Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
ఉపకారం కోసం అపకారం
అసోం విద్యార్థులకు దళారుల వల
ఇంజినీరింగ్‌ కళాశాలలకు సరఫరా
నకిలీ సర్టిఫికెట్లతోనూ నడిపిస్తున్న వైనం
కేంద్రం ఇస్తున్న నిధుల్ని కాజేస్తున్న కాలేజీలు
ఈనాడు - హైదరాబాద్‌
ఇంజినీరింగ్‌ చదివేందుకు అసోం నుంచి విద్యార్థులు వస్తున్నారు... ఐదారేళ్లుగా పదుల సంఖ్యలో హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరుతున్నారు... అసోంకు దగ్గర్లో పశ్చిమబంగ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలలుండగా...వేల కిలోమీటర్లు దాటి హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారంటే...ఇక్కడ కొన్ని కళాశాలలు, అసోంలోని దళారులతో కుమ్మక్కై రూ.కోట్లలో ఉపకార వేతనాలను స్వాహా చేసేందుకు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాయి. అసోం రాష్ట్రం కరీంగంజ్‌ జిల్లా వాసి జకీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా వ్యవహారం గుట్టు రట్టయ్యింది. జకీర్‌ సహచరుడు బహరుల్‌ ఇస్లాంతో పాటు మరో 20 మంది దళారులు ఈ వ్యవహారంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం దృష్టి సారిస్తే భారీ కుంభకోణమే వెలుగుచూసే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఒక్కో విద్యార్థికి రూ.30వేలు-50వేలు...: అసోం సహా నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరం(ఈశాన్య రాష్ట్రాలు) రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆయా రాష్ట్రాల్లో కాకుండా దేశంలో ఎక్కడైనా సరే.. ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించేందుకు వెళ్తే ప్రతి విద్యార్థికి ఏటా రూ.1.20లక్షలు ఉపకార వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు చెల్లిస్తోంది. దీంతోపాటు ఒక్కోవిద్యార్థికి మెస్‌ఛార్జిలు, వసతిగృహం ఛార్జీల చొప్పున (ఎస్‌సీ, ఎస్టీ, బీసీలకు) మరో రూ.80వేలను కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందుతున్నాయి. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ.2లక్షలు వస్తుండగా... కళాశాలల నుంచి దళారులు ఒక్కో విద్యార్థికి రూ.30వేల నుంచి రూ.50వేల వరకూ తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ నల్గొండ జిల్లా కోదాడ సన ఇంజినీరింగ్‌ కళాశాల, చేవెళ్ల- విద్యావికాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, రాయల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, మెయినాబాద్‌-గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసోం విద్యార్థులున్నట్టు పోలీసుల పరిశోధనలో తేలింది. పరారీలో ఉన్న దళారి బహరుల్‌ ఇస్లాం దొరికితే మరిన్ని కళాశాలల జాబితా బయటకు వచ్చే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ సహా రంగారెడ్డి, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 30 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1200 మంది అసోం విద్యార్థులున్నారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

విద్యార్థులు... నకిలీ సర్టిఫికేట్లు...: ఉపకారవేతనాల స్వాహా వ్యవహారంలో దళారులు తొలుత అసోం నుంచి ఇంటర్‌ తత్సమాన విద్యార్హతలున్నవారిని తీసుకొచ్చేవారు. ఒక సంవత్సరం, లేదా రెండు సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థులు అసోంకు వెళ్లిపోయేవారు. వారు వెళ్లిపోయినా నాలుగేళ్లు ఉపకార వేతనాలను ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్‌, తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ సీట్లు కూడా మిగిలిపోవడం, నిర్వహణ భారంగా మారడంతో కొందరు ఈ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల ఇంజినీరింగ్‌ కళాశాల(డిచ్‌పల్లి) యాజమాన్యం 30 మంది విద్యార్థులు కావాలంటూ జకీర్‌, బహరుల్‌ను కోరింది. ఒక్కో విద్యార్థికి రూ.50వేల చొప్పున ఒప్పందం కుదిరి, రూ.15లక్షల చెక్‌కూడా ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం బహరుల్‌ అసోంకు వెళ్లాడు. అక్కడ వారు వచ్చేందుకు ఇష్టపడకపోవడంతో వారికి రూ.10వేల చొప్పున ఇచ్చి ఇంటర్‌ సర్టిఫికేట్లను తీసుకున్నాడు. హైదరాబాద్‌కు వచ్చాక జకీర్‌ సాయంతో పేర్లుమార్చేసి 150 నకిలీ సర్టిఫికేట్లను తయారు చేశాడు. 30 సర్టిఫికేట్లను తిరుమల ఇంజినీరింగ్‌ కళాశాలకు ఇచ్చాడు. మరో రెండు కళాశాలలు 20 మంది చొప్పున విద్యార్థులు కావాలంటూ కోరగా.. వాటినే ఇచ్చే క్రమంలో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు జకీర్‌ దొరికిపోయాడు. ఇతని వద్ద నుంచి 132 నకిలీ సర్టిఫికెట్టను స్వాధీనం చేసుకున్నారు. బహరుల్‌ దొరికితే మరింత మంది దళారుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని టాస్క్‌ఫోర్స్‌ ఉపపోలీస్‌ కమిషనర్‌ లింబారెడ్డి వివరించారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net