Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
ఎన్నికలే ఎన్నికలు..
5 వారాల్లో 5 రకాలు...
గందరగోళమేనంటున్న పార్టీలు, అభ్యర్థులు
భారీగా పెరగనున్న ధన ప్రభావం
ఈనాడు - హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికలను ఏళ్ల తరబడి వాయిదావేసిన ఫలితం... ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉంటూ పౌరసేవలందించే సంస్థల ఎన్నికలపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించిన దాని పర్యవసానం... ఒకేసారి అయిదు రకాల ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజలకు ఇబ్బందికరం...అంతకుమించి పార్టీలు, ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు! కాస్త అటుఇటుగా అయిదు వారాల వ్యవధిలో అయిదు రకాల ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన పరిస్థితి. ఒక విధమైన గందరగోళం. సాధారణ ఖర్చుకు కొన్ని రెట్లు అధికంగా వ్యయం పైగా ప్రయాస. సాధారణ ఎన్నికలకు ముందుగా మున్సిపల్‌ ఎన్నికలే జరగకపోతే బాగుండని అనుకునే పార్టీలకు ఇప్పుడు ఏకంగా మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలు సైతం రావటంతో నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లైంది. మున్సిపల్‌ ఎన్నికలు జరిపినా... వాటి ఫలితాల్ని ప్రకటించొద్దని ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిచేశారు. అటునుంచి సానుకూల స్పందన రాలేదు. అన్నింటికీ సన్నద్ధం కావాల్సి వస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి సాధారణ ఎన్నికలు మన రాష్ట్రంలో చివరి దశలో జరగనున్నాయి. ఈ లోగానే మున్సిపల్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్తులకు ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. పార్టీలకు, అభ్యర్థులకు వూపిరి సలపనీయనంతా బిజీగా వరస ఎన్నికల షెడ్యూల్‌ ఉండనుంది. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 30వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. వచ్చేనెల రెండో తేదీన ఎన్నికల ఫలితాలొస్తాయి. ఏడోతేదీన మున్సిపల్‌ ఛైర్మన్లు, వైఎస్‌ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఈ నెల 10వ తేదీన జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే వీలుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 17వ తేదీన నోటిఫికేషన్‌, వచ్చేనెల 6వ తేదీన పోలింగ్‌ ఉండొచ్చని పార్టీలు భావిస్తున్నాయి. అదే నెల 9వ తేదీ నాటికి ఫలితాలు, 14వ తేదీకి జిల్లాపరిషత్తు, మండల పరిషత్తుల అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరిగే వీలుంది. పార్టీల అంచనా మేరకే ఈ తేదీలు ఖరారు కాకపోయినా... ఒకటి, రెండు రోజులు అటుఇటుగానే తేదీలుండొచ్చు. అప్పటికే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఉంటుంది. తెలంగాణలో 30వ తేదీన, సీమాంధ్రలో మే 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఎక్కడా పార్టీలకు తీరికుండదు.

భారమంతా... అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులపైనే: జిల్లాలో ఏ ఎన్నికలైనా, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలైనా సాధారణంగా శాసనసభ్యులు, ఆ తరువాత లోక్‌సభ సభ్యులదే కీలక పాత్ర. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల్లో వారి అనుచరులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు లభిస్తాయి. అలకలు, అసంతృప్తులున్నా వీరే తీర్చాలి. ఎన్నికల్లో విజయానికి వీరే అన్ని వ్యవహారాలూ చూడాలి. ఫలితాలొచ్చాక ఛైర్మన్ల ఎన్నికకు మంత్రాంగం నడపాలి. అధ్యక్ష పదవులు ద్వితీయ శ్రేణి నాయకులకొస్తాయి. కౌన్సెలర్లు, కార్పొరేటర్లు, జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవులకు ప్రధానంగా ఆయా పార్టీల్లోని కార్యకర్తలే పోటీ చేస్తారు. కార్యకర్తల విజయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషిచేస్తే... తిరిగి వీరి గెలుపునకు కార్యకర్తలు కష్టపడతారు. ఇది ప్రతి పార్టీలో జరిగేదే. అయితే ఈసారి ఎన్నికలన్నీ ఒకేసారి వచ్చిపడ్డాయి. అందులోనూ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు చివర్లో... అంటే మున్సిపల్‌, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తుల ఎన్నికల ప్రక్రియంతా ముగిశాక జరగనున్నాయి. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించుకుంటేనే వారు వీరికి సహకరిస్తారు. శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే వారు ఎవరైనా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించటం ద్వారా వారి సత్తా చూపాలి. ఇదొక విధంగా ముందస్తు పరీక్ష. ఇందులో నెగ్గితే అసలు పరీక్షను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మొత్తం శక్తియుక్తులన్నీ ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపాల్సిందే. అంటే వ్యయప్రయాసలు కొన్ని రెట్లు అధికంగా ఉండనున్నాయి. ఒకేసారి అన్ని రకాల ఎన్నికల ఖర్చు భరించాల్సి ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నికల వరకైతే సుమారు 160 నియోజక వర్గాలపైనే ప్రభావం ఉండేది. జిల్లా, మండల పరిషత్తులు సైతం ఒకేసారి రావటంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా ఈ ఎన్నికలు జరుగుతున్నట్లుగానే పరిగణించాలి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలోనే సాధారణ ఎన్నికల ప్రచారమూ చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో, బహుశా దేశంలోనూ ఎన్నడూ ఇలా ఒకేసారి ఎన్నికలు జరగలేదని పార్టీలంటున్నాయి.

అప్రమత్తంగా ఉండండి
జిల్లా ఎస్పీలతో డీజీపీ
న్నికల నేపథ్యంలో డీజీపీ ప్రసాదరావు శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శాంతిభద్రతల అదనపు డీజీ కౌముది, రీజియన్‌ ఐజీలు, జోనల్‌ డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలతోపాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలతోపాటు పురపాలక సంఘాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో పోలీసు శాఖపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు ఎన్నికలు నిర్వహించినా, మూడు ఎన్నికలు నిర్వహించినా పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ముందునుంచే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, నాయకుల పర్యటన సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫాక్షన్‌ ప్రభావిత జిల్లాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ముందు నుంచే అవసరమైన ప్రాంతాల్లో ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో ఎస్పీ తమ జిల్లాలోని పరిస్థితిని వివరించగా డీజీపీ వారికి సూచనలు చేశారు.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net