Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
విస్తరణపై మోదీ, షా ముద్ర
ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాల ముద్ర స్పష్టంగా కనిపించింది. 2015-16 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌ కసరత్తు మొదలవుతుండడం, రక్షణ శాఖకు సంబంధించిన కొనుగోళ్లను ప్రక్షాళించాలని ప్రధాని నిర్ణయించడం వల్ల అరుణ్‌జైట్లీ వద్ద ఆర్థిక శాఖ ఉంచి, అదనపు బాధ్యతగా ఉన్న రక్షణ శాఖను మనోహర్‌ పారికర్‌కు అప్పగించారు. నిజాయితీపరునిగా, సమర్థ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా పారికర్‌ గుర్తింపు పొందడంతో ఆయన్ని రక్షణ శాఖ మంత్రిగా తీసుకోవడంపై ప్రధాని మొగ్గు చూపారు. హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీల్లో బలంగా ఉన్న జాట్లను దృష్టిలో పెట్టుకుని బీరేంద్ర సింగ్‌ను కేబినెట్‌లో తీసుకున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన కాంగ్రెస్‌ నుంచి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకు అమిత్‌షా ఇచ్చిన వాగ్దానం మేరకే కేబినెట్‌లో బెర్తు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆరెస్సెస్‌ మూలాలతో భాజపా ప్రధాన కార్యదర్శిగా ఉన్న జేపీ నడ్డాకు కేబినెట్‌లో చోటు కల్పించడం ద్వారా హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పించినట్లయింది. ఆ రాష్ట్రంలో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలనూ ఈ ఏడాది ఎన్నికల్లో భాజపా గెలుచుకొంది.

శివసేనకు ఝలక్‌!: నిన్నటి వరకు శివసేనలో ఉన్న సురేశ్‌ ప్రభు భాజపాలోకి మారి కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించడం వెనుక షా వ్యూహచతురత స్పష్టంగా కనిపిస్తోంది. బెర్తుల కేటాయింపులో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఒత్తిళ్లకు తల ఒగ్గేది లేదనే బలమైన సంకేతాన్ని ఈ చర్య ద్వారా పంపించినట్లయింది. పైపెచ్చు శివసేనలో చీలికను ప్రోత్సహించే రీతిలో ప్రభును భాజపాలో చేర్చుకున్నారు. మహారాష్ట్రలో దేవండ్ర ఫడణవీస్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత నాలుగు కేబినెట్‌ మంత్రి పదవులు, నాలుగు సహాయ మంత్రి పదవులు మాత్రమే అక్కడ ఇస్తామంటూ షా స్పష్టం చేసినట్లు సమాచారం.

రాజకీయ వ్యూహం: రాజకీయంగా బలంగా ఉన్న ఠాకూర్లకు సానుకూల సంకేతాలు పంపించడం కోసం రాజీవ్‌ ప్రతాప్‌ రూడీకి అవకాశం కల్పించారు. ఈ నెలలో ఝార్ఖండ్‌లో, వచ్చే ఏడాది బిహార్‌లో జరగనున్న ఎన్నికల్లో ఠాకూర్ల మద్దతు నిలబెట్టుకోవడానికి భాజపా ప్రయత్నిస్తోంది. అగ్రనేత రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్గానికి ప్రధాని తగిన ప్రాధాన్యం కల్పించడం లేదనే భావనను తొలగించడానికి కూడా ఈ ఎంపిక ఉపయోగపడనుంది. రాజ్‌నాథ్‌ సింగ్‌కు సన్నిహితునిగా రూడీకి పేరుంది. బిహార్‌కు చెందిన అగ్గిబరాటా గిరిరాజ్‌ సింగ్‌, రాం కృపాల్‌ యాదవ్‌లను సహాయ మంత్రులుగా తీసుకోవాలన్న నిర్ణయం వెనుకా భాజపా రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. గిరిరాజ్‌ సింగ్‌ భూమిహార్‌ సామాజిక వర్గానికి చెందినవారు. దక్షిణ బిహార్‌, ఝార్ఖండ్‌లలో ఆ వర్గానికి పట్టుంది. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)తో ఉన్న పాతికేళ్ల అనుబంధాన్ని తెంచుకుని రాం కృపాల్‌ యాదవ్‌ భాజపాలో చేరారు. బిహార్‌, ఝార్ఖండ్‌లలో 52% ఓట్లున్న ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని మంత్రి పదవికి ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతంలో భాజపాకు బాసటగా నిలుస్తున్న కాయస్థ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించడానికి జయంత్‌ సిన్హాను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. కార్పొరేట్‌ పాలనలో ఉన్న రెండు దశాబ్దాల పైచిలుకు అనుభవం, వ్యూహ రచన మెళకువలు ఆయనకు కలిసొచ్చాయి.

ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీని మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా మోదీ తన విశాల హృదయాన్ని చాటుకొన్నట్లయింది. ఎన్నికలకు ముందు జేడీ(యు) నేత షబ్బీర్‌ అలీని భాజపాలోకి తీసుకోవడాన్ని నక్వీ వ్యతిరేకించారు. అప్పట్లో షబ్బీర్‌ అహ్మదాబాద్‌ వెళ్లి మోదీని కలిసి పార్టీలో చేరారు. తర్వాత అలీని భాజపా నుంచి తొలగించడం, ఇప్పుడు నక్వీకి మంత్రి పదవి ఇవ్వడం విశేషం. నజ్మా హెప్తుల్లాతో కలిపి మంత్రి వర్గంలో ఇద్దరు ముస్లింలు ఉన్నట్లయింది. బాబుల్‌ సుప్రియోను మంత్రి వర్గంలో తీసుకుని బంగాల్‌కు ప్రాతినిథ్యం ఇచ్చారు.

పార్టీలోనూ తప్పని మార్పులు: ఒకరికి ఒకే పదవి అనే నిర్ణయం కారణంగా త్వరలో భాజపాలో కొన్ని మార్పులు చేపట్టే అవకాశం ఉంది. మంత్రి పదవులు పొందినవారిలో పలువురికి పార్టీ పదవులూ ఉన్నాయి. నూతన మంత్రుల్లో బండారు దత్తాత్రేయ, ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ (ఉపాధ్యక్షులు), జేపీ నడ్డా, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ (ప్రధాన కార్యదర్శులు) పార్టీ హోదాలు నిర్వర్తిస్తున్నారు.

కేంద్ర మంత్రి వర్గం.. సమగ్ర స్వరూపం
ప్రధాని నరేంద్ర మోదీ: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు

కేబినెట్‌ మంత్రులు..
1. రాజ్‌నాథ్‌సింగ్‌ : హోం శాఖ

2. సుష్మాస్వరాజ్‌ : విదేశీ వ్యవహారాలు

3. అరుణ్‌ జైట్లీ: ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు

4. ఎం.వెంకయ్యనాయుడు : పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక

నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు

5. నితిన్‌ జైరాం గడ్కరీ : రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్‌

6. మనోహర్‌ పారికర్‌ : రక్షణ శాఖ

7. సురేశ్‌ ప్రభు : రైల్వేలు

8. డి.వి.సదానందగౌడ : న్యాయ శాఖ

9.ఉమాభారతి : జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన

10.నజ్మాహెప్తుల్లా : మైనారిటీ వ్యవహారాలు

11. రాంవిలాస్‌ పాసవాన్‌ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ

12. కల్‌రాజ్‌మిశ్ర : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు

13.మేనకా సంజయ్‌గాంధీ : మహిళ, శిశు సంక్షేమం

14. అనంతకుమార్‌ : రసాయినాలు, ఎరువులు

15. రవిశంకర్‌ ప్రసాద్‌ : కమ్యూనికేషన్లు, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ

16.జగత్‌ ప్రకాశ్‌ నడ్డా : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

17. అశోక్‌ గజపతి రాజు : పౌర విమానయానం

18. అనంతగీతె : భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌

19. హర్‌సిమ్రత్‌ కౌర్‌బాదల్‌ : ఆహార శుద్ధి, పరిశ్రమలు

20. నరేంద్రసింగ్‌ తోమర్‌ : గనులు, ఉక్కు

21. చౌధురి బీరేంద్రసింగ్‌ : గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, తాగునీరు, పారిశుద్ధ్యం

