ప్రజలకు సేవ... పెట్టుబడికి తోవ!

తాజావార్తలు


ప్రజలకు సేవ... పెట్టుబడికి తోవ!
బ్యాంకులకు కొత్త జవజీవాలు
దేశ ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా చీడపురుగులా తొలిచేస్తూ సమాంతర ఆర్థిక వ్యవస్థకు నల్లధనం విషబీజాలు వేసింది. దాన్ని కూకటివేళ్లతో పెకలించే దృఢసంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొన్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక చరిత్రలో మైలురాయి. నగదుభరిత వ్యవస్థ నుంచి నగదురహిత వ్యవస్థ వైపు దూసుకెళ్లడంలో ఈ నిర్ణయం కొత్త ఒరవడి సృష్టించింది. దేశంలో చలామణీలో ఉన్న మొత్తం ద్రవ్యంలో 86 శాతం పైగా ఉన్న పెద్ద నోట్లను ఒక్కసారిగా రద్దు చేయడంతో వివిధ రంగాలు, అనేక వర్గాల ప్రజలు, సామాన్య ప్రజానీకం అంతా తీవ్రమైన కుదుపునకు లోనయ్యారు. కొత్త నోట్ల జారీ పూర్తిస్థాయిలో జరగడానికి మరికొంత సమయం పట్టనున్న దృష్ట్యా ఈ ఇబ్బందులు ఇంకొన్ని రోజులు కొనసాగవచ్చు. అప్పటిదాకా స్వల్పకాలానికి వివిధ రంగాల వృద్ధిరేటు స్వల్పంగా కుంగే అవకాశాలున్నాయి. స్థూల దేశీయోత్పత్తి కూడా తగ్గనుంది. దీర్ఘకాల ప్రయోజనాల్ని లక్షించి వీటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరోవైపు బ్యాంకుల్లో డిపాజిట్లు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. నవంబరు 10 నుంచి దాదాపు 10 లక్షల కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లోకి వచ్చి చేరినట్లు సమాచారం. ఇంత స్వల్ప వ్యవధిలో భారీయెత్తున డిపాజిట్లు వృద్ధి చెందడం దేశ బ్యాంకింగ్‌ చరిత్రలోనే తొలిసారి. ఈ డిపాజిట్లన్నీ పొదుపు ఖాతాల్లో ఉన్నందువల్ల ఈ నెల 30 తరవాత కొంత భాగం తరలిపోవచ్చు. మరికొంత కాలపరిమితి డిపాజిట్లలోకి మారొచ్చు. ఏమైనా నోట్ల రద్దు వల్ల బ్యాంకులకు స్వల్పకాలిక నిధులు అందుబాటులోకి వచ్చాయి. తాజా పరిణామాల వల్ల దీర్ఘకాలంలో బ్యాంకులకు బహుళ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో కొన్ని అవరోధాలను అధిగమించి ముందుకు వెళ్ళాల్సి ఉంది.

