గుంటూరులో రౌడీదర్బారు
close

తాజావార్తలు


గుంటూరులో రౌడీదర్బారు
అమరావతి: రౌడీషీటర్ల హత్యలు, ప్రతీకారేచ్ఛలతో గుంటూరు నగరం భీతిల్లుతోంది. ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలో గుంటూరు నడిబొడ్డున రెండు హత్యలు చోటు చేసుకున్నాయి. రెండు హత్యలు రౌడీ నేపథ్యం కలిగిన వారు చేసినవే కావటం గమనించాల్సిన అంశం. రౌడీషీటర్లు, అల్లరిమూకల పీచమణచటంలో అర్బన్‌ జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యం ఉందన్న విమర్శలు ఉన్నాయి. డిసెంబరు నెలాఖరున బుడంపాడు వద్ద గోపీనాథ్‌ అనే రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. అతన్ని చంపింది కూడా మరో రౌడీషీటరే. ఆదివారం సాయంత్రం శ్రీనివాసరావుతోటలో చోటు చేసుకున్న మరో హత్య పోలీసులు పాఠాలు నేర్చుకోలేదనడానికి ప్రబల ఉదాహరణ. ఇద్దరు యువకులు మద్యంమత్తులో ఒకరికొకరు కత్తులు పట్టుకుని జనం అంతా చూస్తుండగానే పొడుచుకోవటంతో వారిలో శివరాం అనేయువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

రౌడీలే ఆదాయ వనరులు? : నగరంలో కొంతమంది పోలీసు అధికారులకు, రౌడీలకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు దందాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో సొమ్ము చేసుకున్న సొత్తులో కొంత పోలీసులకు ముట్టజెబుతారనే ప్రచారం ఉంది. ఇలా కొందరు పోలీసులే వారిని పెంచిపోషిస్తుండటంతో వారికి పోలీసులు అంటే భయం లేకుండాపోయిందని అంటున్నారు. గతేడాది సంక్రాంతి పండగ వేళ చుట్టుగుంట సెంటర్‌కు చెందిన ముగ్గురు యువకులను చిలకలూరిపేట జాతీయరహదారి పక్కన పొత్తూరు వద్ద ముక్కలుముక్కలుగా నరికిచంపారు. వారిని చంపిన యువకులకు కనీసం బెయిల్‌రాకుండా చేయటంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించలేకపోయారు. మొక్కుబడి కేసులు నమోదు చేయటంతో వారు తిరిగి బెయిల్‌పై బయటకు వచ్చి నాలుగు రోజుల కిందట మళ్లీ మారణాయుధాలు పట్టుకుని ఓ మద్యం దుకాణం వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని పట్టుకుని వదిలేశారు తప్పిస్తే వారిని ఎందుకు మారణాయుధాలు కలిగి ఉన్నారా అన్నది విచారించలేదు. ఇలా పోలీసుల వైఫల్యం అన్నింటా ఉండటంతో రౌడీలు, అల్లరి మూకలకు కలిసొస్తోంది.

పొలిటికల్‌ పోస్టింగ్‌లు! : గుంటూరు అర్బన్‌ జిల్లాలో ఏడాదిన్నరగా ఎస్‌హెచ్‌ఓల నియామకాల్లో పారదర్శకత లేకుండా పోయిందనే విమర్శలు పోలీసుశాఖ నుంచే వినిపిస్తున్నాయి. రాజధాని నిర్మితమవుతున్న నేపథ్యంలో గుంటూరు అర్బన్‌ జిల్లాకు ప్రాధాన్యం బాగా పెరిగింది. చాలా మంది ప్రముఖులు, స్థిరాస్తి ఇతరత్రా లావాదేవీల నిర్వహణకు గుంటూరుకు వచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి నివాసం కూడా అర్బన్‌ జిల్లా పోలీసుల పరిధిలోనే ఉంది. సచివాలయానికి ఎవరు వెళ్లాలన్నా అర్బన్‌ జిల్లా నుంచే వెళ్లాలి. వాటన్నింటి దృష్ట్యా కొంచెం నిబద్ధతతో పనిచేస్తారని పేరున్న అధికారులను లాబీయింగ్‌కు తావు లేకుండా నియామకం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే అందుకు విరుద్ధంగా ఇక్కడ పోస్టింగ్‌లు పడుతున్నాయి. చాలా వరకు రాజకీయ జోక్యంతోనే అనర్హులకు స్టేషన్ల బాధ్యతలు కట్టబెడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తీరా వీరు విధి నిర్వహణలో అంతగా రాణించలేకపోతున్నారని ఇవే అర్బన్‌ జిల్లాలో శాంతిభద్రతలు కీక్షీణించటానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. అర్బన్‌ జిల్లాలో అనేక మద్యం షాపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, సమయపాలన పాటించటం లేదని కేసులు నమోదు చేసి వాటి లైసెన్సులను రద్దు చేయాలని అర్బన్‌ జిల్లా నుంచి వెళ్లిన సిఫార్సులు కాగితాలకే పరిమితం కావటంతో రౌడీలు, అల్లరిమూకలకు గుంటూరు నగరంలో రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం లభ్యమవుతోందని వినికిడి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గుంటూరు అర్బన్‌లో శాంతిభద్రతల బలోపేతానికి పకడ్బందీ చర్యలు చేపట్టకపోతే మున్ముందు మరిన్ని హత్యలు చోటుచేసుకుంటాయనటంలో సందేహం లేదు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.