Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
కనమన్నా కష్టంగానే ఉంది!
ఇద్దరు బిడ్డలకు ఓకే అన్నా ప్రజల నుంచి నీరస స్పందన
చైనాలో వైచిత్రి
ఒక్క నిర్ణయంతో ప్రభుత్వ విధానం మారిపోయింది. మరి ప్రజల ఆలోచనా ధోరణి మారుతుందా?దేశ ఆర్థిక పురోగమనానికి జనాభా నియంత్రణ అనివార్యమని భావించిన చైనా ప్రభుత్వం మూడున్నర దశాబ్దాలుగా అంతా ఈసడించుకుంటున్నా కూడా ‘ఒక్క బిడ్డ’ విధానాన్ని కఠినంగా, కాస్త కర్కశంగా కూడా అమలుచేసింది. కానీ మళ్లీ ఇప్పుడు అదే ఆర్థిక గమనాన్ని వేగవంతం చేసేందుకు విధానం మార్చుకుని ‘ఇద్దరు బిడ్డలకు ఓకే’ అంటూ కొత్త పల్లవి అందుకుంది. కఠిన నియంత్రణ వల్ల దేశంలో వయసుడిగిన వారు పెరిగి, ఆర్థిక చోదకులుగా అక్కరకొచ్చే యువ పనిమంతుల సంఖ్య తగ్గిపోతుండటం నేడు చైనా ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తాను ఒకే అన్నా.. ప్రజలు ఈ నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతించే స్థితిలోనే ఉన్నారా? ఇదే ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న ఆసక్తికర చర్చ.

‘ఒకటే ఆశ, ఒకటే సంతోషం, ఒకటే బాధ్యత!’
చైనా ప్రజలు దశాబ్దాలుగా చూస్తున్న టీవీ ప్రకటన ఇది. కఠినంగానే అయినా సరే, కుటుంబాలను నియంత్రించాల్సిందేనని కంకణం కట్టుకున్న చైనా ప్రభుత్వం ఒక్క బిడ్డే ముద్దు, అంతకంటే ఎక్కువ వద్దంటూ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ప్రజలకు నూరిపొయ్యటమే కాదు, దీన్నెవరైనా కాదంటే వారిపై కత్తులు కూడా నూరింది! దీన్నెవరైనా అతిక్రమించే ప్రయత్నం చేస్తే వారి మీద నానా రకాలుగా విరుచుకుపడింది. దీన్ని అమలు చేసేందుకు దాదాపు 5 లక్షల మంది అధికారులను నియోగించింది. వీళ్లు తరచూ ఇంటింటికీ వెళ్లి కొత్తగా ఎవరైనా గర్భం దాల్చారేమో పరీక్షిస్తారు. 40, 50 ఏళ్లు దాటిన మహిళలనూ వదిలిపెట్టరు. నిబంధన తప్పినట్టుంటే బలవంతానా గర్భస్రావాలుగానీ, కు.ని. ఆపరేషన్లుగానీ చేయిస్తారు, లేదంటే ఆదాయాలను బట్టి భారీ జరిమానాలు వేస్తారు. ‘సామాజిక పెంపకం ఫీజు’ పేరుతో విధించే ఈ జరిమానాల కింద చాలామంది తాము దాచుకున్న సొమ్ము మొత్తాన్నీ చెల్లించుకున్న సందర్భాలు అనేకం. పల్లెల్లో అయితే కొందరు వీటిని కట్టేందుకే పెంపుడు పందులు, కోళ్ల వంటివాటిని అమ్మేసుకునేవాళ్లు. జరిమానా 1980లలోనే గరిష్ఠంగా రూ.55 వేల వరకూ ఉండేది, ఇప్పుడు లక్షలకు చేరింది. ఈ రూపేణా ఏటా కుటుంబ నియంత్రణ బ్యూరో కోట్లాది యెన్‌లను వసూలు చేస్తోంది.
ఇంతా చేసి, ఈ నిబంధనకు కట్టుబడింది చాలా వరకూ పట్టణ, మధ్యతరగతి ప్రజలే! డబ్బున్నవాళ్లు రెండో బిడ్డను కనేసి, జరిమానాలు కట్టేసిన సందర్భాలనేకం. అలాగే అధికారుల కళ్లుగప్పి పిల్లల్ని కని, రహస్యంగా వారిని పెంచటమూ పరిపాటిగా మారింది. ఎందుకంటే 1990 జనాభా లెక్కల్లో 2.3 కోట్ల జననాలు నమోదు కాగా 2000 లెక్కల నాటికి పదేళ్ల వయసు పిల్లలు 2.6 కోట్లని తేలింది. అంటే 30 లక్షల మంది ‘అక్రమంగా’ పుట్టారన్న మాట. ఇలా సంతాన నియంత్రణ ప్రహసనంగా సాగుతున్నా, ప్రజల జీవితాల్లోకి ఇలా చొచ్చుకురావటమేమిటని హక్కుల కార్యకర్తలంతా ఈసడిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఎన్నడూ వెరవలేదు. 1978లో తీసుకువచ్చిన ‘ఒకే బిడ్డ’ విధానం ద్వారా దాదాపు 40 కోట్ల జననాల్ని నిలువరించగలిగామనీ, దేశం ఆర్థిక శక్తిగా అవతరించటంలో ఈ జనాభా విధానానిదీ కీలక పాత్రేనని కమ్యూనిస్టు ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ ఇదే ఇప్పుడు పెను సమస్యగా పరిణమించబోతోందని గుర్తించటం విశేషం.

