సైనా, సింధు తర్వాత మేమే..!

తాజావార్తలు


సైనా, సింధు తర్వాత మేమే..!
బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు
ఒలింపిక్స్‌ లక్ష్యంగా సాధన
విజయవాడ: ఒకప్పుడు ఆట అంటే క్రికెట్టే. మన దేశంలో ప్రతీ ఒక్కరూ దానిపైనే మక్కువ చూపేవారు. మిగతా క్రీడల్లో రాణిస్తున్నా వారికి ప్రోత్సాహం లభించేది కాదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సానియా స్ఫూర్తితో టెన్నిస్‌ వైపు, సైనా స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ వైపు చిన్నారులు దృష్టిపెట్టారు. ఇటు మీడియా, అటు ప్రకటన సంస్థలు కూడా వారిని ప్రోత్సహించడంతో వారు రాకెట్లలా దూసుకువెళుతున్నారు. తల్లిదండ్రులూ తమ పిల్లలు క్రీడల్లో రాణించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా శిక్షణకు పంపిస్తున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు జాతీయస్థాయిలో పలు పతకాలతో సత్తా చాటుతున్నారు. సైనా, సింధులకు వారసులుగా తమ ఆటతీరును మెరుగుపర్చుకుంటున్నారు. విజయవాడలో జరుగుతున్న జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో వీరు పాల్గొని చక్కటి ఆటతీరును ప్రదర్శిస్తున్నారు.

రోజుకు ఆరుగంటల సాధన
తండ్రి ఎస్‌కే మహబూబ్‌ స్ఫూర్తితో అయిదేళ్ల కిందట బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టి పతకాల పంట పండిస్తున్నాడు ఎస్‌కే అర్షద్‌. నంద్యాలలోని గుడ్‌ డే పబ్లిక్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న అర్షద్‌ నంది పైప్స్‌ అకాడమీలో కోచ్‌ రాధాకృష్ణ పర్యవేక్షణలో రోజూ ఆరు గంటల పాటు సాధన చేసేవాడు. ఓ వైపు మెలకువలు నేర్చుకుంటూ పలు ర్యాంకింగ్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. 2015లో గోపీచంద్‌ అకాడమీలో నిర్వహించిన జాతీయ సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీ అండర్‌-13 సింగిల్స్‌లో తృతీయ, డబుల్స్‌లో విన్నర్‌ ట్రోఫీలు కైవసం చేసుకున్నాడు. అదే ఏడాది దిల్లీలో జరిగిన జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీ అండర్‌-13 డబుల్స్‌లో విన్నర్‌, గుంటూరు, విశాఖపట్నంలో జరిగిన జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీల్లో పలు ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది మెరుగైన సాధన కోసం హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో శిక్షణకు వెళ్లాడు. జనవరిలో నిర్వహించిన జాతీయ అండర్‌-15 ర్యాంకింగ్‌ టోర్నీ డబుల్స్‌లో తృతీయ స్థానంలో నిలిచాడు. గచ్చిబౌలిలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో అండర్‌-15 కేటగిరీ డబుల్స్‌లో తృతీయ స్థానం సాధించాడు. గత నెలలో తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-15 కేటగిరీ సింగిల్స్‌లో ప్రథమ, డబుల్స్‌లో ద్వితీయ స్థానాల్లో నిలిచి జాతీయ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నానంటున్నాడు ఎస్‌కే అర్షద్‌.

