Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
కోటిన్నరదాకా బేరం
బ్రోకర్లే.. లీకువీరులు
వైద్య పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ నిజమే
రూ.70 లక్షల నుంచి కోటిన్నర వరకు వసూలు
సీఐడీ అదనపు డీజీ కృష్ణ ప్రసాద్‌ వెల్లడి
అజ్ఞాతంలో పలువురు విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్‌, విజయవాడ, కర్నూలు: పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే వెల్లడైనట్లు సీఐడీ అధికారికంగా నిర్ధరించింది. విద్యార్థులు-కళాశాలలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన కన్సల్టెన్సీ నిర్వాహకులు నేరానికి పాల్పడినట్లు తేలింది. విభాగాన్ని బట్టి ఒక్కో విద్యార్థి నుంచి రూ.70లక్షల నుంచి కోటిన్నర వరకూ వసూలు చేసినట్లు స్పష్టమైంది. సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్‌ శనివారం తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. కడపజిల్లా రాయచోటిలోని మనిమరెడ్డిగారి పల్లె గ్రామానికి చెందిన కొమ్మూరి మనీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌ అమీర్‌పేటలో వెర్‌టెక్స్‌ కన్సల్‌టెన్సీ నిర్వహిస్తున్నాడు. నిజామాబాద్‌కు చెందిన డి.సాయినాథ్‌ హైదరాబాద్‌లో ఇదే తరహా కన్సల్‌టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇంజినీరింగ్‌, వైద్య కళాశాల్లో విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తూ కమిషన్‌ తీసుకునే వారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలతో వీరికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. పీజీ వైద్య విద్యకు విద్యార్థులు రూ.కోట్లు చెల్లించేందుకు ముందుకు రావడంతో వీరికి ఆశపుట్టింది. పీజీ వైద్య ప్రవేశ పరీక్ష పత్రం రాబట్టగలిగితే రూ.కోట్లు సంపాదించవచ్చనే ఆలోచన వచ్చింది. తమలా కన్సల్‌టెన్సీలు నిర్వహిస్తున్న మరో పది మందిని కూడగట్టారు.
వీరిలో బెంగళూరుకు చెందిన వి.సురేష్‌, బస్వరాజు, ముంబయికి చెందిన అన్జూసింగ్‌, బీహార్‌కు చెందిన దనుంజయ కుమార్‌ చౌహాన్‌, హైదరాబాద్‌కు చెందిన భూషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి 2014 పీజీ వైద్య ప్రవేశ పరీక్ష పత్రం ముందుగానే బయటకు తెచ్చేందుకు కుట్రపన్నారు. ఈ మేరకు ఆసక్తిగల విద్యార్థులను సంప్రదించారు. వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆసక్తి చూపిన విద్యార్థులకు చెందిన పదోతరగతి, ఇంటర్‌, ఎంబీబీఎస్‌ పత్రాలను తమ వద్ద పెట్టుకున్నారు. కొంత మొత్తం డబ్బు తీసుకొని మిగతా మొత్తానికి చెక్కులు తీసుకున్నారు. ర్యాంకు వచ్చిన తర్వాత వారికి వచ్చే విభాగాన్ని బట్టి మిగతా డబ్బు చెల్లించాల్సి ఉంది. ఉదాహరణకు రేడియాలజీకి రూ.కోటిన్నర, పీడియాట్రిక్స్‌కు రూ.70 లక్షల చొప్పున రేటు నిర్ణయించారు. ప్రశ్నపత్రాన్ని ముందుగానే చేజిక్కించుకున్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థులను బృందాలుగా విభజించి ముంబయి, హైదరాబాద్‌లలో వివిధ ప్రాంతాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. మార్చి 2న పీజీ ప్రవేశ పరీక్ష జరగ్గా వీరు మాత్రం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 మధ్యలో విద్యార్థులకు ప్రశ్నపత్రం అందించారు. ముంబయిలోని శోహం రెసిడెన్సీ, ఇంపీరియల్‌ హైట్స్‌, హైదరాబాద్‌లో మధ్యవర్తి సాయినాథ్‌ ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ప్రశ్నపత్రాన్ని జవాబులతో వారికి ఇచ్చి తర్ఫీదు ఇప్పించారు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి సెల్‌ఫోన్లు తీసుకోవడంతోపాటు ఒక్కసారి లోనికి వెళ్లిన వారిని మళ్లీ పరీక్ష రోజు సరాసరి పరీక్ష కేంద్రానికి తరలించారు. అప్పటి వరకూ వారికి అన్నీ మధ్యవర్తులే చూశారు. ముంబయిలో ఆశ్రయం పొందిన వారిని పరీక్ష రోజు విమానాల్లో హైదరాబాద్‌ తరలించారు. వీరి ప్రయత్నం ఫలించి.. విద్యార్థులకు అనూహ్యమైన ర్యాంకులు వచ్చాయి. మొదటి 100 ర్యాంకుల్లో 25పైగా ర్యాంకులు వీరివే. కడపకు చెందిన జగదీప్‌రెడ్డికి 12వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన ఆనంద్‌కు 16, గుంటూరుకు చెందిన భీమేశ్వరరావుకు 25, కరీంనగర్‌కు చెందిన సాయిసుధ 2వ ర్యాంకు, బీరెల్లి శ్రీనివాస్‌కు 3, డి.శ్రావణికి 28, ఒంగోలుకు చెందిన బి.వెంకటేశ్వరరావుకు 45వ ర్యాంకు వచ్చాయి. వీరు అనేక పద్ధతుల్లో డబ్బు చెల్లించారు. ఉదాహరణకు ఒంగోలుకు చెందిన వెంకటేశ్వరరావు రూ.10 లక్షలు ఆన్‌లైన్లో సాయినాథ్‌ ఖాతాకు బదిలీ చేయగా, రూ.95 లక్షలకు పది చెక్కులు ఇచ్చాడు. ఈ బ్యాంకు ఖాతాలతోపాటు నిందితుల సెల్‌ఫోన్లు, డెబిట్‌కార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మధ్యవర్తులు మునీశ్వరరెడ్డి, సాయినాథ్‌లతోపాటు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు.

