Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


ధర్మం తప్పితే దెబ్బ తప్పదు
ర్మానికి క్షతి కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మోద్ధరణ చేస్తానంటాడు భగవానుడు. ధర్మం చాలా సూక్ష్మమైనది. ధర్మానికి కలిగే నష్టాన్ని భగవానుడు గమనించగలడు. ధర్మాన్ని దెబ్బ కొట్టినవారికి బుద్ధి చెప్పగలడు. మళ్లీ ధర్మాన్ని ప్రతిష్ఠించగలడు. ఇదంతా దేవునికే సాధ్యం. ఇటువంటి ధర్మోద్ధరణకు సంబంధించిన కథే శ్రీహరి అంశావతారాల్లోని ఒకటైన పరశురామావతారంలో స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాల్ని భాగవతం తొమ్మిదో స్కంధం ఇలా తెలుపుతోంది.

పూర్వం హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే ఓ రాజుండేవాడు. ఆయన దత్తాత్రేయుడిని ఆరాధించి ఆ స్వామి కృపవల్ల శత్రువిజయం, వెయ్యి చేతులు, అణిమాదిసిద్ధులు, యశస్సు, ఓజస్సు, తేజస్సు, మంచి ఇంద్రియ పటుత్వం లాంటి వరాలన్నింటినీ పొందాడు. ఆ వరాలతో లోకాలన్నీ తిరుగుతూ తన ప్రతాపాన్ని ప్రకటించుకొంటుండేవాడు. ఓ రోజు ఆ కార్తవీర్యార్జునుడు తన చతురంగ బలాల్ని వెంటపెట్టుకొని వేటకోసం అడవికి వెళ్ళాడు. అడవిలో బాగా తిరిగి అలసిపోయాడు. ఆకలి, దప్పికలతో ఉన్న అతడికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. మహర్షి దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించాడు కార్తవీర్యార్జునుడు. ఆయన కూడా ప్రజాపాలకుడైన రాజు తన ఆశ్రమానికొచ్చినందుకు ఆదరించి ఆనందించాడు. భోజన వేళకొచ్చిన ఆ రాజుకు, పరివారాని కంతటికీ చక్కటి భోజనం ఏర్పాటు చేయాలని అనుకొన్నాడు జమదగ్ని. వెంటనే ఆయన తన హోమథేనువు సహాయంతో కార్తవీర్యార్జునుడికి, అతడి వెంట వచ్చిన వారందరికీ చక్కగా తృప్తిగా రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాట్లు చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. అప్పటి దాకా అక్కడ భోజన పదార్థాలు వండటం కోసం పొయ్యి వెలిగించటం, పాత్రలు పెట్టడంలాంటి ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. కానీ క్షణాల్లో అంతమందికీ షడ్రశోపేతమైన భోజనాలు సిద్ధమయ్యాయి. ఇదెలా సాధ్యమైంది అనుకొన్నాడు రాజు. తన సందేహాన్ని మంత్రుల ముందు ఉంచాడు. వారు రాజుకు జమదగ్ని దగ్గరున్న హోమథేనువు గురించి చెప్పారు. ఆ థేనువు ప్రభావం వల్లనే అంతటి అద్భుతం జరిగిందని, అది కామధేనువని మంత్రులు చెప్పిన దగ్గర నుంచి రాజు మనస్సు మనస్సులో లేదు. తన దగ్గర ఎన్ని సంపదలు ఉండి ఏం లాభం. అవన్నీ ఒక ఎత్తైతే ఈ ఒక్క కామధేనువు ఒక ఎత్తు. ఇలాంటి ధేనువు ఒక్కటుంటే చాలు అని అనుకొన్నాడు. కానీ కార్తవీర్యార్జునుడు ఆ సమయంలో తాను ధర్మాన్ని తప్పుతున్నట్టు మర్చిపోయాడు. తాను రాజు కనుక తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చని, అన్నీ తనవేనని అధర్మ మార్గంలో ఆలోచించాడు. ఆ గోవును పట్టి తెమ్మని తన భటుల్ని ఆజ్ఞాపించాడు. ఆ భటులు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి కామధేనువు విలపిస్తూ రానని మొండికేసినా బలవంతంగా దాన్ని