Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'

ఆయుష్మాన్‌భవ!
నూరు కూడా కాదు, నిజానికి మనిషి ఆయుర్దాయం నూట ఇరవై ఏళ్లని శాస్త్రవచనం. దానిలో ఓ ఇరవై తగ్గించి ‘నిండు నూరేళ్లు కన్నుల పండువగుచు ఆయురారోగ్య భాగ్యమ్ములందుకొనుడు’ అని పెద్దలు జంటలను దీవిస్తూ ఉంటారు. మనిషి ఆయుర్దాయాన్ని సంవత్సరాల్లో కాకుండా- ఎన్ని పున్నమలు చూశాడనేది లెక్కించాలని ఒక వాదం. ‘జీవుడు వేయి పున్నమల జీవన భాగ్యమునందెనేని సంభావన సేయగా దగును భాగ్యవిశేషము నూరు ఏండ్లుగా’ అనేది వారి మాట. వేయి పున్నమలకు ‘సహస్ర చంద్రదర్శనోత్సవం’ అనే సంప్రదాయం అలా వచ్చిందే. దాంతో మరో పదహారేళ్లు కోత పడింది. ఈ లెక్కలన్నీ పక్కకు నెట్టి, ‘ఒత్తిడి లేని జీవితము ఓరిమి, యొద్దిక గల్గు భార్యయున్‌ మెత్తని వర్తనమ్ము సుతిమెత్తని లాలన చాలు ఎల్లకాలమున్‌’ అనుకుంటూ బతికినంత కాలం నిశ్చింతగా గడపాలన్నది సగటు మానవుడి జీవితాశయం. నూరేళ్ల సంపూర్ణ ఆయుర్దాయం పెద్ద విషయమేమీ కాదు సుమా, ‘చరమధాతురక్ష సమ్మతినొనరించు సజ్జనుండు వర్ష శతము బ్రతుకు’ అంటూ ఆయుర్వేద సూత్రాన్ని వివరించింది ‘చారుచర్య’ గ్రంథం. చరమధాతువంటే శుక్లం! మనిషి దేహంలో పది వాయువులు కాక, ఏడు ధాతువులుంటాయంది ఆయుర్వేదం. ఆ సప్త ధాతువుల్లో చరమ- అంటే ఆఖరిది శుక్లధాతువు. ఆయుష్షు పెరగడానికి శుక్లధాతువు దోహదపడుతుంది. పది ఆయువుల్లో చివరిదైన ధనంజయ వాయువు ముఖ్య కర్తవ్యం శుక్లధాతువును రక్షించడమే అంది. బతుకుమీద తీపి అందరికీ సహజమే గాని- హితబోధలు, ఆరోగ్య సూత్రాలంటే మాత్రం చేదు. ‘అపథ్యము అగు భోజనములు హరించును ఆయువు’ అని పంచమవేదం చెప్పిన మాట మనకు అందుకే రుచించదు.

శ్రీకృష్ణుడు 125 ఏళ్లు జీవించాడని- హరివంశం, విష్ణుపురాణం, భాగవతాల కథనం. దేహత్యాగం చేసేనాటికి భీష్మాచార్యుడికి 170 ఏళ్లని, ధర్మరాజు పట్టాభిషిక్తుడయింది- 80వ ఏట అనీ పరిశోధకుల తీర్మానం. అవి ద్వాపరయుగం నాటి ఆయుర్దాయాలు. కలియుగం వచ్చేసరికి మానవులు ‘అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు...’ అని భాగవతం చాటింది. అల్పతరం అంటే కొలత- నూరేళ్లని! నిజానికి నిండు నూరేళ్లు జీవించాలనేది ఆశ కాదు- మనిషి హక్కు! వందేళ్లు బతికిన మనిషిని చూసి ఆశ్చర్యపడటం దేనికని ప్రశ్నించాడో కవి. ‘నిండుగ నూరుయేండ్లు మనినాడని అచ్చెరువొందుటేల? తానండగ ధర్మబద్ధముగ నుండిన చాలు...’ అన్నాడు. ఆ మాటను వేదం ఏనాడో ఆకాంక్షించింది. ‘జీవేమ శరదశ్శతం... నందామ శరదశ్శతం... జీవచ్ఛవంలా కాకుండా వందేళ్లపాటూ జీవకళతో మనిషి ఆనందంగా గడపాలి’ అని ఆశీర్వదించింది. ‘శతమానం భవతి’ అన్నది మన పెద్దల దీవెనల్లో ప్రధానమైనది. ‘నూరేళ్ల ఆయుర్దాయం హక్కు సరే, దాని వెనక కొన్ని బాధ్యతలున్నాయి’ అంది భారతం. ఓర్పు, సత్యం, దయ, శుచీశుభ్రత, గురువులపై భక్తి- మనిషి ఆయుర్దాయాన్ని హెచ్చిస్తాయని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. ‘క్షమయు సత్యంబు కృపయు శౌచమును గురుల వలని భక్తియును ఆయువు పొలుపునిచ్చు’ అని ఆనుశాసనిక పర్వం బోధించింది. తపస్సు, బ్రహ్మచర్య దీక్ష, ఆహార విహారాదులపై అదుపు వంటివి నూరేళ్ల ఆయుర్దాయానికి భరోసా ఇస్తాయనీ చెప్పింది. ‘తపమునను బ్రహ్మచర్య వ్రతమున హిత మితాశనమున... పెరుగును ఆయువు’ అంది. వ్యాయామం మనిషికి నిత్యావసరం అన్నాడు ఆయుర్వేద ఆచార్యుడు చరకుడు. ‘లాఘవం కర్మసామర్థ్యం... వ్యాయామంతో శరీరానికి చేవ, పనిలో సామర్థ్యం పెరుగుతాయి’ అని వివరించాడు. ఆయుర్వేదం మనిషి పూర్ణాయుర్దాయానికి ఎన్నో మార్గాలు సూచించింది.

