Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'


చలం ప్రేమలేఖలు
మనుషుల్లో యవ్వనం శాశ్వతంగా ఉండిపోయేలా మందులేవో కనిపెట్టే పరిశోధనలేవో జరుగుతున్నాయి!!
అలాగే అందర్నీ ‘నిత్య ప్రేమికులుగా’ మార్చే మందేమైనా ఉందా?ప్రేమరానివారినీ, అదంటే కానివారినీ.. 
వయసులకు అతీతంగా.. ఒక్క గుక్కలో... కాదుకాదు ఒక్క చుక్కలో ప్రేమికులుగా మార్చే మందు... ఉందా?!
ఉంది. ఇదిగో ఇదే అది. వూహల చక్కెరద్ది.. పారవశ్యంతో పాకం పట్టి... అసభ్యతా పరీక్షలు నెగ్గి... తయారుచేసిన అక్షరాల ‘క్యాప్సుల్‌’!.
చలం తనలోకి విరహం... వివశతా అనే బ్యాక్టీరియాలు ఎక్కించుకుని తయారుచేసిన ‘యాంటీబాడీస్‌’!కనుకే ప్రేమంటే జంకేవారికి... ఇది ‘యాంటీ ‘భయా’టిక్‌’!చలం ‘ప్రేమ లేఖల’నే ఆ పూర్తి కోర్సులో ఓ చిన్న శాంపిల్‌ మందు... మీ కోసం..!
రాత్రి పది గంటలు. నా గుడిశలో వొంటరిగా కూచున్నాను. రోజల్లా విరామం లేకుండా వాన కురిసింది. ఇంకా కురుస్తోంది. బైట కటిక చీకటి. ప్రతి నిముషం తనలోకి ప్రవహించే యీ పట్టణపు మురికివాననీటిని, కలుపుకోడం యిష్టంలేక పోట్లాడుతోంది నది. చలి, తలుపు దగ్గిరగా దీపం నీడలో కూచుని రాస్తున్నాను. కొంచెం వైనూ, నువ్వూ, అంతే తక్కువ నాకు. పోనీ వైను వొద్దులే. వేడి కాఫీ చాలు. ఈ రాత్రికి రాకూడదా నువ్వు?

ఇన్ని సంగతులు, విచిత్రాలు జరుగుతాయే యీ లోకంలో, తప్పిజారి పొరబాటున ఇది జరగకూడదా? అనుకుంటాను. అనేకమంది వొస్తారు. వెడతారు. అనుకోని విషయంగా, నువ్వు నా దగ్గిరకి రావడమనేది ఈ రాత్రి జరగకూడదా? ఇన్ని అద్భుతాలు జరిగే లోకంలో యిది అసంభవమా!

నువ్వు నాకు చెప్పిన అరేబియన్‌ నైట్స్‌ కథలో ఎవరో దేవతలు చైనా దేశపు రాకుమారిని ఒకరాత్రి హఠాత్తుగా బాగ్దాద్‌ రాజకుమారుడి పక్కలో పడుకోబెట్టి, తెల్లారేసరికి తీసుకుపోయినారు కదా! ఆ దేవతలు యీ కాలంలో లేరా, ఉండి నామీద కనికరించరా?

సాయంత్రం -మ్మని అడిగాను. ఏమని? ‘‘నువ్వేనా, సిగరెట్‌ కాల్చిం తరవాత నా నోరు చక్కగా వాసన వేస్తుంది అన్నావు?’’ అన్నాను. ఆ ప్రశ్న అడుగుతుండగానే జ్ఞాపకం వొచ్చింది నా పొరపాటు. ఆమెకాదు ఆ మాట నువ్వు అన్నావు. చూశావా ఎట్లాంటి ప్రమాదంలో పడ్డానో. ఇంకో స్త్రీ సహిస్తుందా అట్లాంటి మతిమరుపు! శిక్షపడ్డాను నా ప్రశ్నకి.

మన ముద్దుల విభజన జ్ఞాపకముందీ!

టీ ముద్దు...సిగరెట్‌ ముద్దు...ఫ్రెంచి ముద్దు

ఇంత దూరంనించి నిన్ను ముద్దు పెట్టుకుంటే దీనికేం పేరో?

ఆధ్యాత్మిక ముద్దా!

నిద్రలో, ఇంతదూరం నించి నేను పంపే ముద్దుని గుర్తెరిగి, నా దగ్గిర వున్నప్పుడు చేసినట్లే, ఆనందంతో, కళ్ళు మూసుకునే, చిరునవ్వు నవ్వుతావా? కాని, చూచి సంతోషించేదెవరు? లేక బద్ధకంగా, నీ పొడుగాటి చేతులెత్తి, ఇంతదూరాన వున్న నా కంఠాన్ని, దగ్గిరకి లాక్కోవాలని శూన్యాన్ని వెతుకుతావా?