తల్లిదండ్రులే స్ఫూర్తి
తల్లిదండ్రులైన ఒలింపియన్‌ పీవీలక్ష్మి, బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ పుల్లెల గోపీచంద్‌లనే స్ఫూర్తిగా తీసుకొని అయిదేళ్ల వయసులో రాకెట్‌ చేతబట్టాడు పుల్లెల సాయి విష్ణు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గ్లెండేల్‌ అకాడమీలో ఏడో తరగతి చదువుతున్న సాయివిష్ణు ప్రారంభ దశలో రోజూ ఒక పూట మాత్రమే సాధన చేసేవాడు. మూడేళ్ల కిందట నుంచి సాధన తీవ్రతరం చేశాడు. గత ఏడాది రాష్ట్ర అండర్‌-13 బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌ కేటగిరీలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది ఆలిండియా ర్యాంకింగ్‌ టోర్నీలో అండర్‌-13 కేటగిరీ సింగిల్స్‌లో మూడో ర్యాంకులో ఉన్నాడు. శరీర ఎదుగుదల వల్లే వచ్చే పలు రకాల ఇబ్బందుల వల్ల గత రెండు జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీల్లో పాల్గొనలేకపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ సబ్‌ జూనియర్స్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు కూడా వారం రోజులు మాత్రమే సాధన చేశాడు. క్రీడలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ రోజూ కోచ్‌ నుంచి మెలకువలను నేర్చుకుంటున్నాడు. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు.

సింధులా కావాలని..
ఒలింపియన్‌ పీవీసింధు స్ఫూర్తితో రాకెట్‌ చేతబట్టింది దోనేపూడి రష్మిత. నగరంలోని వీపీసిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న రష్మిత 2014లో డీఆర్‌ఆర్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియంలో అప్పటి కోచ్‌ కిరణ్‌ పర్యవేక్షణలో సాధన ప్రారంభించింది. తర్వాత అయిదు నెలల పాటు జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ విద్యాధర్‌ వద్ద, ఏడాది నుంచి అసోసియేషన్‌ కోచ్‌ కె.భాస్కర్‌, శాప్‌ కోచ్‌ జి.సుధాకర్‌రెడ్డిల పర్యవేక్షణలో డీఆర్‌ఆర్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియంలో సాధన కొనసాగిస్తోంది. సాధన ప్రారంభించిన ఏడాదే జిల్లా అండర్‌-13 కేటగిరీలో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. 2015లో జరిగిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-13 సింగిల్స్‌, డబుల్స్‌లో విన్నర్‌ ట్రోఫీలు కైవసం చేసుకోగా.. అండర్‌-15 కేటగిరీ సింగిల్స్‌, డబుల్స్‌లో తృతీయ, అండర్‌-17 కేటగిరీ సింగిల్స్‌, డబుల్స్‌లో తృతీయ, అండర్‌-19 డబుల్స్‌లో తృతీయ స్థానాల్లో నిలిచింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌-13 బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ ఏడాది జిల్లా స్థాయి ఛాంపియన్‌షిప్‌ అండర్‌-13 సింగిల్స్‌, డబుల్స్‌లో విజేతగా నిలిచి, అండర్‌-15 సింగిల్స్‌లో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన రాష్ట్ర స్థాయి మినీ, సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-12 డబుల్స్‌లో రన్నర్‌, డబుల్స్‌లో తృతీయ, అండర్‌-14 సింగిల్స్‌లో తృతీయ స్థానాలు సాధించింది. తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-13 సింగిల్స్‌లో సెమీస్‌, అండర్‌-13 డబుల్స్‌, అండర్‌-15 డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి దేశానికి పతకం సాధించాలనే దిశగా సాధన చేస్తున్నానంటుంది దోనేపూడి రష్మిత.

