Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


కూనలమ్మ పదాలు
వేనవేలు రకాలు
ఆరుద్రదే వ్రాలు
అంటాడు శ్రీశ్రీ
కూనలమ్మ పదాలు
లోకానికి సవాలు
ఆరుద్ర చేవ్రాలు
అంటాడు శ్రీశ్రీ
కూనలమ్మ పదాలు
కోరుకున్న వరాలు
ఆరుద్ర సరదాలు
అంటాడు శ్రీశ్రీ
చిన్ని చిన్ని మాటల ఈటెల ‘‘ఆరుద్ర కూనలమ్మ పదాలు’’ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొంతపుంతలు తొక్కించాయి. ఆ కవితా సంపదను ప్రవాసాంధ్రులకూ ‘‘ఈనాడు.నెట్‌’’ అందించాలని అనుకుంటోంది. మొట్టమొదటగా, కూనలమ్మ పదాలు రాయడానికి ఆరుద్రకు ప్రేరణగా నిలచిన పాత కూనలమ్మ పదాలతో మొదలుపెట్టి... ఇక ప్రతిరోజూ మీకు కూనలమ్మ పదాల విందు.
పాత కూనలమ్మ పదాలు
సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ
ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ

సామ్యవాద పథమ్ము
సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రదమ్ము
ఓ కూనలమ్మ
అరుణబింబము రీతి
అమర నెహ్రూ నీతి
ఆరిపోవని జ్యోతి
ఓ కూనలమ్మ
సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ
ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ

తెలివితేటల తాడు
తెంపుకొను మొనగాడు
అతివాద కామ్రేడు
ఓ కూనలమ్మ
ఇజము నెరిగిన వాడు
నిజము చెప్పని నాడు
ప్రజకు జరుగును కీడు
ఓ కూనలమ్మ
స్టాలినిస్టు చరిత్ర
సగము గాడిదగత్ర
చదువుకో ఇతరత్ర
ఓ కూనలమ్మ
మధ్యతరగతి గేస్తు
మంచి బందోబస్తు
జనులకిక శుభమస్తు
ఓ కూనలమ్మ

దహనకాండల కొరివి
తగలబెట్టును తెలివి
కాదు కాదిక అలవి
ఓ కూనలమ్మ
కూరుచుండిన కొమ్మ
కొట్టుకొను వాజమ్మ
హితము వినడు కదమ్మ
ఓ కూనలమ్మ
కష్టజీవుల కొంప
కాల్చి బూడిద నింప
తెగునులే తన దుంప
ఓ కూనలమ్మ
జనుల ప్రేముడి సొమ్ము
క్షణము లోపల దుమ్ము
తులువ చేయును సుమ్ము
ఓ కూనలమ్మ

మధువు మైకము నిచ్చు
వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు
ఓ కూనలమ్మ
హరుడు అధికుడు కాడు
నరుడు అల్పుడు కాడు
తమకు తామే ఈడు
ఓ కూనలమ్మ
సుదతిపాలిట భర్త
మొదట వలపుల హర్త
పిదప కర్మకు కర్త
ఓ కూనలమ్మ
చివరి ప్రాసల నాభి
చిత్రమైన పఠాభి
కావ్యసుధట షరాభి
ఓ కూనలమ్మ

తీర్చినట్టి బకాయి
తెచ్చిపెట్టును హాయి
అప్పు మెడలో రాయి
ఓ కూనలమ్మ
నిజము నిలువని నీడ
నీతి యన్నది చూడ
గాజు పెంకుల గోడ
ఓ కూనలమ్మ
చెప్పి దేవుని పేరు
చెడుపు చేసెడివారు
ఏల సుఖపడతారు
ఓ కూనలమ్మ
ఈశుడంతటివాడు
ఇల్లరికమున్నాడు
పెండ్లయిన మరునాడు
ఓ కూనలమ్మ

మరియెకరి చెడు తేది
మనకు నేడు ఉగాది
పంచాంగమొక సోది
ఓ కూనలమ్మ
జనులు గొర్రెలమంద
జగతి వేసెడు నింద
జమకట్టు స్తుతి క్రింద
ఓ కూనలమ్మ
ఉడుకు రచనల యందు
ఎడద మెదడుల విందు
లేటు గోపీచందు
ఓ కూనలమ్మ
ఇరకు కార్యపు గదులు
ఇరుకు గోడల బదులు
మేలు వెన్నెల పొదలు
ఓ కూనలమ్మ

