మీ మదుపు బంగారంగానూ!

తాజావార్తలు


మీ మదుపు బంగారంగానూ!
నేడు ధన త్రయోదశి... బంగారం కొంటే మంచిదని చాలామందికి నమ్మకం. దీని సంగతి ఎలా ఉన్నా.. పసిడి మీద మన వారికున్న ప్రేమ ఈనాటిది కాదు. శుభకార్యాలు, పండగలు, బహుమతి సందర్భం ఏదైనా మొదటి ఆలోచన కనకంపైనే. దీనికి తగ్గట్టే.. పండగల వేళ రకరకాల రాయితీలూ వూరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బంగారంలో మదుపు చేసేందుకు ఉన్న వివిధ మార్గాలేమిటో.. ఎందులో ఎలా మదుపు చేయాలో తెలుసుకుందాం!

భారతీయులకు బంగారం అంటే ప్రాణం. సంపదకు, దర్పానికి చిహ్నం. ఓ ఆర్థిక భరోసా. అందుకే, బంగారం ధర ఎంతగా పెరిగినా.. కొనడానికి సిద్ధంగా ఉండేవారు ఎంతోమంది. అయితే, బంగారాన్ని కేవలం ఆభరణాల దృష్టితోనే చూడటం లేదిప్పుడు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పసిడిలో మదుపు చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఎన్నో రకాల మార్గాలూ అందుబాటులోకి వచ్చాయి. మరి, అవేమిటి? లాభనష్టాలేమున్నాయి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఫండ్ల రూపంలో...
నిజంగా కొనాల్సిన అవసరం లేకుండా బంగారం ద్వారా వచ్చే లాభాలను అందిపుచ్చుకోవడానికి గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (జీఈటీఎఫ్‌) సాయపడతాయి. మార్కెట్‌ ట్రేడింగ్‌ వేళల్లో యూనిట్లు కొనొచ్చు. అమ్ముకోవచ్చు. షేర్లలో పెట్టుబడి పెట్టినట్లే.. వీటిద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు.

ఇవే ఎందుకు?: బంగారంలో పెట్టుబడి ఎప్పుడూ దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉండాలి. గత ఏడాది కాలంగా జీఈటీఎఫ్‌లు 13-14శాతం రాబడిని అందించాయి. పసిడికి ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా కొంత మేరకు ఇందులో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ మంచిదే.
* మన కళ్లముందు సులువుగా కొనే బంగారంతో పోలిస్తే జీఈటీఎఫ్‌లను అర్థం చేసుకోవడం కాస్త క్లిష్టమే. కానీ, ఇవి అందించే ప్రయోజనాలతో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదు.
* జీఈటీఎఫ్‌లలో తయారీ ఖర్చు లేదు. నాణ్యత లోపం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. తిరిగి అమ్మడం తేలిక. బంగారం ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటుంది. కాబట్టి, దొంగల భయం అసలే ఉండదు.

ఎలా కొనాలి?: జీఈటీఎఫ్‌లలో మదుపు చేయాలంటే డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తప్పనిసరి. ఇప్పటికే మీకు డీమ్యాట్‌ ఖాతా ఉంటే.. సులువుగా వీటిని కొనొచ్చు. యూనిట్లు కొనేప్పుడు, అమ్మినప్పుడు రుసుములు భరించాలి. సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ పన్ను ఉంటుంది.
* ఇక్కడ ఒక యూనిట్‌ అంటే.. ఒక గ్రాము బంగారం అన్నమాట. యూనిట్ల కేటాయింపు ఏ రోజున ఏ ధర ఉంటే దాన్ని లెక్కిస్తారు.
* గోల్డ్‌ ఈటీఎఫ్‌ల విలువ ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్‌ ధరలను బట్టి యూనిట్లను కొనే అవకాశాన్ని కల్పిస్తాయి.

చిన్న మొత్తంతోనూ..
గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. వీటికి ప్రత్యామ్నాయంగా బంగారం ఫండ్లను ఎంచుకోవచ్చు. మదుపరుల నుంచి సమీకరించిన సొమ్మును ఇవి జీఈటీఎఫ్‌లలో మదుపు చేస్తాయి. సాధారణ మ్యూచువల్‌ ఫండ్ల మాదిరిగానే వీటిలోనూ మదుపు చేయవచ్చు. నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయాలనుకునే వారికి ఇవి సరిపోతాయి. రూ.500లతోనూ పెట్టుబడి పెట్టేందుకు వీలుంది.

