Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


సర్వపాప హరం గోవ్రతం
భారతావనిలో గోమాత దేవతా స్థానాన్ని అలంకరించి ఉంది. కన్నతల్లికి సమానురాలిగా గోమాత పూజలందుకొంటూ ఉంటుంది. ఈ గోమాతకు సంబంధించిన ఒక దివ్యవ్రతం యుగయుగాలుగా ఆచరణలో కనిపిస్తోందని శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణం తృతీయ ఖండం రెండు వందల తొంభై ఒకటో అధ్యాయంలోని ముఫ్పై ఒక్క శ్లోకాలు వివరించి చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని గొప్ప గొప్ప చక్రవర్తులు సైతం నిర్వహించి తాము తెలిసీతెలియక చేసిన పాపాలన్నిటినీ పోగొట్టుకొని ఉత్తమ పుణ్యఫలాలను సంపాదించుకొన్నారు.

నెల రోజులపాటు గోవ్రతం లేక గో శుశ్రూష అనేది జరుపుతుంటారు. గోవులు లేచి నిలిచినప్పుడు వ్రతం చేసే వ్యక్తి కూడా లేచి నిలుచోవాలి. అవి కూర్చున్నప్పుడే అతడు కూడా కూర్చోవాలి. గోవులు తినేటప్పుడు తినటం, తాగేటప్పుడు తాగటం ఇవన్నీ శుశ్రూషలో భాగాలు. వ్రత సమయంలో గోమూత్రంతో స్నానం చేయటం, గో పురీషంతోనూ, ఆవుపాలు, పెరుగు నెయ్యి అనే గోరసాలతోనూ యవధాన్యాన్ని కలుపుకొని ఆహారంగా తీసుకోవాలి. ఇలా ఒక్క మాసం రోజులు జరిపితే కల్మషాలన్నీ నశిస్తాయి. ఒక్క గోవును నెలపాటు తన దగ్గర ఉంచుకోవాలి. దానికి యవధాన్యాన్ని ఆహారంగా పెడుతుండాలి. మాసాంతంలో ఆ గోవును ఉత్తముడు, అర్హుడైన విప్రుడికి దానం ఇవ్వాలి. ఇలా చేసిన వారికి రాజసూయ, అశ్వమేథ యాగాలు చేసిన ఫలితంకంటే గొప్ప పుణ్యఫలితం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరతాయి. జన్మాంతంలో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మూడు రోజులుకానీ, ఏడు రోజులుకానీ గోవుకు యవధాన్యాన్ని దాణాగా పెట్టి గోవుతినగా మిగిలిన యవలను తాను ఆహారంగా తీసుకొన్నా పాప విమోచనం కలుగుతుంది. మహాపుణ్యఫలం దక్కుతుంది. గోవుల గిట్టల నుంచి ఎగిరిన ధూళి సర్వపాప నాశకరం, గో ధూళి లేచిన ప్రదేశం పవిత్రమూ, ఉత్తమోత్తమం. అది దరిద్రాన్ని నశింపచేస్తుంది కూడా.