ఇవన్నీ యెట్లా జ్ఞాపకం ఉంటాయో? చూశావా ఒక్కొక్కటే యిట్లా స్ఫురణకి వొచ్చి గడిచిన భాగ్యానికై కొంచెం ఆనందమూ, నా ప్రస్తుతపు దరిద్రానికి వ్యసనమూ కలుగుతుంది.

ఈవాళ పొద్దున్న నేను లేచి చూసేప్పటికి, చక్కని గుండ్రని చిలకలు రెండు నా శీతాఫలం చెట్టుమీద కూచుని, నేను నా కోసం బాగా పండాలని ఉంచుకున్న పెద్ద పండుని ఫలహారం చేస్తున్నాయి. ఒక్కొక్క గింజే చెరొకసారి ముక్కుముంచి తీసుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాయి. నాకు కోపమొచ్చి తరిమెయ్యబోయి ఆగాను. నా దగ్గిరగా కూచుని అంతంలేని కబుర్లతో నన్ను నవ్వించే నువ్వు జ్ఞాపకం వొచ్చావు. ఇద్దరం ఎన్ని గంటలు నది నీళ్ళవంక చూస్తూ విసుగులేని కబుర్లు అర్థమూ, అంతమూ లేకుండా చెప్పుకునేవాళ్ళం! వాటికిట్లా పొద్దున్న కడుపులు నిండితే, యింక రోజంతా హాయిగా కాంతిలో, ప్రేమతో, అరుస్తో, చెట్లలో దాగుడుమూతలాడుతో ఆడుకోగలవు గదా! పోనీ వాటినన్నా సుఖించనీ.

ఆ చిలకల్ని చూడగానే ‘అంతమాత్రం వాటికి తెలియవొద్దా ఇది నా చెట్టు అని!’ అనిపించింది. కాని, వెంటనే నవ్వుకున్నాను. ప్రపంచమంతా వాటిదే. నా భాష వాటికి అర్థమైనా ‘ఈ పండు నాది’ అంటే తెల్లబోయి చూస్తాయి. బలవంతుణ్ని గనక నేను వాటిని తరిమితే, ‘యింకేమీ పనిలేదా, పిట్టల్ని తరమడం తప్ప యీ మనిషికి!’ అనుకుంటాయి. నాకు సిగ్గేసింది. ప్రపంచానికంతా అధిపతినై పుట్టిన నేను యీ చెట్టునీ, పండునీ, యీ బట్టల్నీ, పువ్వుల్నీ, నావని వేరుగా తీసి దాచుకునే, దరిద్రావస్థల్లో ఉన్నాను కదా అని సిగ్గుపడ్డాను. ప్రపంచమంతా నిండివుండే నిర్మలానందాన్నీ, కాంతినీ, నీటినీ, నీడల్నీ, అనుభవించే ఆ పక్షులు మనకన్న ఎంతో అధికులనిపించింది. ఎవరికీ కాకుండా దాచుకోవాలని ప్రయత్నించవు కదా!

నీకిట్లా ఉత్తరాలు రాస్తే నా హృదయానికి ఉపశాంతి కలుగుతుంది. ఎవరితోనైనా మాటాడితేగాని, వాస్తవంగా కనబడదు. ఎవరితో మాట్లాడను? అర్థంకాని వాళ్ళతో మాట్లాడతానేమో, అపవిత్రమౌతుందేమోనని భయం. ‘ర-మ్మ’ను చూడడానికి వెళ్ళాలి. ఆమెతో మాత్రమే నీ సంగతులూ, మన ప్రేమా మాట్లాడగలను. ఆమెకే అర్థమౌతుంది.

మనం ముగ్గురం హోటల్లో గడిపిన రాత్రి చాలాసార్లు జ్ఞాపకం వొస్తుంది. ఆమెని నిద్రపుచ్చి గదిముందు చీకట్లో కుర్చీలలో కూచుని చేతులమీద చేతులు వేసుకుని ప్రేమా, జీవితమూ, సృష్టీ, మనమూ, మన కష్టాలూ, యిట్టా మాట్టాడుతూవుంటే, ఆనందమో, దుఃఖమో కళ్ళనిండా నీళ్లు కమ్మాయి. మాట్లాడలేక చేతుల్ని బిగించుకుని కూచున్నాను. ప్రేమతో, ఆలోచనలతో, ఉద్రేకాలతో మన హృదయాలు కొట్టుకున్నాయి. మన వియోగాలూ, భగ్నమయే మన ఆశయాలూ, మన ఆశలూ, యెన్నో మాట్లాడాము రెండు గంటలదాకా!

