Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


సర్వం.. శివ సర్వస్వం
శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఎందుకంటే ఈ సకల చరాచర జగత్తంతా ఆయనకు సంబంధించినదే. ఆ సర్వేశ్వరుడు అనేకానేక సందర్భాలలో తన దైవత్వాన్ని చాటిచెప్పటం కనిపిస్తుంది. ఆ సందర్భాలలో పరమేశ్వర తత్వం ఆవిష్కృతమవుతూ ఉంటుంది. అప్పుడు మనకు కనిపిస్తున్న సర్వస్వం ఆ శివుడికి చెందినదే కానీ మనది కాదు సుమా! అందుకే జగత్తంతా ఆయనకు లోబడి ఉంటుంది అనే భావన కలుగుతుంది. అలాంటిటి శివుడికి సంబంధించిన కథ ఇది. సర్వం శర్వమయమే. ఆ శర్వుడే ఎవరికి కావలసినది వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు అనే విషయాన్ని తెలియజెప్తుంది ఈ కథా సందర్భం. కృష్ణదర్శనుడు... ఈ పేరు కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. దీనికి అర్థం నల్లని కళ్ళున్నవాడు అని. ఇంతకీ ఈ నల్లని కన్నులవాడు ఎవరై ఉంటారని అనుకొంటే... పరమేశ్వరుడు అని సమాధానమిస్తూ ఆ కృష్ణదర్శనుడి అవతార విశేషాలను వివరిస్తోంది శివపురాణం శతరుద్ర సంహితలోని అరవై తొమ్మిదో అధ్యాయం. మనిషి నా ఇల్లు, నా సంపద అని తనకు సంబంధించిన వాటి గురించి నిరంతరం కలవరిస్తుంటాడు. ఇంతకీ మనిషికి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలవన్నీ ఎవరివి? అనే ఓ ప్రధాన విషయాన్ని వివరించి చెబుతుంది ఈ కథ.

పూర్వం శ్రాద్ధదేవుడు అనే మనువు ఉండేవాడు. ఆయనకు ఇక్ష్వాకువు, తదితర తొమ్మిది మంది కుమారులు కలిగారు. వారిలో నభగుడు అనే వాడు చివరివాడు. నభగుడు చిన్నప్పుడే విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళాడు. ఇలా చాలా కాలం గడిచింది. శ్రాద్ధదేవుడికి వయసు మీరటంతో అతడి దగ్గర ఉన్న ఎనిమిది మంది కుమారులు ఆస్తినంతా సమంగా పంచుకున్నారు. ఆ పంపకాలలో నభగుడి విషయాన్ని ఆ ఎనిమిది మంది విస్మరించారు. కొంతకాలం తరువాత వేదవిద్యనంతటినీ అభ్యసించి నభగుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తన సోదరులు ఎనిమిది మంది ఆస్తినంతా సమ భాగాలుగా పంచుకొని అనుభవిస్తూ ఉండటాన్ని చూసి తన వాటా సంగతి ఏమిటని అడిగాడు. ఆ సోదరులకు ఏమి చెప్పాలో తెలియక నీ వాటా కింద తండ్రి శ్రాద్ధదేవుడిని ఇస్తున్నాము వెళ్ళి తీసుకో అని చెప్పారు. నభగుడు అమాయకంగా తండ్రి వద్దకు వెళ్ళి అదే విషయాన్ని చెప్పాడు. శ్రాద్ధదేవుడు ఎనిమిది మంది కుమారులు అలా ప్రవర్తించటాన్ని నిరసించాడు. అయినా మంచికో, చెడుకో నభగుడికి వాటా కింద తనను పంచారు కనుక తానే ఏదో ఒక మంచి ఉపాయాన్ని చెప్పి నభగుడికి మేలు చేయాలనుకొన్నాడు. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అంగిరసుడి కుమారులు ఆ రోజుల్లో ఒక పెద్ద యాగం చేస్తున్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఆ యాగం సంపన్నం కావటానికి కావలసిన అగ్ని సూక్తాలను అక్కడకు వెళ్ళి పఠించమని శ్రాద్ధదేవుడు నభగుడికి చెప్పాడు. అలా చేస్తే అంగిరసుడి కుమారులు గొప్ప సంపదలను ఇస్తారని, వాటితో సుఖంగా ఉండమని చెప్పాడు.

తండ్రి మాటలను ఆలకించి ఆ యాగం దగ్గరకు వెళ్ళి అలాగే అగ్ని సూక్తాలను పఠించాడు. అవి అంగిరసుడి కుమారులకు తెలియదు. సమయానికొచ్చి తగిన సూక్తాలను పఠించి తమ యాగాన్ని సుసంపన్నం చేసినందుకు అంగిరస పుత్రులకు ఎంతో ఆనందం వేసింది. యాగం అయిపోయాక గొప్ప సంపదలను నభగుడికి ఇచ్చి వారు వెళ్ళిపోయారు. నభగుడు వాటన్నిటినీ తీసుకొని తన ఇంటికి బయలుదేరుతుండగా ఓ నల్లటి కన్నులున్న వ్యక్తి ఎంతో అందమైన వాడు (కృష్ణదర్శనుడు) అక్కడికి వచ్చి ఆ సంపదంతా తనదని వాదించాడు. నభుగుడు కూడా మునులు తనకిచ్చారని వాదనకు దిగాడు. అప్పుడు కృష్ణదర్శనుడు వాదులాట అనవసరమనీ, ఈ సంపద నిజంగా ఎవరిదో తేల్చి చెప్పగల శక్తి నభగుడి తండ్రి అయిన శ్రాద్ధదేవుడికే ఉందని, ఆయననే ధర్మం అడిగి రమ్మని అన్నాడు. నభగుడు వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పాడు. ఆ వచ్చిన వ్యక్తి రూపురేఖా విలాసాలను తన కుమారుడి మాటల ద్వారా విని ఆశ్చర్యపోయి ఆ వచ్చిందెవరో కాదు, అక్షరాలా శివుడే. ఆయనకు నమస్కరించి సంపదంతా ఆయనదేనని చెప్పమని అన్నాడు నభగుడితో శ్రాద్ధదేవుడు. పరుగు పరుగున నభగుడు వెళ్ళి కృష్ణదర్శనుడిని స్తుతించి నమస్కరించాడు. సృష్టిలోని సర్వ సంపదలు ఈశ్వరుడివేనని తనను మన్నించమని అన్నాడు నభగుడు. కృష్ణదర్శనుడికి ఆ భక్తుడిలోని నిష్కల్మష భక్తితత్వం నచ్చింది. వెంటనే గొప్ప సంపదలను, బ్రహ్మ జ్ఞానాన్ని కూడా నభగుడికి అనుగ్రహించాడు శివుడు. సృష్టిలో సంపదలు ఆ సర్వేశ్వరుడి సొంతమే తప్ప ఎవరివీ కావు. వాటికోసం తగాదాలు పడటం మంచిది కాదన్న ఓ సత్యాన్ని సూచన ప్రాయంగా తెలియజెప్పేందుకు ఆ పరమేశ్వరుడు దాల్చిన అవతారమే కృష్ణదర్శనావతారం. మానవాళికి మంచిని నేర్పేందుకు శివుడు ధరించిన అవతారాలలో ఇది ఒకటి అని శివపురాణం పేర్కొంటోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

తెలుగులో నా ఆఖరి సినిమా వంగవీటి

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన చేశారు. తెలుగులో తన ఆఖరి సినిమా......

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net