Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
లక్ష్యం రూ.30 వేల కోట్లు
ఏపీ వాణిజ్య పన్నుల వ్యవస్థ ప్రక్షాళన త్వరలో అమల్లోకి రానున్న బిల్లుల తనిఖీ
మొండి బకాయిలకు శాశ్వత పరిష్కారం
ప్రవేశ పన్నుకూ మార్గం సుగమం
ఈనాడు - హైదరాబాద్‌
ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ద్వారా 30 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. గత ఏడాది రూ.23,240 కోట్లున్న ఆదాయాన్ని 28 శాతం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం బిల్లుల తనిఖీ (ఇన్వాయిస్‌ ట్రాకింగ్‌ సిస్టం), ప్రవేశ పన్ను, శాశ్వత పరిష్కారం (వన్‌టైం సెటిల్‌మెంట్‌) విధానాలను అమలు చేయడానికి సిద్ధమైంది. రాష్ట్ర విభజన అనంతరం 58% జనాభా ఉన్న ప్రాంత ఆదాయం 47 శాతానికి పరిమితమైన నేపథ్యంలో దీన్ని సాధ్యమైనంత వరకూ పెంచుకోవాలని సీఎం, ఆర్థిక మంత్రి సంకల్పించారు. వ్యవస్థను అవకతవకలకు అవకాశంలేని విధంగా పటిష్ఠ పరచడానికి ఉపక్రమించారు. ఇందులో భాగంగానే తాజా మంత్రివర్గ సమావేశంలో బిల్లుల తనిఖీ, ప్రవేశ పన్ను, శాశ్వత పరిష్కారం విధానాలకు ఆమోదముద్ర వేశారు. ఇప్పటివరకూ వాణిజ్య పన్ను వివరాల దాఖలు సమయంలో పన్ను చెల్లింపుదారులెవరూ తమ కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు సమర్పించడం లేదు. ఇక మీదట దీన్ని తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ చట్ట సవరణ చేస్తూ త్వరలో ఆర్డినెన్స్‌ జారీ చేస్తారు. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలో వాణిజ్యపన్ను చెల్లించే వ్యాపారులంతా తమ లావాదేవీలకు సంబంధించిన బిల్లులను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వాణిజ్య పన్నుల శాఖ వెబ్‌సైట్‌కు ఎక్కించాలి. అలా వచ్చిన వాటిని అధికారులు పోల్చిచూస్తారు. వస్తువు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి టోకు, చిల్లర వ్యాపారులు ఒకే ధర చూపారా? లేదా? అని విశ్లేషిస్తారు. కొత్త వ్యవస్థ వచ్చాక పన్ను ఎగవేత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నిజాయితీగా పన్ను కట్టే వ్యాపారులకు అనవసర వేధింపులు తగ్గుతాయి. కేవలం బిల్లుల్లో తేడాలున్న వ్యాపారులను మాత్రమే తనిఖీ చేస్తారు. ఇలాంటి కేసులు 5-6 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

బయటి రాష్ట్రాల
వాహనాలకు జీపీఎస్‌
సరుకు లోడ్‌తో బయటి రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై ఇకమీదట జీపీఎస్‌ విధానం ద్వారా నిఘా వేస్తారు. బయటి రాష్ట్రాలకు వెళ్తున్నట్లు చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో సరుకు దించేసి వెళ్లిపోయే వాహనాలను గుర్తు పట్టేందుకు ఇది ఉపకరిస్తుంది. దీనివల్ల జీరో వ్యాపారం తగ్గుతుంది. రాష్ట్ర సరిహద్దులోని తనిఖీ కేంద్రం వద్దకు ఇతర రాష్ట్ర వాహనం వచ్చిన వెంటనే దానికి ఎలక్ట్రానిక్‌ చిప్‌ అతికిస్తారు. గమ్యస్థానం చేరేవరకూ జీపీఎస్‌ ద్వారా నిఘా పెడతారు. అది చెప్పిన చోటుకు కాకుండా మరెక్కడికైనా వెళ్తే తక్షణం పట్టుకొవచ్చు.

వాణిజ్య పన్నుల మొండి బకాయిదారులకు శాశ్వత పరిష్కారం వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల రెండో వారంలో ఆర్డినెన్స్‌ జారీచేసే అవకాశం ఉంది. రూ.3 వేల కోట్ల పన్నులు మొండి బకాయిల రూపంలో పేరుకుపోయాయి. చాలా కేసులు కోర్టులకు వెళ్లాయి. పన్ను మధింపులో లోపాల కారణంగా వ్యాపారులు కట్టకుండా మొండికేశారు. ఏళ్లతరబడి వీటిని నానబెట్టడం బదులు శాశ్వత పరిష్కార పథకం కింద పరిష్కరిస్తే ఉభయ తారకంగా ఉంటుందని నిర్ణయించారు. 50 శాతం వసూలయినా ఖజానాకు రూ.1500 కోట్లు చేరుతుందని అంచనా. 2011 ఏప్రిల్‌కు ముందున్న పాత బకాయిలకు ఈ పథకం అమలు చేస్తారు. 2008 నుంచి 15 కేసుల్లో 1,386 కోట్ల పన్ను వివాదంలో చిక్కుకుంది.

ప్రవేశ పన్ను
ఇతర రాష్ట్రాల సరుకు రాష్ట్రంలో భారీగా దించకుండా చూసేందుకు ప్రవేశ పన్ను పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణ నుంచి సరుకులు కొని ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ జాగ్రత్త తీసుకుంటోంది. ఏపీ గుత్తేదారు తెలంగాణలో సిమెంట్‌ కొంటే అక్కడ కేవలం 2 శాతం పన్ను కట్టేసి స్వరాష్ట్రంలో ఉపయోగించుకోవడానికి వీలవుతోంది. దీనివల్ల సదరు కాంట్రాక్టరుకు 12.5 శాతం పన్ను మొత్తం మిగిలే అవకాశం ఉంది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటు ఉత్పత్తిదారుల వ్యాపారం నష్టపోయే ప్రమాదం నెలకొంది. సమానావకాశాలు కల్పించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపన్ను వేయడానికి సిద్ధమైంది. కోర్టుల మార్గదర్శకాలకు లోబడే కొత్త విధానం తీసుకువస్తారు.

త్వరలో అవగాహన సదస్సులు
వాణిజ్య పన్నుల విధానంలో కొత్తగా తీసుకురాబోతున్న మార్పులపై వ్యాపారులు, ఆడిటర్లకు అవగాహన కల్పించడానికి త్వరలో సదస్సులు నిర్వహించాలని వాణిజ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 సర్కిళ్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తారు.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net