Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu


మేక చెప్పిన మనిషి కథ
మేక మనుషులు ఎలా ప్రవర్తించాలి? అనే విషయానికి సంబంధించిన కథ చెప్పింది. ఆ కథలో ఉన్న ఆంతర్యమేమిటి అనే విషయాన్ని వివరించే ఈ కథా సందర్భం పద్మపురాణం అంతర్గతంగా ఉన్న గీతామహాత్మ్యంలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు అర్జునుడిలోని నిస్తేజాన్ని పోగొట్టి చైతన్యాన్ని నింపి, కర్తవ్యాన్ని బోధించి ధర్మవిజయానికి మార్గం చూపాడు. భగవద్గీత ఇలా సన్మార్గ దర్శనం చేయించే ఓ జ్ఞాన దీపికగా అందరికీ సుపరిచితమే. అయితే భగవద్గీత కేవలం ఇలా జ్ఞాన మార్గాన్ని మాత్రమే బోధించే మహత్తర గ్రంథం ఒక్కటే కాదని అది అద్భుత దైవశక్తి నిధి అని తెలియచేస్తుంది ఈ కథా సందర్భం. భగవద్గీతలోని ఒక్కో అక్షరం దైవశక్తి సమన్వితమూ, అమృతతుల్యమూ కూడా. ఆ అక్షర శబ్ద ప్రకంపనలు మహాపాపాలను దూరంగా తరిమేస్తాయి. భూత, ప్రేత పిశాచాదులను దరిదాపులకు రానివ్వవు. అకాలమృత్యువును నిరోధించే రక్షణ కవచాలుగా కూడా ఆ అక్షరాలు కనిపిస్తాయి. ఆ విషయమే ఈ కథలో వ్యక్తమవుతుంది. పూర్వం నర్మదా నదీ తీరంలో మహిష్మతీపురం అనే ఓ పట్టణం ఉండేది. అక్కడ వేదవేదాంగపారంగతుడైన మాధవుడు అనే ఓ పండితుడుండేవాడు. అతడు ఆత్మతత్వజ్ఞుడిగా ఉండి నిరంతరం అతిథి పూజా సత్కారాలలో తరిస్తుండేవాడు. ఆయన దగ్గర చదువుకొన్న శిష్యులు గొప్పగొప్ప వారుగా పేరొందుతుండేవారు. ఓ సారి మాధవుడు ఓ మహత్తర యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగం కోసం ఒక మేకను సిద్ధం చేశాడు ఆ పండితుడు. యాగం చేసే హడావుడిలో ఉన్న మాధవుడు మేక సమీపానికి రాగానే ఏవో విచిత్రమైన మాటలు వినిపించాయి. ఆ మాటలు ఎటు నుంచి వస్తున్నాయా అని చూస్తుండగానే అక్కడ యాగ స్తంభానికి కట్టి ఉంచిన మేక ఇంకొంచెం తన స్వరాన్ని పెంచి మానవ భాషలో ఇలా అంది ‘ఓ పండితుడా ! ఎన్నెన్ని యజ్ఞాలు చేసి ఏం లాభం. యజ్ఞాల సందర్భంగా జీవహింస చేయటం వల్ల అంతకుముందు సంపాదించిన పుణ్యం అంతా నశించి పాపం పెరిగిపోతుంటుంది. ఈ విషయం తెలియకుండా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు’అని మేక అన్న మాటలను విని మాధవుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకొని ‘ఇంతకీ నీవెవరు? మేకగా పుట్టి ఇలా మాట్లాడటానికి తొలుత ఉన్న కారణమేమిటి?’ అని అన్నాడు. అప్పుడామేక అతడికి తన పూర్వజన్మ గురించి చెప్పింది.

పూర్వ జన్మలో తాను కూడా ఓ వేదపండితుడినేనని, బాగా వేదవేదాంగాలూ, శాస్త్రజ్ఞానం ఉన్నా ఒక మేకపిల్లను బలి ఇవ్వటానికి సిద్ధపడ్డప్పుడు ఆ మేకపిల్ల తల్లి అక్కడికొచ్చి తన బిడ్డను హింసిస్తున్నందుకు ప్రతిఫలంగా మేకగా పుట్టమని శపించి వెళ్ళిపోయిందని, అందుకే తాను మేక జన్మ ఎత్తినట్లు మేక రూపంలో ఉన్న పండితుడు చెప్పాడు. అయితే తనకు భగవద్గీతను చదువుకొన్నందువల్ల పూర్వజన్మ స్మృతి అలానే ఉందని మాధవుడితో మేక రూపంలోని పండితుడు చెప్పాడు. భగవద్గీత మహత్తరశక్తి సమన్వితమైందని, ఆ శక్తికి సంబంధించిన పనికొచ్చే మరో కథను చెప్తాను వినమని మాధవుడితో మేక రూపంలోని పండితుడు కథను ఇలా చెప్పటం ప్రారంభించాడు.

