క్రికెట్‌ కోసం సంగీతం సృష్టించా!

తాజావార్తలు


క్రికెట్‌ కోసం సంగీతం సృష్టించా!
సాహిత్యానికి ఓ నోబెల్‌, సినిమాలకో ఆస్కార్‌, పాప్‌ సంగీతానికి గ్రామీ అవార్డులాంటిదే కర్ణాటక సంగీత కళాకారులకిచ్చే ‘సంగీత కళానిధి’ పురస్కారం. చెన్నైలోని తొంభై ఏళ్ల చరిత్ర ఉన్న మ్యూజిక్‌ అకాడమీ దీన్ని అందిస్తుంటుంది. ఈసారి మన తెలుగింటి ఆడపడుచు అవసరాల కన్యాకుమారిని ఈ అవార్డు వరించింది. మొత్తం శాస్త్రీయ సంగీత ప్రపంచంలో దాన్ని అందుకుంటున్న తొలి వయోలిన్‌ కళాకారిణి ఆమే! గుంటూరులో పుట్టి, విజయనగరంలో పెరిగి, మద్రాసులో రాణించి కర్ణాటక సంగీత ప్రపంచంలో తెలుగు జెండా ఎగరేస్తున్న ఆమెను వసుంధర పలకరించింది..
మాది విజయనగరం. నాన్నగారు అవసరాల రామరత్నం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టరుగా పనిచేసేవారు. అమ్మ వైణికురాలూ, రేడియో కళాకారిణి. ఇవటూరి విజయేశ్వరరావు నా తొలి గురువు. సరిగమల నుంచి సభల్లోకి వెళ్లి కచేరీలు చేసేదాకా అక్కడే శిక్షణ పొందా. చిన్నప్పటి నుంచే అక్కలిద్దరికీ వయోలిన్‌ సహకారం అందించేదాన్ని. నేనొక్కదాన్నే కచేరీలూ చేయడం మొదలుపెట్టాను. మద్రాసులో అయితే ప్రతిభకు తగ్గ గుర్తింపుంటుందని నాన్నతో చెప్పా. అప్పటికీ నాన్నకింకా నాలుగేళ్ల సర్వీసున్నా, అమ్మతో నన్ను మద్రాసులోని తాతగారింటికి పంపించారు. గాత్ర సంగీతంలాగే నా వయోలిన్‌ కూడా ప్రతిపదాన్నీ పలికించగలదనే గుర్తింపు ఇక్కడే వచ్చింది నాకు! బాలమురళీ, డీకే పట్టమ్మాళ్‌ వంటి హేమాహేమీలకి వాద్య సహకారం అందించాను. ఆ తర్వాత ఎమ్మెల్‌ వసంతకుమారి దగ్గర చేరాను. కర్ణాటక సంగీతంలోని ‘ముగ్గురమ్మలు’గా చెప్పుకునేవారిలో ఆమె ఒకరు. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మీ, డీకే పట్టమ్మాళ్‌ మిగతా ఇద్దరు. అలా ఎంఎల్‌ వసంతకుమారి దగ్గర రెండుదశాబ్దాలపాటు వాద్య సహకారం అందించాను. దాంతోపాటూ సొంతంగా వయోలిన్‌ ప్రధానంగా కచేరీలూ చేశాను. అమెరికాకు వెళ్లిన తొలి వయోలిన్‌ కళాకారిణిని కూడా నేనే! అప్పట్నుంచి ఇప్పటిదాకా ఇంగ్లండు, స్విట్జర్లాండు, కువైట్‌ ఇలా ఎన్నో చోట్ల ప్రతి ఏటా కచేరీలు చేస్తూనే ఉన్నాను.
ప్రయోగాలంటే ప్రాణం! మొదట్నుంచి ప్రయోగాలంటే ప్రాణం నాకు. 1980ల్లోనే వీణా, నాదస్వర కళాకారులతో కలిసి వాద్యలహరి పేరుతో నేను చేసిన వినూత్న ‘వాద్య సంగమ’(ఫ్యూజన్‌) కార్యక్రమాలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత తీవ్రస్థాయి సంగమం, శతవాద్య సమ్మేళన్‌ వంటి ప్రయోగాలూ చేశాను. గత కొన్నేళ్లుగా సాక్సాఫోన్‌ విద్వాంసుడు కదిరి గోపాలనాథ్‌కు వయోలిన్‌ సహకారం అందిస్తున్నాను. ఇందుకోసం ఆ పాశ్చాత్య వాయిద్యానికి తగ్గట్టు వయోలిన్‌ని మార్చుకోగలిగాను. తిరుమల గిరుల్లోని ఏడుకొండల పేర్లు తెలుసా? శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి తదితర సప్తగిం¹ుల పేరుతో ఏడురాగాలు సృష్టించాను. వాటితో నేను చేసిన అన్నమయ్య కృతులు.. నాకెంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆ మధ్య క్రికెట్‌కి సంబంధించిన ఓ యానిమేషన్‌ చిత్రం కోసం.. సిక్సర్‌ కొట్టడం, ఔట్‌ కావడం, నో బాల్‌ వంటి సందర్భాలకు తగ్గట్టు ప్రత్యేకమైన వయోలిన్‌ శబ్దాలని సృష్టించాను. దానికి క్రిక్‌మ్యాజిక్‌ అనీ పేరుపెట్టాను. వాటినిప్పుడు ఒక్క యానిమేషన్‌ చిత్రానికే కాదు.. బయట కూడా విరివిగా వాడుతున్నారు!
అవార్డులివి.. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం ప్రతిష్టాత్మకమైనవి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా కూడా ఎంపికయ్యాను. తెలుగురాష్ట్రాలకు చెందిన తొలి మహిళగా సంగీత కళానిధి నన్ను వరించడం గర్వంగా ఉంది. సంగీతం నాకు.. వ్యక్తిగత జీవితం అక్కరలేదన్నంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చింది. అందుకే పేరుకు తగ్గట్టే ‘కన్యాకుమారిగా’నే ఉండిపోయాను!
- నేతా మునిరత్నం, న్యూస్‌టుడే, చెన్నై.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.