Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
తరాల తలరాతను మార్చే సదవకాశం
జీవితకాలంలో ఒకేసారి వస్తుంది
రాజధానిపై చెప్పుడు మాటలు వినొద్దు
స్థానికులే తొలి లబ్ధిదారులు
అందరికీ న్యాయం చేస్తా
ఏడాదిలోపు ధ్రువపత్రాలిస్తాం
అపోహలన్నీ తీరుస్తాం
ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు కట్టిస్తాం
లక్షన్నర వరకు ఒకేసారి రుణ మాఫీ
పంటల వారీగా పరిహారం పరిశీలిస్తాం
రాజధాని ప్రాంత గ్రామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి భూములివ్వడం వల్ల స్థానిక రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వారి జీవితాల్లో ఎవ్వరూ వూహించనంత మార్పులొస్తాయని చెప్పారు. రెచ్చగొట్టే వారి మాటలు వినకుండా రాజధాని ప్రాంత పరిధిలోని రైతులంతా భూసమీకరణకు సహకరించాలని సూచించారు. రాజధాని అడవుల్లో పెట్టమని చెప్పిన వారు, సొంత భూములకు విలువను పెంచుకోవాలనుకున్న వారు, దొనకొండలో పెట్టాలని రాయబారాలు నెరిపిన వారు రైతులన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వారి మాటలు వినకుండా సానుకూల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. భూమి ఇచ్చిన రైతుకు తొలి లబ్ధి చేకూరాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. అన్నదాతలు బ్యాంకుల నుంచి తీసుకున్న లక్షన్నర రూపాయల రుణాన్ని ఏక మొత్తంలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకరి భూమి తీసుకొని, మరికొందరి భూమి వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ తన నేతృత్వంలోనే ఏర్పాటవుతుంది కాబట్టి అందరికీ ఒకే న్యాయాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. రాజధాని భూసమీకరణ మంత్రివర్గ సభ్యులైన యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు తాండికొండ ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌లతో శనివారం ఉదయం తన నివాసంలో సమావేశమై క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను చర్చించిన తర్వాత చంద్రబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు స్పష్టత ఇవ్వడంతో పాటు, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇష్టానుసారం విభజించారు
కాంగ్రెస్‌ నాయకులు రాజధాని లేకుండా విభజన చేశారు. హైదరాబాద్‌ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని గొప్పలు చెప్పారు. బిల్లును ఇష్టానుసారంగా రాశారు. అప్పులు జనాభా ప్రాతిపదికన విభజించి, ఆదాయాన్ని ఇష్టానుసారం పంచారు. విద్యుత్తును వినియోగం ఆధారంగా పంపిణీ చేశారు. అఖిల భారత స్థాయి అధికారులను 13:10 నిష్పత్తిలో పంచి రాష్ట్ర ఉద్యోగులు, పింఛనుదారులను 58:42 నిష్పత్తిలో విభజించారు. దీని వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడింది.

అడవుల్లో పెట్టమన్నారు
హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయలేం. తాత్కాలిక రాజధాని ఏర్పాటుకూ సమస్యలున్నాయి. కొత్త రాజధాని కట్టుకోకుండా చేయడానికి కొంతమంది పెద్దలు ప్రయత్నించారు. అందరికీ కేంద్ర స్థానంలో ఉన్న దీన్ని రాజధాని కోసం ఎంపిక చేస్తే కొంత మంది మాత్రం అడవుల్లో పెట్టమని నాకు సూచనలు చేశారు. మరికొందరు తమ భూముల విలువ పెంచుకోవడానికి తాము భూములుకొన్న చోట పెట్టమని సలహా ఇచ్చారు. అది సాధ్యం కాకపోవడంతో ప్రజల్లో అపోహలు సృష్టించారు. ఆటలు సాగక పోవడంతో మళ్లీ పంటలు పొలాల్లో కట్టవద్దంటున్నారు.

ప్రతి ఒక్కరి శ్రమతో నిర్మాణం కావాలి
నాపై నమ్మకంతో రాజధానికి ఎంతో మంది విరాళాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక ఇటుక, దానికి సమానమైన డబ్బు విరాళంగా ఇవ్వాలని అడిగా. 4.93 కోట్ల మంది ప్రజల శ్రమ, విరాళం ఇందులో ఉండాలి. నా శక్తి, శ్రమ, డబ్బు, తెలివి తేటలు ఇందులో ఉన్నాయన్న భావన ప్రతి మనసులో కలగాలి. అందుకే దీన్ని ప్రజా రాజధాని అంటున్నా. సైబరాబాద్‌ అభివృద్ధి చేసినప్పుడూ చుట్టుపక్కల వారే బాగుపడ్డారు. వారి భూములకు విలువ వచ్చింది. కంపెనీలతోపాటు ఉద్యోగాలు వచ్చాయి. ఆదాయం పెరిగింది. కొంతమంది శ్రీకాకుళం నుంచి పనికోసం వచ్చారు. ఇక్కడున్న వారు పని చేయించుకొనే స్థితికి ఎదిగారు. ఈ వాస్తవాన్ని కాదని భూమి పోతే నష్టం జరుగుతుందని రెచ్చగొట్టడం సరికాదు.

