Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


వేమన పద్యాలు
ఆంధ్ర సాహిత్యంలో ప్రగతిశీల భావాలు కల కవి యోగి వేమన. వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు. చాలా కాలం వరకు సంప్రదాయ భక్తులైన మన కవులు వేమనను కవిగా గుర్తించలేదు. ఇప్పటికీ కొందరు ఇతనిని కవిగా గుర్తించరు. తొలిసారి పాశ్చాత్య పండితుడైన బ్రౌను మహాశయుడు వేమనలోని సంస్కార భావములు గుర్తించి అనేక పద్యాలను ఆంగ్లంలోకి అనువదించారు. తరువాత ప్రముఖ కవి, విమర్శకుడు కట్టమంచి రామలింగారెడ్డి తన ‘‘కవితత్వ విచారంలో’’ వేమన గొప్పదనం గురించి వివరించారు.
తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు

తలచి చూడనతకు తత్వమగును
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: దేవుడి అందరి హృదయాలలో ఉంటాడు. చిత్తశుద్ధితో ఆత్మ పరిశీలన చేసుకుంటే అతడు కనిపిస్తాడు. ఎలాంటి వికరాలకు లొంగకుండా ఆ తత్వాన్ని దర్శించేవాడే నిజమైన యోగి.

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడలవేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ప్రతి చిన్న విషయానికి విరక్తి చెంది ఎప్పటికీ దాని నుంచి బయటపడలేక అల్లాడేవాడు బలహీనుడు. ఆ వలలో చిక్కుకొని తప్పించుకోలేక నిర్వీర్యమైపోయేవాడికి ఎట్టి పరిస్థితుల్లోను ముక్తి లభించదు.

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
మెంత చేసే ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మూర్ఖుడు జ్యోతిష్యమని, వాస్తుని వ్యర్థ వ్యాఖ్యలు చేసి ఆత్మవంచన చేసుకుంటాడు. తన విధిరాతను బట్టి అలా జరిగిందని భావించడు. తన కర్మల ఫలితమే అలా జరిగిందని, అది దేవుడే అలా చేశాడని గ్రహించడు.

టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు
లోకమందు జెప్పి మంచు
కాకులట్టి జనుల కానరీ మర్మము
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ఎందరో పెద్దలు ప్రపంచ రహస్యాలకు వ్యాఖ్యలు వివరంగా చెబుతుంటారు. తెలివిలేని ప్రజలు దేవుడొక్కడే అనే వారి వివరణను గ్రహించకుండా ప్రవర్తిస్తుంటారు.

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
రెంటినందు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: జ్ఞానం గురువులాంటిది. జ్ఞానం లేకపోతే బుద్ధి అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య భ్రమిస్తుంటుంది. ఈ భ్రమలకు అడ్డుకట్ట వేస్తేనే మోక్షం లభిస్తుంది.

జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ప్రజలు తమను తాము తెలివిగలవారమనుకుంటారు. తమలోని అజ్ఞానాన్ని గ్రహించరు. తమను తాము తెలుసుకోలేని వారు తపస్సు చేసినా సరైన ప్రయోజనాన్ని పొందక, సారాన్ని గ్రహించలేక అడవుల్లో నివసిస్తూ పలు కష్టాలపాలవుతుంటారు.

జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములందు నెండ జగములుండు
నరుడు జగమునంట నడుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: చావు పుట్టుకలు స్వప్నాలలోని అవస్థలలాంటివి. ప్రపంచం ఎండమావులలోని నీటిలాంటి మిథ్య, ప్రపంచ భోగాలలో చిక్కుకొని తప్పించుకోలేక అల్లాడడం వివేకవంతులకు అవమానకరం.
ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు

లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టునిట్టు దాటనది పోవునిది రామ
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: నీడనిచ్చే వృక్షం, మంచి బోధనలు చేసే గురువుల వల్ల అందరికీ మేలు చేకూరుతుంది. చెంత చేరగానే చెట్టు నీడను, గురువు జ్ఞానాన్ని ఇస్తారు. చెట్టు లేకపోతే నీడ ఉండదు. గురువు లేకపోతే జ్ఞానం ఉండదు.
నరుడెయైన లేక నారాయణుండైన

తత్త్వబద్ధుడైన దరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామా వినురవేమ
తాత్పర్యం: మానవుడైన, దానవుడైనా, తత్త్వవేత్తయైనా, ఇంకెవరైనా సరే శరీరధారికి మరణమనేది తప్పనేతప్పదని గ్రహించవలెను.
ద్వారంబంధమునకు దలుపులు గడియలు

వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామా వినురవేమ
తాత్పర్యం: ద్వారానికి తలుపులు గడియలు ఉన్నట్లే మాటకు కూడా నియమములు రక్షణలై కలవు. ధర్మమెరిగి తగినట్లు మాట్లాడినవాడే ధన్యుడు, ఉత్తముడగును.
బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి

మిత్రచంద్ర శిఖులు నేత్రచయము
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: బ్రహ్మం అంటే ఏదో తెలియని తత్వం కాదు. మానవ దేహమే బ్రహ్మ స్వరూపం. గాలి ప్రాణం. కళ్లే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మానవుడే బ్రహ్మమని సాధనతో తెలుసుకోవాలి.
యోగిననుచు గొంత యోగముగూర్చక

జగమునెల్లబట్ట చంపి తినుచు
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన
యోగికాడు వాడె యోగువేమ
తాత్పర్యం: యోగి అని ప్రకటించుకొని అందరినీ పీడించేవాడు ఎన్నటికీ యోగి కాలేడు. డబ్బు కోసం ఇతరులను బాధించేవాడు ఎందుకూ పనికిరానివాడే అవుతాడు.
అర్ధ యంకణమున కాధారమైనట్టి

యొంటిమేడ గుంజు నొనరనిల్పె
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: దేహం ఒంటి స్తంభపు ఇల్లులాంటిది. దానికి జీవుడు ఒక్కడే యజమాని. కానీ ఇల్లాళ్ళు మాత్రం ఏడుగురు. వారే సప్తప్రకృతులు.
అన్నదానమునకు నధిక సంపదగల్గి

యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్సర్వం: అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: ఎంతటి బలమైన ఆహారం పెట్టి పోషించినా శరీరం శాశ్వతం కాదు. ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. డబ్బు కూడా నిలవదు. ఎన్నిటికైనా మనం చేసిన దానధర్మాలే నిలిచి ఉంటాయి. అందుకే అందరూ ధర్మబుద్ధిని కలిగి ఉండాలి.
పండువలన బుట్టె బరగ ప్రపంచము

పండువలన బుట్టె పరము నిహము
పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: భగవంతుడు ప్రకృతి నుంచి జన్మించాడు. భగవంతుడు ఈ లోకాలను సృష్టించాడు. ఇన్ని లోకాలను సృష్టించిన భగవంతుడి గొప్పతనం ప్రహ్లాదుడి వంటి భక్తులు మాత్రమే తెలుసుకోగలిగారు.
తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల

నొనర శివుని జూడ నుపమ గలదు
మనసు చదరనీక మహిలోన జూడరా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: జనులు తపస్సు చేసి కృశించుట వ్యర్థము. భగవంతుని చూచుటకిది మార్గము కాదు. మనస్సును చెదరనీయక స్థిరముగా నుంచి ధ్యానించినచో దేవున్ని చూడవచ్చును.

తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా!
తాత్పర్యం: మంచివో చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా చేయువాడు వ్యర్థుడు.

జాలినొందరాదు జవదాటి కనరాదు
అది మూలమైన ఆత్మమఱుగు
పోరిచేరి పొంది పూర్ణము నందురా
విశ్వదాభిరామ వినురవేమా
తాత్పర్యం: ఆత్మరహస్యమునకుగల మూలతత్త్వమును చూడలేకపోయామని విచారపడినా, యోగనియమములను విడిచినా లాభము లేదు. ఇంద్రియాలను జయించి ఈశ్వరతత్వాన్ని పొందితేనే మేలు.
జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినురవేమా
తాత్పర్యం: యోగి కావాలనుకున్నవాడు జాతి, మతాలను విడిచిపెట్టాలి. ఒకవేళ జాతిని ఆశ్రయించినా కూడా నీతిని మాత్రం విడవకూడదు. ఏ జాతివాడైనను దురాచారాలను విడవకపోవడం తప్పు

నీవనినను నేననినను
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
భావంబు దెలిసి మదిని
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా
తాత్పర్యం: నీవు-నేను అని వాదులాడుట జనుల పద్ధతి కాదు. భగవంతుని తత్త్వమెరిగి నిర్భావంగా ధ్యానం చేయుటయే పరము పొందుటకు తగిన సాధనము.
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల

మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినురవేమా
తాత్పర్యం: పాపవర్తనము, కల్మషం ఉన్నంతవరకు పుణ్యతీర్థాలలో మునిగినా, నిధులపై తిరిగి, వేల్పులకు మ్రొక్కుచున్ననుఉ ఏమి ప్రయోజనము లేదు.
పంచ ముఖములందు బంచాక్షరి జనించె

పంచ వర్ణములను ప్రబలె జగము
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: శివుడి అయిదు ముఖాల నుంచి పంచాక్షరి వెలువడింది. పంచాక్షరిలోని అయిదు అక్షరాల నుంచి ప్రపంచం పుట్టింది. అందుకే అందరూ ఆ పరమేశ్వరుడినే స్తుతించాలి.
నేయి వెన్న కాచి నీడనే యుంచిన

బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: వెన్నను కాచి నేతిగా మార్చి నీడలో ఉంచితో అది పేరుకుంటుంది. పెరుగులా గట్టిపడుతుంది. మనసు అదుపులో ఉన్నట్లే అనిపించినా... ఏమాత్రం ఉపేక్షించినా పట్టు జారిపోయే ప్రమాదం ఉంది.
మంటికుండవంటి మాయ శరీరంబు

చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినురవేమా
తాత్పర్యం: మట్టి కుండలాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నశిస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమైంది. దానికి అది ఎన్నటికీ నాశనం కాదు. ఎన్ని దేహాలు నశించి భూమిలో కలిసిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఎప్పటికీ ఉంటుంది. అందుకు శాశ్వతమైన దేహంపై అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదు.

మంట లోహమందు మ్రాకుల శిలలందు
పటములందు గోడప్రతిమలందు
తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినురవేమా
తాత్పర్యం: అగ్ని, లోహం, చెట్టు పుట్ట, రాళ్ళురప్పలు, కఠినశిలలు, పటాలు, ప్రతిమలు మొదలైన అన్నింటిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు. అలాగే నీలోను దేవుడు ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకొని అందరూ ప్రవర్తించాలి.

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగువేమా
తాత్పర్యం: ఎన్ని పనులున్నా కూడా క్షణకాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనస్సుతో లింగజీవాత్మ పరమాత్మను నిశ్చలబుద్ధితో చూచి
పూజిస్తే పూర్ణపదవి సిద్ధిస్తుంది. మోక్షం కోరుకునే మానవులకు ఇది అవసరం.
ధూమాదుల నావృతమై

వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
శ్రీమించు శివుని జేరును
గామాదుల గలియడతడు ఘనముగ వేమా
తాత్పర్యం: భూమిపై ఏర్పడే పొగ మెల్లగా ఆకాశంలో కలుస్తున్నట్లుగానే, మానవునిలో ఉన్న జీవాత్మ ఈశ్వరునితో కలుసుకొనును. అప్పుడు జీవునికి కామాది వికారములుండవు.
పగలుడుగ నాసలుడుగును

వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్‌
తగులుడుగు భోగముడిగిన
త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!
తాత్పర్యం: విరోధములు నశించిన ఆశలు నశించును. విచారము లేకున్న కోరికలు నశించును. భోగములు నశించిన జన్మములు నశించును. త్రిగుణములు నశించిననే కొని ముక్తి కలుగును.

పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా?
విశ్వదాభిరామ వినురమేమా!
తాత్పర్యం: నీటిలో కలిసి ఉన్న పాలను వేరు వేయడం హంసకు తెలుస్తుంది. కానీ ఆ నేర్పు నెమలికి లేదు. అలాగే జ్ఞాని, ఉత్తముడు మాత్రమే పరమేశ్వరుడి పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతాకానీ మూర్ఖుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేడు.
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల

పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమా!
తాత్పర్యం: పుట్టిన వారికి చావు తప్పదు. చావక బతికి ఉన్నవారు ఎవరూ లేరు. చావు, పుట్టుకలు భ్రాంతులు. అందుకే పుట్టుకపై ఆశతో భోగభాగ్యాలపై లాలసత్వం పెంచుకోకూడదు. చచ్చిపోతామనే భయంతో నిత్యం ఆవేదన చెందకూడదు.

పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరుల విత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: పరుల ధనంపై ఆశ లేనివాడే పురుషుల్లో ఉత్తముడు. పరుల సొమ్ము తీసుకున్నా, అది పాపంతో సంపాదించినదే అవుతుంది. అలా చేసేవాడికి ముక్తి ఉండదు.

పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమంతలేక జారడగును
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ఈ కాలపు బ్రాహ్మణులు పరుల ధనాన్ని ఆశిస్తున్నారు. ప్రాణాల కంటే దానమే గొప్పదంటున్నారు. జ్ఞానం లేకపోయినా అందరికంటే తామే గొప్ప అని అపోహ పడుతున్నారు.

నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
వ్రాతకన్న సాక్షి వలవదన్న
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కానీ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలకన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను, కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది.
నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు

నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: వాస్తవాలు, అవాస్తవాలు దేవుడికి తెలుస్తాయి. అందుకే ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నీతిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నిజం చెప్పేవారిని పరమేశ్వర స్వరూపమే అనవచ్చు. నిజాలు చెబితేనే మన వ్యక్తిత్వం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ఎవరి దగ్గరైనా ధనం ఉంటేనే వారిని తమ వారని చెప్పుకోడానికి ఇష్టపడతారు. డబ్బు లేకపోతే ఎంత మంచివారినైనా తమ బంధువులని చెప్పుకోరు. మనుషుల మంచితనానికంటే డబ్బుకే విలువఇస్తారు. ధనం ఉంటేనే అదృష్టం అని భావిస్తారు.
తామసించి చేయదగ దెట్టి కార్యంబు

వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: తొందరపడి ఆవేశంతో ఏ పని చేయకూడదు. తొందరపాటువల్ల ఆ పని ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పచ్చికాయ తొందరపాటుతనంతో తెచ్చి మగ్గపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది పండుగా మారదు. చివరికి తినడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి

ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోదం తెస్తుంది.

తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
పార్వతీభవు లిలబరమగురులు
కూలివాండ్ర జగతి గురులన ద్రోహము
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: తల్లిదండ్రేలే అందరికీ మొదటి గురువులు. పార్వతీ పరమేశ్వరులు పరమగురువులు. డబ్బు తీసుకొని బోధించే వారు అసలు గురువులే కాదు. అలా వారిని గురువులనడం ద్రోహమే అవుతుంది.
తామసించి చేయదగ దెట్టి కార్యంబు

వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: తొందరపడి ఆవేశంతో ఏ పని చేయకూడదు. తొందరపాటువల్ల ఆ పని ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పచ్చికాయ తొందరపాటుతనంతో తెచ్చి మగ్గపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది పండుగా మారదు. చివరికి తినడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల

పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమా!
తాత్పర్యం: పుట్టిన వారికి చావు తప్పదు. చావక బతికి ఉన్నవారు ఎవరూ లేరు. చావు, పుట్టుకలు భ్రాంతులు. అందుకే పుట్టుకపై ఆశతో భోగభాగ్యాలపై లాలసత్వం పెంచుకోకూడదు. చచ్చిపోతామనే భయంతో నిత్యం ఆవేదన చెందకూడదు.

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
బుట్టిరేమి వారు గిట్టరేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!
విశ్వదాభిరామ వినుర వేమా!
తాత్పర్యం: సక్రమంగా పెంచి పోషించలేని పిసినారులు, ఇతరులకు ఏ మాత్రం సాయం చేయనివారు బతికి ఉన్నా... చచ్చినా ఒక్కటే. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. చస్తూ ఉంటాయి. అవి పుట్టినా, చచ్చినా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు. పిసినారులు కూడా అలాంటి చెదలతోనే సమానం.

లోకమందుబుట్టి లోకమందె పెరిగి
లోక విభవమోర్వలేక జనుడు
లోకమందు జనికి లోబడి చెడిపోవును
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పారం: భూమిమీదే పుట్టి పెరిగి పెద్దయిన మానవుడు భూమిమీద వృద్ధి చెందిన సంపదలకు తాను సృష్టించిన సొమ్ముకు భోగభాగ్యాలకు దాసోహమై చెడిపోతున్నాడు.

మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్సినంత మహితుడగును
మనసులేని పూజ మట్టి సమానము
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: చిత్తశుద్ధితో పూజిస్తే దేవుడు మెచ్చి వరాలు అందిస్తాడు. మనస్సు నిల్పి చేయని పూజ నిరర్థకము. నిలకడైన మనస్సుతో దేవుడిని పూజిస్తేనే సరైన పరమార్థం చేకూరుతుంది.

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!
తాత్పర్యం: జనులు తనను నిందింపని రీతిలో నడవడిక కలిగిన వ్యక్తి, తన ప్రవర్తనను ప్రజలు మెచ్చుకొనునట్లు ప్రవర్తించువాడే నిజమైన ధర్మాత్ముడు.

మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే?
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: అబద్ధాలతో నిత్యం అందరినీ నమ్మించి మోసంతో సొమ్ము సంపాదించే దుష్టబుద్ధి కలవాడు ఎప్పటికీ గురువు కాలేడు.

మనసే మాయా మృగమౌ
మననేమిటి పైకిగానీ మణిపోనీకా
మనసున మనసును జంపిన
మనందే ముక్తిగలదు మహిలో వేమా!
తాత్పరం: మనసు ఒక మాయా మృగం. అన్నింటిపై ఆశపడుతుంటుంది. మనసును దుష్ట కర్మలవైపు మళ్లనీయకూడదు. మనస్సులో పుట్టే వికారాలను అణచివేసే వారికి ముక్తి, ప్రశాంతత మనస్సులోనే లభిస్తుంది.

మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకుగరుణచెందినదని
వేదపఠన చేసి వెఱ్ఱులై పోదురు,
విశ్వదాభిరామవినుర వేమా!
తాత్పర్యం: మానవులు మంత్రాలు చదివి, దేవతలనుపూజిస్తూ తాము పుణ్యాత్ములం అయిపోయామని గొప్పగా భావిస్తారు. నిజమైన దయాగుణం కలవారు, పుణ్యాత్ములు ఇలా విర్రవీగరు.
మఠములోనియోగి మాయలన్నియుగోసి

ఘటములోన నున్న ఘనునిదెలిసి
మాట మాటకుగురు మరువక తెలుపురా,
విశ్వదాభిరామ వినుర వేమా!
తాత్పర్యం: నిజమైన యోగి గ్రామంలో ఉండకుండా మఠంలో నివసిస్తాడు. మాయలు, వ్యామోహాలకు అతీతుడై గురువాక్యమును, భగవంతుడిని నిత్యం ధ్యానిస్తూ ఉంటాడు.
తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ

వెంట దేరు ధనము వంటబోరు
తొనెటకు జనునొ ధనమెందు బోవునో
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: జనులు పుట్టినపుడు ధనాన్ని తీసుకొనిరారు. మరణించినపుడు వెంట తీసుకుపోలేరు. ధనానికి తనకు ఎటువంటి సంబంధము లేదు. కావున ధనంపై కోరిక తగదు.

ఆశయనెడు దాని గోసివేయగాలేక
మొహబుద్ది వలన మునుగువారు
కాశివాసులైన గనబోరు మోక్షము
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ఆశకు లొంగిపోయి అల్లాడేవారు, భోగభాగ్యాల మోహంలో మునిగి తేలేవారు మోక్షాన్ని పొందలేరు. ఇలాంటివారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నివశించినా ముక్తిని పొందలేరు.
చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే

ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప
గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: మనసు అనెడి వేరు తెగితేనేగాని, మాయ అనెడి వృక్షం నశించదు. అప్పుడే ఆశలనెడి కొమ్మలెండిపోయి ముక్తిని పొందవీలగును.

భోగంబుల కాశింపక
రాగద్వేషంబు రంగుడదమలో
వేగమె మోక్ష పదంబును
రాగను నాతండు యోగిరాయుడు వేమా!
తాత్పర్యం: సుఖముల నాశింపక, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి శ్రీఘ్ర ముగనే ముక్తి కలుగును. అట్టివాడే యోగీశ్వరుడని చెప్పదగును.
చనువారెల్లను జనులం

జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్‌
వినవలె గనవలె మనవలె
నని మషులకు దెలుసగూడ దంత్యము వేమా!
తాత్పర్యం: చనిపోయిన యుత్తముల చరిత్రలను శ్రద్ధగా విని, వారివలనే నడుచుకొనుచు ముక్తిని యత్నించవలెను. తయ యంత్యములను గూర్చి ఎవ్వరికిని తెలుపగూడదు.

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
కట్టుపడుచు ముక్తిగానరైరి
జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: ఆలు, కోరికలతో బంధితులైన ప్రజలు మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఈ కోర్కెలను, ఆశలను అణచివేసేందుకు జ్ఞానమనే ఖడ్గం కావాలి. అందుకే జ్ఞానాన్ని అందరూ ఆర్జించాలి.
అతిథి రాక చూచి యదలించి పడవైచి

కఠిన చితులగుచు గానలేరు
కర్మమునకు ముందు ధర్మము గానరో
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: అతిథి ఇంటికి రాగానే అతనిని అదిలించి పొమ్మని చెప్పిన కఠినచిత్తులు ధర్మమును గుర్తింపరు.ధర్మము చేసిననే కర్మములు నశించగలవు
తను వలచిన దావలచును తను

వలవక యున్ననెనడు తావలవ డిలన్‌
తనదు పటాటోపంబులు తన
మాయలు పనికిరావు ధరలోన వేమా!
తాత్పర్యం: తాను ఇతరులను ప్రేమిస్తే తనని వారు ప్రేమిస్తారు. తాను ప్రేమించకుంటే వారు కూడా ప్రేమించరు. మాయలు పన్ని మోసాలు చేస్తే ఎవ్వరు కూడా ప్రేమించరు.

మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: మనిషి ఎన్నిమాటలైనా చెప్పగలడుకాని, తాను చెప్పినట్లు నడుచుకోలేడు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తననుతాను గుర్తించడంలో ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేదుకదా!

తనకేనాడు సుభిక్షము
తనకేనాడును భగంబు తనరవయునం
చును తన దశకై యెల్లెడ
మనసందున జివుకుచుండు మహిలో వేమా!
తాత్పర్యం: తనకెల్లప్పుడు సిరిసంపదలుండవలెననీ, భోగభాగ్యాలు ఉండాలని నరుడు ఆశలోనే మనసు నుంచి చివుకుచుండును. ఆశవల్ల మిగిలేది బాధే!

ఎండిన మా నొకటడవిని
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదుపును వేమా!
తాత్పర్యం: ఎండిన మ్రాను అడవిలో ఉన్నచో అందుకు పుట్టిన అగ్ని వనమునంతయున కాల్చును. వంశములో ఒక నీచుడు పుట్టి ఆ వంశమునంతను నశింపజేయును.
నిజము తెలిసియున్న సుజినుడానిజమునె

పలుకవలయుగాని పరులకొరకు
చావకూడ దింక నోపదవ్యం పల్క
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: తనకు నిజము తెలిసిఉన్నచో నిజాన్నే చెప్పాలితప్ప అసత్యాన్ని చెప్పరాదు. నిజాన్ని ఎంతమాత్రమూ దాచకూడదు.

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!
తాత్పర్యం: జనులు తనను నిందింపని రీతిలో నడవడిక కలిగిన వ్యక్తి, తన ప్రవర్తనను ప్రజలు మెచ్చుకొనునట్లు ప్రవర్తించువాడే నిజమైన ధర్మాత్ముడు.

వినియు వినకయుండు కనియు గనక యుండు
తలచి తలపకుండు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: జ్ఞాని, మోక్ష ధర్మములు వినియు విననట్లును, తత్వమును చూచిచు చూడనట్లును, దేవుని తలచియు తలపనట్లు ఉండును. అట్టి
జ్ఞానిని అందరూ పూజిస్తారు.
వెన్న చేతబట్టి వివరంబు తెలియక

ఘృతము కోరునట్టి యతని భండి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: వెన్నను చేతలో పట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నేతికై బాధపడే వానివలె, జనుడు తనలోనే భగవంతుడున్నాడని తెలుసుకోలేక అతనెక్కడో ఉన్నాడని వెదకుచూ తికమక పడుతుంటాడు.

రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూప క్రియల్‌
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: మానసిక ధ్యానంవలన దివ్యత్వమును పొందవచ్చును. కానీ, ఏదో ఒక రూపం నిర్మించి పేరుపెట్టి, ఆర్భాటంగా పూజలు చేస్తే లాభంలేదు.
లోభమోహములను ప్రాభవములు తప్పు

తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొండగుచుండు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: లోభము, మోహము కలవారికి గొప్పతనము దక్కదు. అట్టివారు తలచిన పనులు జరగవు. తానొకటి తలచిన, దైవమొకటి తలచుననుట ఎరిగినదే కదా!
శాంతమే జనులను జయమునొందించును

శాంతముననె గురువు జాడ తెలియు
శాంత భావ మహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: శాంత స్వభావం ఉంటే దేనినైనా సాధించవచ్చు. శాంతంతోనే గురువులు గొప్పవారయ్యారు. శాంత గుణం మహిమను వర్ణించలేము.

వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: వేషం వేసి నటించడం కూడా మోసం చేయడమే. అలాంటి వారిని నమ్మకూడదు. రావణుడంతటి గొప్పవాడు కూడా వేషం వేసి సీతను అపహరించి అపకీర్తి పాలయ్యాడు.
ఇంగలంబు తోడ నిల సల్పుతోడను

పరుని యాలితోడ పతితుతోడ
సరసమాడుటెల్ల చావుకు మూలము
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: నిప్పుతోను, నీచుడితోనూ, పాపాత్ముడితోను, పరస్త్రీ తోనూ పరిహాసమాడడం తన ప్రాణానికి హాని కలిగిస్తుంది.
ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు

దాని బలిమి నెంతయైన గూడు
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: ఐకమత్యం ఎంతో ముఖ్యమైనది. దానిలో ఎంతో బలం ఉంది. గడ్డి పరకలను ఒక్కటిగా చేర్చి ఏనుగును కూడా బంధించవచ్చు. ఐకమత్యంగా ఉంటే ఎంతని కార్యాన్నయినా సాధించవచ్చు.

తామసించి చేయదగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనా?
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: ఏ పని అయినా తొందరపడి చేయడం మంచి విధానం కాదు. తొందరపడడం వల్ల పని చెడుతుంది ఫలితం రాదు. పచ్చికాయ తెచ్చి ముగ్గపెట్టినంత మాత్రాన అది పండు కాదు కదా!
తల్లీ బిడ్డలకు తగవు పుట్టించెడి

ధనము సుఖము గూర్చునని గడింత్రు
కానీయెల్ల యెడల ఘన దుఃఖకరమది
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: ధనము బాగా ఉంటే ఎక్కువ సుఖపడవచ్చనుకుని దాన్ని అష్టకష్టాలు పడి సంపాదిస్తారు. కానీ ధనము ఎల్లప్పుడూ దుఃఖమే కలిగించును కానీ దీనివల్ల నిజమైన ఆనందాన్ని పొందలేము. ధనం తల్లీబిడ్డల మధ్య కూడా తగవులు తెస్తుంది.

దొంగమాటలాడ దొరుకునె మోక్షము
చేతగాని పలుకు చేటుదెచ్చు
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: గురువులమని చెప్పి దొంగ మాటలు చెప్పినంతమాత్రాన ముక్తి లభించదు. చేతగాని మాటల వల్ల చేటు కలుగుతుంది. హీనమైన గుణాలుండడం గురువు లక్షణం కాదు.
నలుగురు కల చోటను దా

దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా
దలచెడి యాతడు నిచ్చలు
గల మాటలే పలుకుచుండగా దగు వేమా!
తాత్పర్యం: నలుగురిలో మర్యాదగా తిరగాలనుకునేవాడు ఎల్లప్పుడు యథార్ధాన్నే పలకాలి. అప్పుడే అతన్ని అందరూ గౌరవిస్తారు.

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
కడుపు చల్లజేసి ఘనత విడుచు
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: కన్యాదానం చేసినవారిని, అన్నం పెట్టిన వారిని ఎల్లప్పుడూ గౌరవంతో చూడాలి. వారికి తగిన మర్యాద ఇవ్వనివాడు దుష్టుడితో సమానం.

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.
పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు

బంగరందు కూర్ప బరువు గనును
గాని యితర లోహమైన హీనము గాదె
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: రత్నాల అందం బంగారు అభరణాల్లో పొదిగితేనే తెలుస్తుంది. ఇతర లోహాల్లో అమర్చితే ఎంతమాత్రం శోభను చేకూర్చదు. మంచివాళ్లకు చెడ్డవారికి కూడా భేదం ఇలాగే ఉంటుంది.
జన్నములను మరియు జన్నియల ననేక

ముల నొనర్చియున్న ఫలముకాన
రాక యుండు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: మనిషిలో నీతి లేకుండా ఎన్ని యజ్ఞాలు, వ్రతాలు చేసినా ప్రయోజనం ఉండదు.
తప్పు పలుకు పలికి తాతోట చేసిన

కూడియున లక్ష్మీ క్రుంగిపోవు
నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యం: అబద్దాలు ఆడితే కూడబెట్టిన ధనం కరిగిపోతుంది. అసత్యం పలికేవారిని లక్ష్మీదేవి విడిచి పెడుతుంది. చిల్లికుండలో నీళ్లు నిలబడని రీతిలో అవాస్తవాలు చెప్పేవాడి నుంచి ధనం వెళ్లిపోతుంది.
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు

దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది... నాది అంటే భూమి నవ్వుతుంది.దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు.
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది

ఎట్లు కలగుబర మదెంతయైన
ధనము గలిగియున్న దైవంబు గలుగదు
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: నీతి అనే దీపం సహాయం లేకపోతే అజ్ఞానాంధకారం నశించదు. అది లేకపోతే బ్రహ్మస్వరూపం కనిపించదు. ధనం ఉన్నంత మాత్రాన దైవ కృప ఉండదు.
పగయుడగు గోపముడిగిన