చారిత్రక తప్పిదం?

కప్పుడు ప్రజలకు సరైన తిండి, నీరు అందించటమే కష్టమని తలపట్టుకున్న చైనా- ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్ల జనాభాఉండి కూడా రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనిలో కార్మిక బలం పాత్రే ఎక్కువ. అయితే ప్రస్తుతం ఆర్థిక రంగాన్ని జడత్వం ఆవరించి, తిరోగమనం దిశగా సాగుతోంది. ఇప్పుడు సంపన్న దేశంగా అవతరించాలంటే కార్మిక శక్తి ఒక్కటే ఆధారం. కానీ జనాభా స్థితి చూస్తే పనిచేసే తరం తగ్గుతూ, రోజురోజుకూ వృద్ధ జనాభా పెరిగిపోతోంది. 2010-2030 మధ్య చైనా దాదాపు 6.7 కోట్ల మంది శ్రామికులను కోల్పోనుందన్నది ఐరాస అంచనా. ప్రస్తుతం చైనాలో 15-59 ఏళ్ల మధ్య వయసు వారు 67.6% ఉన్నారు, వీరి సంఖ్య క్రమేపీ తగ్గిపోతూ 2050 నాటికి 50% పడిపోతుంది, ఇదే సమయంలో 60 ఏళ్ల పైబడిన వారు ప్రస్తుత 15.2% నుంచి 36.5% పెరుగుతారు. అంటే వచ్చే మూడు దశాబ్దాల్లో చైనా జనాభాలో మూడో వంతు 60 ఏళ్లు నిండిన వారే ఉంటారు. ఈ వృద్ధతరం ఆర్థికానికి దోహదం చెయ్యలేకపోగా కుటుంబాలకు, అంతిమంగా ప్రభుత్వం మీద అదనపు భారంగా కూడా తయారవనున్నారు. ఇప్పటికే యువతీయువకులు- తమ బిడ్డనే కాదు, తల్లిదండ్రులిద్దరిని, నలుగురు తాతబామ్మలను చూసుకోవాల్సిన స్థితిలో నలుగుతున్నారు. పెళ్లి తర్వాత అత్తింటి వృద్ధులూ తోడై, తాము చూసుకోవాల్సిన వృద్ధుల సంఖ్య రెట్టింపవుతోంది. ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం మీద భారీగా వెచ్చించాల్సి వస్తోంది. అందుకే చైనా ‘ధనిక దేశం’గా అవతరించక ముందే ‘వృద్ధ దేశం’గా తయారైపోతోందన్న ఆందోళన గత కొద్దికాలంగా వినిపిస్తోంది. రెండోది- ఈ విధానం వల్ల దేశంలో మగపిల్లల సంఖ్య పెరిగి ఆడపిల్లల సంఖ్య తగ్గింది. ఈ లింగ వ్యత్యాసం సామాజిక సమస్యలు తెచ్చిపెడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే చైనా ప్రభుత్వం కొంతకాలంగా ‘ఒక బిడ్డ’ విధానాన్ని కొద్దికొద్దిగా సడలిస్తూ వస్తోంది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ‘ఒకరే బిడ్డ’ అయినా- వాళ్లు ఇద్దరిని కనొచ్చని 2013లో కొత్త నిబంధన తెచ్చింది. అయినా ప్రజల నుంచి పెద్ద స్పందన లేకపోవటం విశేషం. రెండో బిడ్డను కనేందుకు తక్కువ దరఖాస్తులే వచ్చాయి. బీజింగ్‌ వంటి పట్టణాల్లో అర్హులైన వారిలో 6.7% కూడా ఉత్సాహం చూపకపోవటం అధికారులను విస్మయానికి గురి చేసింది. తాజాగా ఇద్దరు బిడ్డలకు అనుమతిస్తూ ప్రభుత్వ నిర్ణయం ప్రకటించినా ప్రజల నుంచి ఏమంత స్పందన లేదు. ‘ఇదో ఆశ్చర్యకరమైన పరిణామమని’ నార్త్‌కరోలినా యూనివర్సిటీ ప్రొఫెసర్‌, చైనా జనాభా అధ్యయనవేత్త అయిన కాయ్‌ యాంగ్‌ వంటి వారంతా భావిస్తున్నారు.

బిడ్డ భారమా?

ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చినా ప్రజల్లో పెద్ద ఉత్సాహం కానరాకపోవటానికి పిల్లల పెంపకం చైనాలో ఖరీదైన వ్యవహారంగా మారిపోవటమే మూలమని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లల చదువుల మీద చైనా జంటలు చాలా ఖర్చుపెడుతున్నాయి. ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం చైనాలో ఒక బిడ్డను పెంచేందుకు కనీసం 6,330 పౌండ్లు (దాదాపు రూ.6.4 లక్షలు) ఖర్చవుతోంది. చాలా జంటలు ఈ ఖర్చును తట్టుకునే స్థితిలో లేవు. అపార్ట్‌మెంట్ల ధరలు ఆకాశాలను అంటుతున్నాయి, పట్టణాల్లో జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది.ఈ పరిస్థితుల్లో ఒక్కళ్లను పెంచటమే కష్టంగా ఉంది, ఇక ఇద్దరెక్కడ?’ అని ఎంతోమంది వాపోతున్నారు. ఇల్లు గడవటానికి చాలాచోట్ల తల్లులూ కష్టపడుతున్నారు. ఇద్దరూ పనిచేస్తున్నా కొరత తప్పని స్థితిలో పట్టణాల్లో 50 శాతానికిపైగా ప్రజలు ఒకరి కంటే ఎక్కువమందిని కనేందుకు సిద్ధంగా లేరని ‘క్యాపిటల్‌ ఎకనామిక్‌’ సర్వేలు గుర్తించాయి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ 2020 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని రెట్టింపు చేసుకోవాలన్న దృఢ నిర్ణయాన్ని ప్రకటించిన వేదిక మీది నుంచే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ ఇద్దరు బిడ్డల నిర్ణయాన్నీ ప్రకటించటం విశేషం. అయితే ‘‘ఇది ఎన్నడో తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడిది పట్టణ ప్రజలనేమంత ఆకట్టుకోదు. మళ్లీ ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి, ఈ నిర్ణయం ఫలితంగా దేశ శ్రామిక శక్తి పెరగాలంటే మరో 20 ఏళ్లు పడుతుంది’’ అని జియాంగ్‌టాంగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ క్వాన్‌బావో అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటికే దేశంలో కార్మికుల లభ్యత తగ్గి, ఉత్పాదనా వ్యయం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో చైనా ‘ప్రపంచ ఫ్యాక్టరీ’ హోదాను నిలబెట్టుకోవం చాలా కష్టం’ అన్నది ఆయన విశ్లేషణ. వృద్ధ జనాభా విషయంలో జపాన్‌ స్థితీ ఇలాగే ఉందిగానీ ఆ దేశానికి చైనాలా ఆర్థికశక్తిగా ఎదగాలన్న కాంక్షణ లేకపోవటంతో దీనికంత ప్రాధాన్యం ఇవ్వటం లేదు.
మనమెక్కడ?
ప్రస్తుతం చైనా జనాభా 138 కోట్లు, మన దేశ జనాభా 131 కోట్లు. ప్రపంచ జనాభాలో చైనాది 19%, మనది 18%. 2022 నాటికి ఈ రెండు దేశాల జనాభా 140 కోట్లతో సరిసమానం కానుంది. ఆ తర్వాత 2030 నాటికి భారత జనాభా 150 కోట్లు, 2050 నాటికి 170 కోట్లు అయిపోతుంది, కానీ చైనాలో మాత్రం 2030 వరకూ జనాభా సంఖ్య ఇలాగే ఉండి, ఆ తర్వాత తగ్గటం మొదలవుతుందని అంచనా. సమస్యేమంటే చైనాలో పనిచేసే యువతరం తగ్గి, వృద్ధతరం పెరుగుతుంటే మన దేశంలో మాత్రం 2050 వరకూ కూడా యువతరం దాదాపుగా 61-62% వద్దే ఉంటుందని భావిస్తున్నారు. వృద్ధులు 8.9% నుంచి 19.4 శాతానికి, రెట్టింపవుతారు. అయినా పనిచేసే నవతరం తగ్గదు కాబట్టి ఆర్థికంగా ఎదిగేందుకు భారత్‌కు ఏమంత ఇబ్బంది ఉండబోదనీ, చైనాలో మాత్రం యువతరం తగ్గి, వృద్ధులు పెరగటం వల్ల సమస్య అనివార్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
డైపర్ల కంపెనీల పంట పండింది!
కొత్త నిర్ణయం ఫలితంగా 2017 నుంచీ ఏటా కనీసం 10 లక్షల జననాలన్నా పెరుగుతాయన్నది అంచనా. ఇంతపెద్ద విధానపరమైన మార్పును తట్టుకునే శక్తి చైనా ఆసుపత్రులకుగానీ, వైద్య వ్యవస్థలకు గానీ లేదు. ప్రస్తుతానికి కొత్త నిర్ణయం పట్ల పిల్లల పాలడబ్బాలు, డైపర్ల కంపెనీలు మాత్రం ఎగిరి గంతేస్తున్నాయి. తమ ఉత్పత్తుల నిల్వలు పెంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. సహజంగానే గర్భనిరోధక కండోమ్‌ల కంపెనీలు మాత్రం ముఖం ముడుచుకుంటున్నాయి!

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net