Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
క్రయోజనం నెరవేరింది
ప్రయోగాల పరంగా ఘన చరిత్రనే కలిగి ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తాజా ప్రయోగం విజయవంతం కావడంపై ఇంతగా ఉబ్బితబ్బిబ్బవ్వడానికి కారణమేంటి? అంగారకుడిపై అన్వేషణకు నవంబరులో ఉపగ్రహాన్ని దిగ్విజయంగా ప్రయోగించి మంచి వూపుమీదున్న ఇస్రో.. ఇప్పుడు ఈ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ప్రయోగానికి ఎందుకింత ప్రాధాన్యం ఇచ్చింది? అసలు ఈ ప్రయోగంలో ఇమిడి ఉన్న అంశాలేమిటి... ఇది మనకు ఏ విధంగా ప్రయోజనకరం..?
క్రయోజెనిక్స్‌ అనేది అత్యంత శీతల ఉష్ణోగ్రతలకు సంబంధించిన శాస్త్రం. అత్యంత శీతల ఇంధనాలతో పనిచేసే రాకెట్‌ ఇంజిన్లను క్రయోజెనిక్‌ ఇంజిన్లుగా పిలుస్తారు. సాధారణంగా వీటిలో ద్రవ హైడ్రోజన్‌ను ఇంధనంగాను, దాన్ని మండించడానికి ఆక్సిజన్‌ను ఆక్సిడైజర్‌గాను వాడతారు. ఈ ఇంజిన్ల సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మండే ప్రతి కిలో ఇంధనానికి చాలా ఎక్కువ తోపు(థ్రస్ట్‌) లభిస్తుంది. మిగతా ఘన, ద్రవ ఇంధన ఇంజిన్ల కన్నా ఇవి ఒకటిన్నర రెట్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి.
* అమెరికా 1963లో, జపాన్‌-1977, ఫ్రాన్స్‌-1979, చైనా-1984, రష్యా 1987లో క్రయోజెనిక్‌ ఇంజిన్లను విజయవంతంగా అభివృద్ధి చేశాయి. ఫ్రాన్స్‌ ఒక్కటే తొలి ప్రయత్నంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయో ఇంజిన్‌తో విజయం సాధించింది.
* అంతరిక్ష పరిజ్ఞానాలు జాతీయ భద్రతతోపాటు వాణిజ్య కోణంలోనూ కీలకం కావడం వల్ల వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు ఆయా దేశాలు నిరాకరిస్తున్నాయి. అందువల్ల క్రయోజెనిక్‌ పరిజ్ఞానం అమెరికా తదితర దేశాలకే పరిమితమైంది.
* క్రయోజెనిక్‌ ఇంజిన్ల ప్రయోజనాలను 1983లో భారత్‌గుర్తించింది. ఆ పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకోవాలా, లేక విదేశాల వద్ద కొనాలా అన్న మీమాంసలో పడిపోయింది. చివరకు, విదేశాల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
* రెండు కేవీడీ-1 క్రయోజెనిక్‌ ఇంజిన్లు, పూర్తిస్థాయి క్రయోజెనిక్‌ పరిజ్ఞానం పొందడం కోసం రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘గ్లావ్‌ కాస్మోస్‌’తో 1991లో ఇస్రో ఒక భారీ ఒప్పందం చేసుకొంది. ఈ పరిజ్ఞానాన్ని భారత్‌ క్షిపణుల కోసం వినియోగిస్తోందన్న ఆరోపణతో అమెరికా క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ ఒప్పందం(ఎంసీటీఆర్‌)ను ప్రయోగించింది. ఎంసీటీఆర్‌ను ఉల్లంఘిస్తున్నాయంటూ గ్లావ్‌ కాస్మోస్‌, ఇస్రోలపై ఆంక్షలు విధించింది. రష్యా వెనక్కి తగ్గింది. భారత్‌కు పరిజ్ఞానాన్ని ఇవ్వకుండా, ఏడు క్రయో ఇంజిన్లను మాత్రమే సరఫరా చేసేలా ఒప్పందాన్ని మార్చివేసింది.
* ఆంక్షలు అమల్లోకొచ్చే సరికే భారత ఇంజినీర్లు రష్యా నుంచి కొంత క్రయోజెనిక్‌ పరిజ్ఞానాన్ని పొందారు. దాని ఆధారంగా రూ.335 కోట్ల బడ్జెట్‌తో 1993లో సొంతంగా క్రయోజెనిక్‌ ఇంజిన్‌ రూపకల్పనను మొదలుపెట్టారు. తమిళనాడు మహేంద్రగిరిలోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌(ఎస్‌ఎస్‌పీసీ) ఈ బృహత్తర కార్యక్రమానికి వేదికైంది. గోద్రెజ్‌, హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్‌ సంస్థలు ఇందులో పాలుపంచుకొన్నాయి.
