కౌన్సెలింగ్‌, ఇంగ్లిష్‌ విభాగాలకు మీ సందేహాలు పంపాల్సిన చిరునామా:

చదువు డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
edc@eenadu.net

 

 
డిప్లొమా తర్వాత... ఏం చేయాలి?
* డిప్లొమా(ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతున్నాను. డిప్లొమా తర్వాత ఇంజినీరింగ్‌ కాకుండా ఏయే కోర్సులు ఎక్కడ చేయవచ్చు?
వాటి అవకాశాల గురించి కూడా చెప్పగలరు.
- ఎస్‌. సాయిదత్త, అనంతపురం
జ: డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) వారికి ఉండే అవకాశాలుంటాయి. డిప్లొమా చదివనవారికి ఎంపీసీ వారు చేసే దాదాపు అన్ని కోర్సులూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థికి చాలా ముఖ్యమైన దశ. మీ ఆసక్తి, సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోండి.
డిప్లొమా (ఈసీఈ) చదివనవారు ఇంజనీరింగ్‌ కాకుండా బీఎస్సీ ( బయాలజీకి సంబంధించిన కోర్సులు తప్ప), బీఏ, ఎల్‌ఎల్‌బీ, చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రెటరీ మొదలైనవి చేయవచ్చు. అంతేకాకుండా మాస్‌ కమ్యూనికేషన్స్‌, జర్నలిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, లెదర్‌ టెక్నాలజీ, ప్లాస్టిక్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ మొదలైనవి చదవవచ్చు. ఈ కోర్సులు ఎక్కడైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేయడం మేలు. ప్రతి కోర్సు కూడా ప్రత్యేకత ఉండి, దానికి సంబంధించిన ఉద్యోగావకాశాలను కలిగి ఉంటుంది. మీ ఆసక్తిని బట్టి నిర్ణయాన్ని తీసుకోండి.


* ఎం.ఎస్సీ మ్యాథ్స్‌ ఫస్టియర్‌ చదువుతున్నాను. దీన్ని చేస్తూనే అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఈడీ మ్యాథ్స్‌ చెయ్యాలని వుంది. ఇలా రెగ్యులర్‌గా ఒక కోర్సు, దూరవిద్యలో మరో కోర్సు ఒకే సంవత్సరంలో చేయవచ్చా? భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందా? ఇలా చేస్తే రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించే టెట్‌, డీఎస్సీలకు అర్హత ఉంటుందా?
- షేక్‌ అస్మా యాస్మిన్‌
జ: రెండు డిగ్రీ కోర్సులు కానీ, రెండు పీజీ కోర్సులు కానీ ఒకేసారి చేయడానికి వీలులేదు. రెండు డిగ్రీలను ఒకటి రెగ్యులర్‌గా, మరొకటి దూరవిద్య ద్వారా ఒకే సంవత్సరంలో చేయరాదు. అలాచేస్తే ఆ డిగ్రీకి విలువ ఉండదు. కాబట్టి ఒక డిగ్రీని పూర్తిచేసిన తర్వాత మరొకటి చేయడం మేలు. ఒకటి రెగ్యులర్‌ కోర్సు చేస్తున్నప్పుడు సాయంకాలపు డిప్లొమా కోర్సులు గానీ, సర్టిఫికెట్‌ కోర్సులు గానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకానీ రెండు డిగ్రీ స్థాయి కోర్సులను ఒకేసారి చేయకూడదు. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.


* నేను డిప్లొమా (ఈఈఈ) పూర్తిచేశాను. ఈ మధ్య ఏఎంఐఈ గురించి విన్నాను. డిప్లొమా తర్వాత బీటెక్‌ కూడా ఉంది. ఏఎంఐఈ , బీటెక్‌...ఈ రెండింటిలో దేనికి కెరియర్‌ అవకాశాలున్నాయి?
- షరీఫ్‌
జ: ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌) అనేది దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్‌ విద్యను అందిస్తుంది. ఏఎంఐఈ అనేది బీటెక్‌ డిగ్రీకి సమానం. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి బీటెక్‌ డిగ్రీతో సమానంగా అన్ని అవకాశాలు ఉంటాయి. ఉన్నతవిద్యను అభ్యసించాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఏఎంఐఈ, బీటెక్‌ వారికి సమాన అవకాశాలుంటాయి.

ఏఎంఐఈ కోర్సు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారు చదవడానికి అనుకూలం. పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సు చదవడంవల్ల వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిప్లొమా (పాలిటెక్నిక్‌), ఇంటర్మీడియెట్‌ తర్వాత కూడా చదవడానికి అవకాశం ఉంటుంది.

ఎలాంటి టెక్నికల్‌ కోర్సు అయినా రెగ్యులర్‌గా చేయడమే మేలు. దూరవిద్య ద్వారా చేసిన కోర్సులు రెగ్యులర్‌ కోర్సులకు సమానమైనప్పటికీ, రెగ్యులర్‌ ద్వారా కోర్సు చేసినవారికి సబ్జెక్టు పరిజ్ఞానం, నైపుణ్యాలూ ఎక్కువగా లభించే అవకాశాలు ఉంటాయి.దూరవిద్యలో సాంకేతిక కోర్సు?

* బి.కాం చదివాను. దూరవిద్య ద్వారా ఎం.ఎ. పాలిటిక్స్‌ చెయ్యాలనుకుంటున్నాను. అలా చేస్తే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు అర్హత ఉంటుందా?
- రఘు
* పీజీ అనేది లెక్చరర్‌ పోస్టులకు చాలా ముఖ్యమైనది. మీరు పీజీ డిగ్రీని దూరవిద్య ద్వారా చెయ్యాలనుకుంటున్నారు. కాబట్టి యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌) గుర్తించిన విశ్వవిద్యాలయాల్లో చదవడం ఉపయోగకరం. పీజీని దూరవిద్య ద్వారా అయినప్పటికీ యూజీసీ గుర్తింపు ఉన్న సంస్థలో చదివితే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు అర్హులవుతారు. పీజీ లెక్చరర్‌ పోస్టులకు కీలకం కాబట్టి దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడం ప్రయోజనకరం.
* ఏఎల్‌ఎంగా పనిచేస్తున్నాను. దూరవిద్యలో ఎలక్ట్రికల్‌ డిప్లొమా చేయవచ్చా? వివరాలు తెలుపగలరు.
- నాగార్జున కుమార్‌
* దూరవిద్యలో ఎలక్ట్రికల్‌ డిప్లొమా చేయడానికి అవకాశం ఉంటుంది. కాని మనదేశంలో అతి తక్కువ విద్యాసంస్థలు దూరవిద్య ద్వారా సాంకేతిక కోర్సులను అందిస్తున్నాయి. ఉదాహరణకు- ఐఐఎమ్‌టీ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నికల్‌ స్టడీస్‌) సంస్థ మూడు సంవత్సరాల టీడీఈఈ (ట్రైనింగ్‌ డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) కోర్సును అందిస్తోంది. దేశంలో ఉన్న హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌, బెంగళూర్‌ మొదలైన నగరాల్లో దీని బ్రాంచీలున్నాయి.
ఇందులో ప్రవేశానికి రెండు సంవత్సరాల కనీస పని అనుభవం ఉండాలి. ఏఎంఐఈ కోర్సు ద్వారా కూడా దూరవిద్యలో ఎలక్ట్రికల్‌ డిప్లొమా చేయవచ్చు. సాధారణ డిగ్రీతో పోలిస్తే ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) కోర్సు సిలబస్‌ కొంచెం క్లిష్టంగా ఉంటుంది.

సాంకేతిక (టెక్నికల్‌) కోర్సులను దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడం వల్ల ప్రాక్టికల్‌ పరిజ్ఞానం, భావప్రసారణ నైపుణ్యాలు పెంపొందడానికి అవకాశం ఉంటుంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌ కెరియర్‌ కౌన్సెలర్‌

జెనెటిక్‌ ఇంజినీరింగ్‌లో భవిత ...?
1. చరిత్రకారుడు (హిస్టోరియన్‌) అవ్వాలంటే ఏ అర్హతలు సాధించాలి?
- ఎం. సురేష్‌, గుంటూరు
జ: చరిత్రకారుడుగా అవ్వాలంటే సాధారణంగా చరిత్రలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కనీసం అవసరం. వృత్తిపరమైన అనుభవం, బ్యాచిలర్‌ డిగ్రీతో ప్రొఫెషనల్‌ పొజిషన్‌ను సాధించినవారికి ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యాపక వృత్తిని చేపట్టాలనుకునే చరిత్రకారులకు తప్పనిసరిగా పీహెచ్‌డీ ఉండాలి. విద్యాసంబంధ స్థలాల్లో పదోన్నతుల కోసం ఒక చరిత్రకారుడు పరిశోధనా పత్రాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తూ ఉండాలి. డిగ్రీలో హిస్టరీతో పాటుగా లాంగ్వేజ్‌, ఎంచుకున్న స్పెషలైజేషన్‌ తాలూకు సాహిత్యం లాంటివి కూడా చదవడం సబ్జెక్టులో నిమగ్నమై ఉండేలా దోహదపడతాయి.

చరిత్రకారులు గతకాలానికీ, ప్రస్తుత కాలానికీ సంబంధించిన విస్తృత సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. కాబట్టి స్టాటిస్టిక్స్‌ తరగతులు కూడా దోహదం చేస్తాయి. చరిత్రకారులు చారిత్రక మూలాలను, పత్రాలను అధ్యయనం చేసి, పరిశోధించి, విశ్లేషించి, భావానువాదం చేసి ప్రదర్శిస్తారు. అందుకని ఈ స్థాయి చేరుకోవాలనుకునేవారికి అత్యుత్తమమైన రాత, భావ ప్రకటన సామర్థ్యాలు అవసరం. మెరుగైన విశ్లేషణ, వాస్తవిక ఆలోచన, మేథోపరమైన దృక్పథం, స్వీయ ప్రేరణ, సమయ నిర్వహణ మొదలైన లక్షణాలు కలిగి ఉండాలి.2. ఇంటర్‌ రెండో సంవత్సరం (బైపీసీ) విద్యార్థిని. నాకు మెడిసిన్‌ గానీ, వెటర్నరీ సైన్స్‌గానీ చదవాలని లేదు. బయోటెక్నాలజీ ఎక్కడ అందిస్తున్నారు? దీని వల్ల ఏ ఉద్యోగావకాశాలుంటాయి?
- కె. సాయి సుమంత్‌
జ: ఆసక్తి లేని సబ్జెక్టులను చదవకపోవడమే మంచిది. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని చదవడం వల్ల ఆ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. బయోటెక్నాలజీ కోర్సును తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ మొదలైనవి అందిస్తున్నాయి. రాయలసీమ యూనివర్సిటీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తోంది. కె.ఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ (బయోటెక్నాలజీ) అందుబాటులో ఉంది. గిరిరాజ్‌ గవర్నమెంట్‌ కళాశాల (అటానమస్‌), నిజామాబాద్‌ వారు కూడా బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తున్నారు.