పగయుడుగన్‌ కోర్కెలుడుగు బరజన్మంపుం
దగులుడుగు భేదముడిగిన
త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా!
తాత్పర్యం: కోపం నశిస్తే పగ పోతుంది. పగ పోతే కోరికలు ఉండవు. భేదభావాలు లేకపోతే మరో జన్మ లేదు. త్రిగుణాలు నశిస్తే ముక్తి కచ్చితంగా లభిస్తుంది.
పప్పులేని కూడు పరులకోసహ్యమే

యుప్పులేని వాడె యధిక బలుడు
ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: పప్పులేని భోజనము రుచించదు. అప్పులేని వాడే గొప్పవాడు. భోగాభాగ్యాలపై ఆశలేని వాడే జ్ఞాని. 
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు

తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: విలువైన నీలమణి ఒక్కటి చాలు. విలువలేని మెరుగురాళ్లు తట్ట నిండా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. అలాగే చెత్త పద్యాలు వేల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేదు. రసవంతమైన పద్యం ఒక్కటైనా చాలు. 
పరుల దత్తమొప్పి పాలనచేసిన

నిల స్వదత్తమునకు విను మడియగు
నవని పరుల దత్త మహపరింపగ రాదు
విశ్వధాబిరామ వినురవేమ!
తాత్పర్యం: పరులు ఇచ్చిన దానాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దానివల్ల తాను ఇచ్చిన దానం కంటే రెండురెట్ల ఫలం దక్కుతుంది. పరుల సొమ్ము అపహరించడం నీచమైన పని.
నిజములాడు వాని నిందించు జగమెల్ల

నిజము బల్కరాదు నీచులకడ
నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: చెడ్డవారితో నిజం చెప్పకూడదు. వారు నిజం చెబితే నమ్మరు. పైగా నిందిస్తారు. ఉత్తముల దగ్గర మాత్రం కచ్చితంగా నిజాన్నే చెప్పాలి.
పదుగురాడుమాట పాడియై ధరజెల్లు

నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.

పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
వట్టి మాటలాడు వాడధముడు
అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా
విశ్వధాబిరామ వినురవేమ!
తాత్పర్యం: పరుల మేలు చూసి ఓర్చుకోలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలే తప్ప అసూయపడకూడదు. అలా అసూయపడే వాళ్ల బతుకు నిష్ప్రయోజనం.
భయమంతయు దేహమునకె

భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే
లయమంతయు జీవునకే
జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమా
తాత్పర్యం: సంశయం, భయం అన్నీ శరీరానికే. వాటిని విడిచి పెడితే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. లయము పొందేది జీవుడే. ఆత్మ నిత్యమైనది. దానినెప్పుడు విజయం వరిస్తుంటుంది.

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది... నాది అంటే భూమి నవ్వుతుంది.దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు.

మాటజెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: ఎదుటివాడు చెప్పే మాటల్లోని మంచి చెడ్డలను తెలుసుకోలేని వాడు మూర్ఖుడు. అందరి మాటలను ఆలకించేవాడు ఉత్తముడు. మాటలు విన్న తర్వాత మంచిచెడులను ఆలోచించి సమాధానం చెప్పకపోవడం కూడా సమంజసం కాదు.
మనసు తెలిసి యొకని మాటకు బ్రతిచెప్ప

సంతసించు నతడు చాలమెచ్చు
మనసు దెలియకున్నడనియుచు ననునేదో
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: మనసు కనిపెట్టి మాట్లాడితే ఎంతటి వారైనా మెచ్చుకుంటారు. మనసు తెలుసుకోకుండా మాట్లాడితే ఎదుటివాళ్ళు కోపగించుకునే అవకాశం ఉంది. లేదా వ్యతిరేకంగా మాట్లాడతారు.
ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి

వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: భార్య మాటలు విని అన్నదమ్ములను ఏవగించుకొని వేరింటి కాపురం పెట్టడం వెర్రితనం. ఇది కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడం వంటిది.

జ్ఞానియైనవాని మానక పూజించు
మనుజుడెప్పుడు పరమునను ముదంబు
సుఖమునందుచుండుసూరులు మెచ్చగ
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: జ్ఞానిని గుర్తించి ఎప్పుడు పూజించాలి. పుణ్యాత్ముడు భువిలోను, దివిలోను సమస్త సుఖములను అనుభవిస్తాడు.
హాని కలుగబోదు హరిమది నెంచెడు

వాని కబ్దు పరము వసుధయందు
పూని నిష్ఠమీరి పొదలక యుండుము
విశ్వరాభిరామ వినురవేమ!
తాత్పర్యం: భగవంతుడిని మనస్సులో ధ్యానించే వారికి ఎలాంటి హాని జరగదు. అతడికి తప్పక ముక్తి లభిస్తుంది. అందుకే నిష్ఠతో దేవుడిని ధ్యానించి నిశ్చలంగా జీవించాలి.
అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను

సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: అల్పుడెప్పుడు మాట్లాడినా ఆడంబరంగానే ఉంటుంది. అదే సజ్జనుడు మాట్లాడితే చల్లగా నిరాడంబరంగా ఉంటుంది. కంగున మోగి విలువలేని ఇత్తడిలాగా అనవసరమైన హడావిడి చేసేవారు అల్పులు. శబ్దం రాకపోయినా బంగారం లాగా విలువైన వాడు సజ్జనుడు.

న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు
జ్యోతిషము జనముల నీతుల దప్పించు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: జాతకాలు, ముహూర్తాలు, శుభలగ్నాలు మొదలైనవి వేలం వెర్రిగా పిరణమించాయి. న్యాయం అన్యాయమవుతోంది. శాస్త్రోక్తమైన శుభలగ్నాలు పెట్టినా అవి అప్పుడప్పుడు అశుభాలుగానే మారుతున్నాయి.

దేవుడనగ వేరే దేశముందున్నాడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనములనెక్కి పడిదోలుచున్నాడు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: మన ఇంద్రియాలను నడిపించే జీవ చైతన్యమే దేవుడు. ఆ దేవ చోదితుడైన నరుడు తన వాళ్లకోసం పాటుపడాలి.
భూమిలోన బుట్టు భూసారమెల్లను

తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: ఈ ప్రపంచం నుంచే సమస్త చరాచర జీవకోటి జన్మిస్తుంది. మానవుడి ఉనికిలో నుంచే చైతన్యం ఉద్భవిస్తుంది. శ్రమలో నుంచే సర్వం ఉత్పన్నమవుతుంది. శ్రమించనిదే సృష్టిసాగదు. శ్రమంలో నుంచే సంపద వస్తుంది.

వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు
చేతకంటె హెచ్చు వ్రాత లేదు
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: చేసుకున్న దానికన్నా చిన్నమెత్తు దేవుడు కూడా ఇవ్వలేడు. దీనినే లోకులు బ్రహ్మవాతలంటారు. తల వ్రాతకు బ్రహ్మదేవుడు కర్త కావచ్చు గానీ, తన చేతకు నరుడు తానే కర్త.

అనువుగాని చోట అధికుల మనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ యద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: అనువుగాని చోట ఎవరూ తమ ఆధిక్యాన్ని చూపడానికి ప్రయత్నించకూడదు. కొద్దిగా తగ్గివున్నా తప్పులేదు. పెద్ద కొండ సైతం అద్దంలో చిన్నది కనిపిస్తుంది. అలాగే సమయం వచ్చే ఆధిక్యాన్ని ప్రదర్శించకుండా ఒదిగి ఉండాలి.

ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ
నంటి చూడలేక యడవులందు
నుంట మేటంచునుందురా జోగులై
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: ఎల్లప్పుడూ ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి. అయితే ఈశ్వరుడెవరు, ఎక్కడ ఉంటాడనీ వెతికేందుకు అడవులకు వెళ్లాల్సిన అవసరంలేదు. తనలోనే తత్వం ఉంచితే, ఇంట్లోనే ఈశ్వరుడుంటాడు. అందరిలోనూ ఆ దేవుడు ఉంటాడు.

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: తాము ప్రబోధించే సంస్కారం చాలా పుణ్యమైంది. దీనిని చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చన్నిదైనా అదేం తక్కువ పనికాదు. చూడ్డానికి మర్రి విత్తనమంత కనిపించినా సారవంతమైన నేలలో నాటితే మర్రి వృక్షంగా రూపొందుతుంది.

అగ్నిబానా మేసి యంబుధి నింకించు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: మహిమతో మహాసముద్రాన్ని ఇంకించిన వారైనా సరే మానవ ప్రయత్నంలో సేతువు కట్టందే ఆ దరి చేరుకోలేరు. పూజవల్ల కాదు, పూనుకవల్ల ఏదైనా నెరవేరుతుంది.

ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు
నం దొకండు విడ్డ పొందు చెడును
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: కలసికట్టుగా ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు. అయిదు వేళ్లు కలిపితే చేయి మరింత బలంగా మారుతుంది. కుటుంబంలోను, కులం, వర్గంలోనూ, అందరూ సయోధ్యగా ఉంటేనే పనులు జరుగుతాయి.
ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె

జీవబుద్ధి వలన జీవుడయ్యె
మోహబుద్ధిలయము ముందర గనుగొను
విశ్వదాభిరామ వినురమేమ!
తాత్పర్యం: ఆత్మ అంతా తానే అయినా జీవిస్తూ ఉండడంవల్ల వల్ల జీవుడయ్యాడు. జీవుడికి సహజమైన మోహాలు లోభాలు సహజం. వయస్సు ముదురుతన్న కొద్దీ మోహం ఎక్కువ అవుతుంది.
గుణములోగలవాని కులమెంచగానేల

గుణము కలిగెనేని కోటిసేయు
గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: గుణవంతుడి కులాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ధనవంతుడు కాకపోయినా గుణం ఉంటే చాలు. గుణహీనుడు చిల్లిగవ్వ విలువ కూడా చేయడు.

తల్లితండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: జన్మనిచ్చినవారిపై జాలీ, ప్రేమ లేనివాడు పుట్టినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే. వాడి బతుకు పుట్టలోని చెదల వంటిది. అవి పుడితే ఎంత? చస్తే ఎంత?
కోపమున ఘనత కొంచెమైపోవును

కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. ఉన్న కొద్ది సుగుణం కోపం వల్ల తక్కువైపోతుంది. కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది. అందుకే శాంతమే శ్రీరామరక్ష.

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా
నలుపు నలుపేకాని తెలుపుకాదు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినా రంగు అలాగే ఉంటుంది తప్ప తెలుపుగా ఎట్టి పరిస్థితుల్లోను మారదు. కొయ్యబొమ్మను తీసుకువచ్చి ఎంతకొట్టినా దానికి సుగుణాలు అలవాటుకావు. అదేవిధంగా మూర్ఖుడికి ఎంత బోధించినా జ్ఞానం తలకెక్కదు.
అల్పబుద్ధివానికధికారమిచ్చిన

దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ
తాత్పర్యం: అల్పుడికి అధికారమిస్తే మంచివారిని పక్కనపెట్టి వంతపాడేవారిని కొలువులో చేర్చుకుంటాడు. చెప్పుతినే కుక్కకు చెరకు తీపి తెలియనట్లే చెడ్డవారికి మంచివారి విలువ తెలియదు.
పట్టుపట్టరాదు పట్టివిడువరాదు

పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: అవగాహన లేకుండా ఏ పనీ ప్రారంభించకూడదు. మనం చేసే పని యోగ్యమైందని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వదలకూడదు. మధ్యలో వచ్చే అంతరాయాలకు, అపాయాలకు, ప్రలోభాలకు గురై పట్టువిడవడం కంటే పడి చచ్చిపోవడమే మంచిది.
తుమ్మచెట్టు ముండ్ల తోడనేపుట్టును

విత్తులొననుండు వెడలునట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టను
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: చెట్టు పుట్టినప్పుడే తుమ్మచెట్టుకు ముండ్లు పుట్టును. అదీ విత్తు నుండే ప్రారంభమగును. అదేవిధంగా ముర్ఖునకు చెడ్డబుద్ధి పుట్టకతోనే వచ్చును.
కపటి వేషమూని కడగండ్లు పడనేల

విపిన భూమి తిరిగి విసుగనేల
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
విశ్వదాభి రామ వినుర వేమ
తాత్పర్యం: కపట వేషాలు వేసి కష్టాలు పడడం, అడవులకు వెళ్ళి విసుగు పుట్టేలా తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముక్తిని పొందడానికి ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే చాలు.

