Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu


జగన్నాథుడి జగన్నాటకం
కల సృష్టికి కారకుడు, విశ్వానికంతటికీ అధినాయకుడు గోలోక శ్రీకృష్ణుడేనని వివరించే ఈ కథా సందర్భం బ్రహ్మవైవర్తపురాణం ద్వితీయ ఖండం పదకొండో అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి నుంచే ఆవిర్భవించిన జగజ్జనని రాధమ్మ, శ్రీకృష్ణుడు ఇద్దరూ ఆడే జగన్నాటకంలో జనావళి ఆనందం కోసం వారికి దగ్గరగా ఉండే జీవన విధానాన్నే ఆ గోలోక శ్రీకృష్ణుడు అనుసరించినట్లు కనిపిస్తుంది. తాత్త్విక దృష్టితో చూస్తే మాత్రం సర్వాన్ని సృష్టించిందీ, ఆడిస్తున్నదీ ఆ గోలోక శ్రీకృష్ణుడేననే సందేశాన్ని ఈ కథ అందిస్తున్నట్లు గోచరిస్తుంది. గోలోకంలో ఓ రోజు ఓ వింత జరిగింది. రాధాదేవి ప్రియసఖి ఒకరు వచ్చి శ్రీకృష్ణుడు గంగతో ఏకాంతంగా ఉన్నాడని అదేదో పెద్ద రహస్యమైనట్లు రాధమ్మ చెవిలో చెప్పింది. ఇక్కడే అసలు నాటకానికి నాంది పలికినట్టైంది. రాధమ్మ వెంటనే రుసరుసలాడుతూ గంగ, కృష్ణులు ఉన్నచోటికి వెళ్లింది. దాంతో భయంతో కంపించి పోయిన గంగ రాధమ్మకు వినయంతో తలవంచి నమస్కరిస్తూనే వెంటనే వెళ్లి శ్రీకృష్ణుని కాలి బొటన వేలిలో జలరూపంలో ప్రవేశించింది. అంటే శ్రీకృష్ణుడిని ఆశ్రయించింది. గంగను సరసన పెట్టుకుని ఏం చేస్తున్నట్టు అని రాధాదేవి కృష్ణుడిని ప్రశ్నించింది. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ­రుకున్నాడు. అప్పుడు ఆమె గతంలో జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటీ వివరించడం ప్రారంభించింది. ‘కృష్ణా! నువ్వు గతంలో ఇలా ఎన్నో సార్లు చేశావు. చందన వనంలో విరజతో కలసి విహరిస్తున్నప్పుడు నేను చూసి కోపగించాను. అప్పుడు నీవూ భయపడ్డావు. విరజ కూడా భయపడి తన అసలు రూపాన్ని విడిచి జల రూపాన్ని ధరించి నదిగా మారిపోయింది. కోటి యోజనాల విస్తీర్ణంతో, నాలుగుకోట్ల యోజనాల పొడవుతో గోలోకమంతటా ఆ విరజ నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఆ తర్వాత విరజకూ, నీకూ జరిగిన సమాగమం వల్ల సప్తసముద్రాలు ఉద్భవించాయి. నేనింకా ఆ విషయాన్ని మరచిపోలేదు సుమా. కృష్ణా! ఓసారి నువ్వు చంపక వనంలో శోభ అనే గోపికతో కలసి ఉన్నప్పుడు నా కంట పడ్డావు. నేను వస్తున్నానని తెలియగానే నీవు అంతర్థానమయ్యావు. అప్పుడు శోభ తన శరీరాన్ని వదలి చంద్ర మండలాన్ని చేరింది. ఆ నాటి నుంచి చంద్రుడికి కాంతి ఏర్పడింది. ఆమె కాంతి రత్నాలు, బంగారం, విద్యావంతులు, స్త్రీల ముఖాలు, రాజులు, విలువైన వస్త్రాలు, కాసులు, చందనవనం, నీరు, చిగురుటాకులు, రాజుల గృహాలు, దేవాలయాలు, సంస్కారవంతులైన జనులకు తలాకాస్త నువ్వే పంచిపెట్టావు. అలా నువ్వు చేసిన తర్వాత నుంచే వాటన్నింటికీ కాంతి వచ్చి లోకంలో వెలగగలుగుతున్నాయి. నువ్వు చేసింది