బయోటెక్నాలజీ చదివినవారికి పరిశోధనా రంగంలో, ఫార్మాస్యూటికల్‌ రంగంలో, కెమికల్‌ పరిశ్రమలో, వ్యవసాయరంగంలో, వాతావరణ రంగంలో, ఆక్వాకల్చర్‌, బయో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, బయో ఇన్ఫర్మేటిక్స్‌, ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌, అకడెమిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (కళాశాలలు, విశ్వవిద్యాలయాలు), ప్రింట్‌ / డిజిటల్‌ మీడియా మొదలైన రంగాలలో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ- ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.3. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ తీసుకుంటే భవిష్యత్‌ అవకాశాలు ఏముంటాయి? అండర్‌గ్రాడ్యుయేట్‌, పీజీల్లో ఈ కోర్సు ఏ కళాశాలల్లో లభ్యమవుతుంది? ప్రవేశపరీక్ష వివరాలు కూడా తెలుపగలరు.
- ఎ. సాహితి, పాతపట్నం
జ: సాధారణంగా చాలా విశ్వవిద్యాలయాల్లో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అనేది అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీల్లో బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి కోర్సుల్లో భాగంగా బోధిస్తారు. అంతేకానీ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీల్లో జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ను చాలా విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా అందించడం లేదు.

కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో బీఎస్సీ (జెనెటిక్స్‌) అందుబాటులో ఉంది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ మొదలైనవి (ఎమ్మెస్సీ) పీజీలో జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ను అందిస్తున్నాయి. వీటితోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ కలికట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ మొదలైనవి బీఎస్సీ, ఎమ్మెస్సీలో జెనెటిక్స్‌ను అందిస్తున్నాయి. కొన్ని ఐఐటీల్లో కూడా జెనెటిక్స్‌ అందుబాటులో ఉంది. ఎస్‌ఆర్‌ఎమ్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ (జెనెటిక్‌ ఇంజనీరింగ్‌), ఎంటెక్‌ (జెనెటిక్‌ ఇంజనీరింగ్‌) కోర్సులున్నాయి.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు (బీఈ/ బీటెక్‌) ఐఐటీల్లో చదవాలంటే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర విద్యాసంస్థలు తమ రాష్ట్రస్థాయి ప్రత్యేక ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, దిల్లీ వారు నిర్వహించే ఆల్‌ ఇండియా కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా వివిధ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐటీల్లో గేట్‌ పరీక్ష ద్వారా ఎంటెక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రస్తుతం జెనెటిక్‌ ఇంజనీరింగ్‌కి మనదేశంలో, విదేశాల్లో చాలా గిరాకీ ఉంది. వివిధ రంగాల్లో జెనెటిక్‌ ఇంజనీర్ల అవసరం కూడా పెరుగుతూ ఉంది. వీరు ముఖ్యంగా ఫార్మా, వ్యవసాయ రంగం, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని రీసెర్చీ అండ్‌ డెవెలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లలో, బయోటెక్‌ లేబొరేటరీలలో, ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంబంధిత రంగాలలో మొదలైనవాటిలో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజి (న్యూదిల్లీ), సెంటర్‌ ఫర్‌ డిఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ (హైదరాబాద్‌), బయోకెమికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ అండ్‌ ప్రాసెస్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌( చండీగర్‌), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజి(దిల్లీ), ఇతర సంస్థలతో జెనెటిక్‌ ఇంజనీర్స్‌, బయోటెక్‌ శాస్త్రవేత్తల అవసరం ఎంతైనా ఉంటుంది.4. బయోసైన్సెస్‌లో బి.ఇడి చేయాలని ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో చేయాలంటే ఏ అర్హతలతో, ఎప్పుడు ప్రవేశ పరీక్ష రాయాలి?
- అరుణ్‌ కుమార్‌
జ: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో బి.ఇడి కోర్సు అందుబాటులో లేదు. మీరు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర విశ్వవిద్యాలయాల్లో బి.ఇడి చేయదలచుకుంటే ఎడ్‌సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కొన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలలో బి.ఇడి అందుబాటులో ఉంది. మే లేదా జూన్‌ నెలల్లో ప్రత్యేక పరీక్షను నిర్వహించి, దాని ద్వారా జులై నెలలో ప్రవేశాలు కల్పిస్తారు. బి.ఇడి చేయడానికి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.


5. నాకు బీటెక్‌లో ఒక సబ్జెక్టు బ్యాక్‌లాగ్‌ ఉంది. దాన్ని పూర్తి చేసి బీటెక్‌ డిగ్రీ అర్హతతో ఎంబీఏ చేస్తున్నాను. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది నా కల. నాకు మార్గం తెలపండి.
- కాటాబత్తిని శేఖర్‌
జ: సాధారణంగా మన ఇండియన్‌ డిగ్రీలతో అమెరికాలో నేరుగా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఏవైనా కంప్యూటర్‌ (సాఫ్ట్‌వేర్‌) కోర్సులు నేర్చుకుని అమెరికాలో ఉద్యోగానికి వెళ్లవచ్చు. లేదంటే మొదట భారత్‌లో ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరి, ఆ కంపెనీ ద్వారా అమెరికాకు వెళ్లవచ్చు. భారత్‌లో ఉన్న అమెరికన్‌ కంపెనీలో పనిచేసి దాని ద్వారా వెళ్లడం మరో విధానం. అమెరికాలో ఎమ్మెస్‌ (మాస్టర్‌ డిగ్రీ) చేసి అక్కడే ఉద్యోగానికి ప్రయత్నించేవారూ ఉన్నారు. ఒకవేళ కంపెనీ తరపున వెళ్లి అక్కడ అమెరికాలో ఉద్యోగం సంపాదించినప్పటికి తిరిగి మీరు పూర్వం పనిచేసిన కంపెనీకి వచ్చి ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతే మీరు అక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇంటర్‌ పట్టా తప్పనిసరా?
1.ఇంటర్‌ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. తరువాత ఏం చేయాలో అర్థం కావడం లేదు. టెక్నికల్‌ వైపు వెళదామంటే బీటెక్‌కు విలువ తగ్గిందంటున్నారు. పోనీ, డిగ్రీ చేద్దామంటే ఉద్యోగావకాశాలు తక్కువంటున్నారు. ఏది చదివితే కెరియర్‌ బాగుంటుంది?
- వైష్ణవి
జ: బీటెక్‌ చేసినవారికైనా, డిగ్రీ చేసినవారికైనా ఉద్యోగావకాశాలు తప్పకుండా ఉంటాయి. ఏ డిగ్రీ అయినా కూడా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. బీటెక్‌కు విలువ తగ్గిందని అనుకోవడం పొరపాటు. దానికుండే ఉద్యోగావకాశాలు దానికుంటాయి. ఈ రోజుల్లో డిగ్రీ చదివినవారికి ఉద్యోగావకాశాలు తక్కువేం లేవు.

ప్రభుత్వ రంగంలో అయినా, ప్రైవేటు రంగంలో అయినా ఉద్యోగానికి డిగ్రీ తప్పనిసరి. ఉద్యోగావకాశాలు అనేవి ఏ డిగ్రీ చేశామనే దానిపైనే ఆధారపడి ఉండవు. జ్ఞానం, సబ్జెక్టు పట్ల పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉద్యోగావకాశాలకు దోహదం చేస్తాయి. మీరు ఏ డిగ్రీ చదవడమనేది మీకున్న ఆసక్తి, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ఐదు, పది సంవత్సరాల తరువాత ఎలా ఉండాలని అనుకుంటున్నారో, మీకే కోర్సుపై ఆసక్తి ఉందో, ఉన్న నైపుణ్యాలను బట్టి ఏ కోర్సు చదవాలో నిర్ణయించుకోండి.2. బీఏ (హెచ్‌.పి.పి) పూర్తిచేశాను. పీజీలో నా సబ్జెక్టుల ఆధారంగా ఏ కోర్సు చేస్తే మంచిదో తెలపండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?
- జి. శ్రీనివాస్‌, కరీంనగర్‌
జ: పీజీలో మీ సబ్జెక్టుల ఆధారంగా ఎంఏ (చరిత్ర) లేదా ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌) లేదా ఎంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ కోర్సు చేయాలనేది మీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తి, నైపుణ్యాలు, జ్ఞానానికి తగిన కోర్సును ఎంచుకుని చదివితే భవిష్యత్తులో రాణించడానికి అవకాశముంటుంది. ఏ కోర్సుకయినా దాని ప్రత్యేకత దానిది. కాబట్టి సంబంధిత ఉద్యోగావకాశాలు తప్పనిసరిగా ఉంటాయి.