పూర్వం కురుక్షేత్రంలో చంద్రశర్మ అనే ఓ రాజుండేవాడు. ఆయన ప్రజానురంజకంగానే పరిపాలన చేస్తుండేవాడు. చంద్రశర్మ తనకింకా ఆయురారోగ్యాలు, యోగక్షేమాలు, సుఖశాంతులు ప్రాప్తించేందుకు పలు రకాల దానాలు చేస్తుండేవాడు. ఓసారి సూర్యగ్రహణం ప్రాప్తించింది. ఆ గ్రహణ సమయంలో కాలపురుష దానం చేస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్పారు. కాలపురుష దానాన్ని ఇచ్చే వారికి మేలే జరిగినా ఆ దానాన్ని పుచ్చుకొన్న వారికి మాత్రం నష్టం జరుగుతుందన్న భయంతో దానం పుచ్చుకోవటానికి చాలా మంది ముందుకు రాలేదు. కానీ ఓ వేద పండితుడు తాను ఆ దానాన్ని స్వీకరించేందుకు సిద్ధమని ముందుకొచ్చాడు. రాజు, ఆ వేదపండితుడు, రాజుదగ్గరుండే పురోహితుడు ముగ్గురూ కలసి సూర్యగ్రహణ సమయంలో నదీస్నానానికి వెళ్ళారు. ముగ్గురూ నదీస్నానం చేసి ఒడ్డుకు చేరారు. అక్కడ రాజపురోహితుడు వేదపండితుడికి రాజు చేత కాలపురుష దానాన్ని శాస్త్ర విధిగా చేయించసాగాడు. అలా దాన ప్రక్రియ జరుగుతుండగానే ఓ భయంకరమైన పురుషాకృతి, ఓ స్త్రీ ఆకృతి వేదపండితుడిలోకి ప్రవేశించటానికి విఫలప్రయత్నం చేయటం కనిపించింది. ఆ పండితుడు మాత్రం దానం పుచ్చుకొనే సమయంలో భగవద్గీత తొమ్మిదో అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగాన్ని జపించుకుంటూ ఉండిపోయాడు. రాజు భీకరాకృతులు చేస్తున్న విఫల ప్రయత్నం చూసి ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు. వేదపండితుడు దానం పుచ్చుకొంటూ గీతను చదువుకొంటున్నప్పుడు గీతాక్షరాల నుంచి ఆవిర్భవించిన విష్ణుదూతలు ఆ భీకరాకృతులను తరిమికొట్టారు. రాజు దానం ఇవ్వటం పూర్తయ్యాక వేదపండితుడితో భీకరాకృతులను విష్ణుదూతలు వెళ్ళగొట్టడం తాను చూశానని, అదంతా ఎలా జరిగిందో వివరించమని వినయంగా కోరారు. అప్పుడా పండితుడు ఆ భీకరాకృతులలో మొదటిదైన పురుషాకృతి రాజుకు సంబంధించిన పాపమని, స్త్రీ ఆకృతి రాజుకు సంబంధించిన నింద అని కాలపురుష దానం వల్ల రాజు నుంచి ఆ రెండూ విడిపోయి తనను చేరాల్సి ఉందని అన్నాడు. అయితే తాను శ్రీమహావిష్ణు సంబంధమైనది, భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయమూ అయిన రాజవిద్యా, రాజగుహ్య యోగాన్ని పఠిస్తూ ఉండటం వల్ల తనకు ఆ ముప్పు తప్పిందన్నాడు. గీతా పఠనం వల్ల తనలో విష్ణుశక్తి నిండి ఉండటమే దానికి ప్రధాన కారణమని అన్నాడు. ఆ తరువాత ఆ రాజు గీతామహాత్యా్మన్ని తెలుసుకొని ఆ వేదపండితుడి చేతనే గీతను తన ఇంట్లో పారాయణ చేయించుకొని జన్మాంతంలో మోక్షాన్ని పొందాడు.

అని ఈ కథను మేకరూపంలో ఉన్న పండితుడు మాధవుడికి చెప్పగానే ఆయన కూడా భగవద్గీత తొమ్మిదో అధ్యాయాన్ని ప్రతిరోజూ పారాయణ చేసుకొని సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందాడు అని పద్మపురాణం గీతా మహాత్సా్మన్ని ప్రకటిస్తోంది. ఈ కథను శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి, పరమ శివుడు పార్వతీదేవికి తెలియజెప్పినట్లు పద్మపురాణం పేర్కొంటోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net