రోజూ రాత్రి రెండుదాకా మేలుకుని, తన భార్య ఆరోగ్యం పాడుచేసుకుంటోందని వైద్యుడి దగ్గర వాపోయాడు భర్త. ‘అంత రాత్రిదాకా ఏం చేస్తుందావిడ?’ అని వైద్యుడు అడిగితే, ‘నేను బార్‌ నుంచి వచ్చేంతవరకు తిండికూడా తినకుండా కాచుకుంటుంది’ అని చల్లగా బదులిచ్చాడా పతిదేవుడు. ‘నా మరణశయ్య పరచుకొన్నాను నేనె... నాకు నేనె వీడ్కోలు విన్పించినాను’ అన్న కృష్ణశాస్త్రి మాటలు ఇలాంటివారికీ వర్తిస్తాయి. ఈ బాపతు దురలవాట్లే కాదు, ‘అలుక బొంకు క్రూరత శుచితాపగమము(అపరిశుభ్రత) గురు విరోధము- ఆయువు కడు కుంద(క్షీణింప) చేయు’ అని భారతం హెచ్చరించింది. ఇవికాక ప్రతి చిన్నదానికీ కంగారుపడటం, కుంగిపోవడం ఆయుక్షీణమేనని వైద్యులంటున్నారు. శాంతచిత్తం ఒక్కటే మనిషికి శ్రీరామరక్ష. ‘ఆపద వ్యాధి వార్ధకము అంతము ఎవ్వరికైన తప్పవు... ఉద్దీపక సజ్జనోత్తములు దీనిని అవశ్యమెరింగి స్వస్థులై ఓపగ నేర్తురీ స్థితులను వూర్జిత చిత్తులు శాంతవృత్తి...’ అన్న సుగుణాఢ్య శతక కర్త హితబోధ అందరికీ ఆచరణీయం. అబ్బో! నూరేళ్ల బతుక్కి ఇన్ని అగచాట్లా అని బెంబేలెత్తేవారికి చాలా సులభమైన చిట్కా ఏమిటంటే- ‘ఎక్కువమంది పిల్లల్ని కనడమే!’ ...మీరు చదివింది నిజమే! సంతానం ఎంత ఎక్కువైతే ఆరోగ్యం, ఆయుర్దాయం అంతగా పెరుగుతాయని బ్రిటిష్‌ కొలంబియాలో సైమన్‌ ఫ్రేజర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ పాబ్లో నెపొమషి బృందం పరిశోధనల్లో తేలింది. గర్భవతులైనప్పుడల్లా శరీరంలో ‘ఈస్ట్రోజన్‌’ హార్మోన్‌ పెరుగుదల దీనికి కారణమంటున్నారు. ‘మరి మా సంగతి ఏమిటి?’ అని పురుష పుంగవులు ఈర్ష్యపడవలసిన పనిలేదు. స్త్రీమూర్తులంతా సుఖసంతోషాలతో అలరారే కుటుంబాల్లో పురుషుల ఆయుర్దాయమూ ఇనుమడిస్తుంది!

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
Top  |  previous page
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net