ఎంఏ (హిస్టరీ) చదివినవారికి పురావస్తుశాఖ, దస్తావేజులు భద్రపరిచే, చారిత్రక పార్కులు, జీనియాలజీ, దౌత్యాధికార, ఇంటెలిజెన్స్‌, మిలిటరీ, మ్యూజియం, పాలిటిక్స్‌, సంరక్షణ, పబ్లిక్‌ రిలేషన్స్‌, టూరిజం, రేడియో, టెలివిజన్‌, ప్రచురణ, పరిశోధన, హిస్టారికల్‌ ఫిక్షన్‌ మొదలైన వాటిలో ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌) చదివినవారికి పొలిటికల్‌ జర్నలిస్టుగా, పౌరవ్యవహారాల అధికారిగా, మధ్యవర్తిగా, ప్రభుత్వ అధ్యాపకుడు, ప్రొఫెసర్‌, పొలిటికల్‌ అనలిస్ట్‌, ప్రచార అధికారి మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చదివినవారికి న్యూస్‌ రిపోర్టర్‌, డేటా అనలిస్ట్‌, స్థానిక ప్రభుత్వరంగంలో- సిటీ డైరెక్టర్‌, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌, లోకల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ బోర్డ్‌, కమ్యూనిటీ హెల్త్‌ డైరెక్టర్‌, ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, పోలిస్‌ కమిషనర్‌, ప్రైవేటు రంగంలో- కంపనీ డైరెక్టర్‌, సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మొదలైన అవకాశాలుంటాయి. లోకల్‌ గవర్నమెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌, పాలసీ మేనేజర్‌, పబ్లిక్‌ హౌసింగ్‌ మేనేజర్‌, చారిటీ మేనేజర్‌, బడ్జెట్‌ డైరెక్టర్‌, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌, పబ్లిక్‌ అఫైర్‌ డైరెక్టర్‌, అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కన్సల్టెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డైరెక్టర్‌ మొదలైన స్థానాల్లో ఉపాధికి ఆస్కారం ఉంటుంది.3. ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా నేరుగా బి.ఎ. చదువుతున్నాను. (టెన్త్‌, ఇంటర్‌ లేకుండా) బి.ఎ. పాసైన తర్వాత అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హుడినేనా? నాలాంటి వారు ఇంటర్వ్యూలకు వెళ్తే ఎలాంటి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు?
- సి. వాసవి, నర్సీపట్నం
జ: టెన్త్‌, ఇంటర్‌ లేకుండా దూరవిద్య ద్వారా నేరుగా బి.ఎ. చదువుతున్న మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులు కారు. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో వారు టెన్త్‌, ఇంటర్‌ కచ్చితంగా చదివి ఉండాలని అడుగుతున్నారు. ఉదాహరణకు జూనియర్‌ లెక్చరర్స్‌, డిగ్రీ లెక్చరర్స్‌, యూనివర్సిటీ లెక్చరర్స్‌ లాంటి ఉద్యోగాలకు కచ్చితంగా టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ చదివి ఉండాలని అడుగుతున్నారు. అతి తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నోటిఫికేషన్‌లో ఏమీ రాయరు. కానీ ఇంటర్వ్యూ సమయంలో ఇబ్బందులుండే అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్‌లో ఒకవేళ టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివి ఉండాలని- లేకుంటే డిగ్రీ అర్హత కలిగి ఉండాలని రాసినట్లయితే మీరు ఆ ఉద్యోగానికి అర్హులవుతారు. కొన్ని నోటిఫికేషన్లలో టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివినవారు అర్హులు అని రాస్తుంటారు. అలాంటివాటికి మీరు అనర్హులు. బోధనా రంగంలోకి రావడానికి కచ్చితంగా ఇంటర్‌, టెన్త్‌, డిగ్రీ అవసరమనే జీవో ఉంది. లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్‌లకు ఇది వర్తిస్తుంది (స్కూలు టీచర్లకు కాదు). మీలాంటి వారు ఇంటర్వ్యూలకు వెళ్తే మీకు డిగ్రీ సర్టిఫికేట్‌ మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్నే పరిశీలిస్తారు.4. పదోతరగతి తర్వాత ఇంటర్‌ చదవకుండా డా. బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ పూర్తి చేశాను (2011-2014). బీఈడీ కూడా చేశాను. ఇంటర్మీడియట్‌ లేదనే కారణంతో పోలీస్‌, గ్రూప్స్‌, ఇతరత్రా ప్రభుత్వోద్యోగాలకు నాకు అర్హత లభిస్తుందా? బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణల సమయంలో కూడా ఇంటర్‌ మార్కుల మెమో అడుగుతున్నారు.
- ఎ.బస్వరాజ్‌, కప్పాడ్‌
జ: ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హతను ఎక్కడైతే అడుగుతున్నారో అక్కడ కచ్చితంగా ఇంటర్‌ అర్హత సాధించి ఉండాలి. ఇంటర్‌ సర్టిఫికెట్‌ ఎక్కడైతే అడుగుతారో అక్కడ మీరేం చేయలేరు. సాధారణంగా పోలీస్‌లాంటి ప్రభుత్వోద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌ అర్హత ఉండాలని అడుగుతారు. సాధారణంగా వీటికి సంబంధించి వీరు అర్హులు, వీరు అనర్హులు అని నిబంధనలేం లేవు. ఆయా సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న ఉద్యోగం, దాని అవసరం, దరఖాస్తు చేసిన ఇతరుల అర్హతను బట్టి కొన్నిసార్లు నిర్ణయాలుంటాయి. ఒకవేళ నోటిఫికేషన్లో టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హత కలిగి ఉండాలని సూచించనట్లయితే మీకు అర్హత ఉంటుంది. 
ఫుడ్‌ టెక్నాలజీలో పీజీ...!
ఎంఏ (చరిత్ర) చదివినవారికి ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలియజేయండి.
- ఎం. సురేష్‌, గుంటూరు
జ: ఎంఏ (చరిత్ర) చదివినవారికి ఆ డిగ్రీ ఒకేషనల్‌ డిగ్రీ కాకపోయినప్పటికీ చాలా ఉద్యోగావకాశాలుంటాయి. పురావస్తుశాఖల్లో, దస్తావేజులు భద్రపరిచే శాఖల్లో, న్యాయశాఖ, సివిల్‌ సర్వీసెస్‌, జర్నలిజం (పత్రికా రచన/ వార్తారచన), దౌత్యాధికార, జీనియాలజీ, చారిత్రక పార్కులు, హిస్టోరికల్‌ ఫిక్షన్‌, ఇంటెలిజెన్స్‌, మిలిటరీ, మ్యూజియాలు, సంరక్షణ, ప్రజాసంబంధాలు, రేడియో, టెలివిజన్‌, ప్రచురణ, సర్వే, పరిశోధన రంగం, పర్యాటక రంగం, బోధన మొదలైన శాఖల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

ఇంకా.. ఆర్కైవిస్ట్‌ (ప్రభుత్వ అభిలేఖదారుడు), డాక్యుమెంట్‌ స్పెషలిస్ట్‌, లైబ్రేరియన్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజర్‌, రికార్డు మేనేజర్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, ఎడిటర్‌ మొదలైన అవకాశాలుంటాయి.మా అమ్మాయి బీఎస్‌సీ (బయోటెక్నాలజీ) రెండో సంవత్సరం చదువుతోంది. తరువాత ఫుడ్‌ టెక్నాలజీలో పీజీ చేయాలనుకుంటోంది. కోర్సు వివరాలు, ఉద్యోగావకాశాలను తెలపండి.
- బి. గోపాలకృష్ణ, అనంతపురం
జ: మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌జీ రంగా, గీతం, శాతవాహన మొదలైన విశ్వవిద్యాలయాలు ఫుడ్‌టెక్నాలజీలో పీజీని అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు కూడా అందిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు వాటి ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కర్ణాటక), గీతం యూనివర్సిటీ మొదలైనవి ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలో ఐసీఏఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) వారు నిర్వహించే ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. ఫుడ్‌ టెక్నాలజీ చదివినవారికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో, క్వాలిటీ కంట్రోల్‌ యూనిట్స్‌, రైస్‌ మిల్లులు, తయారీ రంగం, పరిశోధన ప్రయోగశాలలు, హోటల్స్‌, కూల్‌డ్రింక్‌ ఫ్యాక్టరీలు, డిస్టిల్లరీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఉపాధి దొరుకుతుంది.

వీరు ఉన్నత చదువులు చదివినట్లయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, యానిమల్‌ న్యూట్రిషనిస్ట్‌, డైటీషియన్‌, ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, న్యూట్రిషనల్‌ థెరపిస్ట్‌, టాక్సికాలజిస్ట్‌, ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌ ఉద్యోగావకాశాలుంటాయి.బీటెక్‌ 2010లో పూర్తిచేశాను. కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుంది. ఏం చేయాలి?
- సుబ్రహ్మణ్యం, రాజంపేట
జ: ఇంకా ఉద్యోగం రాలేదని నిరాశ చెందవలసిన అవసరం లేదు. పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది. బీటెక్‌ పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విరివిగా ఉద్యోగావకాశాలుంటాయి. మీరు కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలని ఉందన్నారు. కానీ బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో చెప్పలేదు. ఈ రోజుల్లో ఏ సంస్థ అయినా సరైన నైపుణ్యాలు, సామర్థ్యాలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. మీరు ఏ విభాగంలో, ఏ రంగంలో పని చేయాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు, పరిజ్ఞానం మొదలైనవి ఆ ఉద్యోగం చేయడానికి అవసరమవుతాయి. వాటిని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి.

ఏ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో ఆ రంగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. భావవ్యక్తీకరణ, బృందంతో కలిసి పనిచేయగలగడం, పట్టుదల, విశ్వాసం, నాయకత్వ లక్షణాలు, స్వీయ ప్రేరణ, చొరవ తీసుకోవడం, సమస్యను సమర్థంగా పరిష్కరించగలగడం, చదివిన సబ్జెక్టుకు సంబంధించి పరిజ్ఞానం మొదలైనవి అవసరం.యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా, యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో బీఈ/ బీటెక్‌ను అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలపండి.
- కె.ఎస్‌. శ్రీనివాస్‌
జ: ప్రత్యేకంగా బీటెక్‌/ బీఈలో యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా, యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ను అందించే విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తక్కువగా ఉన్నాయి. చాలా సంస్థలు ఎక్కువగా యానిమేషన్‌, మల్టీమీడియా, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కోర్సులను డిప్లొమా లేదా పీజీ డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సులుగా అందిస్తున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ బీటెక్‌ (డిజిటల్‌ టెక్నిక్స్‌ ఫర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌), పంజాబ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన గురుకూర్‌ విద్యాపీఠ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ బీటెక్‌ (3డీ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌), ఉత్తరాఖండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఎస్‌సీ)లో బీటెక్‌ (గ్రాఫిక్స్‌ అండ్‌ గేమింగ్‌) కోర్సు, అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నాలుగు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్‌ (యానిమేషన్‌ డిజైన్‌)లను అందిస్తున్నాయి.

2015 నుంచి ఐఐటీ- బాంబే కూడా 4 సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (యానిమేషన్‌ డిజైన్‌)ను అందిస్తోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌ అండ్‌ యానిమేషన్‌- ఐఐడీఏఏ- కోల్‌కతా బీఎస్‌సీ (యానిమేషన్‌)నూ, తమిళనాడులోని హిందుస్థాన్‌ యూనివర్సిటీ బీఎస్‌సీ (మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌) కోర్సులనూ అందిస్తున్నాయి.

యానిమేషన్‌, మల్టీమీడియా, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కోర్సులు ఎక్కువగా ఒకేషనల్‌ కోర్సుల్లాగానే అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రైవేటు సంస్థలు వీటిని పార్ట్‌టైం/ సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులుగా అందిస్తున్నాయి.


డాట్‌నెట్‌తో పాటు ఏ కోర్సులు మేలు?
* డిప్లొమా (ఈసీఈ) 2007లో పూర్తిచేసి, బీటెక్‌లో చేరాను. కానీ, కొన్ని కారణాలరీత్యా మధ్యలోనే ఆపేశాను. ప్రస్తుతం బీఎస్‌సీ మొదటి సంవత్సరం దూరవిద్య ద్వారా చేద్దామనుకుంటున్నాను. జియాలజీ, మైనరాలజీ, పాలెంటాలజీల గురించిన వివరాలను అందించండి. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
- విద్య
జియాలజీ, మైనరాలజీ, పాలెంటాలజీ లాంటి కోర్సులను దూరవిద్య ద్వారా చేయడం వీలవదు. ఈ కోర్సులను ఏ విశ్వవిద్యాలయాలు కూడా దూరవిద్య ద్వారా అందించడం లేదు. ఈ కోర్సులను చేయాలనుకుంటే రెగ్యులర్‌గానే చేయాల్సివుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ, ఉస్మానియా వంటి విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలైన బనారస్‌ హిందూ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, యూనివర్సిటీ ఆఫ్‌ అలహాబాద్‌ వంటి విశ్వవిద్యాలయాలు జియాలజీ డిగ్రీని అందిస్తున్నాయి.