కోర్టుకెక్కిన వాడు
కొండనెక్కిన వాడు
వడివడిగ దిగిరాడు
ఓ కూనలమ్మ
పరుల తెగడుట వల్ల
బలిమి పొగడుట వల్ల
కీర్తి వచ్చుట కల్ల
ఓ కూనలమ్మ
కోపాగ్నులకు వృద్ధి
కుత్సితాలకు రద్ది
లేమి చంపు సుబుద్ధి
ఓ కూనలమ్మ
అతివ పలుకే చాలు
అందు వేనకువేలు
మొలచు నానార్థాలు
ఓ కూనలమ్మ

చెక్కు చెదరని వక్త
చేదు నిజము ప్రయోక్త
చంపబడును ప్రవక్త
ఓ కూనలమ్మ
ఎంకి పాటల దారి
ఎడద గుర్రపు స్వారి
చేయులే నండూరి
ఓ కూనలమ్మ
ఆలు మగల లడాయి
అంత మొందిన రేయి
అనుమానపు హాయి
ఓ కూనలమ్మ
బ్రూటు కేసిన ఓటు
బురదలో గిరవాటు
కడకు తెచ్చును చేటు
ఓ కూనలమ్మ

రాజముద్రికె మొహరు
ప్రజల నేతయె నెహురు
స్వేచ్ఛ పేరే యుహురు
ఓ కూనలమ్మ
జనులు నమ్మెడివరకు
కనులు తెరవని వరకు
వెలుగు నకిలీ సరకు
ఓ కూనలమ్మ
పాత సీసాలందు
నూతనత్వపు మందు
నింపితే ఏమందు?
ఓ కూనలమ్మ
అయిదు రోజులు వేస్టు
అగుట కెయ్యది బెస్టుఝ
చూడుము క్రికెట్‌ టెస్టు
ఓ కూనలమ్మ

‘అతడు - ఆమె’ల ఫైటు
అతివ ఛాన్సులు బ్రైటు
ఆడదెపుడూ రైటు
ఓ కూనలమ్మ
ఆత్మవంచన వల్ల
ఆడు కల్లల వల్ల
అగును హృదయము డొల్ల
ఓ కూనలమ్మ
వాతలుండిన నక్క
వ్యాఘ్రజాతిలొ లెక్క
అనును కద తలతిక్క
ఓ కూనలమ్మ
నూతిలోపలి కప్ప
పాతఘనతలు తప్ప
మెచ్చ దితరుల గొప్ప
ఓ కూనలమ్మ

నరుడు మదిలో దొంగ
నాల్క బూతుల బుంగ
కడుగ జాలదు గంగ
ఓ కూనలమ్మ
పంగనామము లేల
భస్మ పుండ్రము లేల
భక్తి నిజమగు వేళ
ఓ కూనలమ్మ
అతివ పురుషుని దీటు
అనుచు నభమున చాటు
ఆడ కాస్మోనాటు
ఓ కూనలమ్మ
ప్రజలు చేసెడి పొదుపు
ప్రభుత ఫ్యాడుల మదుపు
సంగయాత్రలో కుదుపు
ఓ కూనలమ్మ

కొత్త పెండ్లము వండు
గొడ్డుకారము మెండు
తీపియను హస్బెండు
ఓ కూనలమ్మ
పాత బిరుదముకన్న
పదవియే కద మిన్న
హ్యూము చాటెను మొన్న
ఓ కూనలమ్మ
గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
కూళతో స్నేహమ్ము
ఓ కూనలమ్మ
పిరికి ఎలుకల జంట
పిల్లి మెడలో గంట
వెళ్లికట్టిన దంట
ఓ కూనలమ్మ

లంచమనియెడి ఉప్పు
క్లార్కు తింటే తప్పు
ఘనుడు తింటే మెప్పు
ఓ కూనలమ్మ
హృదయమున్న విమర్శ
మెదడు కలచు విమర్శ
తిట్టు నెచ్చెలి స్పర్శ
ఓ కూనలమ్మ
హాస్యమందున అఋణ
అందెవేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మ
ఆపరేషను శిక్ష
ఆయుధమ్ముల భిక్ష
ప్రక్కవాడికి కక్ష
ఓ కూనలమ్మ