ఎన్నో తలనొప్పులు
* క్రయోజెనిక్‌ ఇంజిన్ల రూపకల్పనలో చాలా తలనొప్పులున్నాయి. క్రయో ఇంజిన్‌లో ఇంధన ట్యాంకులు భారీగా ఉంటాయి. బాహ్య ఉష్ణోగ్రత నుంచి రక్షించడానికి పెద్ద మొత్తంలో ఇన్సులేషన్‌ అమర్చాలి. ఇంధన సామర్థ్యం-గరిష్ఠ ప్రయోజనం కోణంలో చూస్తే ఈ ఇబ్బందులన్నీ నామమాత్రమే. 
* హైడ్రోజన్‌ ద్రవ రూపంలోకి మారాలంటే మైనస్‌ 253 డిగ్రీల సెల్సియస్‌, ఆక్సిజన్‌ ద్రవ రూపంలోకి మారాలంటే మైనస్‌ 183 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు శీతలీకరించాలి. ఈ వాయువులను ద్రవ రూపంలోకి మార్చడం, నిల్వ చేయడం, రవాణా చేయడం కోసం చాలా సంక్లిష్టమైన పరిజ్ఞానాలు, ఖరీదైన సౌకర్యాలు కావాలి. అలాగే రాకెట్‌లోనూ వాటిని నిల్వ చేయడానికి, నిర్దేశిత పరిమాణాల్లో, సరైన ఉష్ణోగ్రత, పీడనం వద్ద మండించడానికి సంక్లిష్టమైన థర్మల్‌, స్ట్రక్చరల్‌ వ్యవస్థలు అవసరం. ఇంధనంతోపాటు ఇంజిన్‌లోని పరికరాలనూ శీతలీకరించాలి. లేదంటే ద్రవరూపంలో ఉన్న హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ మళ్లీ వాయురూపంలోకి మారిపోతాయి.
* ఇంత శీతల వాతావరణాన్ని సాధారణ లోహాలు తట్టుకోలేవు. మిశ్రమ లోహాలతో పరికరాలను తయారుచేయాలి. క్రయోజెనిక్‌ ఇంజిన్‌కోసం శక్తిమంతమైన అల్యూమినియం మిశ్రమ లోహంతో తయారైన ట్యాంకులను ఇస్రో సిద్ధంచేసింది. రష్యా ట్యాంకులతో పోలిస్తే వీటి బరువు 100 కిలోల మేర తక్కువ. మన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ వ్యయం సుమారు రూ.36 కోట్లు కాగా, రష్యా ఇంజిన్‌ ధర దాదాపు రూ.90 కోట్లు. క్రయోజెనిక్‌ దశ కోసం 95శాతం లోహాలు హైదరాబాద్‌లోని మిథాని నుంచి సరఫరా అయ్యాయి. 
* క్రయోజెనిక్‌ దశ కోసం హైస్పీడ్‌ టర్బో పంపులను తయారు చేయడం అతిపెద్ద సవాల్‌. ఎందుకంటే హైడ్రోజన్‌ సాంద్రత చాలా తక్కువ. పంపులు నిమిషానికి దాదాపు 40 వేల సార్లు తిరిగితేగాని ఇంధనం ముందుకు కదలదు. హైడ్రోజన్‌ లీకైతే వెంటనే మంటలు అంటుకుంటాయి. ఇంత శీతల ఉష్ణోగ్రత వద్ద మంటలు కంటికి కనిపించవు. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
* ట్యాంకుల్లో ఉండే ద్రవీకృత హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లను విస్తరణ ఛాంబర్‌లోకి పంపుతారు. తర్వాత వాటిని సరైన నిష్పత్తి, సరైన ఉష్ణోగ్రత, పీడనంలో టర్బో పంపులో మిశ్రమం చేశాక కంబషన్‌ ఛాంబర్‌లో మండిస్తారు. ఫలితంగా వేడి వాయువులు ఏర్పడి.. నాజిల్‌ గుండా బయటకు దూసుకెళ్లి వాహకనౌకను ముందుకు తోస్తాయి.
సమూల మార్పులు
* ఇప్పుడు జీఎస్‌ఎల్‌వీకి అమర్చిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ 73 కిలో న్యూటన్ల తోపును అందిస్తుంది. 2,200 కిలోల ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టగలదు.
* 2010 ఏప్రిల్‌లో జీఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విఫలమయ్యాక ఇస్రో మళ్లీ ప్రాజెక్టు మూలాల్లోకి వెళ్లిపోయింది. స్వదేశీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌తోపాటు జీఎస్‌ఎల్‌వీ డిజైన్‌ మొత్తాన్నీ పునఃపరిశీలించింది. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-డీ5లో భారీ మార్పులు చేపట్టింది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఇంకా బాగా రక్షించేందుకు దాని కవచ భాగాన్ని రీడిజైన్‌ చేశారు. అధిక పీడనాన్ని తట్టుకునేలా వైర్‌ సొరంగాన్ని పటిష్ఠం చేశారు. వాహకనౌకకు సంబంధించిన ఏరోడైనమిక్‌ లక్షణాలను మెరుగుపరిచారు. లోగడ ఒకసారి వైఫల్యానికి కారణమైన ఇంధన బూస్టర్‌ టర్బో పంపును పూర్తిగా రీడిజైన్‌ చేశారు. భూతలం మీదే భారరహిత స్థితిని కృత్రిమంగా సృష్టించి, ఇంజిన్‌ను పరీక్షించారు. మహేంద్రగిరిలోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌(ఎల్‌పీఎస్‌సీ)లో ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం వాహకనౌకపై 850 సార్లు విండ్‌ టన్నెల్‌ పరీక్షలు నిర్వహించి, వివిధ పరిస్థితుల్లో అది ఎలా పనిచేస్తుందో గమనించారు.