మీకు 15-20ఏళ్ల సమయం ఉంటే.. ఇప్పట్నుంచే నెలకు కొంత గోల్డ్‌ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్లకు కేటాయించవచ్చు. వ్యవధి ముగిసే సరికి మీ దగ్గర పెద్ద మొత్తంలో యూనిట్లు జమ అవుతాయి. మధ్యలో వచ్చే డివిడెండ్లు ఇతరత్రా కలిపితే ఇంకా ఎక్కువే అయ్యేందుకు అవకాశం ఉంది.

ఈ-బంగారం కొంటారా?
నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఈఎల్‌) బంగారాన్ని ఎలక్ట్రానిక్‌ రూపంలో అందిస్తోంది. ఇక్కడ మీరు కొనాలనుకుంటున్న బంగారాన్ని ఎక్స్ఛేంజ్‌ జమ చేసి, భద్రపరుస్తుంది. అంటే, మీ బంగారానికి మీరే యజమాని అన్నమాట. కావాలనుకున్నప్పుడు బంగారాన్ని తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. జీఈటీఎఫ్‌లలో పెట్టుబడులన్నీ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చూస్తుంది. నేరుగా బంగారంలో మదుపు చేయాలి, అవసరమైనప్పుడు తీసుకోవాలి అనుకునే వారు ఈ-గోల్డ్‌ మార్గాన్ని ఎంచుకోవచ్చు.

భారతీయ నాణేలు..
ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా నేరుగా బంగారం కొనాలనుకునే వారు భారతీయ బంగారు నాణేలను పరిశీలించవచ్చు. దీనిపై ఒక వైపు అశోక చక్రం, మరో వైపు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ముద్రితమై ఉంటుంది. 24క్యారెట్ల 999 స్వచ్ఛ బంగారం 5, 10గ్రాముల పరిణామాల్లో లభిస్తుంది. 20గ్రాముల బంగారం కడ్డీలు కూడా లభిస్తాయి. వీటిని ఎంఎంటీసీ విక్రయ కేంద్రాల్లో కొనుగోలు చేయొచ్చు.

కొంచెం జాగ్రత్తగా..
మొత్తం పెట్టుబడిలో 5-10శాతం వరకూ పసిడికి కేటాయించవచ్చు. బంగారాన్ని ఆభరణాల రూపంలోనే ఎక్కువగా కొంటారు. మదుపు కోసం అనుకున్నప్పుడు ఈ పద్ధతి అంత మంచిది కాదు. తరుగు కింద 15-20శాతం వరకూ వెళ్తుంది. తయారీ ఖర్చులు అదనం. నగలను కొనేప్పుడు ధరతోపాటు తరుగు, తయారీ ఖర్చులను గమనించాలి. మంచి పేరున్న దుకాణాల నుంచి కొనడం ఎప్పుడూ మంచిది. కేవలం బంగారాన్ని కొనాలనుకున్నప్పుడు నాణేలు, కడ్డీల రూపంలో తీసుకోవచ్చు. కొన్ని బంగారు ఆభరణాల దుకాణాల్లో నెలవారీ కొంత చెల్లించి, బంగారాన్ని కొనుగోలు చేసే పథకాలూ అందుబాటులో ఉంటాయి. డబ్బు జమ అయిన తర్వాత మీరు కావాలనుకున్న రోజు బంగారాన్ని ఆ రోజు ధర ప్రకారం ఇస్తారా? మీరు కట్టిన డబ్బుతో ఎప్పటికప్పుడు బంగారాన్ని మీ పేరుమీద జమ చేస్తారా? అనేది తెలుసుకున్నాకే వీటిలో చేరాలి.

- కిశోర్‌ నార్నే, హెడ్‌, కమోడిటీస్‌-కరెన్సీ, మోతీలాల్‌ ఓస్వాల్‌ కమోడిటీస్‌
బ్యాంకు నుంచి...
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కూడా నేరుగా బంగారాన్ని నాణేలు, కడ్డీల రూపంలో కొనేందుకు అవకాశం ఉంది. 999.9 స్వచ్ఛతతో 2, 4, 8, 10, 20, 50, 100.. ఇలా మీకెన్ని గ్రాములు కావాలంటే అంత కొనుక్కోవచ్చు. భవిష్యత్తులో ఆభరణాలు చేయించుకోవాలని భావించేవారు బ్యాంకు బంగారాన్ని కొనేందుకు పరిశీలించవచ్చు. అయితే, కాస్త ధర ఎక్కువగా ఉంటుందని మర్చిపోకూడదు. తిరిగి అమ్మాలనుకున్నప్పుడు మాత్రం బ్యాంకులు ఈ బంగారాన్ని కొనవు.