అత్తవారిని మొక్క
అలక పానుపు యెక్క
మృగము కిందే లెక్క
ఓ కూనలమ్మ
కడకు పాకిస్థాను
కలిసె చైనాతోను
మిత్రుడా! సైతాను?
ఓ కూనలమ్మ
పడతి వలపుల కలలు
పండి వేసెడి గెలలు
వెలుగు నీడల వలలు
ఓ కూనలమ్మ
కుమతియొక్క సమీక్ష
గుబ్బ యెముక పరీక్ష
చేయువలయు ఉపేక్ష
ఓ కూనలమ్మ

ఏకపత్నీ వ్రతము
ఎలుగెత్తు మన మతము
వేల్పు భార్యలో? శతము!
ఓ కూనలమ్మ
పాలకోసము రాళ్లు
భరియించుమను వాళ్లు
తాము వంచరు వళ్లు
ఓ కూనలమ్మ
గంగగట్టున నూయి
కందకములో గోయి
త్రవ్వేను లొల్లాయి
ఓ కూనలమ్మ
ఆశ తీరని తృష్ణ
అఘము తేలని ప్రశ్న
ప్రతిభ అడవుల జ్యోత్స్న
ఓ కూనలమ్మ

బండి కూల్చెను తొల్లి
బండి తోలెను మళ్లి
దండి ­సరవెల్లి
ఓ కూనలమ్మ
మేనమామకు యముడు
మేనయత్తకు మరుడు
ఘనుడుకద మాధవుడు
ఓ కూనలమ్మ
గుడి గోడ నలరారు
పడతిదుస్తుల తీరు
ఫిల్ములో సెన్సారు
ఓ కూనలమ్మ
చలిహోమ గుండాలు
పలు సోమపానాలు
అది బార్‌-బి-క్యూలు
ఓ కూనలమ్మ

పుణ్య గాథల బూతు
బూజు పట్టిన ట్రూతు
అంతు చిక్కదు లోతు
ఓ కూనలమ్మ
గ్రోలెనే స్తన్యమ్ము
గ్రుద్దెనే ఆ రొమ్ము
వాడెపో దైవమ్ము
ఓ కూనలమ్మ
భక్తి తేనెల యేరు
పసిడి కలల బిడారు
కలసి పోతనగారు
ఓ కూనలమ్మ
తగిన సమయము చూచి
తాను వేయును పేచి
పాలిటిక్సుల బూచి
ఓ కూనలమ్మ

కులము నిచ్చెన నెక్క
గుణము కిందికి తొక్క
దివికి చేరున నక్క?
ఓ కూనలమ్మ
కటిక మూర్ఖుల క్రొవ్వు
కరగజేసెడు నవ్వు
పాప చల్లని నవ్వు
ఓ కూనలమ్మ
కసరు తేనెల వంటి
కథలు కుత్తుకబంటి
నింపు కొడవటిగంటి
ఓ కూనలమ్మ
వెన్న మీగడ పాలు
వెలది సౌందర్యాలు
బాలకృష్ణుని పాలు
ఓ కూనలమ్మ

ఎద్దు నెక్కెను శివుడు
గెద్దపై మాధవుడు
ఘనుడు మన మానవుడు
ఓ కూనలమ్మ
తెల్లవారల హజము
తెల్లవారుట నిజము
లేచె నీగ్రో వ్రజము
ఓ కూనలమ్మ
కసిని పెంచే మతము
కనులు కప్పే గతము
కాదు మన అభిమతము
ఓ కూనలమ్మ
పెరుగుచుండె అప్పు
కరుచుచుండె చెప్పు
కానుపించని నిప్పు
ఓ కూనలమ్మ

నరము లందున కొలిమి
నాగుపాముల చెలిమి
అల్పబుద్ధుల కలిమి
ఓ కూనలమ్మ
గడ్డిపోచలు పేని
గట్టి ఏనుగు నేని
కట్టువాడే జ్ఞాని
ఓ కూనలమ్మ
కయ్యమాడెడి యువతి
తియ్య విలుతుని భవతి
తనకు తానే సవతి
ఓ కూనలమ్మ
మమత పగిలే గ్లాసు
మనికి గుర్రపు రేసు
చిట్టచివరకు లాసు
ఓ కూనలమ్మ