మైనరాలజీ, పాలెంటాలజీలు బయాలజీ డిగ్రీలో సబ్జెక్టులుగా ఉంటాయి. తరువాత ఎంఎస్‌సీలో వేర్వేరుగా చదవవచ్చు. కొన్ని విద్యాసంస్థలు బీటెక్‌లో జియోసైన్స్‌ ఇంజినీరింగ్‌ను కూడా అందిస్తున్నాయి. జియాలజీ, మైనరాలజీ, పాలెంటాలజీ చదివినవారికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్ష ద్వారా ఉద్యోగావకాశాలుంటాయి. సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, కోల్‌ ఇండియా, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అథారిటీ, హిందుస్థాన్‌ జింక్‌, ఇతర సంస్థల్లోనూ ఉపాధి లభిస్తుంది. ఆర్మీ, పారా మిలిటరీ దళాలు కూడా జియాలజిస్టుల సేవలను ఉపయోగించుకుంటున్నాయి.* బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) 2011లో పూర్తిచేశాను. డాట్‌నెట్‌ కూడా నేర్చుకున్నాను. కానీ ఇంకా ఉద్యోగం రాలేదు. ఇంకా ఏమైనా కోర్సులు నేర్చుకుంటే మేలా? ఉద్యోగసాధనకు ఏం చేయాలో తెలపండి.
- దివ్య
మీరు డాట్‌నెట్‌తోపాటు ఎస్‌ఏపీ, ఒరాకిల్‌ లాంటి కోర్సులు నేర్చుకోవచ్చు. స్ట్రక్చర్‌ క్వెరీ లాంగ్వేజ్‌ (ఎస్‌క్యూఎల్‌), టెస్టింగ్‌ టూల్స్‌ (మాన్యువల్‌ అండ్‌ ఆటోమేషన్‌), నెట్‌వర్కింగ్‌ లాంటి కోర్సులు నేర్చుకుంటే కెరియర్‌ అభివృద్ధికి దోహదపడతాయి. ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల మాత్రమే ఉద్యోగం సాధించలేరు. వీటితోపాటు మంచి భావప్రకటన సామర్థ్యం, ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించగలిగే సామర్థ్యం, బృందంతో కలిసి పనిచేయగల సామర్థ్యం మొదలైనవి చాలా అవసరం. సబ్జెక్టు పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, ఇంటర్వ్యూని ఎదుర్కొనే సామర్థ్యం మొదలైనవి ఉద్యోగసాధనకు ఉపయోగపడతాయి.


* బీఎస్‌సీ (మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్స్‌) చదివాను. దాని తరువాత అగ్రికల్చర్‌ వైపు వెళ్లాలనుంది. అవకాశం ఉంటుందా? ఉంటే వివరాలు తెలపండి.
- ఎస్‌. షేక్షావళి
మీరు అగ్రికల్చర్‌ చదవడానికి అవకాశముండదు. చదవాలనుకుంటే బీఎస్‌సీ (అగ్రికల్చర్‌)కానీ, బీఎస్‌సీ (హార్టీకల్చర్‌)కానీ, బీఎస్‌సీ (సెరికల్చర్‌)కానీ లేదా బీఎస్‌సీ (ఫారెస్ట్రీ)కానీ చదివుండాలి. అంతేకాకుండా బీఎస్‌సీ (కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) చదివినవారు అగ్రికల్చర్‌ చేయడానికి అర్హులు.


* మా పిల్లలు కేంద్రీయ విద్యాలయం (సెంట్రల్‌ స్కూల్‌)లో చదువుతున్నారు. కేంద్రీయ విద్యాలయం, రాష్ట్ర చదువులకు తేడాలేమిటి? కేంద్రీయ విద్యాలయంలో చదివిన వారి భవిష్యత్తు, ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?
- రేగంటి దేవానంద్‌, చిత్తూరు
కేంద్రీయ విద్యాలయాలు భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో బోధన హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన మాతృభాషను ఒక సబ్జెక్టుగా కేంద్రీయ విద్యాలయాలు అందించవు. రాష్ట్ర చదువుల్లో విద్యార్థులు వారి వారి రాష్ట్రాలకు చెందిన మాతృభాషను ఒక సబ్జెక్టుగా చదవుతారు.

కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్లో భావప్రకటన సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం, ఆలోచన, ఆత్మవిశ్వాసం ఇతర విద్యార్థుల్లో కంటే మెరుగ్గా ఉంటుంది. కేంద్రీయ విద్యాలయంలో మనోవికాసానికి సంబంధించిన కార్యక్రమాలు, సైన్స్‌ ఫేర్‌లాంటివి అపుడపుడు జరుగుతుండడం వల్ల విద్యార్థుల భావప్రకటన సామర్థ్యం, అవగాహన శక్తి ఎక్కువవుతాయి.

ఉద్యోగావకాశాలు స్కూళ్లను బట్టి ఉండవు. విద్యార్థుల నైపుణ్యాలు, ఆసక్తి, సబ్జెక్టు పట్ల పరిజ్ఞానం మొదలైనవాటిని బట్టి ఉంటాయి కానీ, వారు ఏ స్కూల్లో చదువుకున్నారన్న దానిపై విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలుండవు.* ఎంఎస్‌సీ (సైకాలజీ) దూరవిద్య ద్వారా పూర్తిచేశాను. సైకాలజీలో పీహెచ్‌డీ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? భవిష్యత్తు ఎలా ఉంటుంది?
- ఎస్‌.ఎస్‌. రావు, విజయనగరం
తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఉస్మానియా, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా మొదలైన విశ్వవిద్యాలయాలు సైకాలజీలో పీహెచ్‌డీని అందిస్తున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో హెల్త్‌ సైకాలజీలో పీహెచ్‌డీ కోర్సు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్రస్థాయి, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.

ఉదాహరణకు- అలహాబాద్‌, బనారస్‌ హిందూ, యూనివర్సిటీ ఆఫ్‌ కర్నాటక, కలబురగి, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, పంజాబ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ, కేరళ, కురుక్షేత్ర మొదలైన విశ్వవిద్యాలయాతోపాటు చాలా రాష్ట్రాల్లోని రాష్ట్ర, కేంద్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో సైకాలజీలో పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.

ఎంఎస్‌సీ (సైకాలజీ)ని దూరవిద్య ద్వారా చదివిన మీరు పీహెచ్‌డీ మాత్రం రెగ్యులర్‌ విధానంలోనే చదవాలి. ఎందుకంటే సైకాలజీ పీహెచ్‌డీని ఏ విశ్వవిద్యాలయాలూ దూరవిద్య ద్వారా అందించడం లేదు. సైకాలజీలో పీహెచ్‌డీని చదివినవారికి మెంటల్‌ హెల్త్‌, సోషల్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ సబ్జెక్టు చదివినవారికి ముఖ్యంగా క్లినికల్‌ సైకాలజిస్టులు, కౌన్సెలర్లు, సోషల్‌వర్కర్స్‌గా ఉదోగావకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో సోషల్‌ వర్కర్‌, సోషల్‌ సర్వీస్‌ మేనేజర్‌, మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలర్‌, రిహాబిలిటేషన్‌ కౌన్సెలర్‌, ఒకేషనల్‌ కౌన్సెలర్‌, మెంటల్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌, బిహేవియర్‌ అనాలిసిస్‌ స్పెషలిస్ట్స్‌, సైకలాజికల్‌ స్పెషలిస్ట్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి. విద్యారంగంలో స్కూల్‌ సైకాలజిస్ట్‌, ఎడ్యుకేషనల్‌ సైకాలజిస్ట్‌, స్కూల్‌ కౌన్సెలర్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. వ్యాపార రంగంలో ఇండస్ట్రియల్‌- ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్టులుగా, ఫోరెన్సిక్‌ సైకాలజిస్టులుగా ఉద్యోగావకాశాలుంటాయి. 
 

ఉమెన్‌ స్టడీస్‌లో ఉద్యోగావకాశాలు

మా అమ్మాయి బీటెక్‌ (ప్లానింగ్‌) మూడో సంవత్సరం చదువుతోంది. తరువాత ఏయే పోటీ పరీక్షలను రాయవచ్చు? మాస్టర్స్‌ ఏ బ్రాంచిలో చేస్తే ఉపయోగకరం? ప్రభుత్వ ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?
- జాహ్నవి, హైదరాబాద్‌
బీటెక్‌ తరువాత ఉద్యోగం చేయాలనుకుంటే యూపీఎస్‌సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) వారు నిర్వహించే ఐఈఎస్‌ (ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌), సివిల్‌ సర్వీసెస్‌ లాంటి పోటీపరీక్షలు రాయడానికి అవకాశముంటుంది. బ్యాంకింగ్‌ రంగంలో పనిచేయాలనుకుంటే ఐబీపీఎస్‌, ఎస్‌బీఐలాంటి పరీక్షలను రాయాల్సిఉంటుంది. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, ఏఏఐ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ మొదలైన సంస్థలు పీఎస్‌యూ (పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌) పోటీపరీక్ష ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. పరిశోధన రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటే ఇస్రో, బార్క్‌, డీఆర్‌డీఓలాంటి పరీక్షల ద్వారా అవకాశముంటుంది.

భారత్‌లో రక్షణ రంగంలో పనిచేయడానికి సీడీఎస్‌ (కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌) పరీక్ష ద్వారా ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకుంటే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ద్వారా ఎంటెక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం జీఆర్‌ఈ, టోఫెల్‌, జీమ్యాట్‌ లాంటి పోటీపరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా బీటెక్‌ తరువాత ఎంబీఏ చేయాలనుకుంటే క్యాట్‌, మ్యాట్‌, గ్జాట్‌ మొదలైన పరీక్షల ద్వారా ప్రవేశం పొందవచ్చు.

మాస్టర్స్‌ డిగ్రీలో ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, రూరల్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన కోర్సులుంటాయి. మీ అభిరుచినీ, ఆసక్తినీ బట్టి మీకు నచ్చిన బ్రాంచిని ఎన్నుకుని చదవడం మేలు. ఏ బ్రాంచి అయినా తనదైన ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది.

