Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
ఆకాశమార్గాల అందాల నగరి
హైదరాబాద్‌ నలు దిక్కులా స్కైవేలు
ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ హైవేలూ నిర్మించాలి
బహుళ వరుసల పైవంతెనలు కూడా..
రహదారుల వ్యవస్థ అభివృద్ధికి రూ.30 వేల కోట్ల ఖర్చు
సమీక్షలో కేసీఆర్‌ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం మౌలిక వసతుల్లో అత్యంత కీలకమైన రహదారులపై దృష్టిసారించింది, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనతోపాటు పక్కనే ఆకాశహర్మ్యాలను నిర్మించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు నగరం నలుదిక్కులా ఆకాశమార్గాలు (స్కైవే) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితోపాటు ఇప్పటికే అనుకున్న విధంగా ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ హైవేలు నిర్మించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రూ.25వేల నుంచి రూ.30వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనాలు రూపొందించారు. వీటితోపాటు నగర ఉత్తర భాగంలో మరో విమానాశ్రయం నిర్మించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సచివాలయంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, ఎల్‌ఈఏ అసోసియేట్స్‌ ప్రతినిధులు ఎం.ఫణిరాజు, కెనడాకు చెందిన రవాణా వ్యవస్థ, రహదారుల ప్రణాళిక నిపుణుడు జాన్‌ఫెర్రో, టీఎస్‌ రెడ్డి, హనుమంతరావు తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ రద్దీని తట్టుకోవడంతోపాటు రాబోయే 40 ఏళ్ల వరకూ ఇబ్బందులు తలెత్తని విధంగా వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు. హైదరాబాద్‌ నలుదిక్కులా ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, ఆకాశమార్గాలు నిర్మించాలని ఆదేశించారు. భాగ్యనగరంలోఏటా 10 లక్షల జనాభా పెరుగుతోందన్నారు. వివిధ అవసరాల నిమిత్తం ప్రతి రోజు రాజధానికి వచ్చే ప్రజల సంఖ్య 15 లక్షలకు పైగా ఉంటుందని కేసీఆర్‌ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న రహదారులు ఇప్పటి అవసరాలను తీర్చలేకపోతున్నాయని .. వీటిని మెరుగుపరచకుంటే భవిష్యత్తులో హైదరాబాద్‌ గందరగోళంగా తయారవుతుందన్నారు. ప్రపంచంలోని అన్ని నగరాల్లో ‘గ్రిడ్‌లాక్‌’ కాకముందే (నగరంలోని వాహనాలన్నీ రోడ్డుపైన నిలబడినా ఇంకా ఖాళీ జాగా ఉండే రహదారి వ్యవస్థ ఉండాలి. అలా లేకుంటే దాన్ని గ్రిడ్‌లాక్‌ అంటారు) భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని రహదారులను అభివృద్ధి చేసుకుంటారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎప్పుడో వచ్చేసిందని, ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెళ్లిళ్ల సమయంలో నగరంలో ప్రయాణం నరకప్రాయమన్నారు. వివాహం దగ్గర 5, 10 నిముషాలు గడిపితే రహదారుల మీదనే మూడు నాలుగు గంటలపాటు ఉండాల్సి వస్తోందన్నారు.
ఆరు, ఎనిమిది వరసల రోడ్లు ఇక్కడ కష్టం: రద్దీ లేకుండా వాహనాలు తిరిగేందుకు చాలా నగరాల్లో 6, 8, 10 వరుసల రహదారులు నిర్మిస్తారని.. అయితే హైదరాబాద్‌లో పరిస్థితి అందుకు అనుగుణంగా లేదన్నారు. పెద్దపెద్ద రహదారులు నిర్మించాలంటే చాలా ప్రాంతాల్లో కూల్చివేతలు జరపాల్సి ఉంటుందని, ఇదంత సులభం కాదని అన్నారు. ఇస్తాంబుల్‌ తరహాలో చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూనే నగరంలో రహదారుల వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు. ఇప్పటికే అనుకున్న విధంగా పరేడ్‌గ్రౌండ్‌, తూంకుంట, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌ల్లో ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ హైవేలు నిర్మించాలని స్పష్టం చేశారు. వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే వాహనాలు నగర శివార్లలోనే ట్రాఫిక్‌లో చిక్కకుండా ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకూ, ఉప్పల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకూ విపరీతమైన రద్దీ ఉంటుందని.. ఈ మార్గాల్లో ఎలివేటెడ్‌ హైవేలు నిర్మించాలని కేసీఆర్‌ చెప్పారు. పాతబస్తీలో కూడా రహదారుల పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి రహదారుల వ్యవస్థను మెరుగుపర్చాలని సూచించారు. నగరంలోని అన్ని రహదారుల పరిస్థితి, వాహనాల రద్దీ, కూడళ్ల వద్ద ఉండే ఒత్తిడిపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో మొదటి దశలోనే రహదారుల వ్యవస్థను మెరుగుపర్చాలని ఆదేశించారు. తొలి దశలో 2 వేల కి.మీలను గుర్తించి ఆ మార్గాల్లో ఆకాశవీధులు నిర్మించాలన్నారు. రహదారులు వెడల్పు, కూడళ్ల అభివృద్ధి చేపట్టాలన్నారు. ఇప్పుడున్న పైవంతెన (ఫైఓవర్ల)లా కాకుండా బహుళవరుసల పైవంతెనలు, వివిధ పైవంతెనల మధ్య కూడళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో రహదారులను మెరుగుపర్చాలని.. ఆ తర్వాత హెచ్‌ఎండీఏ పరిధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మళ్లీమళ్లీ రహదారులను తవ్వుకునే పరిస్థితి రాకుండా రహదారులు, పైవంతెనలు నిర్మించే దశలోనే భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భ కేబుళ్ల వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇబ్బందులు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు హడావుడిపడే పరిస్థితిలో పూర్తిగా మార్పు రావాలన్నారు. రాబోయే 35 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పుడున్న బాహ్యవలయ రహదారులకు అవతలి ప్రాంతంలో ఒక ప్రాంతీయ వలయ రహదారి (రీజినల్‌ రింగ్‌ రోడ్‌) కూడా రావాలన్నారు. సంగారెడ్డి, వికారాబాద్‌, షాబాద్‌, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌, భువనగిరి, జగదేవ్‌పూర్‌, గజ్వేల్‌, తూప్రాన్‌ల మీదుగా దీన్ని నిర్మించాలని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ పౌరుడైనా హైదరాబాద్‌లో నివసించేందుకు ఇష్టపడతారన్న కేసీఆర్‌ అందుకు తగ్గట్లుగా నగరాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌ రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రూ.25వేల నుంచి రూ.30వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం వివరించారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net