ఇన్ని బాధలు, ఇంత విరహాన్ని భరిస్తున్నా ఎంత ఉత్తమము. ఎంత ధన్యమయింది నా జీవితం! ప్రేమతో పవిత్రమూ, ఫలవంతమూ అయింది. ఇంక ముందేమైతేనేం, అటువంటి ప్రేమ ననుభవించిం తరవాత!

నిన్న సాయంత్రం నదివొడ్డున శాంతంగా వుంది. పగలంతా కలతపెట్టి చాకలివాళ్ళు యిళ్ళకి వెళ్ళారు. నది చంద్రుడితో ఆటలకై సిద్ధపడుతోంది. శుక్రుడు తన కాంతి ఆశీర్వచనాలను నీటి మీద వెదజల్లుతున్నాడు. ఉండి ఉండి, గాలి మెల్లిగా నీటిని వొడ్డువేపు తోసి, గులక మీద చప్పుడు చేయిస్తోంది. నువ్వే నా పక్కన కూచుని వుంటే!

ఆ రెండో వొడ్డున ఏమున్నదో నాకు తెలుసు. కాని, నీటి అవతల పొద్దుగుంకినప్పుడు, ఎంత ‘మిస్టీరియస్‌’గా ఉంటుందో! అదేదో నేనెరగని లోకంవలె కనబడుతుంది. నేనెరిగిన లోకం నాదికాదని, దాని స్వరూపమే నాకు తెలీదని చెప్పడానికి గావును ప్రతి దినమూ చీకటిపడుతో ఉంటుంది ఇట్లా!

నిన్న తెల్లారకట్ట మూడింటికే లేచి ఒక్కణ్ణీ నదివొడ్డున కూచున్నాను. పారిపోతున్న చంద్రుడు మంచుమబ్బుల వెనకనించి దిగులుగా నావంక చూస్తున్నాడు. ఒక రవ్వ గాలి లేదు. నది నిద్రపోతోంది. ఒక్క నా హృదయంలో లేదు శాంతి. యీ లోకానికంతా నీకోసం, నువ్వు కావాలి అని కోర్కెతో, నీ తల నా హృదయానికద్దుకోవాలని. నీ చేతిని నా మెడచుట్టు వెయ్యాలనే కాంక్ష అమితంగా బాధిస్తుంది. నువ్వు, నీ ప్రేమ, నాకు లేకపోతే యోగివలె నేను, యీ నిశబ్దంలో యీ శాంతంలో లీనమైపోయేవాణ్నా! లేదు ఈ హృదయానికి శాంతిలేదు.

అప్పుడే చాకలాడు బట్టలు ఉతికి యీ శాంతాన్ని భగ్నం చేస్తున్నాడు. అతనికి రాత్రి యెందుకు నిద్రరాదో! ఈ సన్నని కాంతిలో చలిలో ఏమి తొందర?

‘‘ఈ చంద్రుడు నీ గది దగ్గర ప్రకాశిస్తూ వుంటాడు. కిటికీలోంచి వెన్నెల నీమీద కూడ పడుతోందేమో, నామీద పడే యీ కిరణాలేనా? ఇన్ని వందలమైళ్ళ దూరమున్నా, నన్నూ నిన్నూ కలిపి చూస్తున్నాడు యితను. చంద్రుడికి దూరమనేది లేదు. నాకేనా’’ అనిపించింది.

ఈ శీతల కిరణాలు నీకేమన్నా నన్ను గురించి కలలు కల్పిస్తున్నాయా? యిట్లా వొంటరిగా చీకట్లో కూచుని నిన్ను గూర్చి తీవ్రంగా ఆలోచించే వాడున్నట్లు తెలుపుతాయా! ఏమో, నిద్రపోతున్న నీ ఆత్మ నా దగ్గరికి వొచ్చి తనని గుర్తుపట్టమని బతిమాలడం వల్లనేనేమో నాకీ ఆరాటం? మూర్ఖుణ్ణి, నేను నీ శరీరం కనబడితేగాని, నిన్ను గుర్తించలేను అనుకున్నాను ఆ వెన్నెట్లో.

