latest breaking telugu news
close

తాజావార్తలు

ఏకకాలంలో దాడి
పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన మెరుపుదాడిలో భారత సైన్యం అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఎంతో ఒడుపుగా పాక్‌ సైన్యాన్ని ఏమార్చి, పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులను మట్టికరిపించింది. లక్ష్యంగా ఎంచుకున్న ఏడు శిబిరాలపై ఏకకాలంలో దాడులు చేపట్టి, శత్రువుకు మేల్కొనే అవకాశం ఇవ్వలేదు. అమావాస్య రోజులు కావడంతో చిమ్మచీకటి అలుముకుని ఉండడం మన బలగాలకు కలిసొచ్చింది. ఆపరేషన్‌ విజయవంతం కావడంలో ఇది కీలక పాత్ర పోషించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ శిబిరాలు 250 కిలోమీటర్ల మేర విస్తరించిన పర్వత, అటవీ ప్రాంతంలో ఉన్నాయి. కమాండోలు నియంత్రణ రేఖ దాటి గరిష్ఠంగా ఎంత దూరం వెళ్లారన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 3 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లినట్లు కొన్ని వర్గాలు చెబుతుండగా.. 6 కిలోమీటర్లుగా కొందరు పేర్కొంటున్నారు.
ఆలోచన..
సెప్టెంబర్‌ 18: జమ్మూకశ్మీర్‌లోని ఉరీలో ఉన్న 12వ సైనిక బ్రిగేడ్‌పై జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను బలితీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. పాక్‌పై చర్య తీసుకోవాల్సిందేనన్న డిమాండ్‌లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సైనిక చర్యకు ఉన్న మార్గాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది.

సెప్టెంబర్‌ 20: దిల్లీలోని సైనిక కార్యకలాపాల డైరెక్టరేట్‌లో సైనిక ఆగ్రనాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి వివరణ ఇచ్చింది. ఉగ్రవాద శిబిరాలు, వాటిపై దాడికి సంబంధించిన ప్రణాళికను సవివర మ్యాప్‌లు, ఇసుక నమూనాల సాయంతో తెలియజెప్పింది.

సెప్టెంబర్‌ 27: సైనిక కార్యకలాపాల డైరెక్టరేట్‌లో మరోసారి వివరణను ఆలకించాక మెరుపు దాడులకు ప్రధాని పచ్చజెండా వూపారు.

కసరత్తు..
ఉరీ అనంతరం ఏడు ఉగ్రవాద చొరబాటు శిబిరాలపై సైన్యం నిరంతర నిఘా వేసింది. ఇందుకోసం నిఘా డ్రోన్లు ఉపయోగించింది.

* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన కార్టోశాట్‌ ఉపగ్రహం అందించిన చిత్రాలను తొలిసారిగా ఈ ఆపరేషన్‌ కోసం నియోగించారు. వీటి ఆధారంగా పక్కా ప్రణాళికను సైనిక నాయకత్వం రూపొందించింది.

* సదరు శిబిరాల్లో ఉగ్రవాదుల జాడను పసిగట్టగానే దాడుల కోసం పారా కమాండో దళాలకు బుధవారం మధ్యాహ్నం ఆదేశాలు అందాయి.

అమలు..
ఆపరేషన్‌కు అనుమతి రాగానే నియంత్రణ రేఖ వెంబడి పలు సైనిక స్థావరాల నుంచి హెలికాప్టర్లు నింగిలోకి లేచాయి. జతలు జతలుగా గగనవిహారం చేశాయి. ఉరీ వంటి సెక్టార్లలో ఒకదాని వెంట ఒకటిగా చక్కర్లు కొట్టి హడావుడి సృష్టించాయి. ఫలితంగా పాకిస్థాన్‌ దృష్టి మొత్తం పూర్తిగా ఆ దిశకు మళ్లింది. దీనికితోడు భారత సైన్యం ఉరీ వెంబడి భారీ సామర్థ్య ఆయుధాలతో కాల్పులు జరిపింది. దీంతో పాక్‌ ఏకాగ్రత ఆవైపునకు మళ్లింది.

