Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
మావోయిస్టుల పడగ నీడలో..!
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల బహిష్కరణ పిలుపు
బస్తర్‌లో వూపందుకోని ప్రచారం
ఛత్తీస్‌గఢ్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
భారత ఎన్నికల చరిత్రలో ఇదో అరుదైన ఘటన. బహుశా ఇదే మొదటిది కూడా కావచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దాదాపు 150 మంది పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేయడానికి ముందుకొచ్చారు. బస్తర్‌ డివిజనల్‌ కేంద్ర కార్యాలయమైన జగదల్‌పూర్‌లో భాజపా ఎమ్మెల్యే సంతోష్‌ బఫ్నా ఈ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, వారి కుటుంబీకుల్లో విశ్వాసం నింపడానికే బీమా ప్రీమియం చెల్లింపులకు ముందుకొచ్చానని బఫ్నా అంటున్నారు. ఈ చర్యను విపక్ష కాంగ్రెస్‌ తూర్పారబడుతోంది. అధికార పక్ష ఎమ్మెల్యే తన సొంత పార్టీ వారికే రక్షణ కల్పించలేనపుడు ఇక ఇతరులకు ఎలా కల్పిస్తాడని కాంగ్రెస్‌ మండిపడుతోంది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్‌ కూడా అధికార పక్షాన్ని అంత ధీటుగా నిలదీయలేని పరిస్థితి. ఎందుకంటే... మే 25వ తేదీన నక్సల్స్‌ దాడిలో చనిపోయిన సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ సతీమణి దేవతి కర్మ, ఆమె నలుగురు కొడుకులకు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తుండడం దీనికో ప్రధాన కారణం. ఓ సాధారణ కుటుంబం జెడ్‌ ప్లస్‌ భద్రత పొందుతున్న ఘటన బహుశా భారతదేశంలోనే ఇదే మొదటిది కావచ్చు. మే నెలలో దర్బాఘాట్‌ వద్ద కాంగ్రెస్‌ కాన్వాయ్‌పై నక్సల్స్‌ దాడి తర్వాత- దేవతి, ఆమె నలుగురు తనయులు మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. దేవతి బస్తర్‌లోని దంతేవాడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ప్రచారంలో ఆమె వెంట ఏకే-47లు ధరించిన కనీసం 35 మంది భద్రతా సిబ్బంది ఉంటున్నారు.

ఎన్నికల ప్రచార సమయాల్లో మావోయిస్టులు మందుపాతరలు పేల్చడం పరిపాటి. ఈ భయం వల్లే మొదటి దశ ఎన్నికల(నవంబరు 11) తేదీ దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ ప్రచారం అంత వూపందుకోలేదు. గ్రామాల్లో మావోయిస్టుల సానుభూతి పరులు దండిగా ఉన్నారని, మందుపాతరల భయంతో దట్టమైన అటవీప్రాంతాల్లోకి ప్రచారానికి వెళ్లడం ఇబ్బందిగా ఉందని శంకర్‌సేన్‌ మాంజీ అనే స్థానికుడు చెప్పారు. అందుకే అభ్యర్థులు గ్రామాల్లోకి వెళ్లకుండా ప్రధాన రోడ్లకు సమీప ప్రాంతాల వరకే వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కూడా బస్తర్‌లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడానికి హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ర్యాలీ కోసం సమస్త అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేందరికీ ఇలాంటి సౌకర్యం లేదు. మావోయిస్టుల హెచ్చరికల్ని బేఖాతరు చేసి... ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తారనే నమ్మకంతో తాము అటవీ ప్రాంతాల్లోకి వెళ్లట్లేదని కొంటగావ్‌ నుంచి పోటీచేస్తున్న శంకర్‌ సోధి చెప్పారు. ఒక్క సోధియే కాదు, పోటీచేస్తున్న ప్రతి అభ్యర్థిదీ ఇదే బాధ.

