Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
భూసేకరణకు సవరణ
పలు నిబంధనలు మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు
పారిశ్రామిక వృద్ధికి తోడ్పడే లక్ష్యంతో అడుగులు
త్వరలో అఖిలపక్ష సమావేశం
శీతాకాల సమావేశాల్లో బిల్లు!
ఈనాడు, దిల్లీ: పరిశ్రమల ఏర్పాటు కోసం భూములను ఇచ్చే రైతులకు న్యాయం చేయటానికి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూసేరణ, పునరావాస చట్టం-2013’’.. అసలుకే ఎసరు తెస్తోందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికాభివృద్ధికి ఈ చట్టం అడ్డంకిగా తయారైందని, దీంట్లో మార్పులను తీసుకురావాలని అభిప్రాయపడుతోంది. ఈ మేరకు త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. భూసేకరణ చట్టానికి సంబంధించిన అంశాల కారణంగా ఇప్పటివరకూ రూ.1,40,500 కోట్ల విలువైన 326 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీనికి ఒక ఉదాహరణ.. 8,126 కి.మీ.లతో కూడిన 81 జాతీయ రహదారుల నిర్మాణం. ఈ పనిని గుత్తేదారులకు ప్రభుత్వం అందించినప్పటికీ ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఈ ఏడాది జనవరి 1 నుంచి భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో దేశంలో ఎక్కడా ఒక్క భారీప్రాజెక్టు కూడా మొదలుకాలేదు. భూములకు పరిహారంగా రైతులు ఎక్కువ మొత్తాలను డిమాండ్‌ చేయటం, చట్టం అమలుకు సంబంధించిన సంక్లిష్ట ప్రక్రియలు వంటి కారణాలతో ప్రాజెక్టులు నెలకొల్పటానికి పెట్టుబడిదారులు ముందుకు రావటం లేదు. మొత్తమ్మీద ఒక అనిశ్చితి నెలకొంది. దీనిని తొలగించటానికి కేంద్రప్రభుత్వం భూసేకరణ చట్టంలో సవరణలు తీసుకురావాలన్న యోచనకు వచ్చి కసరత్తు ప్రారంభించింది. గ్రామీణప్రాంతాల్లో సేకరించే భూములకు చెల్లించే పరిహారం మార్కెట్‌ధరకు నాలుగురెట్లు ఉండాలని, పట్టణప్రాంతాల్లోనైతే రెండురెట్లు ఉండాలన్న నిబంధన తప్ప మిగిలిన నిబంధనల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు రానున్న అఖిలపక్ష సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు చేయటానికి సిద్ధమవుతోంది. దీనిపై కేంద్రప్రభుత్వ అధికారవర్గాలు వెల్లడించిన వివరాలు...

* భూముల సేకరణకు రైతుల ఆమోదం తీసుకునే విషయంలో సడలింపు తేవాలన్నది ఒక ప్రతిపాదన. భూసేకరణ చట్టం ప్రకారం ఒక ప్రైవేటు ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించటానికి.. ప్రభావితప్రాంతంలోని 80 శాతంమంది భూ యజమానులు ఆమోదం తెలపాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుకు 70 శాతం మంది అంగీకరించాలి. దీనిని వరుసగా 60-70 శాతానికి, 50-60 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

* ఒక ప్రాంతంలో ఏర్పాటయ్యే ప్రాజెక్టు వల్ల సామాజికంగా పడే ప్రభావాన్ని, లాభనష్టాల్ని బేరీజు వేయటం భూసేకరణ చట్టంలో ఒక కీలకాంశం. సదరు ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసే ప్రక్రియలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. అయితే దీనిని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు కూడా వర్తింపజేస్తే భూసేకరణలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని.. కాబట్టి వాటిని మినహాయిస్తూ భారీప్రాజెక్టులకు మాత్రమే ఈ అంశాన్ని వర్తింపజేయాలన్నది కేంద్రం ప్రతిపాదన. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను అవి ఏర్పాటు కాకముందే నియంత్రించేకంటే.. అవి ఏర్పాటైన తర్వాత పర్యావరణపరంగా (చెట్లు పెంచటం), సామాజికంగా (స్థానికులకు ఉద్యోగాలివ్వటం) సరైన చర్యలు తీసుకునేలా చూడటం మంచిదని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అభిప్రాయపడుతోంది.

* ప్రాజెక్టు వల్ల నష్టపోయే స్థానికులకు పునరావాసం కల్పించే విషయంలోనూ చట్టంలో ఉన్న నిబంధనకు సవరణ చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో భూమిలేని కూలీలను ‘బాధితులు’గా పరిగణించలేమన్నది కేంద్రం అభిప్రాయం. అంతకుముందు పొలంలో పని చేసినట్లుగానే కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలోనూ వీరు పని చేస్తారు కాబట్టి వీరికి నికరంగా జరిగే నష్టం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. పైగా వీరు ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా జీవనోపాధిని వెతుక్కుంటూ వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి.. పునరావాసం పరిధి నుంచి వీరిని మినహాయించవచ్చని కేంద్రం భావన.