* ఇదే అదనుగా భారత సైన్యంలోని సుశిక్షత పారా కమాండోలు బుధవారం అర్ధరాత్రి 12.30గంటలకు నియంత్రణ రేఖ దాటారు. మార్గమధ్యంలో పాకిస్థాన్‌ సైనిక శిబిరాలు తారసపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బురద, రాళ్లు, మందుపాతరలు వంటి అవరోధాలను దాటుకుంటూ మూడు కిలోమీటర్లు సాగిపోయారు. బురదలో పాక్కుంటూ వెళ్లారు. 4, 9 పారా కమాండో విభాగాలకు చెందిన దాదాపు 160 మంది కమాండోలు ఇందులో పాల్గొన్నారు. వీరికి కశ్మీర్‌లోని ‘ఘాతక్‌’ సైనిక ప్లాటూన్లు తోడ్పాటు అందించాయి.

* ఉత్తర కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా, నౌగామ్‌ సెక్టార్లలో నియంత్రణ రేఖను సైన్యం దాటింది. పర్వతమయంగా, దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. కొన్ని శిబిరాలు 2వేల నుంచి 6వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిని చేరుకోవడానికి కమాండోలు ఎంతో శ్రమకోర్చారు. దాదాపు 1.45 గంటలకు కమాండోలు ముష్కర శిబిరాలను చేరుకున్నారు.

* వెంటనే భారీ ఆయుధాలతో వాటిపై విరుచుకుపడ్డారు. ఐదు ఉగ్రవాద చొరబాటు శిబిరాలను, కొన్ని చోట్ల వాటికి అనుబంధంగా పాక్‌ సైన్యం ఏర్పాటుచేసుకున్న రెండు సైనిక శిబిరాలను కూడా భారత కమాండోలు ధ్వంసం చేశారు. శరపరంపరగా పొగ గ్రెనేడ్లను ప్రయోగించి ఉగ్రవాదుల్లో అయోమయం సృష్టించారు. భారీ స్థాయి ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు తేరుకునే లోపే వారి వైపు భారీ ప్రాణనష్టం జరిగింది.

* ఇదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి సైన్యాన్ని, జమ్మూ, పఠాన్‌కోట్‌ వంటి స్థావరాల్లో వైమానిక దళాలను అప్రమత్తం చేశారు.

* దాడిలో చనిపోయిన ఉగ్రవాదులు ఎంత మందన్నది వెల్లడి కాలేదు. సాధారణంగా ఒక్కో చొరబాటు శిబిరంలో కనీసం 10 మంది ఉగ్రవాదులు, అంతే సంఖ్యలో మార్గదర్శకులు, ఇతర సహాయకులు ఉంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.అంతరిక్షం నుంచి నిఘా
నియంత్రణ రేఖ ఆవలికి వెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి కోసం భారత సైన్యం అధునాతన పద్ధతులను ప్రయోగించింది. డ్రోన్లతోపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన కార్టోశాట్‌ ఉపగ్రహ సేవలను తొలిసారిగా వాడుకుంది. ఇది అందించిన విస్పష్ట చిత్రాల ఆధారంగా ప్రణాళిక రచించింది.

నిజానికి కార్టోశాట్‌ శ్రేణి ఉపగ్రహాలు పౌర అవసరాలతోపాటు సైనిక అవసరాలు కూడా తీరతాయి. నిపుణులు వీటిని ‘ఆకాశంలో నిఘా నేత్రం’గా అభివర్ణిస్తారు. ఈ శ్రేణిలో కార్టోశాట్‌-2సీ వల్ల దేశ సైనిక నిఘా సామర్థ్యం ఇనుమడించింది. ఇది 0.65 మీటర్ల మేర స్పష్టత కలిగిన చిత్రాలను అందిస్తుంది. మునుపటి ఉపగ్రహాల కన్నా ఇది 0.8 మీటర్ల మేర అధికం.

