కౌన్సెలింగ్‌, ఇంగ్లిష్‌ విభాగాలకు మీ సందేహాలు పంపాల్సిన చిరునామా:

చదువు డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
edc@eenadu.net

ఆర్టికల్‌షిప్‌ చేయబోతున్నారా?
సీఏ ఐ.పి.సి.సి. ఫలితాలు వచ్చాయి. సీఏ ఫైనల్‌ చేయాలంటే ఆర్టికల్‌షిప్‌ పూర్తిచేయవలసి ఉంటుంది. అవసరమైన విషయ పరిజ్ఞానాన్నీ, సీఏ ఉత్తీర్ణత తర్వాత చేయబోయే అన్ని పనులనూ ముందుగానే నేర్పే వేదిక... ఈ శిక్షణ!
పీసీసీ ఉత్తీర్ణులైనవారు ఒక ప్రాక్టీసింగ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర ఆర్టికల్‌షిప్‌కు పేరు నమోదు చేసుకొని రెండున్నర ఏళ్ళ పాటు శిక్షణ పూర్తిచేయాలి. అప్పుడు చివరి 6 నెలల్లో సీఏ ఫైనల్‌ రాయటానికి అనుమతి లభిస్తుంది. కోర్సుకు ఇచ్చే ప్రాముఖ్యాన్నే ఈ శిక్షణకూ ఇవ్వాలి. సి.ఎ. సర్టిఫికెట్‌ను మాత్రమే కాకుండా విజయవంతంగా సి.ఎ.గా స్థిరపడటానికి కావల్సిన అన్ని మెలకువలూ నేర్చుకోవాలి.

1. సి.ఎ. ఉత్తీర్ణత తర్వాత తానెలా స్థిరపడాలనుకుంటాడో విద్యార్థికి అవగాహన ముందుగానే వచ్చి ఉండాలి. ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు; ఉద్యోగానికి కూడా వెళ్ళవచ్చు. ప్రాక్టీసుకు వెళ్ళాలనుకుంటే ఈ ఆర్టికల్‌షిప్‌ ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే కూడా ఈ మెలకువలు ఉపయోగపడతాయిగాని, అవి ఉద్యోగంలో ఉపకరించవచ్చు, లేకపోవచ్చు. కొలువులో చేరాక కంపెనీ వారే స్వయంగా 3 నెలల నుంచి 6 నెలల పాటు శిక్షణ ఇస్తుంటారు. కాబట్టి ఆర్టికల్‌షిప్‌లో నేర్చుకున్న విషయాలు ఉద్యోగాలకు వెళ్ళేవారికి తక్కువగానే ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

2. పెద్దపెద్ద ఆడిట్‌ సంస్థల్లో ఆర్టికల్‌షిప్‌ చేయాలనే ఉత్సాహం ఈ మధ్య కాలంలో చాలామందిలో కన్పిస్తోంది. ఇది మంచిదే కానీ ఆ సంస్ధల్లో ఉండే కొన్ని కష్టాలు కూడా తెలుసుకోవాలి. అలాంటి కంపెనీల్లో నిపుణతకు పెద్దపీట వేస్తారు. అంటే ఒక విద్యార్ధి చేత అన్ని పనులూ, ఆడిట్లూ చేయించరు. కొన్ని రకాల ఆడిట్‌లు మాత్రమే చేయిస్తారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒకే రకమైన ఆడిట్‌కి పరిమితమైపోవడం వల్ల విద్యార్ధి అన్ని రకాల ఆడిట్‌ పనులూ గ్రహించే అవకాశాలు తక్కువ.

3. చిన్నచిన్న సంస్థల్లో/ మధ్యతరహా ఆడిట్‌ సంస్థల్లో ఆర్టికల్‌షిప్‌ చేస్తే ప్రతి విద్యార్ధీ అన్ని పనులు, అన్ని రంగాల్లో అనుభవం సంపాదించే వీలుంది. ఆడిట్‌ సంస్థవారు నేర్పించే దానికంటే కూడా విద్యార్ధి మనసు పెట్టి నేర్చుకునేవే ఎక్కువ. ఈ ఆర్టికల్‌షిప్‌ సమయంలో రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రకరకాల క్లయింట్‌ ఆఫీసులకు వెళ్ళి ఆడిట్‌ చేయవలసి ఉంటుంది. అందుకని...

- విరివిగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా రకరకాల క్లయింట్‌ ఆఫీసులకు తిరుగుతూ పని చేయడం భారంగా భావించకూడదు. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం నేర్చుకునే చక్కటి అవకాశంగా మాత్రమే భావించాలి.

- ఆడిట్‌ సంస్థలో దూసుకుపోయే తత్వం అలవరుచుకోవాలి. అంతేకానీ న్యూనతగా తమకు తామే చిన్న వాళ్ళం, తక్కువ వాళ్ళం అని అనుకుంటే క్లయింట్‌ ఆఫీసులో ఆడిట్‌ను చేయవలసిన రీతిలో చేయలేరు.

చదువుతూనే సంపాదన
ఈ విధానం ఆర్టికల్‌షిప్‌లో కన్పిస్తుంది. ఏ ఆడిట్‌ సంస్థలో చేరతామో ఆ సంస్థ వారు విద్యార్ధికి ఐ.సి.ఎ.ఐ. నిబంధనల ప్రకారం స్టయిపెండ్‌ కూడా ఇస్తారు. దీన్ని విద్యకు ఉపయోగించుకొని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండొచ్చు. అంతేకాదు, డబ్చు విలువ కూడా చదువుకునే సమయంలోనే తెలుస్తుంది.

సలహాలు, సూచనలు
* చాలామంది చేసే పెద్ద పొరపాటు- ఆర్టికల్‌షిప్‌లో పడి కనీసం పుస్తకాలు తీయరు; చదువుకోరు. చివరి 6 నెలల్లో సి.ఎ. ఫైనల్‌ పరీక్ష రాయకపోవడం, రాసినా విఫలమవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆర్టికల్‌షిప్‌ వ్యవధిలోనే ఉదయం పూట, సాయంత్రం పూట క్లాసులకు హాజరవుతూ సి.ఎ. ఇన్‌స్టిట్యూట్‌ వారి పుస్తకాలను తీసుకుని పరీక్షకు సన్నద్ధమవ్వాలి.

ఆర్టికల్‌షిప్‌లోని మొదటి సంవత్సరంలో కొన్ని, రెండో సంవత్సరంలో కొన్ని, చివరి 6 నెలల్లో కొన్ని.. అంటే ఉన్న ఈ సి.ఏ ఫైనల్‌ సబ్జెక్టును విభజించుకుంటూ ప్రాక్టికల్‌ శిక్షణతో పాటు చదువుకోవడం కూడా పూర్తి చేసుకోవాలి. అప్పుడే ఆర్టికల్‌షిప్‌, సి.ఎ. ఫైనల్‌కి సన్నద్ధత... రెంటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. సమయం కూడా కలసివస్తుంది.

* కొంతమంది ఆర్టికల్‌షిప్‌ చేయకుండా తెలిసిన ఆడిటర్ల చేత చేసినట్లుగా సర్టిఫికెట్లు తీసుకొని సి.ఎ. కోర్సు పూర్తిచేస్తున్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తే ఆచరణాత్మకంగా ఉండే సమస్యలు, వాటిని ఎదుర్కొనే ఆలోచనా విధానం తెలియక సి.ఎ. ఉత్తీర్ణత పొందినా జీవితంలో రాణించే అవకాశం కోల్పోతారు.

* మనకు కావల్సింది చక్కగా పని నేర్పించేవారు. అందుకని ఆఫీస్‌ భవంతులు, నగిషీలు, ఆఫీసులో సౌకర్యాలు ఇలాంటివి చూసి నిర్ణయం తీసుకోకూడదు. ఆ సంస్థ క్లయింట్లు ఎవరు, వారికి ఉన్న వృత్తి నైపుణ్యం ఏమిటి, ఆడిట్‌ సంస్ధలో చేరితే వచ్చే ఆడిట్‌ ఎక్స్‌పోషర్‌ ఏమిటి అనేవాటికి ప్రాధాన్యం ఇస్తూ ఆడిట్‌ సంస్థను ఎన్నుకోవాలి.