పతకమే లక్ష్యంగా ముందుకు..
సైనా నెహ్వాల్‌ స్ఫూర్తితో 2012లో రాకెట్‌ చేతబట్టింది యార్లగడ్డ ఆశ్రిత. విజయవాడలో వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఆశ్రిత తండ్రి రాజశేఖర్‌ వ్యాపారి. తల్లి నాగజ్యోతి గృహిణి. తొలినాళ్లలో పాఠశాలలోని ఇండోర్‌ స్టేడియంలో అప్పటి కోచ్‌ ఎన్‌.రాజేష్‌ పర్యవేక్షణలో సాధన ప్రారంభించింది. ఏడాది నుంచి కె.భాస్కర్‌, శాప్‌ బ్యాడ్మింటన్‌ కోచ్‌ జి.సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో సాధన కొనసాగిస్తోంది. 2012 నుంచి వరుసగా మూడేళ్ల పాటు జిల్లా అండర్‌-13, 15 బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌, డబుల్స్‌లో విజేతగా నిలిచింది. 2015లో అండర్‌-15, 17 కేటగిరీ సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. అండర్‌-15 డబుల్స్‌లో విన్నర్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది.ఈ ఏడాది జిల్లా స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-15, 17 సింగిల్స్‌, అండర్‌-15 డబుల్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-15 సింగిల్స్‌, డబుల్స్‌ కేటగిరీల్లో కాంస్యం, అండర్‌-17 డబుల్స్‌లోనూ కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ డబుల్స్‌లో కాంస్యం, అండర్‌-17 డబుల్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించే దిశగా సాధన చేస్తున్నానంటుంది ఆశ్రిత.

తండ్రే తొలి గురువు
సామియా ఇమాద్‌ ఫరూకి తండ్రి ఇమాద్‌ ఫరూకి యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. హైదరాబాద్‌లోని గ్లెండేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న సామియా తండ్రి సూచనల మేరకు 2009లో గోపీచంద్‌ అకాడమీలో చేరింది. రోజూ ఏడు గంటల పాటు సాధన చేస్తోంది. కటక్‌లో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్స్‌, రోతక్‌లో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్స్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో మెరుగైన ప్రతిభను ప్రదర్శించింది. గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్స్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-13 కేటగిరీ సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచింది. గత ఏడాది జరిగిన అయిదు జాతీయ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో అండర్‌-13 కేటగిరీలో సింగిల్స్‌, డబుల్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ ఏడాది అక్టోబరులో ఇండోనేషియాలో జరిగిన ఏషియన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-15 కేటగిరీ డబుల్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 2020, 2024లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నానంటోంది సామియా ఉమాద్‌.

సరదాగా ప్రారంభించి..
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని హెల్త్‌ క్లబ్‌లో తండ్రి అఫ్సర్‌తో కలిసి ఎనిమిదేళ్ల వయసులో సరదాగా రాకెట్‌ చేతబట్టి ఆడడం ప్రారంభించాడు ఎస్‌కే ఇమ్రాన్‌(13). నాయుడుపేటలోని విశ్వం హైస్కూల్‌లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఇమ్రాన్‌కు నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు రాకేష్‌చౌదరి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారు. దీనికితోడు 2014లో హైదరాబాద్‌లోని గోపీ అకాడమీలో ప్రవేశం లభించింది. అక్కడి కోచ్‌ సతీష్‌బాబు పర్యవేక్షణలో సాధన చేస్తున్నాడు. ప్రారంభంలో జిల్లా అండర్‌-13 జట్టుకు ప్రాతినిధ్యం వహించి కడప, అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, కాకినాడల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అకాడమీలో ప్రవేశించిన తర్వాత మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2014లో శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌-14 సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచి కశ్మీర్‌లో జరిగిన జాతీయ స్కూల్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2015లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్ర స్థాయి అండర్‌-14 కేటగిరీలో రన్నరప్‌గా నిలిచి ఔరంగాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్కూల్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొన్నాడు. పలు అఖిల భారత బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌ టోర్నీల్లో అండర్‌-13, 15 కేటగిరీల్లో రాణించాడు. గత నెల తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్స్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-13 సింగిల్స్‌లో రన్నరప్‌, డబుల్స్‌లో తృతీయ స్థానంలో నిలిచి ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రస్తుతం నగరంలో జరుగుతున్న జాతీయ సబ్‌ జూనియర్స్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో సారి తన సత్తా చాడుతున్నాడు. 2024, 2028లో నిర్వహించే ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.