బీటెక్‌ (ప్లానింగ్‌) చదివిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ హెచ్‌యూడీఏ, వీయూడీఏ మొదలైనవి. మున్సిపల్‌ కార్పొరేషన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, మల్టీనేషనల్‌ కంపెనీలు (అర్బన్‌ ప్లానింగ్‌కు చెందినవి), సాఫ్ట్‌వేర్‌ రంగం, ప్రొఫెషనల్‌ ఇండస్ట్రీ, ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ (అర్బన్‌ ప్లానర్‌), డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ జాగ్రఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.బీఎస్‌సీ (స్టాటిస్టిక్స్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఎంసీఏ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలు, ప్రవేశపరీక్ష, ఫీజు వివరాలను తెలపండి.
- రజనీకాంత్‌
తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు- ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, తెలంగాణ, పాలమూరు మొదలైన విశ్వవిద్యాలయాలు ఎంసీఏ కోర్సును అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఎంసీఏ ప్రవేశానికి ఐసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఉదాహరణకు బనారస్‌ హిందూ, దిల్లీ, పాండిచ్చేరి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలైన విశ్వవిద్యాయాల్లో ఎంసీఏ కోర్సు ప్రవేశానికి విశ్వవిద్యాలయ ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సు ప్రవేశానికి నిమ్‌సెట్‌ అనే ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా ఐఐటీల్లో ఎంసీఏ కోర్సు ప్రవేశానికి జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫీజు విషయానికి వస్తే ఒక్కో సంస్థ, విశ్వవిద్యాలయాన్ని బట్టి ఫీజు ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా ఫీజు ఎంసీఏ కోర్సుకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది.స్టెనోగ్రఫీలో డిప్లొమా చేయాలనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందించే సంస్థల వివరాలను తెలియజేయండి. టైపింగ్‌ కోర్సులను అందించే సంస్థల గురించీ తెలపండి.
- పి. హరీష్‌, మైలవరం
స్టెనోగ్రఫీ కోర్సును ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలు మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్‌ ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సికింద్రాబాద్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌, ఇతర ప్రైవేటు సంస్థలు స్టెనోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి. వీటితోపాటు మన వివిధ జిల్లాల్లో గల ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లు కూడా స్టెనోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి.

ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, అనంతపురం, తూర్పు గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఐటీఐ సంస్థలున్నాయి. టైపింగ్‌ కోర్సును ఎక్కువగా ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టేట్‌బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ వారు టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ లాంటి కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఐటీఐలు కూడా టైపింగ్‌ కోర్సును అందిస్తున్నాయి.2011లో ఇంటర్‌ ఒకేషనల్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) పాసయ్యాను. మా కళాశాలలో డీఈడీలో అర్హత ఉందని చెప్తే డీఈడీ పూర్తిచేశాను. కానీ మొన్న ఏపీలో డీఎస్‌సీ- 2015లో ఒకేషనల్‌ వాళ్లకు అర్హత లేదన్నారు. ఇపుడు నేను అర్హత సంపాదించాలంటే ఏం చేయాలి? మళ్లీ ఇంటర్‌ రాసి పాసై డీఈడీ చేయవచ్చా? తెలియజేయండి.
- జి. లక్ష్మి
ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చదివినవారికి డీఎస్‌సీలో అర్హత లేదన్న విషయం వాస్తవం. ఇంటర్‌- జనరల్‌ చదివిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. మీరు ఉపాధ్యాయ వృత్తే లక్ష్యంగా కలిగి ఉంటే ఇంటర్‌- జనరల్‌ చదివి తర్వాత డీఈడీ చేయండి. అప్పుడు మీకు డీఎస్‌సీలో అర్హత ఉంటుంది. లేదంటే డిగ్రీ చదివి పాసైన తరువాత బీఈడీ చేయవచ్చు.


డిగ్రీ (బీకాం) చివరి సంవత్సరం చదువుతున్నాను. ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదవాలనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? ప్రభుత్వ ఉద్యోగం పొందగలనా?
- ఎ. హెచ్‌. కావ్య, మడకశిర
ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థల్లో; విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో; కార్పొరేట్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసుల్లో, బిహేవియరల్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో, రెసిడెన్షియల్‌ కేర్‌ ఫెసిలిటీస్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా, సోషియాలజిస్ట్‌, జర్నలిస్ట్‌, లాయర్‌, లీగల్‌ అడ్వైజర్‌, లాబియిస్ట్‌, మల్టీ కల్చరలిజమ్‌ ఆఫీసర్‌, ఎన్‌జీఓ ఏరియా కో ఆర్డినేటర్‌, నాన్‌ ప్రాఫిట్‌ ఫౌండేషన్‌ మేనేజర్‌, పొలిటికల్‌ రీసెర్చర్‌, ప్రెగ్నెన్సీ కౌన్సెలర్‌, సైకోథెరపిస్ట్‌, సోషల్‌ వర్కర్‌, సెక్సువల్‌ అబ్యూస్‌ కౌన్సెలర్‌, సెక్సువల్‌ అస్సాల్ట్‌ ఎడ్యుకేటర్‌, సెక్సువల్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌, సోషల్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, యూనియన్‌ ఆర్గనైజర్‌, ఉమెన్‌ అడ్వకేట్‌, ఉమన్‌ షెల్టర్‌ సూపర్‌వైజర్‌, ఉమెన్స్‌ షెల్టర్‌ సాఫ్ట్‌, ఆంత్రపాలజిస్ట్‌, అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, బయోగ్రాఫర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌, క్రిమినాలజిస్ట్‌, ఈక్వల్‌ ఆపర్చ్యునిటీ ఆఫీసర్‌, వ్యాసకర్త, ఫ్యామిలీ కౌన్సెలర్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. 
 


మనోవిజ్ఞాన శాస్త్రంలో పీహెచ్‌డీ ఎలా?

బీఎస్‌సీ ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీ కల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను దూరవిద్య ద్వారా చదవడం వీలవుతుందా? అందించే విశ్వవిద్యాలయాలు, విద్యార్హతల వివరాలు తెలియజేయండి.

- జె. గంగాధర్‌
బీఎస్‌సీ- ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను చదవడానికి ఇంటర్‌ అర్హత ఉండాలి. కానీ బీఎస్‌సీ ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను సాధారణంగా ఏ విశ్వవిద్యాలయాలూ దూరవిద్య ద్వారా అందించవు. ఈ కోర్సులను రెగ్యులర్‌ విధానంలోనే చేయాల్సి ఉంటుంది.

అతి తక్కువ విశ్వవిద్యాలయాలు- యశ్వంత్‌రావు చావన్‌- మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ, ఇగ్నో లాంటి విశ్వవిద్యాలయాలు డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయి. ఈ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను కూడా ఫుల్‌టైం చేయాల్సి ఉంటుంది. బీఎస్‌సీ- ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ లాంటి కోర్సులను దూరవిద్య ద్వారా చదవడం కంటే నేరుగా ఫుల్‌టైం చదవడమే మేలు. ఎందుకంటే ఏ కోర్సు అయినా దూరవిద్య ద్వారా చదవడం కంటే నేరుగా చదవడం వల్ల సబ్జెక్టుపట్ల జ్ఞానం, నైపుణ్యాలు పెంపొందుతాయి.


మనోవిజ్ఞాన శాస్త్రం (సైకాలజీ)లో పీహెచ్‌డీ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.
- టి. శ్రీనివాసరావు
తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలైన ఉస్మానియా, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా మొదలైన విశ్వవిద్యాలయాలు సైకాలజీలో పీహెచ్‌డీని అందిస్తున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో హెల్త్‌ సైకాలజీలో పీహెచ్‌డీ కోర్సు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర స్థాయి, సెంట్రల్‌ విశ్వవిద్యాలయాలైన అలహాబాద్‌, బనారస్‌ హిందూ, యూనివర్సిటీ ఆఫ్‌ కర్నాటక, గుల్బర్గా, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, పంజాబ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ, కేరళ, కురుక్షేత్ర లాంటి విశ్వవిద్యాలయాలతోపాటు ఇంకా చాలావాటిల్లో సైకాలజీలో పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.

మా అమ్మాయి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ తర్వాత ఏం చదివితే బాగుంటుందో వివరాలను తెలియజేయగలరు.
- మహమ్మద్‌ నజీమ్‌
ఎంపీసీ చదివినవారికి ఇంటర్‌ తరువాత ఇంజినీరింగ్‌ కోర్సులు, బీఎస్‌సీ (బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌), బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), బి- ఆర్కిటెక్చర్‌ (బాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌), బీఫార్మసీ, బీబీఏ, కమర్షియల్‌ పైలట్‌ ట్రెయినింగ్‌, డిప్లొమా కోర్సెస్‌ ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, టెక్నాలజీ, మర్చంట్‌ నేవీకి సంబంధించిన కోర్సులు, జాయింట్‌ ఆర్మ్‌డ్‌ కోర్సులు, కొన్ని డిజైన్‌ సంబంధిత కోర్సులు, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, బాచిలర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ మొదలైన కోర్సులను చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇవే కాకుండా కొన్ని జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ తరువాత ఏర్‌ హోస్టెస్‌ ట్రెయినింగ్‌, ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, లాయర్‌ కోర్సు, యానిమేషన్‌, గ్రాఫిక్స్‌, మల్టీమీడియా, ఫ్యాషన్‌ టెక్నాలజీ లేదా ఫ్యాషన్‌ డిజైన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌- డిజైనింగ్‌ లాంటి జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

మీ అమ్మాయి ఏ బ్రాంచి లేదా కోర్సు చదవాలనేది తన ఆసక్తిని బట్టి చేయడం మంచిది. అపుడే ఉన్నతంగా ఎదగడానికీ, అనుకున్నది సాధించడానికీ అవకాశ ముంటుంది. అంతేకానీ ఎవరో ఏదో చెప్పారని కాకుండా ఆమె ఆసక్తి, నైపుణ్యాలనుబట్టి తగిన కోర్సును ఎంచుకోనివ్వడం మంచిది. 

ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేయాలంటే..?
* బీఎస్‌సీ నర్సింగ్‌, మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌ కోర్సుల తరువాత పీజీ తప్పనిసరా? లేదా ఇంకేమైనా కోర్సులు చేయవచ్చా? రెండు కోర్సులకూ ఉన్న అవకాశాలనూ తెలియజేయండి.
- శ్రావణి, హైదరాబాద్‌
** బీఎస్‌సీ నర్సింగ్‌ చేసినవారు నర్సులుగా కొనసాగాలనుకుంటే పీజీ తప్పనిసరిగా చేయాల్సిన అవసరమేమీ లేదు. కానీ బోధన, పరిశోధన రంగాల్లోకి అడుగు పెట్టాలనుకుంటే తప్పనిసరిగా పీజీ అవసరం ఉంటుంది. అంతేకాకుండా బీఎస్‌సీ నర్సింగ్‌ తర్వాత పోస్ట్‌ బేసిక్‌ స్పెషాలిటీ (ఒక సంవత్సరం) డిప్లొమా కోర్సులను ఎన్నుకోవడం ద్వారా ఏదైనా ప్రత్యేకమైన స్పెషలైజేషన్‌లో నర్సింగ్‌ కూడా చేసే అవకాశముంటుంది.

