Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


అంతగొప్పది ఆ నగరం
సందర్శిస్తేనే చాలా పుణ్యాన్ని ప్రసాదించే నగరాలు కూడా మనకున్నాయి. కాశీ నగరం లాంటి ఆ నగరాల వరుసలో అయోధ్య కూడా ఉంది. రామాయణం ప్రారంభంలో అయోధ్యానగర నైసర్గిక స్వరూపం వర్ణితమై ఉంది. ఆ తర్వాత అయోధ్యకాండ నూరోసర్గలో రాముడి మాటల్లోనే ఆ నగర పవిత్రత, విశేషాలు లాంటివన్నీ కనిపిస్తాయి. వనవాసం చేస్తున్న తనను వెతుక్కుంటూ తమ్ముడు భరతుడు వచ్చినప్పుడు అయోధ్యా నగరం, కోసల దేశప్రజల మంచితనం లాంటివన్నీ ఓసారి గుర్తుచేసుకుంటూ ఆ నగరం అంతా బాగానే ఉంది కదా అని రాముడు కుశలం అడిగిన సందర్భంలోనిది ఈ కథా సందర్భం. ఇక్ష్వాకు వంశంలోని రాజులంతా అసహాయశూరులు. వారందరికీ నెలవు కావటం వల్లనే అయోధ్యానగరం శత్రుదుర్భేద్యంగా రూపొందింది. ఆ నగరానికి నాలుగు వైపులా ఉన్న ద్వారాలు ఎంతో దృఢమైనవి. అది రథ, అశ్వ, గజ బలాలతో ఎప్పుడూ నిండి ఉంటుంది. ఆ నగరంలోని ప్రజలంతా నిరంతరం తమ తమ ధర్మ కార్యాలలో నిమగ్నమై ఉంటారు. వారు జితేంద్రియులు. పనులు చేయటంలో ఎప్పుడూ బద్ధకించక ఉత్సాహాన్ని చూపుతుంటారు. అందుకే అయోధ్యానగరంలో నివసించే ప్రజలంతా ఇతర ప్రాంతాలలోని వారందరికీ పూజ్యులు, ఆదర్శప్రాయులు అని పేరు పొందారు. అయోధ్యలో వివిధ ఆకారాలు గల రాజభవనాలు, మందిరాలు, ఎన్నెన్నో. అవన్నీ ఆ నగర శోభను ఇనుమడింపచేస్తూ ఉంటాయి. అసంఖ్యాకులైన విద్వాంసులు అక్కడుంటారు. సమస్త సంపదలకు ఆ నగరం నిలయం. ప్రజల సుఖసంతోషాలకు అవధి లేనేలేదు. ఆ అయోధ్యానగరం ఉన్న కోసలదేశ ప్రతిభ, పవిత్రతలు కూడా అసామాన్యాలే. అశ్వమేథాది మహాయజ్ఞాలను ఎందరెందరో అక్కడ ఆచరించారు. తరతరాల ప్రజలకు ఆయురారోగ్య భాగ్యాలను పంచి ఇచ్చే దివ్యభూమి కోసల దేశం. ఆ దేశంలో ప్రజలకు భక్తి ప్రపత్తులను పెంపొందింప చేయటానికి కోకొల్లలుగా దేవాలయాలు ఉన్నాయి. బాటసారుల దాహాన్ని తీర్చటానికి, వారికి హాయి కలిగించేందుకు చలివేంద్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ప్రజల స్నానపానాది అవసరాలను తీర్చేందుకు పరిశుభ్రమైనవి, కంటికి ఇంపుగా ఉండేవి అయిన చెరువులు ఆ దేశంలో ఎన్నెన్నో. స్త్రీ, పురుషులు అంతా హాయిగా విహరించేందుకు అనువుగా ఉద్యానవనాలు లాంటివి అక్కడ ఉన్నాయి. అయోధ్య ధర్మనిర్ణయ సభలతోనూ, సమాజానికి మేలు కలిగించే ఉత్సవాలతోనూ ఆ నగరం నిత్యం విలసిల్లుతూ ఉంటుంది. పాడి పంటలు ఎప్పుడూ కళకళలాడుతుంటాయి. హింసాపూరితమై కార్యాలకు అక్కడ చోటే లేదు. కోసల దేశంలో ఎక్కడ చూసినా ఎప్పుడూ పంటలు కళకళలాడుతూ ఉంటాయి. కేవలం వర్షం మీదనే ఆధారపడి కూర్చోక ప్రజలు, ప్రజా పాలకులు ఇతర నదీజలాల సౌకర్యాలతో పంట భూములకు నీరందించే ఏర్పాట్లు జాగ్రత్తగా చేస్తుంటారు. అందుకే కోసలదేశంలో ప్రతిచోటా వర్షం పడినా, పడకపోయినా సస్యశ్యామలంగా, రమణీయంగా కనిపిస్తూ ఉంటుంది. క్రూర జంతువుల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలుగకుండా రాజు జాగ్రత్తలు తీసుకొంటుంటాడు. అగ్నిభయం, చోరభయం లాంటి బాధలు అక్కడి ప్రజలకు ఏనాడూ లేవు. ఆ దేశం వివిధ ఖనిజ సంపదలకు నిలయం. అంత గొప్పగా అయోధ్యానగరం కానీ, ఆ నగరం ఉన్న కోశల దేశం కానీ ఉండటానికి కారణం అక్కడి ప్రజలు, పాలకులు పాపరహితులు గానూ, ధర్మమార్గాన్ని ఆచరించే వారు గాను అయి ఉండటమే. ఆ దేశంలో వ్యవసాయం, పశుపాలన, వాణిజ్యం లాంటి వృత్తులు చేసే వారంతా రాజుకు ప్రీతిపాత్రులుగా ఉంటుంటారు. అందుకే అక్కడి వ్యాపార, వాణిజ్యాల అభివృద్ధి సక్రమంగా జరుగుతూ ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లుతుంటారు. ఇలాంటి విషయాలను శ్రీరామచంద్రుడు భరతుడు కనిపించగానే ఒక్కసారి గుర్తుతెచ్చుకొని ఆ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి కదా అని కుశలం అడిగాడు. అలాంటి పరిస్థితులున్న ఏ నగరమైనా, ఏ దేశమైనా ఎప్పుడూ అందరికీ ఆదర్శప్రాయంగానే ఉంటుందని అలా తమ తమ నగరాలనూ, దేశాలనూ, ప్రజలు, పాలకులు ఇద్దరూ కలిసి తీర్చిదిద్దుకుంటే అదే రామరాజ్యమవుతుందని సూచిస్తోంది ఈ కథా సందర్భం.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net