Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
ఇప్పుడు ఆసక్తి.. అంతర్జాతీయం!
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎటుచూసినా భారత్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభావవంతమైన దేశాధినేతలు ఆలోచనలు కలబోసుకునే ప్రతిష్ఠాత్మక ‘జీ20’ సదస్సులో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా నగరమైన బ్రిస్బేన్‌లో కాలుమోపిన ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ దేశాధినేతల నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందున్నాయి. భారత్‌తో భాగస్వామ్యానికి ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ప్రపంచ ప్రాధమ్యాలతో పాటు దేశీయ ఎజెండానూ బలంగా ముందుకు తీసుకువెళ్లటానికి గట్టి కృషి చేస్తున్నారు.


స్ట్రేలియా గడ్డపై కాలుమోపిన వెనువెంటనే ప్రధాని మోదీ ఐరోపా యూనియన్‌ అధ్యక్షుడితోనూ, బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామరాన్‌తోనూ ఆర్థిక సహకారమే కీలక అజెండాగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం జపాన్‌ ప్రధాని షింజో అబె ఇచ్చిన విందులో పాల్గొన్నారు. భారత్‌తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఐరోపా యూనియన్‌(ఈయూ) ప్రత్యేక ఆసక్తి వ్యక్తం చెయ్యటం, ‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న సరికొత్త ఆర్థిక వాతావరణం’ దృష్ట్యా ఐరోపా యూనియన్‌ తప్పకుండా ముందుకు రావాలని మోదీ ఆహ్వానం పలకటం ఇరు పక్షాల మధ్యా సరికొత్త ద్వారాలు తెవరనున్నాయి. భారత, ఈయూల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ప్రస్తుతం ఒక ఒప్పంద ముసాయిదాపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని కీలకాంశాల మీద ఇరు పక్షాల మధ్యా అంగీకారం కుదరాల్సి ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్‌ దిగుమతులపై సుంకాలు, వైన్‌ దిగుమతులపై పన్నులు గణనీయంగా తగ్గించాలని ఈయూ డిమాండు చేస్తోంది. ప్రధాని మోదీ చొరవతో ఈ పీటముడి వీడిపోతుందని ఇరువర్గాలూ భావిస్తున్నాయి. గతంలో ఐరాస వేదికగా ప్రసంగిస్తూ ‘అంతర్జాతీయ యోగా దినం’ ఒకటి ఉండాలంటూ మోదీ చేసిన ప్రతిపాదనకు తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నట్టు ఈయూ నేతలు వెల్లడించటం విశేషం.

మరోవైపు బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ కూడా ‘భారత్‌తో భాగస్వామ్యం.. మా విదేశాంగ విధానంలో అత్యంత ప్రాధాన్యతాంశం’ అని బాహాటంగా ప్రకటించారు. అంతే కాదు.. ‘‘మీ దార్శనికత ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంది, మీతో భాగస్వామ్యానికి బ్రిటన్‌ సిద్ధంగా ఉంది’’ అని ప్రకటించటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ప్రధాని మోదీ, కామెరాన్‌లు ముఖాముఖీ కలుసుకోవటం ఇదే ప్రథమం. వీరితోనే కాదు.. జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ జర్మన్‌ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌, స్పెయిన్‌ ప్రధాని మారియానో రజొయ్‌లతో కూడా భేటీ కానున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలండెతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా కోట్లాది డాలర్ల రఫెలె యుద్ధ విమానాల ఒప్పందం కూడా చర్చకు రానుంది.

