Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
నిధుల ప్రవాహం.. ఇంజినీర్లే లక్ష్యం
భావజాల వ్యాప్తికి ఐఎస్‌ఐస్‌ ప్రణాళిక
మెట్రోనగరాల్లో వందల సంఖ్యలో యువకుల ఎంపిక
ఐసిస్‌ ట్విట్టర్‌ను అనుసరిస్తున్న వేలమంది
ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మునావద్‌ సల్మాన్‌ గూగుల్‌ మాజీ ఉద్యోగి. కర్ణాటకకు చెందిన ఇతని కుటుంబం ముషీరాబాద్‌లో స్థిరపడింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు పశ్చిమబంగలో దేశసరిహద్దు దాటుతుండగా హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని కుటుంబానికి అప్పగించారు.’’

‘‘మెహిదీ మస్రూర్‌ బిశ్వాస్‌... బెంగళూరులో బహుళజాతి సంస్థ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. రూ.5.3లక్షల వార్షిక వేతనం.పశ్చిమబంగకు చెందిన ఇతడు ఐసిస్‌ సానుభూతిపరుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి దేహద్రోహం కింద అరెస్టుచేశారు. మెట్రోనగరాల్లో 17వేల మంది ఐసిస్‌ ట్విట్టర్‌ ఖాతాను అనుసరిస్తున్నారని బిశ్వాస్‌ వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

‘‘అరిఫ్‌ మజీద్‌.. ముంబయిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి. ఐసిస్‌ భావజాలంపట్ల ఆకర్షితుడైన మజీద్‌ మరో ముగ్గురు స్నేహితులతో ఐసిస్‌లో చేరేందుకు ఇరాక్‌లోని బాగ్దాద్‌కు వెళ్లాడు. అక్కడ ఐసిస్‌ సంస్థ ఉగ్రశిక్షణ శిబిరంలో కొద్దిరోజులున్నాడు. తుపాకీ గాయం కారణంగా ఉగ్రవాదులు వెనక్కిపంపారు. కళ్యాణ్‌కొచ్చిన వారం రోజులకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.’’

మెట్రోనగరాల్లో కొద్దినెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఘటనలివి. పక్కాప్రణాళికతో సామాజిక వెబ్‌సైట్లు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా భావజాలాన్ని వ్యాప్తి చేస్తోన్న ఐసిస్‌ అంతర్జాల పరిజ్ఞానమున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను ఎంపిక చేసుకుంటోంది. వీరి ద్వారా ‘ఐటీ’ బృందాల్ని రూపొందించాలని ప్రణాళికలను సిద్ధం చేసింది. అందుకోసం భారీగా నిధులను ప్రవహింప చేస్తోంది. ఐసిస్‌ కార్యకలాపాలపై నిఘా వేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) కేంద్ర నిఘా వర్గాలకు లభించిన సమాచారంలో కొన్ని అంశాలివి. ఈ అంశాల ఆధారంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఎస్‌ఐస్‌ విధ్వంస కుట్రను భగ్నం చేసింది. భారత్‌లో దిల్లీ, ముంబయి నగరాల్లో ఓ వర్గానికి చెందిన యువకులను ఆకర్షించి ఐసిస్‌ విస్తరించేందుకు ప్రణాళిక వేసుకుంది. దుబాయ్‌, అమెరికా, యూరప్‌ దేశాల నుంచి రూ.కోట్లలో నిధులు పంపుతామంటూ హామీ ఇస్తోంది. ఈ సమాచారాన్ని ముంబయి పోలీసులు సేకరించేసరికి ఐసిస్‌ సంస్థ సభ్యులు వారితో సంబంధాలను తెంచుకున్నట్టు ఎన్‌ఐఏకు సమాచారమందింది. దిల్లీ, ముంబయిల్లో కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఐసిస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం, నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిమి’ మాజీ సభ్యుల్లో కొందరు ఇరాక్‌కు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు గుర్తించారు. అయితే, ఐసిస్‌ భావజాలంలో చిక్కుకున్న కొందరు యువ ఇంజినీర్లు పోలీసులకు దొరక్కుండా వ్యూహాలు మార్చుతూ వందల సంఖ్యలో యువతను ఉగ్రవాద సానుభూతిపరులుగా మారుస్తూనే ఉన్నారు. వీరికి రూ.లక్షల విలువైన బహుమతులు అందుతున్నాయి.

దక్షిణాది రాష్ట్రాలు... అమెరికా.. యూరప్‌..
భారత్‌లో దక్షిణాది రాష్ట్రాలు...విదేశాల్లో అమెరికా, యూరప్‌లలో పాగా వేయాలన్న లక్ష్యంతో ఐసిస్‌ పథకాన్ని రూపొందించినట్టు కొంతకాలం క్రితం బెంగళూరు పోలీసులకు పట్టుబడిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్‌, మధురై, బెల్గాం, మంగళూరు, త్రివేండ్రంలో కార్యకలపాలు నిర్వహించాలంటూ కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎంపిక చేసినట్టు తెలిసింది. తెలంగాణ, కేరళ, తమిళనాడుల నుంచి అమెరికాకు వెళ్లి చదువుకుంటున్న యువత, ఇంజినీర్లను ఎంపిక చేసుకుని వారితో ఐసిస్‌సభ్యులు తరచూ సమావేశమవుతున్నట్టు కేంద్ర నిఘావర్గాలకు ఆధారం లభించినట్టు సమాచారం.


హైదరాబాద్‌లో మరోసారి ఐఎస్‌ఐఎస్‌ కలకలం
హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు ఐఎస్‌ఐస్‌ భావజాలానికి ఆకర్షితులయ్యారని పోలీసులు వెల్లడించారు. వీరంతా సామాజిక మాధ్యమాల ద్వారా పదుల సంఖ్యలో యువకులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులను సిరియా, ఇరాక్‌లకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారని, కొందరిని సభ్యులుగానూ చేర్పిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో అరెస్టయిన నఫీజ్‌, షరీఫ్‌ మొహియుద్దీన్‌ ఖాన్‌, ఒబేదుల్లాఖాన్‌ వద్ద పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఐఏ తెలిపింది. వీరు తరచూ ఫేస్‌బుక్‌ద్వారా మాట్లాడుకునేవారని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసమ్మర్థ ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు అవసరమైన సామగ్రిని సమీకరించుకున్నారని పేర్కొంది. నఫీజ్‌ఖాన్‌, ఒబేదుల్లాఖాన్‌, మహ్మద్‌ షరీఫ్‌ మొహియుద్దీన్‌ ఖాన్‌ టోలీచౌకీలో నివాసముంటుండగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అబు అనాజ్‌ మాదాపూర్‌లో ఉంటున్నాడు. బహుళజాతి సంస్థలో ఉద్యోగం రావడంతో రాజస్థాన్‌ నుంచి ఇక్కడికి వచ్చాడు. మహారాష్ట్రలోని థానె జిల్లా అమృత్‌నగర్‌లో అరెస్టయిన అనుమానిత ఉగ్రవాది అబ్దుల్‌షేక్‌ను ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచి, దిల్లీకి ట్రాన్సిట్‌ రిమాండ్‌ కోరగా కోర్టు అంగీకరించింది.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బల్గేరియాలో శివాయ్‌

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శివాయ్‌’. ఈ చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net