22. జువల్‌ ఓరం : గిరిజన వ్యవహారాలు

23. రాధామోహన్‌సింగ్‌ : వ్యవసాయం

24. థావర్‌చంద్‌ గెహ్లాట్‌ : సామాజిక న్యాయం, సాధికారత

25. స్మృతి జుబిన్‌ ఇరానీ : మానవ వనరుల అభివృద్ధి

26. హర్షవర్ధన్‌ : శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రం

27. జనరల్‌ వీకే సింగ్‌ : గణాంకాలు, కార్యక్రమ అమలు, విదేశీ వ్యవహారాలు, ప్రవాస భారతీయ వ్యవహారాలు (స్వతంత్ర)

28. ఇందర్‌జీత్‌సింగ్‌ రావు : ప్రణాళిక, రక్షణ (స్వతంత్ర)

29. సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌ : జౌళి శాఖ (స్వతంత్ర)

30. బండారు దత్తాత్రేయ : కార్మిక, ఉపాధి కల్పన (స్వతంత్ర)

31. రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ : నైపుణ్యాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు (స్వతంత్ర)

32. శ్రీపాద యశోనాయక్‌ : ఆయుష్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం (స్వతంత్ర)

33: ధర్మేంద్ర ప్రధాన్‌ : పెట్రోలియం, సహజ వాయువు (స్వతంత్ర)

34: సర్బానంద సోనోవాల్‌ : యువజన వ్యవహారాలు, క్రీడలు (స్వతంత్ర)

35. ప్రకాశ్‌ జవదేకర్‌ : పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు (స్వతంత్ర)

36. పీయూష్‌ గోయల్‌ : విద్యుత్తు, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధన వనరులు (స్వతంత్ర)

37. జితేంద్రసింగ్‌ : ఈశాన్యప్రాంత అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖలు (స్వతంత్ర)

38. నిర్మలా సీతారామన్‌ : వాణిజ్య, పరిశ్రమల శాఖ (స్వతంత్ర)

39. మహేష్‌ శర్మ : సాంస్కృతిక, పర్యటక(స్వతంత్ర), పౌరవిమానయాన (సహాయ)

సహాయ మంత్రులు
40. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ : మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాలు

41. రామ్‌క్రిపాల్‌ యాదవ్‌ : తాగునీరు, పారిశుద్ధ్యం

42. హరీభాయ్‌ పార్తిభాయ్‌ చౌదురీ : హోం

43. సన్వర్‌ లాల్‌ జాట్‌ : నీటివనరులు, నదుల అభివృద్ధి, గంగాప్రక్షాళన

44. మోహన్‌భాయ్‌ కళ్యాణ్‌జీభాయ్‌ కుందారియా : వ్యవసాయం

45. గిరిరాజ్‌సింగ్‌ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

46. హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహిర్‌ : రసాయనాలు, ఎరువులు

47. జీఎం సిద్దేశ్వర : భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు

48. మనోజ్‌ సిన్హా : రైల్వే

49. నిహాల్‌చంద్‌ : పంచాయతీరాజ్‌

50. ఉపేంద్ర కుష్వాహ : మానవ వనరుల అభివృద్ధి

51. రాధాకృష్ణన్‌ పి : రోడ్డు రవాణా, జాతీయరహదారులు, నౌకాయానం

52. కిరణ్‌ రిజిజు : హోం

53. క్రిషన్‌పాల్‌ : సామాజిక న్యాయం, సాధికారత

54. సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌ : వ్యవసాయం

55. మనుష్క్‌భాయ్‌ ధంజీభాయ్‌ వసవా : గిరిజన వ్యవహారాలు

56. రావ్‌సాహెబ్‌ దాదారావ్‌ దన్వే : వినియోగదారుల, ఆహార, ప్రజా పంపిణీ

57. విష్ణు దేవ్‌ సాయి : గనులు, ఉక్కు

58. సుదర్శన్‌ భగత్‌ : గ్రామీణాభివృద్ధి

59. రామ్‌ శంకర్‌ కతేరియా : మానవ వనరుల అభివృద్ధి

60. వై.ఎస్‌.చౌదరి(సుజనా చౌదరి) : శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞానం

61. జయంత్‌ సిన్హా : ఆర్థిక

62. కల్నల్‌ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌ : సమాచార, ప్రసార

63: బాబుల్‌ సుప్రియో బరాల్‌ : పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన

64: సాధ్వీ నిరంజన్‌ జ్యోతి : ఆహార శుద్ధి పరిశ్రమ

65: విజయ్‌ సంప్లా : సామాజిక న్యాయం, సాధికారత

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net