Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
ఆ భూములే కావాలి!
రాజధానికి నిర్దేశించిన భూముల కోసం
ఎగబడుతున్న కొనుగోలుదారులు
గందరగోళంలో తుళ్ళూరు రైతాంగం
కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల జోరు
ఈనాడు - గుంటూరు
తుళ్ళూరు.. గుంటూరు జిల్లాలో కృష్ణాతీరం వెంబడి ఉండే ఈ మండలం గురించి నిన్న మొన్నటి వరకు తెలిసిన వాళ్లు చాలా తక్కువ. మరి ఇప్పుడో.. రాష్ట్రంలోని దారులన్నీ తుళ్ళూరు వైపే పయనిస్తున్నాయి. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు, ఒకటీ అరా సరుకు రవాణా వాహనాలు మాత్రమే తిరిగే ఈ ప్రాంత రహదారులపై ఇప్పుడు ఖరీదైన విలాసవంతమైన కార్లు పరుగులు తీస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు, అటు తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద పెద్ద కార్లు వచ్చి ఇక్కడ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లంతా వస్తోంది... ఈ ప్రాంతంలో భూములు కొనడానికే. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి తుళ్ళూరును ఎంపిక చేయడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా అందరికీ అవసరమైన ప్రాంతంగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా, తమ పనేదో తమదే అన్నట్లుగా ఉండే ఈ ప్రాంత రైతాంగంలో రాజధాని వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. రాజధాని కోసం తమ భూములు ఇచ్చేది లేదని కొన్ని గ్రామాల రైతులు తెగేసి చెబుతుండగా మరో పక్క బయటి నుంచి వస్తున్న స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడిదారులు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం భూసమీకరణ జరపనున్న గ్రామాల్లోనే భూములు కావాలంటూ తిరుగుతున్నారు. ఈ పరిణామం స్థానిక రైతులను కొంత గందరగోళానికి గురి చేస్తోంది. ఎకరానికి రూ.70-80 లక్షల ధర ఇస్తామని చెబుతున్నా తమ భూములు అమ్మాలో, వద్దో తేల్చుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ధర చూసి చిన్న రైతులు కొందరు భూములు అమ్ముతుండగా, కాస్త స్థోమత ఉన్న వారు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోపక్క ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. రాజధాని కోసం భూ సమీకరణ జరపడం వల్ల వచ్చే గరిష్ఠ ప్రయోజనం రైతులకే దక్కేలా చేయడం ఎలా? అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.

ఒక్కసారిగా పెరిగిన రద్దీ: తుళ్ళూరు మండల కేంద్రమే అయినా ఓ మోస్తరు పల్లెటూరిలానే ఉంటుంది. సాధారణ దినాల్లో ఇక్కడ పెద్దగా హడావుడేమీ ఉండదు. అటు విజయవాడ, ఇటు గుంటూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల రొదే ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు ఈ వూర్లోనే కాదు.. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆడీలు, బెంజ్‌లు, డస్టర్‌లు, స్విఫ్ట్‌లు, ఇన్నోవాలు తెగ తిరుగుతున్నాయి. తుళ్ళూరులో ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్‌ కూడా నిలిచి పోతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తుళ్ళూరుకు ఇప్పుడు పరిచయం లేని వ్యక్తులు ఏ పని మీద వచ్చినా స్థానికులు వారిని భూములు కొనడానికి వచ్చిన వారుగానే భావిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? భూములు కొంటారా? అని ఆరా తీస్తున్నారు. రాత్రికి రాత్రే ఇక్కడ చాలా మంది దళారులూ పుట్టుకొచ్చారు. సాధారణంగా ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఎక్కడైనా భూసేకరణ జరుగుతుందంటే ఆ భూములు కొనడానికి ఎవరూ ముందుకు రారు. దానికి భిన్నంగా రాజధాని కోసం భూ సమీకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన గ్రామాల్లోనే ఇప్పుడు ఎక్కువగా భూములు కొనేందుకు పోటీలు పడుతున్నారు. అభివృద్ధి చేసిన భూమిలో ప్రభుత్వం వెయ్యి గజాలు ఇస్తామని చెబుతుండడంతో గజానికి రూ.20 వేలు వేసుకున్నా రూ.2 కోట్లు వస్తుందన్న అంచనాల్లో వీరున్నారు. భూ సమీకరణ నిర్ణయం వెలువడ్డాక అక్కడ ఎకరం రూ.70 లక్షలకు చేరింది. ఈ వారం, పది రోజుల్లో రూ.80 లక్షల వరకు వెళ్లింది.