పసిడి బాండ్లలో..
భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే బంగారం కొనే వారిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం సార్వభౌమ పసిడి బాండ్ల పథకాన్ని నవంబరు, 2015లో ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకూ 5విడతల్లో ఈ బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 6వ విడత పసిడి బాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు నవంబరు 2, 2016 వరకూ అవకాశం ఉంది. బాండ్లను నవంబరు 17, 2016న జారీ చేస్తారు.
* భారతీయ పౌరులు, హిందూ అవిభాజ్య కుటుంబం, ట్రస్టులు, మైనర్ల పేరుమీద సంరక్షకులు.. ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
* భారత ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంకు ఈ బాండ్లను సెక్యూరిటీల రూపంలో జారీ చేస్తుంది. డీమ్యాట్‌ రూపంలోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఎక్కడ?: గ్రామీణ బ్యాంకులు మినహా.. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అధీకృత పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఏజెంట్ల ద్వారా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. రూ.50వేల కన్నా ఎక్కువ పెట్టుబడి పెడితే మీ పాన్‌ కార్డు వివరాలు వెల్లడించాలి.

పెట్టుబడి ఎంత?: ఒక గ్రాము బంగారాన్ని యూనిట్లుగా ఇస్తారు. కనీసం 1 యూనిట్‌ను కొనాలి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 500 గ్రాముల వరకూ కొనొచ్చు.

ధర ఎంత?: భారత స్వర్ణ, ఆభరణాల సంఘం (ఐబీజేఏ) అక్టోబరు 17-21 మధ్య ప్రకటించిన 999 మేలిమి బంగారం సగటు ధర రూ.3007. అయితే, దీపావళి సందర్భంగా ప్రతి గ్రాముపై రూ.50 డిస్కౌంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ప్రస్తుతం ఒక గ్రాము యూనిట్‌ ధర రూ.2,957.

వ్యవధి?: జారీ చేసిన తేదీ నుంచి 8ఏళ్ల తర్వాత ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. గడువు తేదీ కన్నా ముందు డబ్బు తీసుకోవాలనుకుంటే.. జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల వరకూ ఆగాల్సి ఉంటుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో నమోదవుతాయి కాబట్టి, అక్కడ కూడా బాండ్లను విక్రయించేందుకు, బదిలీ చేసేందుకు అవకాశం ఉంది.

రాబడి ఎంత?: పెట్టుబడి వృద్ధితో పాటు, వార్షిక వడ్డీ 2.50శాతం అందుతుంది. గత ఐదు విడత బాండ్లతో పోలిస్తే ఈసారి 0.25% వడ్డీ తగ్గింది. ప్రతి 6నెలలకోసారి బ్యాంకు ఖాతాలో వడ్డీని జమ చేస్తారు. పెట్టుబడిని వెనక్కి తీసుకునేప్పుడు మూలధన రాబడిపై పన్ను వర్తించదు. అయితే, వడ్డీకి మాత్రం వ్యక్తిగతంగా వర్తించే శ్లాబులను బట్టి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బాండ్లలోని పెట్టుబడిని గడువుకు ముందే వెనక్కి తీసుకుంటే నిబంధనల మేరకు మూలధన రాబడి పన్ను విధిస్తారు.

గత ఐదు విడతల బాండ్ల జారీ ధరలు వాటి ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం!

లాభమేమిటి?
బంగారం పూర్తిగా కాగితం రూపంలో ఉంటుంది. కాబట్టి, బంగారం నాణ్యత పరిశీలించే అవసరం లేదు. బంగారాన్ని దాచుకోవడానికి లాకర్ల అవసరం లేదు. 8ఏళ్ల తర్వాత అప్పటి బంగారం ధరను బట్టి, బాండు విలువ చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం అదనపు ఆకర్షణ.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.