అంతర్యామి

భక్తిభావం...ప్రభావం!
‘సృష్టిలోని అణువణువునా భగవంతుడి చైతన్యం పరివ్యాప్తమై ఉంది’ అని ఉపనిషత్తులు బోధించాయి. ‘అంతటా తాను ఉండటం, అంతా తనలో ఉండటం సర్వాంతర్యామి లక్షణం’ అని వివరించాయి. అణు పరమాణుమయమైన ఈ సృష్టి కదలికల నుంచి వెలువడే నాదమే- మంద్ర ధ్వని! పెద్దలు దాన్ని ‘ప్రణవం’గా చెబుతారు. సకల శబ్దమయ జగత్తు- ప్రణవం నుంచే ఆవిర్భవించిందని వారు తీర్మానించారు.

ఎడతెరిపి లేని ఆ మంద్ర ధ్వని తరంగాలతో- తన నుంచి వెలువడే సజాతీయ మంద్ర ధ్వని ప్రకంపనలను మనిషి అనుసంధానించుకోవాలి. విశ్వలయతో సయోధ్య కుదుర్చుకోవాలన్న ఆ ఎరుకనే ‘జ్ఞానం’గా పిలుస్తారు. విశ్వనాథ ‘అచ్చపు తెలివి’గా అభివర్ణించింది దాన్నే! ఆ ప్రయత్నంలో సయోధ్య దిశగా సాగే ప్రయాణాన్నే ‘సాధన’ అంటారు. పరమాత్మ మనిషికి మనసును, ఇంద్రియాలను ఏం సాధించడం కోసం ఇచ్చాడో- ఆ దిశగా అతణ్ని సాధన నడిపిస్తుందని భారతంలోని అరణ్యపర్వం వివరించింది.

వివేక చూడామణిలో ‘మోక్షసాధన సామగ్రి అంతటిలోనూ భక్తి మిక్కిలి శ్రేష్ఠమైనది’ అని శంకర భగవత్పాదులు స్పష్టంచేశారు. సాధనకు ప్రధాన ఆలంబన- భక్తి. అది ఒక పరిణత చిత్త సంస్కారం. పరంజ్యోతి పరిష్వంగానికి ఆర్తితో తపించడం భక్తుల సహజ లక్షణం. ఆ తపననే విశ్వనాథ ‘జీవుడి వేదన’గా పేర్కొన్నారు. ఆర్తి పునాదిగా, భక్తి ఆలంబనగా, విశ్వ చైతన్యంతో సయోధ్య దిశగా సాధన కొనసాగుతుంది. సర్వ తంత్రాలకు మంత్రాలకు, సకల యోగాలకు, సమస్త విద్యలకు అదే గమ్యం అని వేదాంతం ప్రస్ఫుటం చేసింది. మనిషికి అదే జీవన పరమార్థం. ఆ గమ్యాన్ని చేరేందుకే అతడు జన్మించాడు అని గుర్తుచేసిన శంకరులు, ‘నర జన్మ దుర్లభం’ అని ప్రకటించింది అందుకే!

నిర్గుణ పరబ్రహ్మాన్ని జ్ఞానంతోనూ ఆకట్టుకోవచ్చు, పట్టుకోనూ వచ్చు. కానీ, అది సర్వజన సులభసాధ్యమైన ప్రక్రియ కాదు. దానితో పోలిస్తే, భక్తిపథమే తేలికైనది. అందుబాటులో ఉండేదీ అదే! భక్తిమార్గంలో లక్ష్యమే కాదు, ప్రయాణమూ పారవశ్యాన్ని కలిగించడం విశేషం. అందువల్లే లోకంలో ఆధునికత విస్తరిస్తున్నా, నాగరికత నట్టింట తిష్ఠవేస్తున్నా- ఈ జాతి సంస్కారం నుంచి భక్తిభావం అంతరించిపోకుండా ఉంది.

యాతనా బహుళమైన మనిషి జీవనయానంలో భక్తి ఒక దిక్సూచి, ఒక ఓదార్పు, ఒకానొక ఆత్మీయ శీతల స్పర్శ. ఎంతోమంది విషయంలో భక్తి ఒక ధైర్య వచనం... బలమైన ఆలంబన. కొద్దిమందికి సంబంధించి అది ఆనంద తీరాలకు, గుండె పొరలకు మధ్య బలపడిన సేతువు... ఆనంద హేతువు. వూహలతో కాక, అనుభూతితో మాత్రమే ఆకళించుకోవాల్సిన అంశమది.

భక్తి ప్రభావంతో మనిషి చైతన్యమే కాదు, పదార్థ స్వభావమూ మార్పు చెందుతుంది. ఆహారానికి భక్తిని జోడిస్తే, అది ప్రసాదంగా మారుతుంది. నీటికి భక్తి తోడైతే, తీర్థమవుతుంది. నిరాహారదీక్షకు భక్తి జత కలిస్తే- ఉపవాసం అనిపించుకుంటుంది. సంగీతం ప్రార్థనగా, ప్రయాణాలు తీర్థయాత్రలుగా, పనులు కర్మలుగా, నామస్మరణలు జపంగా, శుభాకాంక్షలు దీవెనలుగా, మాటలు మంత్రాలుగా మారాలంటే... వాటన్నింటిలో నిర్మల భక్తిభావం ప్రవేశిస్తే చాలు.

అంతటి శక్తిసంపన్నమైనది భక్తి. భక్తుడిగా జీవించడం ఏమంత తేలిక పని కాదు. అది అసిధారా వ్రతం. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కక్ష్యలను శుద్ధి చేసే జీవ రసాయనం అది. భగవంతుణ్నే బానిసను చేసే అత్యంత బలమైన సాధనం- భక్తి. భాగవతుల చరిత్రలే దానికి ప్రబల సాక్ష్యాలు!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.