ఉదాహరణకు కార్డియో థోరాసిక్‌ నర్సింగ్‌, క్రిటికల్‌ కేర్‌ నర్సింగ్‌, నియోనాటల్‌ నర్సింగ్‌, న్యూరో నర్సింగ్‌, ఆంకాలజీ నర్సింగ్‌, ఆపరేషన్‌ రూమ్‌ నర్సింగ్‌, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్‌ నర్సింగ్‌, ఆర్థోపెడిక్‌ నర్సింగ్‌, సైకియాట్రిక్‌ నర్సింగ్‌ లాంటి డిప్లొమా కోర్సులు కూడా చేయవచ్చు. నర్సింగ్‌ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు బాగా ఉంటాయి.

ఈ కోర్సు చదివినవారికి ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఆర్మీ, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌, స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ లాంటి రకరకాల నర్సింగ్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

మెడికల్‌ లాబ్‌టెక్నీషియన్‌తో పెద్ద ఆస్పత్రుల్లో చిన్నస్థాయి ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంఎస్‌సీ (మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌) చేస్తే కార్పొరేట్‌ హాస్పిటళ్లలో, ల్యాబ్‌ల్లో బయోలాజికల్‌ టెక్నీషియన్‌, కెమికల్‌ టెక్నీషియన్‌ మొదలైన అవకాశాలుంటాయి. అంతేకాకుండా పరిశోధన రంగంలోకి వెళ్లాలనుకుంటే ఎంఎస్‌సీ (మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌) చేయాల్సిన అవసరం ఉంటుంది.

* బీకాం (జనరల్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేయాలనుంది. నేను అర్హుడినేనా?
- డి. కుమారస్వామి
** బీకాం చివరి సంవత్సరం చదువుతున్న మీకు ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి అర్హత ఉంటుంది. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి అవకాశం కల్పిస్తున్నాయి.

ఉదాహరణకు- కేంద్రీయ విశ్వవిద్యాలయాలైన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ మొదలైనవి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. కానీ, కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలైన బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా వంటి విద్యాసంస్థల్లో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి బీఏ (పొలిటికల్‌ సైన్స్‌) చదివి ఉండాలన్న నిబంధనను పాటిస్తున్నాయి.

* ఇంటర్మీడియట్‌ తరువాత ఇంజినీరింగ్‌తో సమానంగా ఏదైనా యానిమేషన్‌ కోర్సు ఉందా? ఏదైనా యానిమేషన్‌ కోర్సు చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది?
- పావని, శ్రీకాకుళం
** ఇంటర్‌ తరువాత ఇంజినీరింగ్‌తో సమానంగా ఉండే యానిమేషన్‌ కోర్సు చేయాలంటే బీఈ లేదా బీటెక్‌ యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా కోర్సును చేయవచ్చు. వేరే ఏదైనా యానిమేషన్‌ కోర్సు చేయాలనుకుంటే బీఈ (యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌), బీఏ (యానిమేషన్‌ అండ్‌ గ్రాఫిక్‌ డిజైన్‌), బీఏ (మల్టీమీడియా), బీఎస్‌సీ (యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా), బీఎస్‌సీ (డిజిటల్‌ మీడియా), బీఎస్‌సీ (యానిమేషన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌), బీఎస్‌సీ (యానిమేషన్‌ మల్టీమీడియా టెక్నాలజీ), బీఎస్‌సీ (గేమ్స్‌ డెవలప్‌మెంట్‌) లాంటి కోర్సులు చేయవచ్చు. డిప్లొమా ఇన్‌ 2డి యానిమేషన్‌, డిప్లొమా ఇన్‌ 3డి యానిమేషన్‌), డిప్లొమా ఇన్‌ యానిమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ లాంటి డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

యానిమేషన్‌ కోర్సు చేసినవారికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో, సినిమా, కార్టూన్స్‌ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలు విరివిగా ఉంటాయి.ఈ కోర్సు చదివినవారు వివిధ రంగాల్లో యానిమేటర్లు, గ్రాఫిక్‌ డిజైనర్‌, వీడియో ఎడిటర్‌, 3డి మోడలర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్లు, సౌండ్‌ ఎడిటర్‌, క్యారెక్టర్‌ యానిమేటర్లుగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఎంఎస్‌సీ లేదా ఎంఈ లేదా ఎంటెక్‌ డిగ్రీలో యానిమేషన్‌ కోర్సు చేస్తే వారికి బోధన రంగంలో అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ఉద్యోగావకాశాలుంటాయి.
 

* బీఎస్‌సీ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదవాలనుంది. నేను అర్హుడినేనా? ఈ కోర్సు చదవడానికి ఇంకా ఏమైనా అదనపు కోర్సులు చేయాల్సి ఉంటుందా? తెలియజేయగలరు.
- ఎం. నారాయణస్వామి
** బీఎస్‌సీ (ఎంపీసీ) చదవుతున్న మీరు డిగ్రీ తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదవడానికి అర్హులే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివేవారికి ముఖ్యంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. కాబట్టి మీరు వాటికి సంబంధించిన కోర్సులు చేయడం ఉపయోగకరం. ఎకౌంటింగ్‌కు సంబంధించిన డిప్లొమా కోర్సులు, కంప్యూటర్‌కు సంబంధించిన డిప్లొమా కోర్సులు చేయడం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసేవారికి ఉపయోగకరం. మీ సీవీ (కరిక్యులమ్‌ వీటే)లో ఈ విషయాలు పొందుపరిస్తే మీకు ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
* ఎంఎస్‌సీ చేశాను. డైమండ్‌ టెస్టింగ్‌, జెమాలజీ కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయాలేవి? ఉద్యోగావకాశాలనూ తెలపండి.
- హారిక, రాజమండ్రి
**  డైమండ్‌ టెస్టింగ్‌, జెమాలజీ కోర్సులు వైవిధ్యమైనవి. ఈ కోర్సులను భారతదేశంలో కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇండియన్‌ డైమండ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ, జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఇంటర్నేషనల్‌ జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ మొదలైన సంస్థలు డైమండ్‌, జెమాలజీకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.

డైమండ్‌, జెమాలజీకి సంబంధించి వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్‌ జువెల్లరీ ప్రొఫెషనల్‌ కోర్సు, ప్రొఫెషనల్‌ డైమండ్‌ గ్రేడర్‌ కోర్సు, జువెల్లరీ డిజైన్‌ ప్రొఫెషనల్‌ కోర్సు, జువెల్లరీ మాన్యుఫాక్చరింగ్‌ ప్రొఫెషనల్‌ కోర్సు, జెమాలజీ ప్రొఫెషనల్‌ కోర్సు మొదలైనవి ఉన్నాయి. డిప్లొమా కోర్సులైన డైమండ్స్‌ అండ్‌ డైమండ్‌ గ్రేడింగ్‌, కలర్డ్‌ జెమ్‌స్టోన్‌ ఐడెంటిఫికేషన్‌, పాలిష్‌ డైమండ్‌ గ్రేడింగ్‌ లాంటి స్వల్పకాలిక కోర్సులు కూడా ఉన్నాయి.

ఈ కోర్సులు చేసినవారికి జువెలరీ తయారీ, డిజైన్‌ రంగంలో, జెమ్స్‌ ఎగుమతి చేసే సంస్థల్లో, జువెలరీ వ్యాపార సంస్థల్లో, జెమొలాజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ఉత్పత్తి చేసే రంగంలో, జెమ్‌స్టోన్‌ టెస్టింగ్‌ లేబొరేటరీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. జెమలాజిస్టులకు ఈరోజుల్లో ఉద్యోగావకాశాలకు కొరతలేదు. ఈ కోర్సులు చదివినవారికి జెమ్స్‌, జువెలరీ రంగంలో జెమాలజిస్టులు, జువెలరీ డిజైనర్‌, డైమండ్‌ గ్రేడర్‌, సేల్స్‌ సిబ్బంది, జెమ్‌స్టోన్‌ ఆక్షన్‌ మేనేజర్లుగా మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలుంటాయి.


 

ఎంసీఏతో ఏ అవకాశాలుంటాయి?

హిందీ పండిట్‌ విద్వాన్‌ చేసి, హెచ్‌పీటీ శిక్షణ కూడా పూర్తిచేశాను. విద్వాన్‌ను డిగ్రీతో సమానంగా భావించటం నిజమేనా? అలా అయితే నేను బీఈడీ చేసే అవకాశముందా? వేరే రాష్ట్రంలో డీఈడీ చేస్తే ఆ విద్యార్థి లోకల్‌ అవుతాడా? నాన్‌ లోకల్‌ అవుతాడా?
- పి. రఘునందన్‌
సాధారణంగా మీరు చేసిన హిందీ పండిట్‌ విద్వాన్‌ డిగ్రీతో సమానం కాదు. కానీ మీరు చేసిన హెచ్‌పీటీ శిక్షణ హిందీ ప్రచార్‌ సభ (నాంపల్లి, హైదరాబాద్‌) వారి ఆమోదం పొందినట్లైతే అది డిగ్రీతో సమానమనే జీవో ఉంది. ఆ జీవో కాపీ కావాలనుకుంటే మీరు హిందీ ప్రచార్‌ సభకు వెళ్లి సంప్రదించండి.

ఒకవేళ అది డిగ్రీతో సమానమైతే మీరు బీఈడీ చేయడానికి అవకాశముంటుంది. లేదంటే ఉండదు. ఎందుకంటే బీఈడీ చేయాలంటే డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా మీరు లోకలా, నాన్‌లోకలా అనేది మీరు చదివిన డిగ్రీపై ఆధారపడి ఉండదు. రెండు, మూడు సంవత్సరాలు ఇతర రాష్ట్రాల్లో చేసినంత మాత్రాన నాన్‌లోకల్‌ కారు. నాలుగో తరగతి నుంచి పదోతరగతి వరకు ఎక్కడ చదువుకున్నారో ఆ ప్రాంతం మీకు లోకల్‌ అవుతుంది.