ఆ వివరాలు ఎందుకు చెప్పలేదు?..వైద్యవిద్యార్థులు: వైద్యవిద్య పీజీ ప్రవేశపరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌ జరిగినట్టు నిర్ధరించిన సీఐడీ అసలు ప్రశ్నపత్రం ఎక్కడ లీక్‌ అయ్యింది? ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే వివరాలను ఎందుకు చెప్పలేదు? కావాలనే దాటవేశారా? మరేవైనా కారణాలున్నాయా? ఇలాంటి అనేక సందేహాలను వైద్యవిద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ అధికారి కృష్ణప్రసాద్‌ విలేకరుల సమావేశం కొన్ని విషయాలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందని పలువురు విద్యార్థులు విజయవాడలో ‘ఈనాడు’తో వాపోయారు.ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా గవర్నర్‌ గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

అజ్ఞాతంలోకి కర్నూలు విద్యార్థి: కర్నూలుకు చెందిన ఓ వైద్య విద్యార్థి బ్రోకర్లకు రూ.50 లక్షలు చెల్లించి 11వ ర్యాంకు పొందినట్లు తెలిసింది. ఈయన ఎంబీబీఎస్‌ చదివే సమయంలో ఐదు పర్యాయాలు పరీక్షలు తప్పినా పీజీ ప్రవేశ పరీక్షలో 11వ ర్యాంకు రావడంపై చర్చనీయాంశమైంది. ఈ విద్యార్థి అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిసింది.

పరారీలో జగిత్యాల వైద్యుడు..
కరీంనగర్‌, న్యూస్‌టుడే: లీకు కుంభకోణంలో జిల్లాకుచెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. తాజాగా ఓ వైద్యుడి పాత్ర ఉన్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన ఈ వైద్యుడు జగిత్యాలలోని ఓప్రైవేట్‌ ఆస్ప్రతిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తన భార్యను పీజీ చేయించేందుకు ఈయన జగిత్యాలకు చెందిన ఓ మధ్యవర్తి ద్వారా బ్రోకర్‌ను కలిసినట్లు సమాచారం. ఈ వైద్యుడి కోసం సీఐడీ పోలీసులు శనివారం రాత్రి ఆరా తీయడంతో విషయం వెలుగు చూసింది. వైద్యుడి సతీమణికి పదిలోపు ర్యాంకు రావడం గమనార్హం.

పీజీ ప్రవేశపరీక్ష తేదీపై రెండు రోజుల్లో ప్రకటన: పీజీ వైద్యప్రవేశపరీక్షలో అక్రమాలకు సంబంధించిన పూర్తిస్థాయి సాక్ష్యాలు లభ్యమయ్యాయి. దీంతో గత పరీక్షను రద్దుచేస్తూ, మళ్లీ ప్రవేశపరీక్షను నిర్వహణకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. శనివారం గవర్నర్‌ వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

ఎన్టీఆర్‌ వర్సిటీలో సీఐడీ విచారణ
ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయంలో సీఐడీ అధికారులు శనివారం కూడా విచారణ కొనసాగించారు. ఉద్యోగులు ప్రతి ఒక్కరిని పిలిచి విచారణ చేశారు. రాత్రివరకూ విచారణ కొనసాగింది.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net