* ఏ సంస్థలో చేరాలనుకున్నారో అక్కడున్న సీనియర్లతో, అప్పటికే ఆర్టికల్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది.

* చాలామంది తమ నగరాన్ని వదిలేసి ఎక్స్‌పోషర్‌ వస్తుందనే ఉద్దేశంతో మెట్రో నగరాలకు వెళ్తున్నారు. అలా వెళ్ళే విద్యార్ధుల్లో కొంతమంది ఈ మెట్రో సంస్కృతికి ఆకర్షితులై చదువునూ, ఆర్టికల్‌షిప్‌నూ కూడా నిర్లక్ష్యం చేసి రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఇది గమనించాలి.

* ఆర్టికల్‌షిప్‌ చేసే విద్యార్ధులు తాము చేరిన సంస్థ నుంచి బదిలీ అయి వేరే ఆడిట్‌ సంస్ధకి మారటం ఒకప్పుడు సులభంగా ఉండేది. ఇప్పుడైతే ఐ.సి.ఎ.ఐ. నిబంధనల మూలంగా బదిలీ అంత తేలిక కాదు. అందుకే "Prevention is better than cure" అన్నట్లు ముందుగానే తగిన ఆడిట్‌ సంస్ధను ఎన్నుకోవడం మంచిది.


ఆర్టికల్‌షిప్‌ ప్రయోజనాలు
1. తరగతి గదిలో నేర్చుకున్న. సబ్జెక్టు పరిజ్ఞానం ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే వీలుంటుంది.

2. చదువుతున్న అంశాలపై లోతైన అవగాహన ఏర్పడి ఫైనల్‌ పరీక్షలకు ఉపయుక్తం.

3. శిక్షణ సమయంలో సహ విద్యార్థులు, సీనియర్లు, ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను విభాగం వారు, లీగల్‌ అడ్వైజర్లు.. ఇలా అందరితో కలసి పనిచేయటంవల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం ఉంటుంది.

4. ఈ శిక్షణను నిబద్ధతగా పూర్తిచేసినవారు తాము ఎంచుకున్న కెరియర్‌ గమ్యాలను చేరుకోవటంపై స్పష్టతతో ఉంటారు.

మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)
కొన్ని పెద్ద ఆడిట్‌ సంస్థలు తమవద్ద ఆర్టికల్‌షిప్‌ చేయాలనుకునే విద్యార్ధులకు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహిస్తుంటాయి. అటువంటి కంపెనీలకు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు:
* ముందుగానే సి.ఎ. ఐ.పి.సి.సి. లోని అన్ని సబ్జెక్టులనూ పునశ్చరణ చేసుకొని వెళ్ళాలి.
* ఇంటర్వ్యూకి వెళ్తున్న ఆడిట్‌ సంస్ధ పూర్తి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవారు తమ సంస్ధ పట్ల మీకున్న అభిప్రాయాన్ని అడగవచ్చు.
* మీరు ధరించే దుస్తులు ప్రొఫెషనల్‌ విధానం స్ఫురించేలా ఉండాలి. ప్రశ్నలకు కంగారు పడకుండా సమాధానం చెప్పండి.
* ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే నిజాయతీగా తెలియదని చెప్పాలి. ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేయకూడదు.
* మీరు పని చేయాలనుకుంటున్న ఆడిట్‌ సంస్ధ నియమ నిబంధనలకు లోబడి మీరు పని చేస్తారు. దానికి తగ్గట్టుగా మీ సమాధానాలు ఉండాలి.
గమనిక: సి.ఎ. ఐ.పి.సి.సి. పూర్తిచేసిన విద్యార్ధులు రెండు సంవత్సరాల ఆర్టికల్‌షిప్‌ పూర్తి చేశాక ఐ.సి.ఎ.ఐ. వారి గుర్తింపు పొందిన సంస్థల్లో పారిశ్రామిక శిక్షణ తీసుకునే అవకాశం ఉంది.


  • Railway Recuritment Board
  • Kovida