ఏజెంట్లను పెట్టలేని పరిస్థితి
బస్తర్‌లో మావోయిస్టుల కంచుకోట అయిన దంతేవాడలో మొత్తం 266 పోలింగ్‌ బూత్‌లు ఉంటే... 26 మాత్రమే సాధారణ జోన్‌లో ఉన్నాయి. 142 బూత్‌లు సమస్యాత్మకమైనవిగా, 98 అత్యంత సమస్యాత్మకమైనవిగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 140 బూత్‌లకు మాత్రమే పార్టీలు తమ ఏజెంట్లను పంపగలుగుతున్నాయి. మిగతా వాటికి వెళ్లట్లేదు. దంతేవాడలో పట్టణ ప్రాంతాల్లో కూడా నక్సల్స్‌ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలు చురుగ్గా పనిచేస్తుండడంతో నక్సల్స్‌ ఉనికి అంత ఎక్కువగా లేదు. పట్టణ ప్రాంతాలకు 8 నుంచి 12 కిలోమీటర్ల లోనికి వెళితే మాత్రం మావోయిస్టుల ప్రభావం దండిగా ఉంది. కొన్నిచోట్ల ఆరెస్సెస్‌ అనుబంధ వనవాసీ కల్యాణ్‌ ఆశ్రమ్‌(వీకేఏ) స్థానికుల మద్దతుతో పనిచేస్తోంది. దానికి భాజపా ప్రభుత్వ సహకారం దండిగా ఉంది. అటవీ సమీప మైదానాల్లో కూడా వీకేఏ కనిపిస్తుంటుంది. వీటన్నింటినీ ‘పోరాట జోన్‌’లుగా మావోలు ప్రకటించారు. దీంతో ఇక్కడి బూత్‌లను సమస్యాత్మకమైనవిగా ఈసీ ప్రకటించింది. దట్టమైన అటవీ ప్రాంతాల్ని ‘విమోచన జోన్‌’లుగా మావోయిస్టులు పిలుస్తుంటారు. ఇక్కడి బూత్‌లు అత్యంత సమస్యాత్మకమైనవని ఈసీ ప్రకటించింది.

భారీగా బలగాల మోహరింపు
బస్తర్‌ డివిజన్‌లో 60 శాతం భూభాగం వార్‌ జోన్‌గానో, విమోచన జోన్‌గానో ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బస్తర్‌, చుట్టుపక్కల 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటివిడతగా ఎన్నికలు జరుపుతున్నారు. రాష్ట్ర పోలీసులకు తోడు 45 వేల మంది పారామిలిటరీని అదనంగా మోహరించారు. మావోయిస్టుల బెదిరింపులు దీనికో కారణం. మావోయిస్టు నేత రామన్న ఇటీవల ఓ ప్రకటన విడుదల చేస్తూ... ‘‘గాలింపుల పేరుతో భద్రతా బలగాలు అణచివేతలకు పాల్పడుతున్నాయి. దానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’’ అని హెచ్చరించారు. ఓట్లేయకపోతే నక్సల్స్‌తో లింకులున్నాయని కేసులు పెడతామంటూ ప్రజల్ని రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారని కూడా రామన్న అన్నారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ మావోయిస్టుల బహిష్కరణ పిలుపునిస్తుంటారు. దానివల్ల ఓటింగ్‌ శాతం తగ్గుతూ ఉంటుంది. కాంగ్రెస్‌ ఎంతో కొంత లాభపడుతూ ఉంటుంది.

2003లో 30 వైమానిక దళ హెలికాప్టర్లను భద్రతకు వినియోగించారు. ఈ మారు 15 వినియోగిస్తున్నారు. 2003లో బస్తర్‌ ప్రాంతంలోని 12 సీట్లలో భాజపా 9 స్థానాలు గెలుచుకుంది. 2008లో 11 స్థానాల్లో విజయం సాధించింది. ఈ మారు పోలింగ్‌ శాతాన్ని బట్టి ఎన్ని సీట్లలో ఎవరు గెలుస్తారన్నది ఆధారపడి ఉంటుంది.

అజిత్‌జోగి సంగతేంది?
మావోయిస్టులు ఇటీవల ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మలకు ఉరివేశారు. కానీ ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో క్రియాశీలమైన కాంగ్రెస్‌ నేత అజిత్‌జోగి దిష్టిబొమ్మ వాటిలో లేదు. ఇలా ఎందుకు జరిగిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులపై కఠిన చర్యలకు ప్రతిపాదిస్తే.. అజిత్‌జోగి సహా కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net