గోప్యతే రక్షత.. పిన్‌ దొంగలతో జాగ్రత్త

తాజావార్తలు


గోప్యతే రక్షత.. పిన్‌ దొంగలతో జాగ్రత్త
అవగాహన పెంపుతోనే ఆన్‌లైన్‌ నేరాలకు అడ్డుకట్ట
హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దుకు ముందే ఆన్‌లైన్‌ లావాదేవీలు ఏటికేడాది పెరుగుతున్నాయి... ప్రస్తుతం రోజురోజుకీ ఈ పెరుగుదల కనిపిస్తోంది.. ఇలాంటి సమయంలో సైబర్‌ నేరాల ముప్పూ అదే రీతిలో పొంచి ఉండే ఆస్కారముంది. భవిష్యత్తులో అంతటా ... అన్నింటా నగదు రహిత లావాదేవీల దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సైబర్‌ నేరాల విషవలయం నుంచి తప్పించుకునేందుకు పౌరుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ముందుగా పోలీసులు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ గుర్తించారు. ఘట్‌కేసర్‌ ఇన్ఫోసిస్‌లో సోమవారం ‘నగదు రహిత లావాదేవీలు- సైబర్‌ భద్రత’ అంశంపై కార్యశాల నిర్వహించారు. ఠాణాకు వచ్చే ప్రజలకు సైబర్‌ నేరాలు జరిగే తీరు, వాటి గురించి సమగ్ర అవగాహన కల్పించడం, ఆయా నేరాల కట్టడికి క్షేత్రస్థాయి పోలీసులు తీసుకోవాల్సిన చర్యల గురించి కమిషనర్‌తో పాటు సీడాక్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ నర్సింహారావు, ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రాంతీయ మేనేజర్‌ రంగాచారి, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ స్నేహిత, ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌ వివరించారు. కమిషనరేటü పరిధిలోని అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు ఈ కార్యశాలకు హాజరయ్యారు.
http మాత్రమే ఉంటే అనుమానించాల్సిందే..
సాధారణంగా వెబ్‌బ్రౌజర్‌ http ఉంటే దాన్ని నకిలీగా గుర్తించాలి. రక్షిత వెబ్‌బ్రౌజర్లకు తప్పనిసరిగా https అనే ఉంటుంది. దీనికితోడు ప్యాడ్‌లాక్‌(తాళం వేసినట్లు) సంజ్ఞ ఉంటేనే సురక్షితమని గ్రహించాలి. ఈ తరహా వెబ్‌బ్రౌజర్లతోనే క్రెడిట్‌/డెబిట్‌ కార్డు లావాదేవీలు నిర్వహించాలి. మెయిల్‌కు గాని చరవాణికి గాని వచ్చే లింక్‌ల యూఆర్‌ఎల్‌ను బట్టి ఆ సైట్‌ సురక్షితమైనదేనా అని గుర్తించొచ్చు. ఆ యూఆర్‌ఎల్‌ లింక్‌నుwww.virus total.com సైట్‌లో తనిఖీ చేసి ఈ విషయం ధ్రువపరుచుకునే వీలుంది. ఏదైనా బ్యాంకు నుంచి వచ్చినట్లుగా పంపించే సందేశాల్లోనూ నకిలీలను గుర్తించే అవకాశముంది. ఆన్‌లైన్‌ నేరగాళ్లు పంపే సందేశాల్లో ‘డియర్‌ ... బ్యాంక్‌ కస్టమర్‌’ అని మాత్రమే ఉంటాయి. బ్యాంకు పంపే మెయిల్‌లో మాత్రం ఖాతాదారు పేరుతోనే సందేశం ఉంటుంది.
స్వీడన్‌ బ్యాంకుల్లో నో క్యాష్‌
స్వీడన్‌ దేశంలో సుమారు 1500 బ్యాంకులున్నాయి. వాటిలో 900 బ్యాంకుల్లో డబ్బులుండవు. అంతా ఆన్‌లైన్‌ లావాదేవీల వల్లే అలా సాధ్యమవుతోంది. ఓ బ్యాంకులో చోరీకి వచ్చిన దొంగలు నగదు లేకపోవడం చూసి కంగు తినాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లోని ఆర్థిక అవసరాల దృష్ట్యా 600 బ్యాంకుల్లో మాత్రమే నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయి.
ఓపెన్‌ వై-ఫైతో ముప్పు
ప్రస్తుతం చాలా చోట్ల అటు ప్రభుత్వ సంస్థలు, ఇటు ప్రైవేటు సంస్థలు ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇలాంటి చోట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించొద్దు. అంతా వ్యాపారంతో కూడుకున్న ఈ కాలంలో ఏదీ వూరికే ఉండదనే విషయాన్ని గమనించాలి. ఇలాంటి చోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగితే ఆ సమాచారమంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయి. ఉచిత వై-ఫై వ్యవస్థను నిర్వహించే ఏజెన్సీల నుంచి నేరగాళ్లు సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడేందుకు ఆస్కారముంది.
అనుమానాల నివృత్తి ఇలా..
సైబర్‌ నేరాల గురించి ఏవైనా అనుమానాలుంటే తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ‘మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ ఆధీనంలోని ‘ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌(ఐఎస్‌ఈఏ)’ పేరిట ప్రత్యేక విభాగం ఇందుకోసం పనిచేస్తోంది. పౌరులెవరైనా ఆ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్‌కు నేరుగా ఫోన్‌ చేయొచ్చు. లేదంటే మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా 24 గంటల్లోగా తిరిగి ఫోన్‌ చేసి అనుమానాన్ని నివృత్తి చేస్తారు. సైబర్‌ నేరాలపై సమాచారాన్నీ అందించొచ్చు.