రైతుల మేలుకోసమే భూ సమీకరణ
సాధారణంగా ఇలాంటి విషయాల్లో భూసేకరణ చేపడతారు. ఆ పద్ధతిలో ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారు. చివరకు స్థానిక ప్రజలు అక్కడి పరిశ్రమల్లో పనివాళ్లుగా మారే పరిస్థితి ఇంతవరకూ ఉంది. ఇప్పుడు రాజధాని రైతులకు అలాంటి పరిస్థితి రానీయదలచుకోలేదు. భూములు ఇచ్చేవారే తొలి లబ్ధిదారు కావాలి. అందరికీ ఒకే విధానం ఉంటుంది. హైదరాబాద్‌లో రోడ్డు వెడల్పు చేసినప్పుడు కూడా అందరికీ ఒకే న్యాయం అమలు చేశాం. ఎంత భూమి కావాలన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఉన్న భూమి అభివృద్ధి చేసుకుంటూ పోతే మిగిలిన వారికీ మేలు జరుగుతుంది.

ఎవ్వరికీ అపోహలొద్దు
రైతులకు అపోహ వద్దు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. కూలీల బాగోగులు చూసుకుంటాం. వారి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాం. ఉపాధి హామీ పథకం కొనసాగిస్తాం. వంద రూపాయలు సంపాదించుకొనే చోట వెయ్యి రూపాయల దారి చూపిస్తాం. గుంటూరు, కృష్ణా ప్రజలు తెలివైన వారు. 50 ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లారు. రాజధాని తర్వాత ఇక్కడ ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలు వస్తాయి. రెండెకరాల స్థలం ఉన్న వ్యక్తికి మిగిలిన స్థలంలో వాణిజ్య భవన సముదాయం కట్టుకొని లీజుకిచ్చుకుంటే ఏసీ రూంలో కూర్చున్నా ఆదాయం వస్తుంది. ఇప్పటిలా రాత్రింబవళ్లు బురదలో పని చేయాల్సిన అవసరం ఉండదు. చాలామంది రకరకాల సూచనలు చేశారు. కొంతమంది దొనకొండకు తీసుకెళ్లమని రాయబారాలు నెరిపారు. కానీ చరిత్రలో నేను తీసుకున్న నిర్ణయం సబబే అని ప్రజలు గర్వించేలా చేయాలన్నదే నా తపన.

