Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'

నదీయాజమాన్య బోర్డుకు మున్ముందు కష్టాలే
నీటి నిల్వ, నిర్వహణలో అనేక సమస్యలు
ప్రాజెక్టులన్నీ వినియోగంలోకి వస్తే
మరింత కష్టమంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌
దీ జలాల నిర్వహణలో కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు మున్ముందు అనేక సమస్యలు ఎదురవనున్నాయి. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వుల అమలు; మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి విడుదల అంశాలు బోర్డుకు సవాలుగా మారనున్నాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించగా.. గతేడాది తుది తీర్పు చెప్పిన బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ మొత్తం 1005 టీఎంసీలు కేటాయించింది. ఈ తీర్పు ఇంకా అమల్లోకి రాకపోవడంతో ప్రస్తుతానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ నీటి కేటాయింపుల ప్రకారం వినియోగం జరగలేదు. కేటాయింపు 811 టీఎంసీలు ఉంటే సరాసరిన 950 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకొన్నారు. ఇంత ఎక్కువగా వాడినా కొన్ని ప్రాజెక్టులకు కేటాయింపుల మేర నీటి లభ్యత లేదు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లలో క్యారీ ఓవర్‌ (ఎక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు నిల్వ చేసుకొని తర్వాత సంవత్సరం వాడుకోవడం) కోసం 150 టీఎంసీలను బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించింది. దిగువన ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఉండే సమస్యను పరిగణనలోకి తీసుకొని ఈ కేటాయింపు చేసింది. కానీ, ఏటా వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడుకోవడం తప్ప ఎప్పుడూ క్యారీఓవర్‌ కింద నిల్వ చేయలేదు. నీటి మట్టాల విషయంలో కూడా ఇంతే. నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా, శ్రీశైలం 834 అడుగులు. శ్రీశైలం నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినపుడు కనీస నీటిమట్టం ఎంత అన్నది సంబంధం లేకుండా 1996లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 ప్రకారం శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 834 అడుగులుగా పేర్కొంది. 2004లో 854 అడుగులుగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. కానీ, దిగువన ఉన్న డ్యాం అవసరాల కోసం ఇంత కంటే తక్కువకు నీటిని వినియోగించవచ్చని, దీనికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. శ్రీశైలం పరివాహక ప్రాంతం నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకు నీటిపారుదలను మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన పనుల కోసం 2005 డిసెంబరులో నాటి ప్రభుత్వం జీవో 233ను జారీ చేసింది. ఇందులో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకొనేటప్పుడు జీవో 69 కూడా వర్తిస్తుందని తెలిపింది. పోతిరెడ్డిపాడు నుంచి సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసేటప్పుడు కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌ కేటాయింపులను జీవో 69 మార్గదర్శకాల ప్రకారం విడుదల చేసి ఉండాలని కూడా ఇందులో స్పష్టం చేసింది. ఈ జీవోలోనే ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీల కేటాయింపు ఉందని.. ఈ నికర జలాల కేటాయింపు 34 టీఎంసీలు పోను గాలేరు-నగరి, తెలుగు గంగలు కృష్ణా వరద నీటిపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. అనంతపురం జిల్లాలోని పీఏబీఆర్‌కు 2004 జనవరిలో ఐదు టీఎంసీలను కేటాయించగా, దీన్ని పది టీఎంసీలకు పెంచుతూ 2005లో ప్రభుత్వం జీవో 698 జారీ చేసింది. తుంగభద్ర నుంచి కేసీ కాలువకు ఉన్న కేటాయింపును పీఏబీఆర్‌కు ఇచ్చి, కేసీ కాలువకు శ్రీశైలం నుంచి ఇవ్వడానికి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ 2006 జనవరిలో జీవో-3 జారీ చేసింది. 2012లో నాగార్జునసాగర్‌లో 510, శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు ఖరీఫ్‌ ఆరంభం నాటికి శ్రీశైలంలో కనీస నీటిమట్టం 834 అడుగులు ఉన్న సందర్భాలు చాలా తక్కువ. ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు కనీస నీటిమట్టంపై చర్చించింది. బోర్డు ఏర్పడిన తర్వాత కొంతనీటిని కృష్ణా డెల్టాలో తాగునీటికి విడుదల చేయగా, ఇందులోనే కొంత నారుమళ్లకు వినియోగించుకొన్నారు. ఇప్పుడు మళ్లీ అక్టోబరులోనే శ్రీశైలం నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతే సాగునీటికి, తర్వాత తాగునీటికి ఇబ్బంది తలెత్తుతుందనే ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరంతో వివాదం మొదలైంది. ఈ సమస్యల నుంచి బోర్డు బయటపడినా, భవిష్యత్తులో నీటి నిర్వహణ విధానాన్ని రూపొందించడం అంతసులభమేమీ కాదు.

అవన్నీ వస్తే కష్టాలే..: కృష్ణా బేసిన్‌లో మిగులు జలాల ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. ఇవన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే నదీ యాజమాన్య బోర్డుకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగులు జలాల ఆధారంగా 227.5 టీఎంసీల సామర్థ్యంతో ఏడు ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో మూడు ప్రాజెక్టులు తెలంగాణలో, నాలుగు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులకు 77 టీఎంసీలు; ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీనీవా, గాలేరు- నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు 150.5 టీఎంసీలు అవసరం. ఇందులో తెలుగుగంగ ప్రాజెక్టుకు బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ 25 టీఎంసీలను కేటాయించింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీల వరకు పంపిణీ చేసింది. ఇంతకు మించి వచ్చే మిగులు జలాలను వాడుకొనే స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. 2000 మే వరకు ఈ ట్రైబ్యునల్‌ అవార్డు అమలులో ఉంది. అంతకుముందే మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులను ప్రతిపాదించడం, పునాదులు వేయడం, నామమాత్రంగా పనులు చేపట్టడం జరిగింది. 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ 2013లో తుది తీర్పు ఇచ్చింది. 65 శాతం నీటి లభ్యత, మిగులు జలాలను కూడా కలిపి 2578 టీఎంసీలు ఉన్నాయని పంపిణీ చేసింది. ఇది బచావత్‌ కేటాయింపుల కంటే 448 టీఎంసీలు అదనం. ఏ మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులను చేపట్టిందో, ఆ మిగులు జలాలను కూడా ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసింది. వాటిలో 25 టీఎంసీలు తెలుగుగంగకు కేటాయించింది. నెట్టెంపాడు మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి రెండు రాష్ట్రాల్లో కలిపి మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు 202.5 టీఎంసీలు అవసరం. ఈ ఏడాది హంద్రీనీవాకు ఐదు టీఎంసీలు వినియోగించారు. కల్వకుర్తి పంపుహౌస్‌ నీట మునగడంతో కేవలం 0.3 టీఎంసీలు మాత్రమే తీసుకొన్నారు. కల్వకుర్తి, హంద్రీనీవా ఎత్తిపోతలకు శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగుల కంటే దిగువ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తంమీద కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణకు రెండు రాష్ట్రాల అంగీకారంతో మార్గదర్శకాలు రూపొందించడం, మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటివినియోగం.. నదీయాజమాన్య బోర్డుకు తలనొప్పిగా మారే అవకాశం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net