ఆసక్తి ప్రాంతం..
సైన్యం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ‘ఆసక్తి ప్రాంతానికి’ సంబంధించిన చిత్రాలను కార్టోశాట్‌ అందిస్తుంది. అవసరాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని పదేపదే చిత్రీకరిస్తుంది. వినియోగదారులను బట్టి ప్రామాణిక, అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆర్థో చిత్రాలను అందిస్తుంది. ఆర్థో చిత్రాలను భౌగోళిక వైరుద్ధ్యాలు, కెమెరా ఒరుగుదల ప్రభావాన్ని సరిచేస్తారు.

తొలి కార్టోశాట్‌ను 2005లో ఇస్రో ప్రయోగించింది. రెండోదైన కార్టోశాట్‌-2ఏను 2007లో ప్రయోగించారు. ఇందులో ద్వంద్వ వినియోగ సామర్థ్యం ఉంది. పొరుగు దేశాల్లో చోటుచేసుకునే క్షిపణి ప్రయోగాలను ఇది పసిగట్టగలదు. చిట్టచివరిదైన కార్టోశాట్‌-2సిని ఈ ఏడాది జూన్‌లో ప్రయోగించారు. రిజల్యూషన్‌ విషయంలో ఇవి చాలా మెరుగైనవి. ఈ ఉపగ్రహం ఆసక్తి ఉన్న ప్రదేశాలను చిత్రీకరించడమే కాదు.. సున్నితమైన లక్ష్యాలను వీడియో కూడా తీస్తుంది.

ఒక్కరికి గాయాలు..
ఒకవేళ సహచరులు చనిపోయినా.. మృతదేహాలను వెంట తీసుకురావాలని కమాండోలను సైనిక అధికారులు ఆదేశించారు. దాడిలో పాల్గొన్న ప్రతిఒక్కరూ వెనుతిరిగేలా చూడాలని స్పష్టంచేశారు. పొరపాటున ఒక మందుపాతరపై కాలువేయడంతో ఒక కమాండో స్వల్పంగా గాయపడ్డాడు. మిగతా అందరూ తెల్లవారేలోపే క్షేమంగా స్థావరాలకు తిరిగొచ్చారు.

* గాయపడిన వారిని అత్యవసరంగా తరలించడం కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. అయితే వాటిని ఉపయోగించలేదు.

భారీ ఆయుధాలు..
ఈ దాడిలో పారాకమాండోలు వాడిన అధునాతన ఆయుధాల్లో స్వీడన్‌ తయారీ ‘కార్ల్‌ గుస్తాఫ్‌’ రాకెట్‌ లాంచర్‌ కూడా ఉంది. భుజంపై పెట్టుకొని పేల్చే ఈ ఆయుధాన్ని నిర్వహించడానికి ఇద్దరు సైనికులు అవసరం. ట్యాంకులు, పటిష్ఠ బంకర్లను కూడా ఇది నేలమట్టం చేయగలదు. కమాండోల వద్ద టవోర్‌, ఎం4 తుపాకులు, గ్రెనేడ్లు, పొగను వెలువరించే గ్రెనేడ్లు, తుపాకీ గొట్టం కింద భాగం నుంచి ప్రయోగించే గ్రెనేడ్లు ఉన్నాయి. చీకట్లోనూ చూడగలిగే పరికరాలను తమ వెంట తీసుకెళ్లారు. వారి హెల్మెట్లపైనా కెమేరాలున్నాయి.

మేల్కొనేసరికే తెల్లారిపోయింది..
సైనిక దాడిలో ‘విభ్రమ’ చాలా కీలకం. మెరుపు వేగంతో ఆపరేషన్‌ను సాగించడం ద్వారా భారత దళాలు ఈ అంశాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఈ దాడిని పాకిస్థాన్‌ దళాలు గుర్తించేసరికి మన బలగాలు తమ స్థావరాలకు తిరిగొచ్చేశాయి. అప్పుడు పాక్‌ ఎదురు కాల్పులు జరిపింది.


-ఈనాడు, ప్రత్యేక విభాగం
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.