సమస్యలను పరిశీలిస్తున్నాం
* ఎంతమందికి ఇంటి జాగాలు లేవో తేల్చమని ఎమ్మెల్యేకు చెప్పాం. వారందరికీ శాశ్వత ఇల్లు నిర్మించి ఇస్తాం.
* భూసమీకరణ పరిధిలోని రైతులు బ్యాంకుల నుంచి లక్షన్నర వరకు అప్పుతీసుకొని ఉంటే వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేసి ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం. అక్కడి భూమి అంతా తక్షణం అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించి విలువ పెరిగేలా చేస్తాం.
* నేను అందరితో మాట్లాడమని మంత్రివర్గ ఉపసంఘానికి చెప్పాను. అందరితో మాట్లాడిన తర్వాత ఒక ఆమోద యోగ్యమైన విధానం ప్రకటిస్తాం. స్థూలంగా పాలసీ సిద్ధంగా ఉంది. చివరగా రైతులతో మాట్లాడి కొంత మార్పులు చేర్పులు చేస్తాం.
* రైతులు వాస్తవికంగా ఉన్నారు. నాయకుల అజెండా వేరేగా ఉంది. ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అందరూ రాజధాని అక్కడే రావాలని ఏకగ్రీవంగా కోరారు.
* పంటల వారీగా పరిహారం ఎలా చెల్లించాలో అధ్యయనం చేయమని చెప్పాం. కొందరు నివాస స్థలంతో పాటు కొంత వాణిజ్య స్థలం కూడా కావాలంటున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తాం. ఎక్కడ భూమి ఇచ్చిన వారికి అక్కడే వాణిజ్య స్థలం ఇవ్వడం గురించి పరిశీలించమని చెప్పాం.
* భూసమీకరణ కోసం గడువు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైతులు సుముఖంగా ఉంటే రేపే ఇస్తారు. వాళ్లు ఏది కావాలనుకుంటున్నారో అదే నా మనసులో ఉంది. అదే విషయాన్ని స్పష్టంగా చెబితే సరిపోతుంది.
* రాజధాని పరిధిలో వూర్లు, చెరువులు అలాగే ఉంటాయి. హైదరాబాద్‌లో ప్లానింగ్‌ చేసేటప్పుడు అడవులున్నా నేరుగా రోడ్లు వేయాలనుకున్నాం. కానీ అలా చేయకుండా చుట్టు చుట్టివెళ్లారు. ఇప్పుడు చక్కని రహదారులు వేయాలనుకుంటున్నాం. మనం చేసేది జీవితాంతం ఉంటుంది కాబట్టి ప్రపంచ స్థాయి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నాం.
* హైదరాబాద్‌ కంటే మంచి రాజధాని నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఏమేం ప్రయోజనాలు కల్పించాలో అన్నీ ఇవ్వాలి. ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి అరుణ్‌ జైట్లీని అడిగాం. ఇంకా వారు దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇస్తారన్న నమ్మకం ఉంది.
* అవసరమైతే రైతులతో మాట్లాడటానికి సిద్ధం.
* భూ సమీకరణకు ముందుకొచ్చిన వారందరితో ఎక్కడికక్కడ అనుమతి పత్రాలు తీసుకుంటాం. 25 సెంట్లు ఉన్న వారి గురించీ ఆలోచిస్తున్నాం. వారికి కొంత డబ్బు ఇచ్చి, వారికి వచ్చే 6-7 సెంట్లలో ఒకవైపు నుంచి షాపులు నిర్మించి ఇచ్చే విషయం ఆలోచిస్తున్నాం. అది వారికి ఆస్తిగా ఉంటుంది.
* ఏడాదిలోపు రైతులకు ధ్రువపత్రాలు ఇస్తాం. రాజధాని ప్రణాళిక తయారుచేసి, భూగర్భ నీటి గొట్టాలు, తీగలు వేయాలని యోచిస్తున్నాం. ఒకసారి ప్రణాళిక పూర్తయిన తర్వాత నమూనా తయారు చేసి చూపిస్తాం. ఆ వెంటనే ఎవరి స్థలాలు వారికిస్తాం. ఆ వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం.
* భూములు ఉంచుకొనే వెసులుబాటు ఉంటే రైతులు ఉంచుకోవడమే ఉత్తమం. అమ్ముకుంటామంటే మీ ఇష్టం.
ఎవ్వరికీ రాని అవకాశం ఇది
‘‘రాజధాని ప్రాంత పరిధిలోని రైతాంగానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మీకు సాధికారత కల్పించి, అన్ని విధాలా పైకి తేవాలన్నదే నా సంకల్పం. రాజధాని వల్ల మీ జీవితాల్లో మీరు వూహించని మంచి మార్పులొస్తాయి. మీ తర్వాత తరాలు కూడా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రోజు రెచ్చగొట్టే వాళ్లు ఆ రోజు రాజధాని ఇక్కడే పెట్టాలని ఒక్కరైనా సూచించారా? అందరికీ నచ్చజెప్పుకోవచ్చన్న ఉద్దేశంతో రాష్ట్రానికి నడిమధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశాం. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మించుకోవాలి. రాష్ట్ర విభజన నాడు మనకు రాజధాని లేకుండా చేసి కొందరు మన పొట్ట కొట్టాలనుకున్నారు. కానీ వారే చివరకు సమాధి అయ్యారు. తెలుగు జాతికి ఈ రోజు కొత్త రాజధాని కట్టుకొనే అవకాశం వచ్చింది. సంక్షోభంలో ఇదో అవకాశం. కొత్త రాష్ట్రం రాకపోతే రాజధాని ఆలోచన వచ్చేది కాదు. ఎప్పుడో కట్టిన చండీగఢ్‌ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. బ్రిటిష్‌ వాళ్లు ఎప్పుడో కట్టిన కొత్త దిల్లీని అభినందిస్తున్నాం. ఇలాంటి అవకాశాలు జీవితకాలంలో ఒకసారే వస్తాయి. మన భావితరాలు కూడా ఆనంద పడేలా, గర్వించే రాజధాని కట్టుకుందాం. ఇందులో తొలి లబ్ధిదారులు స్థానిక రైతాంగం, బడుగు బలహీన వర్గాల వారే’’
అంతర్జాతీయ నగరం కావాలా? మురికివాడా?
‘‘కొందరు ఇంత భూమి అవసరమా అంటున్నారు? భూమికి విలువ పెరగాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్లు, మౌలిక వసతులు ఉండాలి. మన భూమికి విలువ పెంచుకోవడమా? మరో మురికివాడ తయారు చేసుకోవడమా? తేల్చుకోవాలి. ప్రధాని ‘అత్యాధునిక నగరాల’(స్మార్ట్‌ సిటీ) గురించి మాట్లాడుతుంటే మనం పాత రోజులకు వెళ్దామా? బ్రిటిషర్లు కట్టిన కొత్త దిల్లీ రోడ్లు చూస్తే ఇప్పటికీ ముచ్చటేస్తుంది. అలాంటివి మనకు కావాలి. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రపంచ స్థాయి నగరాలు కడతామన్నారు. దానివల్ల రైతులే లబ్ధి పొందుతారు. ఆ నగరాన్ని చూడటానికి మనుషులొస్తే ఉపాధి వస్తుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు వచ్చి ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net