* 2013 ఆగస్టులో జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగానికి సిద్ధపడగా.. రెండో దశలోని ఇంధన ట్యాంకుల్లో లీకేజీ ఏర్పడింది. ప్రయోగం వాయిదా పడింది. ఆ ట్యాంకులు అల్యూమినియం-జింక్‌ మిశ్రమం అఫ్‌నార్‌ 7020తో తయారయ్యాయి. ఈసారి అల్యూమినియం-రాగి మిశ్రమంతో తయారైన ఏఏ2219 లోహాన్ని వాడారు.
మనకెందుకు కీలకం?
క్రయోజెనిక్‌ పరిజ్ఞానం ఉంటే కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు మరో దేశంపై ఆధారపడాల్సిన అగత్యం భారత్‌కు తప్పుతుంది. భవిష్యత్‌ తరం ఉపగ్రహ వాహకనౌక అయిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లోనూ క్రయోజెనిక్‌ దశ ఉంటుంది. అందువల్ల ఈ పరిజ్ఞానాన్ని భారత్‌ ఒడిసిపట్టక తప్పదు. 2013 నవంబర్‌లో భారత్‌ తన తొలి అంగారక ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అప్పటికి క్రయోజెనిక్‌ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి ఉంటే.. జీఎస్‌ఎల్‌వీ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. ఉపగ్రహంలో మరిన్ని పరికరాలను పంపడానికి, అంగారకుడి ఉపరితలానికి మరింత దగ్గరి కక్ష్యలోకి దాన్ని ప్రవేశపెట్టడానికి వీలయ్యేది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ రూపకల్పనలో జాప్యం కారణంగా చంద్రయాన్‌-2 లాంటి ప్రాజెక్టులపై ప్రభావం పడింది. భవిష్యత్తులో మానవసహిత అంతరిక్ష యాత్రలు చేయాలన్నా క్రయో ఇంజిన్లు కావాల్సిందే.
వాణిజ్య ప్రయోజనాలు
* భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల ప్రయోగ పరిశ్రమ ఏటా దాదాపు 35 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికి 927 ఉపగ్రహాలను వివిధ దేశాలు ప్రయోగించే అవకాశం ఉందని ‘ఫ్రాస్ట్‌ అండ్‌ సలువన్‌’ అంచనా వేసింది. అందులో కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల వాటా 405. చాలా దేశాలకు సొంత వాహకనౌకలు లేవు. జీఎస్‌ఎల్‌వీ ద్వారా మనం వాటిని ప్రయోగించవచ్చు.
* రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు తక్కువ బరువు ఉంటాయి. అవి కమ్యూనికేషన్‌ అవసరాలకు అక్కరకు రావు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు రెండు నుంచి ఐదు టన్నుల వరకూ బరువుంటాయి. వాటిని జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ కక్ష్యల్లో ఉపగ్రహాలు భూభ్రమణ వేగానికి అనుగుణంగా పరిభ్రమిస్తుంటాయి. అందువల్ల మనకు ఉపగ్రహ సేవలు నిరంతరాయంగా లభిస్తాయి.
* ఇస్రో ఇప్పటివరకూ చిన్న ఉపగ్రహాల ప్రయోగంలోనే సత్తా చాటుకొంది. పీఎస్‌ఎల్‌వీ ద్వారా దాదాపు 1,600 కిలోల బరువైన రిమోట్‌ సెన్సింగ్‌, భూపరిశీలన ఉపగ్రహాలను 620కి.మీ. ఎత్తులోని సౌర అనువర్తిత ధ్రువ కక్ష్యలోకి, 1050 కిలోల ఉపగ్రహాన్ని భూబదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.
* భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల విషయంలో ఇప్పటివరకు ఇస్రోకు ఆ స్థాయి సామర్థ్యం లేదు. అంతర్జాతీయంగా ఎక్కువ మార్కెట్‌ ఈ విభాగానిదే. జీఎస్‌ఎల్‌వీకే ఈ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. జీఎస్‌ఎల్‌వీపై ఇస్రో సాధికారత సాధిస్తే ప్రయోజనముంటుంది.
* ఇస్రో వద్ద మొత్తం తొమ్మిది ఉపగ్రహాలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు కూడా సిద్ధమవుతోంది. వీటి ప్రయోగాలకు జీఎస్‌ఎల్‌వీ అవసరం.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net