నేనేమనుకుంటానంటే, మనిద్దరం చచ్చిపోయిన తరవాత, యీ ఆకలీ, అలసట లేకుండా, చెయ్యీ చెయ్యీ కలిపి, యీ నక్షత్ర లోకాలన్నీ తిరుగుతామేమో అనుకుంటా. ఎన్ని సుందరమైన కాంతులు, రంగుల రంగుల తేజస్సులు, రాత్రులలో మెత్తని మబ్బు నీరెండలు పగలు ఎన్ని నీలపు సముద్రాలలో స్తానాలు, ఇసికల మీద పడకలు, మబ్బుల మీద నవ్వులు, ఆటలు! ఉదయకాంతుల్లో పులకరించే పర్వతాగ్రాల మీద కెగిరి నుంచోడం సాయంత్రం మెరిసే ఆ ప్రేమ నక్షత్రంలో కూచున్నప్పుడు మనకెట్లా వుంటుంది? కాని అప్పుడు కూడా వుత్త ఆత్మలే కాదు నీ దేహం తెలుపు, నునుపు, మెరుపు, అన్నీ నాకు కనపడుతూ ఉండాలి.

కాని చచ్చిపోయిం తరవాత అసలు వుండమేమో! అప్పుడు యీ ప్రేమలో జ్వలించిన యీ నాలుగు గడియలేకద మనకి వుండేది! వాటినిట్లా, విరహంలో వృథా చేస్తున్నామా! వృథా కాదేమో! విరహంలో కూడా వొక విధాన మధురంగానే వుంది. కాని ఆ మాధుర్యంలో యింత తపన యెట్లా మిళితమయిందో తెలీదు.

‘నేను ప్రార్థిస్తే చంద్రుడు నన్ను ఎక్కించుకొని తీసుకువొచ్చి నీ దగ్గిర దింపడా?’ అనుకున్నాను. కాని, ఏం లాభం? ‘నా హృదయోద్రేకంతో చల్లని ఆ చంద్రుడు కూడా కరిగి నాకు సహాయం చెయ్యవచ్చునుగాని, జ-మ్మ హృదయం మాత్రం కరగదు. తలుపు తియ్యదు. చంద్రుడు మొగవాడు గనక అతనికీ ప్రవేశం లేదు. కాని ఇంగ్లిషు చదువుకున్నది గనక చంద్రుణ్ని ఆడదేనంటుందో? లేక పరీక్షిస్తుందో? తీరా మొగవాడైతే?’ అనుకుని నవ్వుకున్నాను.

పోస్టు జవాను దూరంగా కనబడితేనే నేనెంత ఆత్రుతతో వొణుకుతాననుకున్నావు? నా వూపిరి ఆగుతుంది. అంత మెల్లిగా నడుస్తాడేమా అని కోపం? నేనే అతనికి యెదురు పరుగెత్తితే యేమనుకుంటాడో? నా ఉత్తరాలు దాచుకుంటాడేమోనని భయం. ఇంతా చేస్తే నాకు ఉత్తరమే లేదంటే! నాకు వొచ్చిన ఉత్తరాలన్నీ కూడా ఇంకెవరి దగ్గిర్నించో ఐతే!

నా దగ్గరికి వొచ్చి కూడా ‘ఆ కట్టలో మెల్లిగా వెతుకుతాడు’. నీ వుత్తరం ఆ మిగిలిన వుత్తరాలన్నిటి మధ్య కలిపి కట్టడమేమిటి? బుద్ధిలేదూ? నీ ప్రేమ ప్రజ్వలితమైన లేఖ, ఆ మందులూ, ఏడుపులూ, తిట్లూ తీసుకొచ్చే వుత్తరాలతో కడతాడు. నీ ఫొటో వంక చూసి, నీ కళ్ళ లోపలికి చూసి, నీ స్వభావం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాను. నువ్వే ఇక్కడ వుంటే, నువ్వు నన్ను అట్లా చూడనివ్వవు. నవ్వి, ‘‘ఏమిటి అట్లా చూస్తావు?’’ అని ముఖం తిప్పేసుకుంటావు. కాని పాపం, యీ ఫొటో నా కళ్ళలోకి ఎదురుచూస్తుంది. నీ మెడవంక తెలుసు కదూ నీ మెడని నేనెంత ప్రేమిస్తానో! ఆ మెడ మీదనే ముగియాలి నా జీవితం!

కౌపర్‌ అనే ఇంగ్లిషు కవి, తన తల్లి బొమ్మని చూసి, ‘ఆ పెదిమలే మాట్లాడితేనా?’ అన్నాడు.

నేను నీ ఫొటో చూసి ‘ఆ పెదిమలే ముద్దు పెట్టుకుంటేనా’ అంటున్నాను.