స్వల్పకాలానికి ప్రతికూలం
నానాటికీ పెరుగుతున్న నిరర్థక ఆస్తులు, క్షీణిస్తున్న లాభదాయకత, కానరాని రుణ గిరాకీ, తగ్గుతున్న నికర వడ్డీ మార్జిన్లు, నామమాత్రంగా ఉన్న వ్యాపారాభివృద్ధి... ఇవన్నీ దేశ బ్యాంకింగ్‌ రంగానికి పెనుసవాళ్లు విసరుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దు మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. దేశంలో వివిధ రంగాల ఉత్పాదకత తగ్గడంతోపాటు వస్తు, సేవల గిరాకీ, సరఫరాల మధ్య అంతరం పెరుగుతోంది. నోట్ల కొరత వల్ల పలు విపణుల్లో గిరాకీ తగ్గుతోంది. నిత్యావసర వస్తువులు మొదలు విలాసవంతమైన గృహోపకరణాలు, కార్లు, వాణిజ్య వాహనాలకు సైతం గిరాకీ పడిపోయింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు దాదాపు 50 శాతం పైగా క్షీణించిన కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) తగ్గనుంది. గతంలో వేసిన అంచనాల మేరకు అది 7.5 శాతం ఉండకపోవచ్చు. దేశ బ్యాంకింగ్‌ రంగానికి రాబోయే రెండు త్రైమాసికాలు (సెప్టెంబర్‌-డిసెంబరు, జనవరి-మార్చి 2017) గడ్డు కాలమేననడంలో సందేహం లేదు. కొత్తగా వస్తున్న డిపాజిట్ల వల్ల కొంతమేర ప్రయోజనం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అవి బ్యాంకులకు కొంత భారంగా మారనున్నాయి! ముఖ్యంగా నవంబరు 10 నుంచి డిసెంబరు 30 దాకా బ్యాంకుల్లోకి వచ్చే నిధులు స్వల్పకాలానికే ఉపయోగపడతాయి. డిసెంబరు 30 తరవాత ఈ డిపాజిట్లలో ఎంత శాతం కాలపరిమితి డిపాజిట్లుగా మారతాయి, ఎంత శాతం ఉపసంహరణకు గురవుతాయన్నది ఇప్పుడే చెప్పలేం. అందువల్ల ఈ అదనపు డిపాజిట్లను బ్యాంకులు రుణవితరణకు వినియోగించే అవకాశం లేదు. కొంతకాలంగా ఆశించిన మేరకు రుణవితరణ పెరగక బ్యాంకులు ఉన్న డిపాజిట్లనే ఇతర సాధనాల్లో (ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు) వెచ్చిస్తున్నాయి. ఇటువంటప్పుడు ఉన్న డిపాజిట్లలో 20.75 శాతం ఎస్‌ఎల్‌ఆర్‌ (స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో), నాలుగు శాతం సీఆర్‌ఆర్‌ (క్యాష్‌ రిజర్వ్‌ రేషియో) రూపంలో విధిగా ఉంచగా, మిగిలినవాటిని కొన్ని పరిమితుల మేరకు రివర్స్‌ రెపో మార్గంలో రిజర్వు బ్యాంకు వద్ద పెడుతున్నాయి. వీటిపై ఆర్‌బీఐ బ్యాంకులకు ఆరు శాతం వడ్డీ (దీన్నే రివర్స్‌ రెపో రేటు అంటారు) చెల్లిస్తుంది. బ్యాంకుల వద్ద ఉన్న అధిక నిధుల లభ్యత దృష్ట్యా రిజర్వు బ్యాంకు సీఆర్‌ఆర్‌ నిబంధనలను కఠినతరం చేయడంతో బ్యాంకుల వద్ద నిధుల లభ్యత గణనీయంగా తగ్గడమే కాక, వాటి లాభదాయకతపైనా ప్రభావం పడనుంది. బ్యాంకుల్లో సెప్టెంబర్‌ 16 నుంచి నవంబర్‌ 11 వరకు చేరిన అదనపు డిపాజిట్లపై సీఆర్‌ఆర్‌ను 100 శాతానికి పెంచడంతో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు డిపాజిట్లను సీఆర్‌ఆర్‌లో ఉంచాల్సి వస్తుంది. ఆ మేరకు బ్యాంకుల వద్ద నిధుల లభ్యత తగ్గడంతోపాటు వాటిపై ఆర్‌బీఐ ఏ విధమైన వడ్డీ చెల్లించదు కాబట్టి బ్యాంకులపై ఆర్థిక భారం పడుతుంది. బ్యాంకులు వాటి పొదుపు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లపై నాలుగునుంచి ఆరు శాతం (ప్రభుత్వరంగ బ్యాంకులు నాలుగు శాతం, కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఆరు శాతం) దాకా వడ్డీ చెల్లిస్తున్నాయి. బ్యాంకులకు వద్దన్నా డిపాజిట్లు వచ్చిపడుతున్న తరుణమిది. మరోవైపు ఆ డబ్బే భారంగా మారుతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఆర్‌బీఐ 100 శాతం సీఆర్‌ఆర్‌ రూపంలో ఉంచిన డిపాజిట్లపై వడ్డీ చెల్లిస్తే బ్యాంకులకు కొంత వూరట కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు వాటి నికర వడ్డీ మార్జిన్లను కాపాడుకొనేందుకు డిపాజిట్ల వడ్డీరేట్లను తగ్గించడం ప్రారంభించాయి.

దేశ బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన, అత్యంత క్లిష్టమైన సమస్య మొండి బాకీల పెరుగుదల. కొన్ని బ్యాంకుల ఎన్‌పీఏలు సెప్టెంబర్‌లో ఏ స్థాయికి పెరిగాయంటే అవి నష్టాలబారిన పడి, ఇప్పట్లో కోలుకోలేని విధంగా ఉన్నాయి. దేశ బ్యాంకింగ్‌ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు ఆరు లక్షల కోట్ల రూపాయలు దాటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ, పెద్దనోట్ల రద్దు బ్యాంకులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం సమీప భవిష్యత్తులో అన్ని రంగాలపై పడనుంది. తత్ఫలితంగా ఈ రంగాల వృద్ధిరేటు పడిపోవడంతోపాటు రుణ చెల్లింపులూ మందగించే అవకాశం ఉంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఉక్కు, టెలికాం, మౌలిక, స్థిరాస్తి, మైనింగ్‌ రంగాలతోపాటు మరిన్ని రంగాలు ఇబ్బందుల్లో పడనున్నాయి. బ్యాంకుల మొండి బాకీలు రాబోయే రెండు త్రైమాసికాల్లో ఇంకా పెరిగే ప్రమాదముంది. అత్యధిక మొండి బాకీలతో సంక్షోభంలో ఉన్న ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల పరిస్థితి క్లిష్టతరం కానుంది. మొత్తంమీద దాదాపు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు వాటి మొండి బాకీలను నియంత్రించుకోలేక ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఒకవైపు రుణగిరాకీ అంతగా లేకపోవడం, బ్యాంకులన్నీ నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడంలో తలమునకలు కావడంతో- ఈ త్రైమాసికంలో అంచనాల మేరకు రుణవితరణ జరిగే అవకాశం లేదు. మరోవైపు వడ్డీ ఆదాయంతోపాటు వడ్డీయేతర ఆదాయాలూ తగ్గడమే కాక, నోట్ల రద్దువల్ల వ్యయాలు గణనీయంగా పెరగనున్నాయి. నగదు నిర్వహణ, ఏటీఎమ్‌ల పునఃక్రమాంకనతోపాటు ఇతరత్రా కార్యనిర్వహణ వ్యయాలు పెరగనున్నాయి. ఇవన్నీ బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపి వాటి పనితీరును ఇంకా దెబ్బతీయనున్నాయి.

