Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
న్యూయార్క్‌లో ముగ్గురికి జికా వైరస్‌
న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌లో తాజాగా ముగ్గురిలో జికా వైరస్‌ వెలుగుచూసింది. వీరు దేశం వెలుపల, వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో పర్యటించారని అధికారులు తెలిపారు. లాటిన్‌ అమెరికాలో కొందరు చిన్నారులు అసాధారణంగా చిన్నతలలతో జన్మించడానికి ఈ వైరస్సే కారణంగా భావిస్తున్నారు. జికా వైరస్‌ కారణంగా లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాల్లో 22 ప్రదేశాలను గర్భిణులు సందర్శించరాదని అమెరికా అధికారులు శుక్రవారం సూచించారు.
చుట్టబెడుతున్న జికా!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వైరస్‌
‘డెంగీ’ దోమలతోనే వ్యాప్తి
గర్భిణులను కుడితే పెనుముప్పు!
పుట్టబోయే బిడ్డల్లో తీవ్ర లోపాలు
కొన్నిదేశాల్లో గర్భధారణ వద్దని స్త్రీలకు వినతి
మనకూ ముప్పు పొంచి ఉందా?
అంతర్జాతీయంగా మళ్లీ కొత్త ‘వైరస్‌’ కలకలం మొదలైంది. ఈ వైరస్‌ పేరు ‘జికా’! డెంగీ, చికంగన్యా వంటి పెను సమస్యలను మోసుకొచ్చిన దోమలే ఈ కొత్తరకం వైరస్‌ను కూడా తెచ్చిపెడుతుండటంతో ప్రస్తుతం చాలా దేశాలు దీని పేరు చెబితేనే వణికిపోతున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్‌లో ఈ వైరస్‌ పెద్ద విలయాన్నే సృష్టిస్తోంది. గర్భిణులు ఈ వైరస్‌ బారినపడితే వారికి పుట్టే బిడ్డలకు తీవ్రమైన మెదడు లోపాలు వస్తున్నట్టు భావిస్తుండటంతో దీనిపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. గత అక్టోబరు నుంచి బ్రెజిల్‌లో కొన్ని వేలమంది పిల్లలు ఇలాంటి తీవ్ర మెదడు లోపంతో పుట్టారని అనుమానాలు వ్యక్తం కావటంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికి దాదాపు 49 మంది పిల్లలు చనిపోయారు కూడా. ఈ వైరస్‌ సృష్టిస్తున్న విలయాన్ని అడ్డుకునేందుకు బ్రెజిల్‌ ప్రభుత్వం ప్రస్తుతం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గర్భిణులు దోమకాటు బారినపడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్తగా గర్భం దాల్చాలనుకునే వారు ప్రస్తుతానికి కొన్ని నెలల పాటు ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని విస్తృత ప్రచారం చేస్తోంది. మరికొన్ని లాటిన్‌ అమెరికా దేశాల్లో కూడా జికా వైరస్‌ జ్వరాలు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఒక్క కొలంబియాలోనే ఇటీవలి కాలంలో దాదాపు 14 వేల కేసులు నమోదయ్యాయి. బొలీవియాలోనూ కొందరు గర్భిణులు ఈ జ్వరం బారినపడినట్టు తేలింది. పర్యాటకుల ద్వారా ప్రస్తుతం ఈ వైరస్‌ అమెరికా, బ్రిటన్‌లను కూడా చేరినట్టు నిర్ధారణ కావటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఇది దోమల ద్వారా వ్యాపించే వైరస్‌ కావటం, దీన్ని మోసుకొచ్చే ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమలు మన దేశంలో కూడా చాలా ఎక్కువగా ఉండటంతో జికా వైరస్‌ విషయంలో మనమూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డెంగీ జ్వరాలు మన దేశంలో పెద్ద తలనొప్పిగా తయారైన నేపథ్యంలో దానికి జికా కూడా తోడైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఏమిటీ ‘జికా’?