భార్య పుట్టిన రోజు
భర్త మరచిన రోజు
తగ్గె ననుకో మోజు
ఓ కూనలమ్మ
ఎపుడొ పరిణయమైన
ఈడ వుండదు కాన
ఆడ దనబడె చాన
ఓ కూనలమ్మ
సఖుని సన్నని నఖము
చంద్రబింబపు ముఖము
గిల్లినపుడే సుఖము
ఓ కూనలమ్మ
పాదరసమును గెలుచు
పడతి చపలత వలచు
గుండెలందున నిలచు
ఓ కూనలమ్మ

అడ్డు తగిలిన కొలది
అమిత శక్తుల గలది
అబల అగునా వెలది?
ఓ కూనలమ్మ
కొత్తదంటే రోత
చెత్త పాతకు జోత
మనిషి ప్రగతికి ఘాత
ఓ కూనలమ్మ
పిలువకున్నా వెళ్లి
చెరుపజాలును పిల్లి
పలు శుభమ్ముల పెళ్లి
ఓ కూనలమ్మ
మంచి నడవడి లేక
మరులు ఎడదను లేక
మనిషి చేయడు రూక
ఓ కూనలమ్మ

చెరకు రసముల వూట
చిన్మయత్వపు తేట
యోగివేమన మాట
ఓ కూనలమ్మ
రంగు శంకల మగడు
రాజబెట్టిన నెగడు
రమణి ప్రేమకు తగడు
ఓ కూనలమ్మ
పిలిచినప్పుడు రాదు
వెడలగొట్టిన పోదు
వనిత తీయని చేదు
ఓ కూనలమ్మ
అజ్ఞులగు కాకవులు
అయిరి కాకాకవులు
మూసుకో నీ చెవులు
ఓ కూనలమ్మ

పేజి పేజికి వధలు
ప్రెజలు వొల్లని కథలు
ఆరగించును చెదలు
ఓ కూనలమ్మ
పేదలే కానిమ్ము
ప్రభువులే కానిమ్ము
చివర కవరా దుమ్ము
ఓ కూనలమ్మ
కాలవశమున మారి
చాల ముడుపులు కోరి
దేవుడే వ్యాపారి
ఓ కూనలమ్మ
జోలెకట్టె నవాబు
జాలిచూపె గరీబు
మూటకట్టె నవాబు
ఓ కూనలమ్మ

చీట్ల పేకల క్లబ్బు
చివికి కొట్టెడి గబ్బు
మధ్యతరగతి లబ్బు
ఓ కూనలమ్మ
అంతు చూసేవరకు
ఆకట! ఆంధ్రుల చురుకు
నిలువ వుండని సరుకు
ఓ కూనలమ్మ
భర్తతోడను సీత
పట్టు పట్టుటచేత
అట్లు తగలడె రాత!
ఓ కూనలమ్మ
మరచె చేసిన మేలు
చరచె పోరికి కాలు
వాడు చైనా పూలు
ఓ కూనలమ్మ

మనసు కుదరని పెళ్లి
మరుదినమ్మున కుళ్లి
సుఖము హళ్లికి హళ్లి
ఓ కూనలమ్మ
తొలుత కట్టిన బొప్పి
దొసగు వివరము చెప్పి
తొలగుజేమును నొప్పి
ఓ కూనలమ్మ
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామ కథయే రక్తి
ఓ కూనలమ్మ
బహుదినమ్ములు వేచి
మంచి శకునము చూచి
బయలుళురేరఘ హా-చ్చి
ఓ కూనలమ్మ

ఆలి కొన్నది కోక
అంతరిక్షపు నౌక
అంతకన్నను చౌక
ఓ కూనలమ్మ
పసిడి వన్నెయ తరిగె
పన్ను లెన్నియె పెరిగె
ప్రజల వెన్నులు విరిగె
ఓ కూనలమ్మ
వివిధ నీతులు గలవి
పెక్కు బుక్కులు చదివి
నేను చేసెద మనవి
ఓ కూనలమ్మ
పసిడి వన్నియు తరుగు
ప్రజల కెంతో మెరుగు
పాత మౌఢ్యము విరుగు
ఓ కూనలమ్మ