కాని, నీకు కోపం వొస్తుందా? ఆ బొమ్మని ప్రేమిస్తున్నానని! ఆనాడు నా కుర్చీ పక్కన నువ్వు నుంచొని వుండగానే ఫొటోని నేను ముద్దు పెట్టుకుంటూ వుంటే నా మెడమీద చెయ్యేసి, ‘‘నీకు వెర్రా, నేను వుండగానే!’’ అనలేదూ నువ్వు!

‘‘నేను నువ్వు లేనప్పుడు ప్రేమించి, నువ్వు రాగానే వొదిలితే, యీ అమ్మాయి యామనుకుంటుంది?’’ అన్నాను అవునా?

ప్రతి నిముషమూ నువ్వు వొస్తున్నావనే అనుకుంటా, గుమ్మం దగ్గిర నుంచుని యీటూ అటూ చూస్తాను వెర్రిగా.

టాగూరు రాశాడు- ‘‘వొస్తున్నాడు. అతని పాదాల చప్పుడు వినపడుతుందేమోనని గుమ్మంలో నుంచుంటాను. వొకవేళ వొచ్చి, నేను గుమ్మం దగ్గిర కనపడకపోతే! వొస్తున్నాడు. ఎండ కాంతిలో, వానరాత్రుల చీకట్లో, వొస్తున్నాడు. నా హృదయం మీద ధ్వనిస్తున్నాయి అతని పాదాలు.’’ అట్లా వుంది నా సంగతి. రైలు దగ్గర నేను కనపడక వెళ్ళిపోతావేమో అని ప్రతి మెయిలుకీ వెడతాను. ఏమి వెర్రి యిది అని నాలో నాకు తోస్తుంది.

ఈ మాటలు రాస్తో వుండగా నీ ఉత్తరం వచ్చింది. నిజమా... కలా? నిజంగా వొస్తున్నావా? ఇప్పుడు రైల్లో ఉన్నావా? నా దగ్గరికి గంటకి యాభైమైళ్ళ వేగంతో వొస్తున్నావా? అనంతమైన దూరం తగ్గిపోతుంది. ఈ దేశంలో రైళ్ళు గంటకి నూరుమైళ్ళ వేగంలో పరిగెత్తకూడదూ? వాళ్ళ సొమ్మేం పోయింది? ఈ రైళ్ళు వేసినవాళ్ళకి హృదయం లేదు. వాళ్ళకి ప్రియులు లేరు గావును పాపం! లెక్కవేసి చూశాను. నూరుమైళ్ళ ప్రకారమైతే యీ సాయంత్రం ఆరు గంటలకే యిక్కడ ఉండే దానివి కద! ఇప్పుడు యీ రాత్రి వృథా! జీవితంలో ఎవరిస్తారు యీ రాత్రి నాకు మళ్ళీ? నీతో ఉండే ఒక్కరాత్రి!

మళ్ళీ అనుకుంటాను కదా, యింతా నేను సంతోషపడి, ఆత్రుతపడి నువ్వు వొచ్చినట్లే తలచుకుని, నీకోసం అంతా సిద్ధమైనాక నువ్వే రాకపోతే ఎట్లా ఉంటుంది.

రైలంతా చూస్తాను. ముందే తలయెత్తను. ఇంజను దాటినట్లు చప్పుడు తెలియజేసేవరకు కళ్ళు కిందికి వాల్చి వుంచుతాను. తరవాత ఒక్కొక్క పెట్టే నువ్వు కనబడకుండా, నన్ను దాటినకొద్దీ నా హృదయం కుంగడం మొదలుపెడుతుంది. అసలే కనబడకపోతే, ఆ రైలు కిందన్నా పడకపోతినా అనిపిస్తుంది. గార్డును నిన్ను గురించి అడగాలనిపిస్తుంది.

లేదు నువ్వు వొస్తున్నావు. వొస్తున్నావని గోదావరి ధ్వనిస్తోంది. నావేపు, అవుగో, అలలు ఎట్లా దొల్లుతున్నాయో సంతోషంతో! మళ్ళీ మనిద్దరం స్నానాలు చేస్తామని, నీ నున్నని భుజాన్నీ, నీ తెల్లని చేతుల్నీ తాకవొచ్చని యెంత ఆనందిస్తోందో నది! వొస్తున్నావు నాకు తెలుసు నిన్ను రైల్లో చూసిన గాలి ముందే వొచ్చి నాకు చెపుతోంది. లేకపోతే యింత మాధుర్యమెక్కడిది యీ ఉత్తర వాయువుకి! తప్పదు. వస్తున్నావు. నిరంతరమూ నా దగ్గరికి వొస్తూనే వున్నావు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
Top  |  previous page
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net