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: తగనిచోట తాము గొప్పవారమని చెప్పరాదు. కొంచెం వారైన మాత్రాన హాని లేదు. పెద్దకొండ అద్దంలో చిన్నదిగా కనిపించును కదా.

మనసులోనున్న మర్మమంత ఎరిగి
స్థిరము చేసి ఆత్మ తేటపరిచి
ఘటము నిల్పవలయు, ఘనతలింకేటికి
విశ్వదాభి రామవినురవేమ
తాత్పర్యం: మన మనస్సును మనమే అర్థం చేసుకొని స్థిరపరుచుకుంటే ఆత్మతత్వం బోధపడుతుంది. అలా తెలుసుకున్న వారికి ఇతర గౌరవాలేమీ అక్కర లేదు.


కదలనీయకుండ గట్టిగా లింగంబు
కట్టివేయనేమి ఘనత కలుగు
భావమందు శివుని భావించి కానరా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: పెద్ద శివలింగాన్ని కదలకుండా మెడలో కట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. మనస్ఫూర్తిగా శివుడిని ధ్యానించి సేవిస్తే చాలు. 

మేక జంకబెట్టిమెలగుచు మందలో
బ్రమని తిరుగు గొల్ల పగిదిగాను
దేవునెరుగక పరదవేతల దలచు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: మేకను చంకలో పెట్టుకొని మందలో వెతికినట్లు, హృదయంలో ఉన్న దేవుడిని గుర్తించకుండా ప్రజలు ఇతర దేవతల కోసం తిరుగుతుంటారు.

తన కుల గోత్రము లాకృతి
తన సంపద కలిమి బలిమి తనకేలనయా?
తన వెంటరావు నిజమిది
తన సత్యమే తోడువచ్చు తనతో
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: తన కులం, వంశం, రూపం, సంపద, బలం మొదలైనవి తాను చచ్చేటప్పుడు వెంటరావు. సత్యం ఒక్కటే తనతో వస్తుంది. గర్వం వీడి సత్యసంథతతో ప్రవర్తించాలి.


కలిమిగల్గనేమి కరుణ లేకుండిన
కలిమి తగునె దుష్టకర్ములకును
తేనెగూర్పనీగ తెరువున బోవదా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: సంపద ఉన్నా, జాలి, దయ లేకపోతే ఆ సంపద నశిస్తుంది. తేనేటీగలు కూర్చిన తేనే ఆ ఈగలకు దక్కని విధంగా దుష్టుల సంపదలు కూడా వారికి దక్కవు.
ఎండిన మానొకటడవిని

మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదువును వేమా
తాత్పర్యం: ఎండిన మాను అడవిలో ఉంటే దానిలో నుంచి పుట్టిన అగ్ని అడవి అంతటినీ దహించివేస్తుంది. అలాగే వంశంలో ఒక నీచుడు పుడితే ఆ వంశమే నశించిపోతుంది.
కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు

ఉభయులరయుగూడి యుండినట్లు
పేద పేద గూడి పెనగొని యుండును
విశ్వదాభిరామా వినురవేమ
తాత్పర్యం: కుంటి, గుడ్డి పరస్పరము సాయపడునట్లు బీదవానికి బీదవాడే సాయపడును. సజ్జనుడు సజ్జనునే చేరును.

మాటలాడు గల్గు మర్మములెరిగిన
పిన్నపెద్దతనము లెన్నవలదు
పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా?
విశ్వధాభిరామ వినురవేమ
తాత్పర్యం: మాటలాడు నేర్పు ఉన్నవాడు చిన్నవాడైనా, పెద్దవాడైనా ఒకటే. చిన్నవాళ్ల చేతిలో ఉన్న దీపం కూడా చక్కగానే ప్రకాశిస్తుంది కదా.

కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
మొండి వాని హితుడు బండవాడు
దుండగీడునకును కొండెడు దళవాయి
విశ్వదాభిరామా వినురవేమ
తాత్పర్యం: కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలైనట్లు మొండివానికి బండవాడు మిత్రుడైనట్లు. దుర్మార్గునకు అబద్దాలకోరు సహాయపడును.


ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీటనుండనేని నిక్కిపడును
అండతొలుగు నెడల నందర పని అట్లే
విశ్వదాభి రామ వినురవేమ
తాత్పర్యం: నీటి నుంచి బయటకు వస్తే చేప మృతిచెందుతుంది. నీటిలో ఉంటేనే ఆనందంగా ఆడుతుంది. అలాగే మానవుడు తనకు తడిన ఆధారం ఉంటే ఆహంకారంతో ప్రవర్తిస్తాడు. లేకపోతే అణిగిపడి ఉంటాడు.

తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
జాలిపడెడు వాడు జడుడు సుమ్మి
తారతమ్య మెరుగనేరని పశువది
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: తల్లి బాధపడుతున్నా లెక్కచేయకుండా, భార్య దుఃఖిస్తుంటే భార్యపై జాలిపడే వాడు మూర్ఖుడు. చిన్నా పెద్ద భేదం తెలుసుకొని ఎవరి గౌరవం వారికి ఇవ్వడం తెలియనివాడు పశువుతో సమానం.

అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్‌
విడువక కూరిమి సేయకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!
తాత్పర్యం: వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.


పరులమేలు చూసి పలుకాకి వలె
వట్టిమాటలాడు వాడు అధముడు
అట్టివాని బతుకుటదిఏల మంటికా?
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: పరుల మేలు చూసి ఓర్వలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలి. అలాకాక అసూయపడేవారి బతుకు నిష్ప్రయోజనం.

గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: ఆవుపాలు కొంచమైనా చాలు గాడిదపాలు కుండనిండా ఉన్నా ప్రయోజనం లేదు. ప్రేమతో పెట్టిన తిండి కొంచమైనా తృప్తి ఇస్తుంది. తిడుతూ ఎంత పెట్టినా తృప్తి ఉండదు.

చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్కయైనా బాధసేయు
బలిమిలేని వేళ పంతములు చెల్లవు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం: ఎంత గొప్పవాడైనా బలహీనుడైనపుడు అల్పుడికైనా లొంగిపోతాడు. చేజిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా బాధించగలదు కదా!
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net