మిసిమి మెచ్చెడి తులువ
పసిడి కిచ్చును విలువ
నాకు చాలును చెలువ
ఓ కూనలమ్మ
కొంటె బొమ్మల బాపు
కొన్ని తరములసేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మ
అణువు గుండెను చీల్చి
అమిత శక్తిని పేల్చి
నరుడు తన్నున బాల్చి
ఓ కూనలమ్మ
జాలి కరుణలు మాని
ఆలి నేలని వాని
జోలి కెళితే హాని
ఓ కూనలమ్మ

నీరు యెత్తున కేగు
నిజము చాటున దాగు
నీతి నేడొక ప్లేగు
ఓ కూనలమ్మ
తమలపాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మ
రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ
పెరిగె ఇనకమ్‌ టాక్సు
పెరిగె సూపరు టాక్సు
టాక్సులేనిది సెక్సు
ఓ కూనలమ్మ

తాగుచుండే బుడ్డి
తరగుచుండే కొద్ది
మెదడు మేయును గడి
ఓ కూనలమ్మ
మనసు తెలుపని భాష
మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మ
కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ
సన్యసించిన స్వామి
చాలినంత రికామి
చాన దొరికిన కామి
ఓ కూనలమ్మ

లంచ మనియెడి పట్టి
మంచ మేమిటి గట్టి
ఇనుప మేకుల తొట్టి
ఓ కూనలమ్మ
తాను మెచ్చిన కొమ్మ
తళుకు బంగరు బొమ్మ
వలపు గుడ్డి కదమ్మ
ఓ కూనలమ్మ
ఇంటి కప్పుల నెక్కి
ఇపుడు నిజమును నొక్కి
చెప్ప మేలు హుళక్కి
ఓ కూనలమ్మ
సగము కమ్యూనిస్టు
సగము కేపిటలిస్టు
ఎందుకొచ్చిన రొస్టు
ఓ కూనలమ్మ

ఆశ పెరిగిన వాడు
అహము పెరిగిన నాడు
తనకు తానే కీడు
ఓ కూనలమ్మ
గుడిని వీడెను శివుడు
గోడ రాలును చవుడు
కానడే మానవుడు
ఓ కూనలమ్మ
మంచి గంధపు చలువ
మంట వేండ్రపు నిలువ
కుంట నున్నదె చెలువ
ఓ కూనలమ్మ
కావ్య దుగ్ధము పితుక
కఠిన హృదయమె చితుక
ఖలుడు కూడా మెతుక
ఓ కూనలమ్మ

పన్ను వేయని ప్రభుత
పన్ను హ్యూమరు కవిత
ప్రజల కెంతో మమత
ఓ కూనలమ్మ
పిల్ల నిచ్చినవారి
పీకమీద సవారి
చేయూ అల్లుడె మారి
ఓ కూనలమ్మ
పెద్ద జంతువు దంతి
వెడద దంతుల దొంతి
సమము ఒక్క వదంతి
ఓ కూనలమ్మ
ఈసు కన్నుల దోయి
చూచు చెడుపుల వేయి
గుడ్డి ప్రేమే హాయి
ఓ కూనలమ్మ

నీవు పలికిన రీతి
నేను పాడెద నీతి
నీకు చెందుత ఖ్యాతి
ఓ కూనలమ్మ
రాక్షసత్వము పోయి
రాచరికములు పోయి
ప్రజలదే పైచేయి
ఓ కూనలమ్మ
పొరుగు దేశము లిచ్చు
పుల్ల ఇజముల మెచ్చు
మూర్ఖ మెప్పుడు చచ్చు
ఓ కూనలమ్మ
పొరుగు పొలముల హద్దు
పరుల రాజ్యపు హద్దు
దాటువాడే మొద్దు
ఓ కూనలమ్మ

చిన్ని పాదము లందు
చివరి ప్రాసల చిందు
చేయు వీనుల విందు
ఓ కూనలమ్మ
జాతి ఛందము లోన
నీతి చెప్పెడు జాణ
మీటు హృదయపు వీణ
ఓ కూనలమ్మ
పెను సమాసము లున్న
పెద్ద వృత్తముకన్న
చిన్న పదమే మిన్న
ఓ కూనలమ్మ
పరుల మేరును కోరి
పదము లల్లెడువారి
పథము చక్కని దారి
ఓ కూనలమ్మ
Home
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net