వెబ్‌సైట్‌ :www.infosecawareness.in
టోల్‌ ఫ్రీ నం : 18004256235 (సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలు)
వాట్సప్‌ నం : 9490771800 (సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటలు)
ఫేస్‌బుక్‌ : https://www.facebook.com/ infosecawareness
ట్విట్టర్‌ :https://twitter.com/ cdac_isea

పాస్‌వర్డ్‌ల సంగతులిలా..
మెయిల్‌, ఫేస్‌బుక్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌.. లాంటి ఏ వ్యవస్థ నిర్వహణలోనైనా పాస్‌వర్డ్‌ కీలకం. ఇది నేరగాళ్లకు చిక్కితే ప్రమాదం. అందుకే పాస్‌వర్డ్‌ రూపొందించుకోవడంలో జాగరూకతతో వ్యవహరించాలి.

మన దేశంలో 36 శాతం మంది తమ పాస్‌వర్డ్‌లను ఎవరు అడిగినా టక్కున చెప్పేస్తున్నారని నిపుణుల పరిశీలనలో తేలింది.

కొందరైతే పదేళ్లుగా ఒకే పాస్‌వర్డ్‌ను వాడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. సైబర్‌ నేరగాళ్లు తమ వైపు దృష్టి సారించరనే అపోహ వీరిది. ప్రస్తుతం ఆన్‌లైన్‌మయమైనందున అలాంటి అపోహలేమీ పెట్టుకోనక్కర్లేదు. 

పాస్‌వర్డ్‌లను ప్రతీ మూడు నెలలకోసారైనా మార్చాలి. అలా చేస్తే 80 శాతం ఆన్‌లైన్‌ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. పాస్‌వర్డ్‌ తప్పనిసరిగా ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు, సంజ్ఞలు మిళితమై ఉండేలా చూసుకోవాలి.

80 శాతం మంది ఫిర్యాదు చేయడం లేదు
- మహేశ్‌ భగవత్‌, రాచకొండ కమిషనర్‌
ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగనుండటంతో సైబర్‌ నేరాల ముప్పు మరింతగా పొంచి ఉంది. నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా వ్యవహారాలు ఎక్కువగా చేసే వారికి రెండు ఖాతాలు అవసరం. ప్రత్యేకంగా ఒక ఖాతా ఆన్‌లైన్‌ అవసరాలకే ఉండేలా చూసుకోవాలి. సైబర్‌ నేరాల బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది ఫిర్యాదులు సైబర్‌క్రైమ్‌ పోలీసుల దృష్టికి రావడం లేదు. నేరగాళ్లు దొరకరనే అపోహను తొలగించడానికి క్షేత్రస్థాయి పోలీసులు కృషి చేయాలి. సైబర్‌ నేరం జరిగితే ఫిర్యాదు చేసేలా ప్రజల్ని ప్రోత్సహించాలి. ఆన్‌లైన్‌ నేరాలపై ఠాణాలకు వస్తే తొలుత ఫిర్యాదు స్వీకరించి సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ చేయాలి. రెండు కంటే ఎక్కువ నేరాల్లో ప్రమేయమున్న వారిపై సస్పెక్ట్‌షీట్‌ తెరవాలి. పకడ్బందీగా అభియోగపత్రాలు రూపొందించి శిక్షలు పడేలా చేస్తేనే నేరాలు తగ్గుముఖం పడతాయి.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.