దీర్ఘకాలిక ప్రయోజనాలనేకం...
నోట్ల రద్దు వల్ల ఎదురయ్యే స్వల్పకాలిక సమస్యలను పక్కనపెడితే, ఈ చర్యవల్ల దీర్ఘకాలంలో దేశ బ్యాంకింగ్‌ రంగం కొత్తపుంతలు తొక్కనుంది. ఆర్థిక వ్యవస్థలో నల్లధనం తగ్గినందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందే వివిధ రంగాల్లో బ్యాంకింగ్‌ రంగం ఒకటి. డిసెంబరు 30 వరకు వచ్చే డిపాజిట్ల వల్ల బ్యాంకులకు నిధుల లభ్యత అనూహ్యంగా పెరుగుతుంది. డిసెంబరు తరవాతా ఈ డిపాజిట్లలో కొంత శాతం బ్యాంకుల్లో ఉండే అవకాశం లేకపోలేదు. దీనివల్ల బ్యాంకులు వాటి వడ్డీరేట్లను తగ్గించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు డిపాజిట్లపై, ఇటు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ ఎల్లుండి ప్రకటించనున్న పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉంది. అందువల్ల బ్యాంకులూ వాటి రుణాలపై వడ్డీరేట్లను తెగ్గోయాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీరేట్ల విధానం దేశ ఆర్థికవ్యవస్థకు మేలు చేస్తుంది. వ్యవస్థలో నగదు చలామణీ తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం దిగి వచ్చేందుకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. రుణ వడ్డీరేట్ల తగ్గింపు పారిశ్రామిక, కార్పొరేట్‌ రంగాలకు కొంత వూరటనిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకొని స్థూలదేశీయోత్పత్తి వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ఆశావహ పరిణామాలన్నీ దేశ బ్యాంకింగ్‌ రంగానికి కొత్త వూపునివ్వడంతో పాటు వాటి మొండి బాకీలను తగ్గించుకొనేందుకు దోహదపడతాయి. పెద్దనోట్ల రద్దు దేశంలో వాణిజ్య లావాదేవీల సరళిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి సామాన్య ప్రజానీకాన్ని సైతం డిజిటల్‌ విధానంవైపు మళ్లించేందుకు దోహదపడుతుంది. నగదు రహిత వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అనివార్య పరిస్థితుల్ని కల్పిస్తుంది. ఆర్థిక సమ్మిళితం (ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌) ప్రక్రియను మరింత వేగవంతం చేసి దేశజనాభాలో అత్యధిక శాతాన్ని బ్యాంకు ఖాతాలు తెరిచి ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తి స్థాయిలో ఆయా ఖాతాల ద్వారా జరిపేందుకు ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ బ్యాంకింగ్‌ రంగానికి కలిసొచ్చే అంశాలే. సమీప భవిష్యత్తులోనే బ్యాంకులు కోట్లాది కొత్త ఖాతాలను తెరిచి, బ్యాంకింగ్‌ సేవలను మరింత విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సేవలు పూర్తి స్థాయిలో అందని ప్రాంతాలకు శాఖలను విస్తరించే దిశలో బ్యాంకులు సత్వర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఏటీఎమ్‌ల సంఖ్య మరింత పెంచి ఖాతాదారులందరినీ డిజిటల్‌ వైపు మళ్లించి నగదు రహిత వ్యవస్థను బలోపేతం చేయడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఇవన్నీ బ్యాంకులకు కొత్త అవకాశాలు ఇవ్వడంతో పాటు, వాటి వ్యాపారాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం తగ్గి, నగదురహిత కార్యకలాపాల శాతం పెరిగినట్లయితే- అంతర్జాతీయంగా మన దేశ రేటింగ్‌, వ్యాపార అనుకూల దేశాల సూచీల ర్యాంకింగూ మెరుగుపడే అవకాశం ఉంది. ఫలితంగా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించి వివిధ రంగాల వృద్ధిరేటును పెంచుకోగలుగుతాం. ఇప్పటిదాకా మందగమనం గుప్పిట్లో ఉన్న రంగాలు క్రమంగా వృద్ధిబాట పడతాయి. భవిష్యత్తులో బ్యాంకులకు రుణ గిరాకీ పెరుగుతుంది. మొండి బాకీల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. పెద్దనోట్ల రద్దు రాబోయే రెండేళ్లలో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు కొత్త జవసత్వాలనిచ్చి వృద్ధిబాట పట్టేందుకు దోహదపడుతుంది!

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.