లాక్కువెళ్ళారు. అలా వెళ్ళేటప్పుడు జమదగ్ని ఎంత అడ్డుపడ్డా ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఆ సమయానికి జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఆశ్రమంలో లేడు. రాజభటులు ధేనువును లాక్కువెళ్ళిన కొద్దిసేపటికి ఆశ్రమానికొచ్చాడు. వచ్చీరాగానే జరిగిన దుర్మార్గమూ, అధర్మమూ అంతా తెలుసుకొని కోపోద్రిక్తుడయ్యాడు. ఆకలిగొని వచ్చి తన తండ్రి పెట్టిన భోజనాన్ని తిని దౌర్జన్యంగా కామధేనువును అపహరించిన రాజును విడిచిపెట్ట కూడదనుకొన్నాడు. వెంటనే కవచాన్ని, గండ్రగొడ్డలిని, అమ్ములపొదిని, విల్లంబుల్ని ధరించి ప్రళయాగ్నిలాగా కార్తవీర్యార్జునుడున్న మాహిష్మతీపురానికి వెళ్ళాడు. పరశురాముడొచ్చిన విషయాన్ని కార్తవీర్యార్జునుడు తెలుసుకొని తన సేనాధిపతులను, చతురంగ బలాలతో కూడిన పదిహేడు అక్షౌహిణుల సైన్యంతో అతడి మీదకు పంపాడు. అంతటి సైన్యాన్ని ఒక్కడుగా పరశురాముడు తుత్తునియలు చేశాడు. ఎదురులేని బాణవర్షం అనే నెయ్యితో మండుతున్న ఆయన కోపాగ్నికి యుద్ధరంగంలోని గుర్రపురౌతులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు సకల శత్రుసేనలు దగ్ధమయ్యాయి. చిట్టచివరకు కార్తవీర్యార్జునుడు మిగిలాడు. ఒక్కడొచ్చి ఇంతటి సైన్యాన్ని నాశనం చేశాడు కనుక తానిక ­రుకోకూడదని కార్తవీర్యార్జునుడు ఉత్సాహంతో కదనానికి కదిలాడు. ముందుగా తనకున్న అయిదు వందల చేతులతో ధనుస్సుల్ని ధరించాడు. మిగిలిన అయిదు వందల చేతులతో ధనుస్సుల అల్లెత్రాళ్ళను లాగి బిగించి వాటికి వాడి అయిన బాణాల్ని సంధించాడు. అన్ని బాణాలతోనూ ముందుగా పరశురాముడిని చుట్టుముట్టాడు. విలువిద్యలో మేటి అయిన ఆ జమదగ్ని కుమారుడు తన ధనుస్సును ఎక్కుపెట్టి ఆ రాజు ధనుస్సులన్నింటినీ ఒక్కసారే ముక్కలయ్యేలా చేశాడు. రాజు ­రుకోక పరిసరాలలోని పెద్దపెద్ద చెట్లను పెకలించి విసిరాడు. దాంతో పరశురాముడు విజృంభించి తన గండ్రగొడ్డలితో అతడి వెయ్యిచేతుల్ని నరికేశాడు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు నేలకూలటంతో అతడి పక్షంలోని వారంతా చెల్లాచెదురై పారిపోయారు. అప్పుడు పరశురాముడు ఆ రాజభటులు బలవంతంగా తీసుకొచ్చిన కామధేనువును, దాని దూడను వెంటపెట్టుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు.

ఈ కథా సందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. కార్తవీర్యార్జునుడు లోభగుణానికి గురై తనను ఆదరించి అన్నం పెట్టిన రుషికే అన్యాయం చేశాడు. అలాంటి అధర్మబుద్ధులు ఆ రోజుల్లో అధికసంఖ్యలో ఉండి భూభారాన్ని పెంచినందువల్లనే భగవానుడు పరశురాముడి అవతారంలో వచ్చి భూభారాన్ని తగ్గించాడు. కార్తవీర్యార్జునుడు సామాన్యుడేమీ కాదు. రావణాసురుడంతటి వాడినే ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు. అంతటి వీరుడు కూడా అధర్మానికి పాల్పడినందువల్లనే కేవలం ఒక్కడి చేతిలో అంతమైపోయాడు. ధర్మాన్ని దెబ్బకొట్టిన వారిని భగవానుడు దెబ్బతీయక మానడు. అనే సత్యాన్ని ప్రకటిస్తుంది ఈ కథ.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net