Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
అథారిటీ, రాష్ట్రం చెరోవైపు
‘పోలవరం’పై ఇంకా కుదరని ఒప్పందం
ఎంఓయూ ముసాయిదాపై స్పష్టత కరవు
చర్చలతో కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు
ఈనాడు - హైదరాబాద్‌
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అథారిటీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఇంకా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదరలేదు. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక అవసరాల సంస్థ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌-ఎస్‌పీవీ)గా పోలవరం ప్రాజెక్టు ప్రాధికార సంస్థ (అథారిటీ) ఏర్పాటయింది. ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అథారిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరాలి. విధివిధానాలపై భిన్నాభిప్రాయాలుండటంతో ఈ వ్యవహారం ముందుకు కదలడం లేదు.

ఎంవోయూకు సంబంధించి ‘అథారిటీ’ ఒక ముసాయిదా తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పంపగా అందులోని విధివిధానాలు తమకు సమ్మతం కావంటూ తిప్పి పంపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేసిన ఎంవోయూ ముసాయిదాను అథారిటీ అంగీకరించలేదు. కేంద్రం ఇంతవరకు 14 సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిందని, వాటి విషయంలో అనుసరించిన విధి విధానాలనే అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ‘అథారిటీ’ మాత్రం పోలవరం విషయంలో ప్రత్యేకంగా వ్యవహరించాలని భావిస్తూ కొత్త విధివిధానాలను ముందుకు తెచ్చింది. ఇవి తమకు సమ్మతం కావని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయినా, ఆ తర్వాత అథారిటీతో నిర్వహిస్తున్న వివిధ సమావేశాల్లో ఎంవోయూకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ చర్చల్లో ఒక్కో అంశాన్ని పరిష్కరించుకుంటూ వస్తూ ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొత్త సీఈఓగా అమర్‌జిత్‌సింగ్‌
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా అమర్‌జిత్‌సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర జలవనరులశాఖలో కార్యదర్శి హోదాలో ఉన్న సింగ్‌ తాజాగా పదోన్నతి పొందారు. ఇంతవరకు సీఈవోగా ఉన్న దినేష్‌కుమార్‌ కొద్ది నెలల కిందట కేంద్ర సర్వీసుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయి రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు.

భూసేకరణ అధికారిగా కుకునూరు సబ్‌ కలెక్టర్‌
పోలవరం ప్రాజెక్టు కోసం పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని 8 గ్రామాల్లో భూ సేకరణ కోసం కుకునూరు సబ్‌ కలెక్టర్‌ను భూసేకరణ అధికారిగా నియమిస్తూ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. కోటరామచంద్రపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని ఈ గ్రామాలకు సంబంధించిన పునరావాస అధికారిగా నియమించారు.

రెండు సమస్యలు
* పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఆస్తులు, కార్యాలయాలు, అతిథి గృహాలు, కార్లు, డ్యామ్‌ మొత్తం తమకు అప్పచెప్పాలని అథారిటీ పేర్కొంటోంది. ఇలా అయితే.. ఈ ప్రాజెక్టుకు మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. ఇందుకు కేంద్రం సుముఖంగా లేదు. 2014 జూన్‌ తర్వాత ఖర్చు చేసిన నిధులు మాత్రమే ఇస్తామని హామీ ఇచ్చింది. సాధారణంగా జాతీయ హోదా దక్కిన ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరిస్తాయి. పోలవరం విషయంలో పూర్తి ఖర్చు తామే భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మొదటి నుంచి ఖర్చు చేసిన నిధులు ఇవ్వని పక్షంలో పోలవరం ఆస్తులన్నీ ఎలా అప్పగిస్తామని రాష్ట్ర అధికారులు ప్రశ్నిస్తున్నారు.

* సత్వర నీటిపారుదల ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద సాయం అందించే ప్రాజెక్టుల్లో 80 శాతం కేంద్రం ముందే చెల్లిస్తుంది. ఖర్చు చేసిన తర్వాత వాటి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే మిగిలిన 10 శాతం విడుదల చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ రాష్ట్రం అదే పద్ధతి పాటించాలని కోరుతోంది. ఖర్చు చేసి, ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, అథారిటీ ఆమోదం పొంది.. ప్రతిపాదనలు పంపినా వాటికీ నిధులు విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతుండటం గమనార్హం.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net