గోవులు పరమ పవిత్రాలు, మంగళప్రదాలు. అందుకే ఈ గోవ్రతం లాంటి వ్రతాలు ఆచరణలోకి వచ్చాయి. గోవులలో సర్వలోకాలూ నిలిచి ఉన్నాయి. అంటే గోవుల మూలంగానే లోకప్రవృత్తి అంతా జరుగుతుంది. దేవతలు, వేదాలు ఎంత పవిత్రాలో గోవులూ అంతే. సర్వలోకాల వారికీ అవి సుఖాలను కలిగిస్తుంటాయి. ఈ విషయాన్ని సర్వశాస్త్రాలూ పేర్కొంటున్నాయి. ఒక్కో గోవు వేదమంత్రాలకు ఆర్ష వ్యాఖ్యానం చెప్పిన ఒక్కో బ్రాహ్మణంతో సమానం. బ్రాహ్మణాలనే వేద భాగాలలాగానే ఆవుల మీద కూడా యజ్ఞాలన్నీ ఆధారపడి ఉన్నాయి. యజ్ఞాలకు కావల్సిన నెయ్యి రూపంలోని హవిస్సు ఆవుల వల్లనే లభిస్తోంది. గోదానం, సర్వపాపాలనూ పోగొడుతుంది. గోమూత్రం, గోమయం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి అనే ఈ ఐదూ మనుషులకు శుద్ధిని కలిగించే ఉత్తమ ద్రవ్యాలు. ఆయుర్వేద శాస్త్రం కూడా ఈ ఐదు ద్రవ్యాల గురించి చాలా చోట్ల వివరించి చెప్పింది. ఈ ఐదింటినీ కలిపి పంచగవ్యం అని అంటారు. పంచ గవ్యాన్ని స్వీకరించటం వల్ల శరీరానికి మేలు కలిగించే ఓషధులను తీసుకొన్నట్టే అవుతుంది. ఆవుల కొమ్ముల మీద ఉంచిన జలం గంగాజలంతో సమానం. ఆవులను చేతితో దువ్వి వాటి దురదను పోగొట్టిన వారికి సర్వపాపాలూ నశిస్తాయి. వాటికి గడ్డిని సమకూర్చటం పుణ్యకార్యం. ఆవులకోసం మేత ఉన్న బీడును, నీటికోసం జలాశయాన్ని ఏర్పరచటం వల్ల కొన్ని సంవత్సరాల పాటు స్వర్గవాస ఫలం దక్కుతుంది. ప్రత్యేకంగా గోవులకోసం మేత ఉండే బీడును దానం చేయటం వల్ల అశ్వమేథయాగం చేసినంత ఫలం దక్కుతుంది. ఆవులకు నివాసయోగ్యంగా ఉండే శాలను ఇచ్చినవారు నగరాధిపతి అయ్యేందుకు తగిన పుణ్యఫలాన్ని సంపాదించుకొంటారు. ఆవులకు ఉప్పుతో గరికలాంటి ఓషధీ పత్రాలను కలిపి తినిపించటం వల్ల వాటికి ఆరోగ్యం సమకూరుతుంది. ఇలా చేసిన వారికి వ్యాధులు దూరమవుతాయి. ఇబ్బందులలో పడ్డ ఆవులను విడిపించటం, బురదలో కూరుకుపోయిన, పులులు లాంటి జంతువుల వల్ల ప్రమాదాన్ని పొందబోయే ఆవులను రక్షించటం వల్ల కూడా అశ్వమేథయాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఆవులకు ఔషధ దానాన్ని చేసిన దాత రోగ రహితుడు గానూ, వాటికి భయాన్ని పోగొట్టిన వారు భయ రహితులుగాను అవుతారు. కటికవాడి చేతి నుంచి ఆవునుకొని దాన్ని మృత్యువు నుంచి తప్పిస్తే గోమేధ పుణ్యఫలం పొందవచ్చు. ఆవులకు చలి, ఎండ నుంచి రక్షణ కల్పించటం స్వర్గప్రాప్తికరం. గోవులు నివసించిన భూమి శుద్ధి పొంది ఉంటుంది. గోవులు నిలిచి ఉండే గృహం ఎంతో పవిత్రమైంది. ఆవులు పీల్చి వదిలిన గాలి, వాటి స్పర్శ కూడా పుణ్యప్రదాలే. గోస్పర్శ వల్ల దుస్వప్నాల ఫలితాలు నశిస్తాయి. ఆవు తలను, మెడను కలిపేలా ఉండే చోట గంగ నిలిచి ఉంటుంది. అందుకే దాన్ని గంగడోలు అని అంటుంటారు. ఒక్క గంగ మాత్రమే కాక ఆవులో సర్వతీర్థాలు, సర్వదేవతలు నిలిచి ఉండటం విశేషం. వాటి రోమాలు పవిత్రాలు, పుణ్యవ్రతాలు. ఆవు పేడతో అలికిన ప్రదేశాన్ని మించిన శుచి అయిన ప్రదేశం మరొకటి ఉండబోదు. అందుకే యజ్ఞశాలలు, దేవతా గృహాలను ఆవుపేడతో అలకటం కనిపిస్తుంది. గోమయం (ఆవుపేడ)లో స్వయంగా లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. గో మూత్రంలో గంగ, ఆవుపాలు, పెరుగు, నెయ్యిలలో సోమరసం, గోరోచనంలో సాక్షాత్తూ సరస్వతీదేవి ఉండటం విశేషం. విష్ణువు యజ్ఞరూపుడు. అలాంటి యజ్ఞం గోవులలో ఉంటుంది. అందుకే గోవును సాక్షాత్తూ విష్ణురూపంగా రుషులు భావిస్తుంటారు. ఇలాంటి గోవుకు నమస్కరించటం, ఆవులకు ఆహార దానాన్ని, సేవలను అందించటం వల్ల మానవాళికి దుఃఖాలు నశిస్తాయి. ప్రయత్న పూర్వకంగా గో శుశ్రూషను, గో వ్రతాన్ని చెయ్యటం మేలు అనే ఈ విషయాలను గురించి మత్స్య పురాణంలో హంసరూపంలోని భగవంతుడు రుషులకు వివరించి చెప్పాడు. ఆవులో మానవుల ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నెన్నో ఓషధ విలువలు ఉన్నాయని ఈనాటి శాస్త్రవేత్తలు వివరించి చెబుతున్నారు. ఇంత విలువైనది కనుకనే భారతావనిలో ఆవు దేవతగా, సాక్షాత్తు కన్నతల్లిలాగా పూజలందుకొంటోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

తెలుగులో నా ఆఖరి సినిమా వంగవీటి

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన చేశారు. తెలుగులో తన ఆఖరి సినిమా......

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net