జికా వైరస్‌ మరీ కొత్తదేం కాదు. ‘జికా’ అనేది ఉగాండాలోని ఒక అటవీ ప్రాంతం. అక్కడి కోతుల్లో ఈ రకం వైరస్‌ కారణంగా జ్వరాలు వస్తున్నట్టు 1940ల్లోనే గుర్తించారు. ఈ జికా వైరస్‌ కూడా వెస్ట్‌నైల్‌, డెంగీ తరహా జ్వరాలను తెచ్చిపెడుతున్న అర్బోవైరస్‌ జాతికి చెందినదే, వాటిలాగే ఇది కూడా ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమల ద్వారానే వ్యాపిస్తుంది. అప్పట్లో దీని కారణంగా మనుషుల్లో కూడా జ్వర లక్షణాలు కనబడుతున్నాయని గుర్తించారుగానీ అవేమంత తీవ్రంగా ఉండేవి కాదు. కేవలం జ్వరం, వంటి మీద దద్దు, కీళ్ల నొప్పుల వంటి సాధారణ లక్షణాలే కనబడేవి. కానీ 2013 నుంచీ ఈ జ్వరాల బారినపడుతున్న వారిలో, ముఖ్యంగా గర్భిణుల్లో సమస్యలు కనబడుతున్నాయని, వారికి పుడుతున్న పిల్లల్లో తీవ్ర మెదడు లోపాలు తలెత్తుతున్నాయని పరిశోధకులు గుర్తించటంతో ఈ వైరస్‌ పట్ల ఆందోళన ఆరంభమైంది. తాజాగా బ్రెజిల్‌లో కూడా కొద్ది నెలలుగా పసిబిడ్డలు- పుట్టుకతోనే తల చిన్నదిగా, మెదడు లోపాలతో పుడుతున్నట్టు గమనించటంతో వైద్యులు ఈ వైరస్‌పై దృష్టి సారించారు. ఆ దేశంలో ఉన్నట్టుండి ఒక్క 2015లోనే దాదాపు 2,782 మంది పిల్లలు ఈ సమస్యతో పుట్టినట్టు గుర్తించటంతో దీనిపై పెద్దఎత్తున అధ్యయనాలను ఆరంభించారు. మెదడు ఎదగకుండా, తల చిన్నగా ఉండిపోవటాన్ని వైద్యపరిభాషలో ‘మైక్రోకెఫాలీ’ అంటారు. ఇది తీవ్రమైన సమస్య. దీనివల్ల పిల్లలు ఎదుగుదల లేకుండా జీవితాంతం మానసిక, శారీరక అవకరాలతోనే ఉండిపోతారు.

గర్భధారణ వద్దు: కొన్ని దేశాల్లో హెచ్చరికలు
జికా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో- ఈ సమయంలో గర్భం దాలిస్తే జికా వైరస్‌ కారణంగా పిల్లల్లో తీవ్ర అవకరాలు వచ్చే ప్రమాదం ఉన్నందున 2018 వరకూ గర్భ ధారణను వాయిదా వేసుకోవాల్సిందిగా బ్రెజిల్‌, కొలంబియా, జమైకా తదితర దేశాల్లో ప్రభుత్వాధికారులు మహిళలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. అమెరికాలో ఈ వారంలో టెక్సాస్‌తో సహా మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు 12 కేసుల వరకూ నమోదయ్యాయని సీడీసీ ధ్రువీకరించింది. ఇది వ్యాపిస్తున్న తీరు, విస్తరిస్తున్న వేగాలను పరిశీలిస్తే ఇక జికా వైరస్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోవటానికి లేదని అమెరికా వైద్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే జికా వైరస్‌ వల్లే పిల్లల్లో అవకరాలు వస్తున్నాయని చెప్పేందుకు ప్రత్యక్ష ఆధారాలేవీ ఇంకా లభించనందున ప్రస్తుతానికి ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 14 దేశాలకు ప్రయాణాలు మాత్రం పెట్టుకోవద్దని సీడీసీ గర్భిణులకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.

దోమకాటే మూలం
ఇప్పటికే జికా వైరస్‌ బారినపడిన వారిని కుట్టిన దోమలు ఇతరులను కుడితే వారికీ ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. సాధారణంగా వీరిలో జ్వరం, ఒంటి మీద దద్దు, కీళ్లనొప్పులు, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలే ఉంటాయి. కొందరిలో అసలే లక్షణాలూ లేకపోవచ్చు కూడా. జికా వైరస్‌ కారణంగా ఎక్కడా మరణాలు సంభవిస్తున్న దాఖలాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కాకపోతే గర్భిణులు మాత్రం ఈ వైరస్‌ బారినపడకుండా ఉండటం- అంటే దోమకాటుకు దూరంగా ఉండటం ముఖ్యం. ప్రస్తుతం ఈ వైరస్‌ మన దేశంలో లేకపోయినా- దీని వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి మన దేశానికి ఎవరైనా వస్తే వారి ద్వారా ఈ వైరస్‌ మన దేశంలో ప్రవేశించొచ్చు. మనలాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఈడిస్‌ ఈజిప్టై రకం దోమలు విపరీతంగా ఉన్నందున ఒకసారి ఈ వైరస్‌ మన దేశంలో ప్రవేశిస్తే దాన్ని ఎదుర్కోవటం కష్టమవుతుందని, ఇప్పటికే డెంగీ భారాన్ని మోస్తున్న మనకు దీంతో కొత్త చికాకులు మొదలవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net