బీఎస్‌సీ (స్టాట్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంసీఏ చేయాలనుంది. ఉద్యోగావకాశాలను తెలియజేయండి. ఆ తర్వాత ఎంఎస్‌సీ (నానో టెక్నాలజీ), ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌, రాకెట్‌ సైన్స్‌) చేయవచ్చా?
- నేతాజీ
బీఎస్‌సీ (స్టాట్‌) చదువుతున్న మీరు డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంసీఏ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంసీఏ చదివినవారికి ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ రంగంలోకూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎంసీఏ చదివినవారికి ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ), బీఏఐఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) మొదలైన సంస్థల్లో ఉపాధికి ఆస్కారం ఉంటుంది. ప్రైవేటు ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంసీఏ చదివినవారికి సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ట్రబుల్‌ షూటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీర్లు, టెక్నికల్‌ రైటర్‌, సిస్టమ్‌ డెవలపర్‌, సిస్టమ్‌ ఇంజినీర్లు, వెబ్‌ డిజైనర్‌ అండ్‌ డెవలపర్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంఎస్‌సీ (నానోటెక్నాలజీ) చేయాలంటే బీఎస్‌సీలో ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌ సబ్జెక్టులను చదివుండాలి. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు ఉదాహరణకు జేఎన్‌టీయూలాంటివి ఎంఎస్‌సీ (నానోటెక్నాలజీ)ని బీఎస్‌సీ అన్ని గ్రూపులవారికి అందిస్తున్నాయి. బీఎస్‌సీలో ఫిజిక్స్‌ సబ్జెక్టు చదివినవారికి ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌) చదవడానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్‌సీ (రాకెట్‌ సైన్స్‌) అనేది ఎక్కడా లేదు. ఆసక్తి ఉంటే పరిశోధనల్లో రాకెట్‌సైన్స్‌ను ఎంచుకోవచ్చు.ఇంటర్‌ (సీఈసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. భూకంపాలు వంటి వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేయడం ఇష్టం. అందుకుగానూ డిగ్రీలో ఏ కోర్సును ఎంచుకోవాలి? అందించే విశ్వవిద్యాలయాలేవి?
- గౌతమ్‌
వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేయాలనే మీ అభిరుచి బాగుంది. ఈ పరిశోధన చేయడానికి డిగ్రీలో ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌ లాంటి కోర్సులను చేయవచ్చు. కానీ ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులను తప్పనిసరిగా చదివివుండాలి.

వాతావరణానికి సంబంధించిన ఏ అంశంపైన పరిశోధన చేయాలన్నా ఈ సబ్జెక్టులు అంటే బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలాంటి వాటిలో తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ రంగంలోనే టెక్నికల్‌గా కాకుండా నాన్‌టెక్నికల్‌ విభాగంలో పని చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకుగానూ జాగ్రఫీలాంటి కోర్సును చదవవచ్చు. సీఈసీ చదువుతున్నారు కాబట్టి, మీకు వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.


అన్నామలై విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా బీజీఎల్‌ (బాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లాస్‌) పూర్తిచేశాను. ఇప్పుడు ఎల్‌ఎల్‌ఎం లేదా ఎంఎల్‌ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. వీలవుతుందా? అందించే విశ్వవిద్యాలయాలేవి?
- ఎం.వి.ఎస్‌. సూర్యారావు
ఎల్‌ఎల్‌ఎంను దూరవిద్య ద్వారా చదవడం వీలవుతుంది. మన దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు దూరవిద్య ద్వారా ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ను అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా కాకతీయ, ఆచార్య నాగార్జున, నల్సార్‌- హైదరాబాద్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు ఎల్‌ఎల్‌ఎంను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని అన్నామలై, కురుక్షేత్ర, బందేల్‌ఖండ్‌, నేషనల్‌ లా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా విశ్వవిద్యాలయం, ఇండియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ మొదలైనవి ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. మీ అభిరుచిని బట్టి నచ్చిన విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఈ (ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) చేస్తున్నాను. ఈ కోర్సుకు ఉన్న ఉన్నతవిద్య ఉద్యోగావకాశాలను తెలియజేయండి.
- వైష్ణవి
బీఈ (ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) చదివినవారు ఉన్నతవిద్యను అభ్యసించాలనుకుంటే మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ నెట్‌వర్క్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ అనాలిసిస్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అప్లికేషన్‌, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ మొదలైన కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆవశ్యకత వివిధ రకాల బిజినెస్‌ల్లో, సర్వీసుల్లో చాలా ఉంటుంది. కంప్యూటర్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, టెలి కమ్యూనికేషన్‌, బయోటెక్నాలజీ, ఈ-కామర్స్‌ సర్వీసెస్‌, డయాగ్నోస్టిక్స్‌ మొదలైన రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సు చదివినవారికి ప్రోగ్రామర్స్‌, క్వాలిటీ అనలిస్ట్‌, టెక్నాలజీ ఇంజినీర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్స్‌, టెక్నికల్‌ కన్సల్టెంట్స్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి. ఆఫీస్‌ ఆటోమేషన్‌, ఎక్స్‌పర్ట్‌ సిస్టమ్స్‌, డెసిషన్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌, ఆన్‌లైన్‌ పరీక్షలు- ఫలితాలు మొదలైన వాటిలో ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ ఆవశ్యకత అధికం.

ఆరోగ్య విద్యలో పీజీ డిప్లొమా చేయాలంటే...

* మా అమ్మాయి సీఎస్‌ఎస్‌ఈ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంజినీరింగ్‌) రెండో సంవత్సరం చదువుతోంది. ఈ బ్రాంచి చదివిన వారికి ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? ఎంటెక్‌ చేయాలనుకుంటే ఏ స్పెషలైజేషన్‌ ఎంచుకోవాలి?
- ఇ. నాగరాజు, కర్నూలు
* కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టం ఇంజినీరింగ్‌ అనేది రెండు బ్రాంచిల కలయిక. ఈ బ్రాంచి చదవడం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌, సిస్టమ్‌ ఇంజినీరింగ్‌లకు సంబంధించిన స్పెషలైజేషన్స్‌లోని ఉద్యోగాలకు అర్హులవుతారు. ఎంటెక్‌ చేయాలనుకుంటే ఈ రెండు రంగాలకు సంబంధించిన స్పెషలైజేషన్లలో చేసే అవకాశం ఉంటుంది. ఈ బ్రాంచి చదివినవారికి వెబ్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, వీడియో గేమ్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ కంప్యూటింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ విజన్‌, సైంటిఫిక్‌ మోడలింగ్‌, కంప్యూటర్‌ సెక్యూరిటీ, డేటాబేస్‌ సిస్టమ్స్‌, యానిమేషన్‌, వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కంప్యూటర్‌ మానుఫాక్చరింగ్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, కంప్యూటేషనల్‌ బయాలజీ, సూపర్‌ కంప్యూటింగ్‌ మొదలైనరంగాల్లో అవకాశాలుంటాయి.

ఈ బ్రాంచి చదివినవారు కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఇంజినీర్లుగా, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అనలిస్ట్‌గా, కంప్యూటర్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ బ్రాంచివారు ఎంటెక్‌ చేయాలని అనుకుంటే ఎంటెక్‌- కంప్యూటర్‌సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ స్క్రుటినీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌, డేటాబేస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ మొదలైన స్పెషలైజేషన్స్‌లో మీ ఆసక్తిని బట్టి ఏదైనా స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.


* ఎంపీసీ 50% మార్కులతో పూర్తిచేశాను. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాకుండా వేరే వృత్తివిద్యా కోర్సులు చేయాలని ఉంది. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ/ మర్చంట్‌ ఆఫ్‌ నేవీలో ఆసక్తి ఉంది. దీనిని ఎవరు చేయవచ్చు?
- ఎన్‌. అప్పలరాజు, శ్రీకాకుళం
* ఎంపీసీ పూర్తిచేసి అందరు విద్యార్థుల్లా ఇంజినీరింగ్‌ లాంటిది కాకుండా వృత్తివిద్యా కోర్సులు చేయాలనుకున్న మీ నిర్ణయం అభినందనీయం. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సు చేయాలనుకున్నవారు 10+2 ఉత్తీర్ణతతో పాటు శారీరక దృఢత్వం కలిగివుండాలి. మంచి భావప్రసార నైపుణ్యాలు, నిర్వహణ సామర్థ్యం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని, సమస్యలను సత్వరమే పరిష్కరించే నేర్పు ఉన్నట్లయితే మీరు ఈ రంగంలో రాణించవచ్చు.

మర్చంట్‌ ఆఫ్‌ నేవీ కోర్సు చేయదలచుకున్నవారు పదోతరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సు చేయదలచుకున్నవారి వయఃపరిమితి 16 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


*పదో తరగతి తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలనుకుంటున్నాను. కోర్సు, కళాశాలల వివరాలు, ఫీజు, ఉద్యోగావకాశాలను తెలియజేయంœË.
- కె. బాబు, చిత్తూరు
* పదో తరగతి చదివిన తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలనుకుంటే సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఇంటర్మీడియట్‌ చేసిన తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును చేయడం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీలు, పీజీలు చేసినవారు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండడంవల్ల పదో తరగతి తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేసినవారికి చెప్పుకోదగ్గ ఉద్యోగావకాశాలు లేవు. కాబట్టి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు ప్రయత్నం చేయండి.

* మెడికల్‌ అండ్‌ హెల్త్‌లో పనిచేస్తున్నాను. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ చేయాలనుకుంటున్నాను. దూరవిద్య ద్వారా అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలపండి.
- బి. మంగ, విశాఖపట్నం
* పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ను దూరవిద్య ద్వారా చేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఆచార్య నాగార్జున, ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇగ్నో మొదలైన వాటిల్లో చేయడానికి అవకాశముంటుంది.

ఇతర రాష్ట్రాల్లోని అన్నామలై, పంజాబ్‌ యూనివర్సిటీ, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు కూడా దూరవిద్య ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం హెల్త్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి వివిధ రకాల పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా పీజీ డిప్లొమా ఇన్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ పల్మొనరీ ఫిజియోథెరపి, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, పర్‌ఫ్యుషన్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ అనస్తీషియా టెక్నాలజీ, మెడికల్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.


* మా అమ్మాయి అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదువుతోంది. తరువాత తనకున్న కెరియర్‌, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు తెలియజేయండి.
- డి.వి.బి. నాగరాజు, కృష్ణాజిల్లా
* అతి ముఖ్యమైన వ్యవసాయ రంగంలో కెరియర్‌పరంగా, ఉద్యోగపరంగా అవకాశాలు అధికం. మీ అమ్మాయి అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదువుతోంది కాబట్టి, ఇందులో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకుంటే అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజినీరింగ్‌, క్రాప్‌ ప్రొడక్షన్‌, రూరల్‌ టెక్నాలజీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ, అగ్రికల్చరల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, సాయిల్‌ వాటర్‌ కన్సర్వేషన్‌ ఇంజినీరింగ్‌, పోస్ట్‌ హార్వెస్ట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ ఇంజినీరింగ్‌ల్లో ఎంటెక్‌ కోర్సులు చేయడానికి అవకాశముంటుంది.

ఎంఎస్‌సీ ఇన్‌ రూరల్‌ టెక్నాలజీ, అగ్రిఇన్ఫర్మేటిక్స్‌, రూరల్‌ టెక్నాలజీల్లో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు.

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలం. వీరికి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ (ఏఆర్‌ఎస్‌), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థలు, బ్యాంకుల్లో, వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలో వీరికి వ్యవసాయ పరికరాల తయారీ రంగంలో, కన్సల్టెన్సీ సర్వీసెస్‌, అగ్రిబిజినెస్‌ సంస్థలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ రిటైలింగ్‌ రంగంలో, పరిశోధన సంస్థలు, లేబొరేటరీల్లో ఉపాధి లభిస్తుంది.


