Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu


శివ ధనుస్సు విశేషాలు
శివ ధనుస్సును విరిచి సీతమ్మను చేపట్టాడు శ్రీరాముడు. ఇంతవరకూ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ శివధనుస్సు ఎక్కడిది? ఎందరెందరో గొప్ప గొప్ప రాజులు సైతం కదల్చలేని ఆ విల్లును శ్రీరాముడు ఎక్కుపెట్టి విరిచినప్పుడు జరిగిన విశేషాలేమిటి? అనే విషయాలను తెలియజెప్పే ఈ కథా సందర్భం వాల్మీకి రామాయణం బాలకాండ అరవై ఆరు, అరవై ఏడు సర్గలలో ఉన్న విషయ సార సంగ్రహం. ఈ సర్గలో జనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి శివ ధనుస్సు తన దగ్గరకు ఎలా వచ్చిందో తెలియచెప్పాడు.

విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులను వెంట పెట్టుకుని లోక కంటకులైన రాక్షసులను వారి చేత సంహరింప చేశాడు. ఆ తర్వాత వారిని వెంట పెట్టుకొని వెళుతూ వెళుతూ మిధిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ మిథిలాధిపతి చేత పూజలందుకున్న తర్వాత తన పక్కనున్న రామ లక్ష్మణులను ఆ రాజుకు పరిచయం చేశాడు. జనకుడి దగ్గరున్న శ్రేష్టమైన ధనుస్సును ఆ రాజకుమారులిద్దరూ చూడాలనుకొంటున్నారని, కనుక వారికి ఆ ధనుస్సును చూపిస్తే వారి ముచ్చట తీర్చుకొని వెళతారని అన్నాడు. అప్పుడు జనకుడు అలాగేనని చెప్పి ముందుగా ఆ చాపం తన ఇంటికి ఎలా వచ్చిందో ఇలా వివరంగా చెప్పాడు.

నిమి వంశంలో ఆరో చక్రవర్తి అయిన దేవరాతుడు అనే మహారాజుండేవాడు. ఆ మహారాజు గొప్ప శివభక్తుడు. ఆ భక్తికి మెచ్చిన మహేశ్వరుడు తన దగ్గరున్న ఒక ధనుస్సును ఉంచమని దేవరాతుడికి ఇచ్చాడు. అదే శివధనుస్సు. ఆ తర్వాత కొన్నాళ్ళకు దక్షయజ్ఞం జరిగింది. ఆ యజ్ఞంలో శివుడు తనకు జరిగిన అవమానానికి ప్రతిగా దేవరాతుడి దగ్గర తానుంచిన ధనుస్సును తీసుకుని తనను అవమానించిన వారిని సంహరించాలనుకున్నాడు. అయితే ఆ పరిస్థితి గమనించిన దేవతలంతా తమను రక్షించమని శివుడిని వేడుకోవటంతో ఆ ప్రార్థనలకు చల్లబడిన శివుడు తన చేతిలోని ధనుస్సును దేవతలకే ఇచ్చి వెనుతిరిగాడు. దేవతలా ధనుస్సును తిరిగి దేవరాతుడికే ఇచ్చారు. అలా తరతరాలుగా ఆ శివ ధనుస్సు తన వంశం వారికే దక్కుతూ వస్తోందని మిధిలాధిపతి విశ్వామిత్రుడికి తెలియచెప్పాడు. ఆ శివ ధనుస్సును తాను నిత్యం గంధ పుష్పమాలికలతో పూజిస్తుండాలన్నాడు. తనకు నాగటి చాలులో దొరికిన సీతకు ఆ శివ ధనుస్సును ఎక్కుపెట్టగల మహావీరుడినే ఇచ్చి వివాహం చేయాలని అనుకొంటున్నానని అన్నాడు. శ్రీరాముడు ఆ ధనుస్సును ఎక్కుపెడితే అయోనిజ అయిన సీత రాముడికి భార్యగా అవుతుందని ఎంతో ఆనందంగా అన్నాడు జనకుడు. ఆ తర్వాత ఆయన తన మంత్రులను పిలిచి శివ ధనుస్సును తన దగ్గరకు తెమ్మన్నాడు. ఆ రాజు ఆజ్ఞననుసరించి బలిష్టులు, దీర్ఘకాయులు అయిన ఐదు వేల మంది పురుషులు ఎనిమిది చక్రాల శకటం మీద ఉన్న పేటికలో భద్రపరిచిన ధనుస్సును ఎంతో శ్రమతో అక్కడకు మెల్లగా లాక్కొంటూ వచ్చారు. ఆ ధనుస్సు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకరించి ఉంది. దాన్ని రామలక్ష్మణులకు చూపించదలచి బ్రహ్మర్షి విశ్వామిత్రుడితోనూ, రామలక్ష్మణులతోనూ జనకుడు ఇలా అన్నాడు.