పెట్టుబడులు, ఇంధనం, భద్రత.. ఇవే లక్ష్యాలు!
భారత ప్రధాని ఆస్ట్రేలియా గడ్డపై కాలుమోపి దాదాపు 28 సంవత్సరాలైంది! ఎప్పుడో 1986లో రాజీవ్‌గాంధీ పర్యటించారు, ఆ తర్వాత మళ్లీ ఇదే భారత ప్రధాని పర్యటన. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు దృష్ట్యా బ్రిస్బేన్‌లో కాలుమోపిన మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో చర్చల నుంచి కూడా భారీగానే ఆశిస్తున్నారు.పెట్టుబడులు రాబట్టటం, ఇంధన రంగంలో భాగస్వామ్యం, భద్రతాపరమైన అంశాలను చర్చించటమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు విదేశాంగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీరి చర్చల అనంతరం భారత, ఆస్ట్రేలియాలు కనీసం ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి అబాట్‌ నెల క్రితమే దిల్లీ సందర్శించి, మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. మోదీ కూడా ఈ నాలుగు రోజుల్లో జీ20 సదస్సు జరుగుతున్న బ్రిస్బేన్‌తో పాటు (16-18 మధ్య) సిడ్నీ, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌ నగరాలను కూడా సందర్శించనున్నారు. ఈ సందర్భంగా మోదీ 500 మంది అత్యున్నతస్థాయి భారత, ఆస్ట్రేలియా సీఈవోలతో ముచ్చటించనున్నారు. భారత ఆస్ట్రేలియన్లు మోదీకి భారీ ఎత్తున పౌరసన్మానం కూడా తలపెట్టారు. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని అబాట్‌ కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 161 సంవత్సరాల మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో మోదీ కోసం ప్రత్యేక స్వాగతసమ్మానం ఏర్పాటు చేశారు. అస్ట్రేలియా ఉభయ సభలనుద్దేశించి మోదీ ప్రసంగించబోతున్నారు. ఒక దేశ ప్రధాని ఇంత విస్తృతంగా పర్యటించటం అరుదనీ, ఇంతటి ఘనమైన ఏర్పాట్లూ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవేననీ, ఇవన్నీ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బలమైన ప్రతిపాదనలు
జీ20లో ప్రధాని మోదీ ఉపాధి విస్తరణ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని ఆశిస్తున్నారు. ఉపాధి కల్పించని, కొత్తగా ఉద్యోగ కల్పన చెయ్యలేని ఆర్థిక వృద్ధి అంతగా ఉపయోగపడేది కాదని మోదీ ప్రపంచ దేశాధినేతలను ఒప్పించేందుకు గట్టి ప్రయత్నం చెయ్యబోతున్నారు. అలాగే నల్లధనంపై అంతర్జాతీయ పోరాటాన్ని ఆశిస్తూ ప్రపంచ దేశాల సహకారాన్ని కూడగట్టేందుకు ఆయన ప్రయత్నిస్తారని విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అవినీతికి వ్యతిరేకంగా జీ20 మొదటి నుంచీ కూడా విస్తృతంగా చర్చలు జరుపుతూనే ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి ఈ అవినీతే పెద్ద విఘాతమని సభ్య దేశాలు అభిప్రాయపడుతున్నాయి. వర్థమాన దేశాల అభివృద్ధికి కీలకమైన ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిధులన్నీ అవినీతి పరం అవుతుండటంతో వృద్ధి కుంటుపడుతోందని వీరు భావిస్తున్నారు. 2010లోనే అవినీతిపై యుద్ధానికి జీ20 ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిపై ఈ సదస్సులో సమగ్ర సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా మోదీ దీనిపై బలమైన వాణి వినిపిస్తారని ఆశిస్తున్నారు. సదస్సు చివర్లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిని కనీసం 2 శాతం పెంచటం లక్ష్యంగా ‘బ్రిస్బేన్‌ కార్యాచరణ ప్రణాళిక’ను ఆమోదిస్తారని భావిస్తున్నారు. జీ20 ఇలా ఒక నిర్దుష్టమైన లక్ష్యాన్ని, అందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చెయ్యటం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం!


ఇదీ జీ20!
* ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఎప్పటికప్పుడు పునస్సమీక్షిస్తూ.. దాని గమనాన్ని గాడిలో పెట్టేందుకు దేశాధినేతలు సమావేశమై, ఆలోచనలను కలబోసుకుని, కార్యాచరణను సిద్ధం చేసే కీలక వేదిక ‘జీ20’. అయితే ఇన్ని దేశాల అధినేతలు ఒకచోట చేరినప్పుడు కేవలం ప్రపంచ ఆర్థిక గమనమే కాదు, దేశాల ఆర్థిక పురోగమనం కూడా అత్యంత ప్రాధాన్యతాంశంగా మారటం సహజం.

* ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 20 దేశాల సమష్ఠి వేదికగా ఆవిర్భవించిన ‘గ్రూప్‌ ఆఫ్‌ 20 (జీ20)’ 1999లో కేవలం ఆర్థిక మంత్రుల, బ్యాంకర్ల వేదికగానే ఏర్పడినా 2008లో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని గడగడలాడించిన తర్వాత మారిన అవసరాల దృష్ట్యా ఇది దేశాధినేతల వేదికగా రూపాంతరం చెందింది.

* దీనిలో 19 దేశాలు, వాటికి తోడుగా ఐరోపా దేశాలన్నింటి సమాహారంగా ‘యూరోపియన్‌ యూనియన్‌’ మొత్తం ఒకే బృందంగా పాల్గొంటోంది. దానికి ‘యూరోపియన్‌ కమిషన్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌’ల ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

-ఈనాడు ప్రత్యేక విభాగం

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net