ఇదొక్కటే కాదు కదా! ఆ తర్వాత ప్రభ అనే మరో గోప స్త్రీతో నువ్వు విహరిస్తున్నప్పుడు నేను చూశాను. అప్పుడు కూడా నన్ను చూసి నువ్వు మాయమయ్యావు. ప్రభ తన దేహాన్ని వదిలి సూర్య మండలానికి వెళ్లింది. అప్పుడు ప్రభ మీద ఉన్న మమకారంతో ఆమె నుంచి వెలువడిన తేజస్సును అగ్ని, రాజులు, మానవ సంఘాలు, దేవతలు, సర్పాలు, బ్రాహ్మణులు, మునులు, సౌభాగ్యవంతులైన స్త్రీలు, కీర్తి వంతులు తదితరులకు తలాకాస్త పంచి ఇచ్చావు. మరోసారి రత్న మందిరంలో ఉన్న రాస మండలంలో శాంతి అనే గోపికతో కలిసి పాలపాన్పుపై నువ్వున్నప్పుడు నేను చూశాను. నా చప్పుడు వినగానే నువ్వు వెళ్లిపోయావు. ఆమె శరీరం వదిలింది. ఆమెలోని శ్రేష్ఠ గుణమైన శాంతిని విష్ణువుకు, లక్ష్మీదేవికి, నీ మంత్రాన్ని ఉపాసించే వైష్ణవులకు, మునులకు, ధర్మాత్ములకు తలా కాస్త పంచి ఇచ్చావు. శాంతి అలా వారి దగ్గరే చిర స్థాయిగా ఉండిపోయింది. ఆ తర్వాత క్షమ అనే గోపికతో నువ్వు ఉన్నప్పుడు చూశాను. అప్పుడు గతంలో లాగే నువ్వు ప్రవర్తించావు. ఆ గోపిక ఇలాంటి ఇతర గోపికల్లాగానే అయిపోయింది. క్షమ మీద ఉండే ప్రేమ కొద్దీ ఆమె విశిష్ట లక్షణాన్ని భూమికి, విష్ణుమూర్తికి, వైష్ణవులకు, మునులకు, దేవతలకు, పండితులకు పంచిపెట్టావు. ఇలా ఎన్నో సందర్భాల్లో నీవు నాకు దొరకకుండా గోపికలతో సరస సల్లాపాలు సాగిస్తూనే ఉన్నావు. ఇదుగో ఇప్పుడీ గంగతో కనిపించావు. దాంతో ఆమె నీ పాదాల నుంచి ఉద్భవించి లోకాలను పవిత్రం చేయటానికి ముందుకు పరవళ్ళు తొక్కుతోంది. ఇలా నిరంతరం నీవు చేస్తూనే ఉంటావు. నేను నిన్ను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అయితే నీవు ఎప్పుడూ దొరకడంలేదు. ఏమి చిత్రమో కదా!’ అని రాధ కృష్ణుడిని తనదైన శైలిలో ప్రేమ పూర్వకంగా, సున్నితంగా మందలించింది. గోలోకంలో రాస మండలంలో రాధాకృష్ణులు రాసకేళీ విలాసంలో ఇలా రాధమ్మ కృష్ణుడిని అదిరిస్తూ, బెదిరిస్తూ ఉంటూనే ఉంది. ఈ కథను పైపైకి పరిశీలిస్తే కృష్ణుడు గోపికలతో నిరంతరం విహరిస్తూ ఉంటాడని, రాధమ్మను ప్రేమ మాయలో ముంచేస్తుంటాడనే ఓ సామాన్య, సాధారణ లౌకికభావం కలుగుతుంది. పురాణాల్లోని కథలు దైవపరంగా ఇలా ఉండటమేమిటి అని సందేహం కలుగుతుంటుంది. ఇందులోని అంతరార్థం గమనిస్తే ఆ సందేహమంతా పటాపంచలైపోతుంది. రాధమ్మ కృష్ణుడిని అడిగిన ప్రతి విషయాన్ని చూస్తే ఈ విశ్వసృష్టి అంతా ఆయన చేసిందేనని, సూర్యచంద్రాదులు వెలుగొందుతున్నదీ, దేవతలంతా భాసిల్లుతున్నదీ, ప్రజలంతా జీవించగలుగుతున్నదీ ఆ గోలోక శ్రీకృష్ణుడి వల్లనేనని ఓ సందేశం స్ఫురిస్తుంది. పురాణ కథలు పండిత పామరులందరికీ ఆనందాన్ని కలిగించాలన్న లక్ష్యంతో విరచితమయ్యాయనే మాటను ఈ కథా సందర్భం సమర్థిస్తున్నట్లు ఉంటుంది.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net