* భూసేకరణలో పరిహారం, పునరావాసానికి సంబంధించిన నిబంధనను కూడా మార్చటానికి కేంద్రం ప్రతిపాదన చేయనుంది. 1 జనవరి 2014కు ముందు భూసేకరణ ప్రక్రియ మొదలై ఇప్పటికీ పూర్తికాని కేసుల్లో రైతులు, స్థానికులు కోరుకుంటే పునరాలోచన చేయవచ్చని చట్టం చెబుతోంది. దీనిని కనీసం 70 శాతం మంది భూయజమానులు, కనీసం 80 శాతం మంది నిర్వాసితులు కోరుకున్నప్పుడు మాత్రమే ‘పరిహారం, పునరావాసం’ నిబంధనలను మార్చాలని కేంద్రం ప్రతిపాదించనుంది.

కొన్ని అంశాల్లో కఠినవైఖరి
పరిశ్రమవర్గాలను సంతృప్తిపరచటానికి ప్రభుత్వం పై ప్రతిపాదనలను ముందుకు తీసుకొస్తుండగా.. కొన్నింటి విషయంలో మాత్రం కఠిన వైఖరినే ప్రదర్శిస్తోంది. ఉదాహరణకు.. భూసేకరణ చట్టంలోని ‘అత్యవసరం’ అన్న నిబంధనను వ్యూహాత్మక, రక్షణసంబంధమైన అంశాల్లో భూసేకరణకు మాత్రమే ఉపయోగించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ నిబంధనలో ఎటువంటి గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వాలని యోచిస్తోంది. తద్వారా, వ్యాపారసంస్థలు తమ సొంతప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ‘అత్యవసరం’ నిబంధనను ఉపయోగించుకోవటానికి వీల్లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. అలాగే, నిరుపయోగంగా ఉన్న భూమిని భూయజమానులకు తిరిగి అందజేసే నిబంధనను యథాతథంగా అమలుచేయాలని కేంద్రసర్కారు భావిస్తోంది. దీనివల్ల ఒక పరిశ్రమ సేకరించిన భూమిలో.. నిరుపయోగంగా ఉన్న భూమిని రైతులు తిరిగి స్వాధీనం చేసుకునే హక్కును కలిగి ఉంటారు.

విస్తృతమైన మద్దతు
భూసేకరణ చట్టంలో సవరణకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్ప మిగిలిన సీఎంలు ఎవరూ వ్యతిరేకిస్తున్నట్లు కనిపించటం లేదు. భూసేకరణ అంశంలో రాష్ట్రప్రభుత్వాలకే పూర్తి స్వయంప్రతిపత్తి ఉండాలని మమత వాదిస్తున్నారు. కానీ, యూపీలోని ఎస్పీ, తమిళనాడులోని ఏఐఏడీఎంకే, తెలంగాణలోని తెరాస, ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వాలు కేంద్రం పాత్రను గుర్తిస్తూ (భూమి కేంద్ర, రాష్ట్ర ఉమ్మడిజాబితాలో ఉండే అంశం).. చట్టసవరణకు అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు. భూ సేకరణ చట్టం వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందన్న కారణంతో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా చట్టసవరణకు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలున్నాయి. చట్టసవరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరించకపోతే ఆ పార్టీ సీఎంలే వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. మరోవైపు, లోక్‌సభలో సర్కారుకు మెజారిటీ ఉన్నందున సవరణ బిల్లు గట్టెక్కుతుందిగానీ.. రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి.. ఎన్‌డీఏయేతర, యూపీఏయేతర పార్టీలైన ఏఐఏడీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, తెరాస, బీజేడీ, ఎన్సీపీ పార్టీల మద్దతు కోరాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ దిశగా ఈ పార్టీలతో మెరుగైన సంబంధాల కోసం కేంద్రం ఇప్పటికే అడుగులు వేసింది. దీంట్లోభాగంగానే, భూమి రికార్డుల డిజిటలీకరణ కోసం రాష్ట్రాలకు ఆర్థికసాయం చేస్తామని పేర్కొంది. భూమి రికార్డులు డిజిటలీకరణ ప్రక్రియలో నమోదైతే భూసేకరణకు పట్టే సమయం చాలావరకూ తగ్గుతుంది కాబట్టి కేంద్రప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనపై తొలుత స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. తమకు రూ.600 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపించింది.

రాష్ట్రాల పాత్ర
భూసేకరణ చట్టం అమలులో రాష్ట్రాలది కీలకపాత్ర అన్న విషయాన్ని కేంద్రం గుర్తించింది. ముఖ్యంగా, భారీప్రాజెక్టుల వల్ల కలిగే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయటం పూర్తిగా రాష్ట్రప్రభుత్వాల పనే అని కేంద్రం భావిస్తోంది. అలాగే భూసేకరణ చట్టంలో చేపట్టే సవరణల గురించి రాష్ట్రప్రభుత్వాలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మొత్తమ్మీద భూసేకరణ చట్టంలో సవరణలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ప్రధాని మోదీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అప్పగించారు. రాజస్థాన్‌లో భూచట్టాలను సవరించటంలో ఆ రాష్ట్ర సీఎం వసుంధరారాజే ప్రశంసలు అందుకున్న అధికారి రాజీవ్‌ మెహ్‌రిషిని కేంద్ర ఆర్థికశాఖ వ్యవహారాల కార్యదర్శిగా నియమించారు. ఈ విధంగా ఈ అంశంపై ముందుకెళ్తున్న కేంద్రప్రభుత్వం.. నవంబరు మూడోవారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అక్కడ తన ప్రతిపాదనలకు మద్దతు లభిస్తే.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లును ప్రవేశపెట్టవచ్చని అధికారవర్గాలు వెల్లడించాయి.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net