రైతుల్లో అయోమయం: తుళ్ళూరు మండలంలో భూ సమీకరణకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఏడెనిమిది కృష్ణా నది కరకట్టను ఆనుకునే ఉంటాయి. ఈ భూముల్లో ఏడాది పొడవునా ఉద్యాన పంటలు పండిస్తారు. ఈ గ్రామాల రైతులు రాజధానికి ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఎవరికీ విక్రయించడానికి కూడా సిద్ధంగా లేరు. మిగతా గ్రామాల రైతుల్లో కొందరు రాజధానికి భూములు ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నారు. కొందరు భూములు విక్రయిస్తున్నారు కూడా. కానీ వీరిని అనేక సందేహాలు తొలుస్తున్నాయి. ఎకరానికి ఇప్పుడు వస్తున్న రూ.70-80 లక్షల ధరకు అమ్మేసుకోవడం మంచిదా? ప్రభుత్వం అభివృద్ధి చేశాక ఇచ్చిన భూమిని తీసుకోవడం ఉత్తమమా? అసలు రాజధాని కచ్చితంగా ఇక్కడే వస్తుందా? ఇలాంటి సందేహాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తుళ్ళూరు మండలంలోని భూములకు ఇప్పుడు పలుకుతున్న ధర కొన్ని నెలల కిందట ఉన్న ధరలతో పోలిస్తే మూడు నాలుగు రెట్లు ఎక్కువ. వాస్తవానికి గుంటూరు జిల్లాలో రాజధాని వస్తుందన్న ప్రకటన వెలువడ్డాక ఇక్కడి భూముల ధరలు ఇప్పుడు వస్తున్న ధరల కంటే పెరిగాయి. నిర్దుష్టంగా ఫలానా గ్రామాల్లో భూ సమీకరణ చేస్తామని, రైతులకు వెయ్యి గజాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించాక ఇక్కడి ధరలు తగ్గి రూ.70-80 లక్షల దగ్గర స్థిరపడ్డాయి. ఇది వరకు రహదారికి దగ్గరగా ఉన్న భూములకు ఎక్కువ ధర, లోపలికి ఉన్న భూమికి తక్కువ ధర అన్న వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఎక్కడి భూమి అయినా వెయ్యి గజాలే వస్తుందని ప్రభుత్వం చెప్పడం, దాన్ని లాటరీ విధానంలో కేటాయిస్తామని స్పష్టం చేయడంతో ఇప్పుడు దాదాపుగా ఎక్కడ ఉన్న భూమికైనా ఒకటే ధర పలుకుతోంది. భూ సమీకరణకు ఎంపిక చేసిన గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనూ భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయి కానీ అక్కడ రూ.ఐదారు లక్షలు తక్కువ ధర పలుకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

కింకర్తవ్యం..?: తుళ్ళూరు మండలంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లేదు. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో ఉంది. రాజధాని భూసమీకరణ ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ కార్యాలయం కిటికిటలాడుతోంది. ఎప్పుడు చూసినా కార్యాలయం ఎదుట 15-20 కార్లు బారులు తీరి ఉంటున్నాయి. భూసమీకరణ విధానంలో భూములు ఇచ్చే రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చుతామన్నది ప్రభుత్వం చెబుతున్న మాట. బయట వ్యక్తులు వచ్చి ఈ గ్రామాల్లో భూములు కొంటుండడం ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. కేవలం వ్యాపార దృక్పథంలో ఎకరాల కొద్దీ భూములు కొంటున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. రైతులకు ప్రయోజం చేకూరాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. కానీ దాని వల్ల రైతులను మరింత భయపెట్టినట్టవుతుందేమోన్న భావనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతానికై ఇక్కడ రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగుతోంది.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net