Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
సామాజిక వర్గాల కూర్పులో మార్పు
కాపులకు పెద్దపీట!
బీసీ, మాదిగ, బంజారాలకు న్యాయం
అట్టడుగులకు అధికారం దిశగా కాంగ్రెస్‌
ఈనాడు - హైదరాబాద్‌
రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అనుసరించబోతున్న విధానానికి కేంద్ర మంత్రివర్గంలో జరిగిన మార్పులు, వివిధ సామాజిక వర్గాలకు లభించిన ప్రాధాన్యం ఒక సూచనగా పార్టీ వర్గాలు పరిగణిస్తున్నాయి. సామాజిక వర్గాల కూర్పును ఆ పార్టీ గణనీయంగా మార్చేసింది. సంప్రదాయంగా అవలంభిస్తున్న విధానానికి పూర్తి భిన్నమైన పంథాను అనుసరించింది. దశాబ్దాల నుంచి పార్టీలో ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం లభిస్తోంది. అన్ని స్థాయిల్లో నాయకత్వ స్థానాల్లో వీరే ఉండేవారు. దానికి అనుగుణంగానే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికయ్యే వారు. సహజంగానే మంత్రి పదవుల్లోనూ వీరికే ప్రాధాన్యం లభిస్తుంటుంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సామాజిక వర్గం పార్టీ నుంచి దూరం జరుగుతోందన్న ప్రచారం అధిష్ఠానాన్ని పునరాలోచనలో పడేసినట్లు కనిపిస్తోంది. ఆ వర్గం నుంచి ఇప్పటికే ఒక కేబినెట్‌ మంత్రి ఉండగా... కారణాలేమైనా ఆయన్ను అంతగా ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేశారు. సహాయ మంత్రిగా మరొకరికి అవకాశమిచ్చారు. అదే సమయంలో ఇటీవలి కాలంలో బాగా ఆదరిస్తున్న మరో ప్రధాన సామాజిక వర్గానికి అగ్రపీఠం వేశారు. ఆ వర్గానికి చెందిన పల్లంరాజుకి కేబినెట్‌ హోదా లభించింది. కీలకమైన మానవ వనరుల శాఖ కేటాయించారు. ముందుగా ఎవరూ ­హించని పరిణామమిది. గతంలో పి.వి.నరసింహారావు, శివశంకర్‌, అర్జున్‌సింగ్‌ వంటి పార్టీ ఉద్దండులు నిర్వహించిన శాఖ ఇది. దశాబ్దాలుగా గాంధీ కుటుంబంతో పల్లంరాజు కుటుంబానికున్న సన్నిహిత సంబంధాలు, యువనేత రాహుల్‌గాంధీతో ఆయనకున్న పరిచయాలు కూడా కొంతమేర దోహదం చేసి ఉండొచ్చు. కొంతకాలం కిందట పీసీసీ అధ్యక్ష పదవికి కూడా పల్లంరాజు పేరు వినిపించటం గమనార్హం. ఇదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ లభించింది. ఈ వర్గం అత్యంత కీలకంగా ఉండే కోస్తాలో అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో చెరో జిల్లాకు ప్రాతినిధ్యం వహించే వీరికి ఇంతటి ప్రాధాన్యం లభించటం విశేషం. గతంలో ఎన్నడూ ఇలాంటిది చోటుచేసుకోలేదు. ఒక ప్రధాన సామాజిక వర్గం పక్కకుపోతోందన్న ప్రచారం నేపథ్యంలో మరో ప్రధాన వర్గాన్ని సన్నిహితం చేసుకునే క్రమంలో ఈ స్థాయి ప్రాధాన్యం లభించిందన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్న క్రమంలోనే చిరంజీవికి స్థానం ఖరారైనా... వర్గ ప్రాధాన్యాన్ని మొత్తంగా చూడాల్సి ఉంటుందని అంటున్నారు. మొదటి నుంచీ ఆధిపత్యం వహిస్తున్న వర్గానికి అంతగా ఆదరణ దక్కని నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. రాష్ట్రం నుంచి బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేదన్న విమర్శలు కొంతకాలంగా వినిపించసాగాయి. మాల వర్గానికి మాత్రమే అవకాశమిచ్చి మాదిగల్ని విస్మరించారన్న భావనా ఆ వర్గం నుంచి ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపాకి మొదటి నుంచీ బీసీ వర్గాల్లో పట్టుంది. తాజాగా భారీ ప్రణాళికతో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది. మాదిగల చిరకాల డిమాండ్‌ అయిన ఎస్సీ వర్గీకరణపై కూడా ఎస్సీ డిక్లరేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల్ని ఆకర్షించేలా తాజా విస్తరణలో కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణలకు అవకాశం లభించింది.

సోనియా, మన్మోహన్‌లకు కృతజ్ఞతలు: సీఎం
కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యమిచ్చినందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంపై వారికున్న అభిమానానికి ఇది నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా కేంద్ర మంత్రులైన వారికి అభినందనలు తెలిపారు. వారికి ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి సేవలదించడానికి ఇది సువర్ణావకాశమనే విషయాన్ని గుర్తించాలని చిరంజీవి, సర్వే, కోట్ల, బలరాం నాయక్‌, కిల్లి కృపారాణిలకు వేర్వేరుగా అభినందల సందేశం పంపారు. వారికి కేటాయించిన శాఖల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, పురంధరేశ్వరికి కూడా అభినందనలు తెలిపారు.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net