‘‘మా పూర్వీకులైన మహారాజులందరూ పూజిస్తూ వచ్చిన దివ్యధనువిది. సీతా దేవిని వివాహ మాడగోరి మహా వీరులైన రాజులు ఈ మహాధనుస్సును ఎక్కుపెట్టలేక చతికిలపడ్డారు. దీన్ని వంచటానికి అల్లెతాడును కూర్చటానికి, బాణాన్ని సంధించటానికి ఆ తర్వాత అల్లెతాడును లాగటానికి కనీసం ఈ శివధనుస్సును ఎత్తటానికి కూడా ఇంతవరకూ ఎవరికీ సాధ్యపడలేదు. సమస్త దేవతలు, అసురులు, రాక్షసులు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, నాగులు... ఇలా ఎవరూ ఈ ధనుస్సును ఎత్తలేకపోయారు. ఈ ధనుస్సును ఎక్కుపెట్టిన మహా పరాక్రమశాలికే సీత దక్కుతుంది’’ అని జనకుడు శివధనుస్సు విశేషాలు వివరించాడు.

ఆ మాటలను విన్న తర్వాత విశ్వామిత్రుడు ఆ ధనుస్సును చూడమని రాముడితో అన్నాడు. శ్రీరాముడు ఆ మాట వినగానే ధనుస్సును భద్రపరిచిన భారీ ఇనుప పేటికను తెరిచి మరొక్కమారు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను తీసుకొని పేటికలోని చాపాన్ని చేతితో అవలీలగా పైకెత్తి వింటి నారిని సంధించి ఆకర్ణాంతం ఒకే ఒక్కసారి లాగాడు. వెంటనే ఆ విల్లు ఫెళ్ళున విరిగింది. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటులా భయంకరంగా వినిపించింది. ఆ సమయంలో వేలాది మంది అక్కడ ఉన్నారు. అక్కడున్న వారందరికీ పర్వతాలు బద్ధలైనట్లు, భూమి కంపించినట్టు అనిపించి అందరూ మూర్ఛపోయారు. విశ్వామిత్రుడు, జనకుడు తప్ప మిగిలిన వారందరికీ అంతటి భయభ్రాంతులు కలిగాయి. శ్రీరాముడు తనకు అల్లుడు అవుతాడో కాడో అని కలవరపడుతున్న జనకుడి మనస్సు కుదుటపడింది. ఆ తర్వాత ఆయన విశ్వామిత్రుడికి నమస్కరిస్తూ అనుమతిస్తే తన మంత్రులను దశరథ మహారాజు దగ్గరకు పంపి ఆ శుభవార్తను తెలియపరచి మిథిలకు ఆహ్వానిస్తానన్నాడు. విశ్వామిత్రుడు అందుకు ఆమోదించటంతో జనకుడు తన మంత్రులను పిలిచి వారికి శుభాహ్వాన పత్రికలను అందించి దశరథ మహారాజును సగౌరవంగా ఆహ్వానించి తీసుకురమ్మని అయోధ్యకు పంపాడు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net