న్యూక్లియర్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేస్తే..?
* గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మెకానికల్‌ చదువుతున్నాను. తరువాత ఇంజినీరింగ్‌లో చేరాలనుంది. ఏ ప్రోగ్రాముల్లో నాకు చేరే అవకాశముంటుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది? - జి. రమేష్‌

** మీకు ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ చదివే అవకాశం ఉంటుంది. మెకానికల్‌, మైనింగ్‌, ప్రొడక్షన్‌, ఆటోమొబైల్‌, మెటలర్జీ, ఏరోనాటికల్‌, మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌ మొదలైన కోర్సులు చదివే అవకాశముంటుంది. పాలిటెక్నిక్‌ తర్వాత ఇంజినీరింగ్‌ చేస్తే చాలా ఉద్యోగాలకు అర్హులవుతారు. విషయ పరిజ్ఞానం కూడా పెరగడం వల్ల పాలిటెక్నిక్‌లో నేర్చుకున్న ప్రాక్టికల్స్‌, ఇంజినీరింగ్‌లో నేర్చుకునే థియరీ, ప్రాక్టికల్స్‌ వల్ల అవగాహన, సమస్యా పరిష్కార సామర్థ్యాలు పెరుగుతాయి. ఫలితంగా మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.

* ఈసీఈ 2014లో పూర్తిచేసి ప్రస్తుతం ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగం చేస్తున్నాను. విదేశాల్లో న్యూక్లియర్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేయాలనుంది. ఏ దేశంలో చేస్తే మంచిది? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? - ఎ. శేఖర్‌

** ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగం చేస్తూ కూడా ఉన్నత విద్య కొనసాగించాలనే మీ అభిలాష అభినందనీయం. న్యూక్లియర్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేయడం వల్ల మెరుగైన అవకాశాలుంటాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్‌లాంటి దేశాల్లో పీజీ చేయవచ్చు. న్యూక్లియర్‌ టెక్నాలజీలో ఉన్నత విద్య తరువాత ప్రయోగశాలల్లో, న్యూక్లియర్‌ ప్లాంట్స్‌, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కొద్దిమంది మాత్రమే చదవాలని కోరుకునే ఈ కోర్సు పూర్తిచేస్తే ఉద్యోగావకాశాలు బాగా ఉంటాయి. మాస్టర్స్‌ తర్వాత పీహెచ్‌డీ కూడా చేయగలిగితే మరిన్ని అవకాశాలను పొందగలుగుతారు.

* బీటెక్‌ (ఈసీఈ) 2014లో పూర్తిచేశాను. కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుంది. గేట్‌ ద్వారా నియామకాలు జరిపే సంస్థల వివరాలు తెలియజేయండి. - సూర్యకిరణ్‌, కడప

** ఎలక్ట్రానిక్స్‌ కోర్‌ విభాగంలో గేట్‌ ద్వారా ఉద్యోగాలను అందించే ప్రధాన ప్రభుత్వ సంస్థలు- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హెచ్‌పీసీఎల్‌ (హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌), ఎన్‌టీపీసీ (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌), ఎన్‌ఎల్‌సీ (నైవెలా లిగ్నైట్‌ కార్పొరేషన్‌), సీఈఎల్‌ (సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌), పీజీసీఐఎల్‌ (పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), పీఎస్‌పీసీఎల్‌ (పంజాబ్‌ స్టీల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌), బీబీఎన్‌ఎల్‌ (భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌), ఏఏఐ (ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఇండియా లిమిటెడ్‌), బీఏఆర్‌సీ (బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌), ఎన్‌బీసీసీ (నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌), ఐఆర్‌సీఓఎన్‌ (ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌), నాల్కో (నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌).

* ఎంబీఏ- మార్కెటింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ పూర్తిచేశాను. పరిశోధన రంగంలో ఆసక్తి ఉంది. ప్రస్తుతం ఓ సంస్థలో ఆపరేషన్స్‌ అనలిస్ట్‌గా చేస్తున్నాను. ఇంకా చదవాలనే ఆసక్తి ఉంది. నా కెరియర్‌కు ఉపయోగపడే కొన్ని కోర్సుల వివరాలను తెలుపగలరు. - చైతన్య

** ఎంబీఏ- మార్కెటింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ ఆసక్తికరమైన కాంబినేషన్‌. ఈ కలయికలో ఉద్యోగావకాశాలున్నాయి. పరిశోధన చేయాలనుకునేవారు ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేయవచ్చు. సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, సర్వీస్‌ ఆపరేషన్స్‌- మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విషయాల్లో పరిశోధన చేయవచ్చు. ప్రత్యేకమైన కోర్సులపై ఆసక్తి ఉంటే పీజీ డిప్లొమాకు అవకాశముంది. లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఈఆర్‌పీ, సీఆర్‌ఎం, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్టిక్స్‌ మొదలైనవి చేయవచ్చు.

* బీటెక్‌ (మెకానికల్‌) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఏర్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేయాలనుంది. వివరాలు తెలియజేయగలరు. - మహంతి

** ప్రస్తుతం విమానయాన పరిశ్రమలన్నింటిలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏర్‌బేస్‌, బోయింగ్‌, నాసా లాంటి సంస్థల్లో ఇంజినీర్ల అవసరం ఎక్కువ. ఇస్రో, డిఫెన్స్‌, పౌరవిమాన సంస్థ, ఎన్‌ఏఎల్‌, డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్‌, ప్రైవేటు ఏర్‌లైన్స్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి. కొన్ని ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగళూరు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, మరికొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఎంటెక్‌, ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ని అందిస్తున్నాయి.


పీజీ లేకుండా పరిశోధనకు వీలుందా?
* బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ సంస్థలో నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. ఎంటెక్‌/ ఎంఎస్‌ చేయకుండా వీలవుతుందా? - రాజు యాదవ్‌

** సాధారణంగా పీహెచ్‌డీ చేయాలంటే సంబంధి సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. ఉదాహరణకు- 3 సంవత్సరాల బీఎస్‌సీ చేస్తే, 2 సంవత్సరాలు ఎంఎస్‌సీ; బీఏ తర్వాత రెండేళ్ళ ఎంఏ; బీకాం తర్వాత రెండేళ్ళ ఎంకాం పూర్తిచేస్తే కానీ పీహెచ్‌డీకి అవకాశం లేదు. కానీ 4 సంవత్సరాల బీఎస్‌సీ (ఆనర్స్‌), బీకాం (ఆనర్స్‌), బీఏ (ఆనర్స్‌), బీఈ/ బీటెక్‌తో నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశముంది. దీన్ని 10+2+4 సిస్టమ్‌ అంటారు.

ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేయడం కోసం భారత్‌లోని వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఎంటెక్‌ను కనీస అర్హతగా నిర్ణయించాయి. ఇందుకు భిన్నంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌, ప్రసిద్ధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, బనారస్‌ హిందు విశ్వవిద్యాలయం)లలో బీటెక్‌తోనే నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తున్నాయి. బీటెక్‌లోఅత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ పోటీపరీక్షలైన యూజీసీ- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌, సీఎస్‌ఐఆర్‌- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌, గేట్‌ మొదలైన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటం, సృజనాత్మకతతో ఆలోచించగలిగి పరిశోధనపట్ల ఆసక్తి ఉండటం, ఎంచుకున్న ఇంజినీరింగ్‌ రంగంలో ఉపయోగకరమైన పరిశోధన అంశాన్ని ఎంచుకుని ఇంటర్వ్యూలో రాణించగలగడం... ఇవి ఉంటే నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశముంటుంది. చాలా విద్యాసంస్థలు ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణి అని పేర్కొన్నప్పటికీ 70- 80% మార్కులు పొందినవారికి సీటు లభించే అవకాశాలు ఎక్కువ. మరికొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటుగా ఉద్యోగానుభవం/ బోధనానుభవం/ కనీసం రెండు పరిశోధన పత్రాల ప్రచురణ ఉన్నట్లయితే నేరుగా పీహెచ్‌డీకి అవకాశమిస్తున్నాయి.

ఈ విషయాలన్నింటినీ గమనిస్తే అత్యంత ప్రతిభ, పరిశోధన పట్ల విపరీతమైన ఆసక్తి కనబరిచే అతి కొద్దిమంది బీటెక్‌ విద్యార్థులకు మాత్రమే పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశం లభిస్తుందని గ్రహించవచ్చు.

* మా అమ్మాయి ఆక్వాకల్చర్‌ చదవాలనుకుంటోంది. నేనేమో హార్టికల్చర్‌ను సూచించాను. వీటిల్లో ఏది మెరుగు? కోర్సులు, ప్రవేశ పరీక్షల వివరాలు తెలియజేయగలరు. - సుధాకర్‌

** మీరు చెప్పిన రెండు కోర్సులూ ఉపయోగకరమైనవే. మార్కెట్‌ను బట్టి ఉద్యోగావకాశాలు మారుతూ ఉంటాయి. ఏ కోర్సు దానికదే ప్రత్యేకం. ఏ కోర్సు అయినా విద్యార్థి/ విద్యార్థిని ఆసక్తిని బట్టి బాగా ఉండడం, ఉండకపోవడమనేది ఆధారపడి ఉంటుంది. బీఎస్‌సీ (హార్టికల్చర్‌) తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలైన కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్‌ యూనివర్సిటీ, డా.వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. ఇంటర్మీడియట్‌ బైపీసీ తరువాత ఎంసెట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఐసీఏఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా కూడా రెండు విశ్వవిద్యాలయాల్లో కొన్ని సీట్లను భర్తీచేస్తారు. హార్టీకల్చర్‌లో డిప్లొమా కోర్సులు చేసే అవకాశముంది.

హార్టికల్చర్‌ కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు చాలా ఉంటాయి. శాస్త్రవేత్త, అధ్యాపకుడు, జిల్లా హార్టికల్చర్‌ అధికారి, హార్టికల్చర్‌ ఇన్‌స్పెక్టర్‌- ట్రెయినింగ్‌ అసిస్టెంట్‌, ఫార్మా సూపర్‌వైజర్‌ లాంటి ఉద్యోగావకాశాలు విద్యార్హతను బట్టి పొందవచ్చు. ప్రైవేటు రంగంలో కూడా మార్కెటింగ్‌ ఉద్యోగాలు, పరిశ్రమల్లో లాండ్‌స్కేపింగ్‌, హోటళ్లు, కన్‌స్ట్రక్షన్‌ సంస్థలు, గోల్ఫ్‌ కోర్టుల్లో కూడా ఉద్యోగావకాశాలుంటాయి. స్వయం ఉపాధికి చాలా అవకాశాలున్నాయి. కన్సల్టెంట్‌గా, ఫ్లోరల్‌ డెకరేటర్లుగా, కోల్డ్‌స్టోరేజీ నిర్వాహకులుగా రకరకాల అవకాశాలుంటాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 30 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో హార్టికల్చర్‌ కోర్సులు, పరిశోధన అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రైవేటు కళాశాలల్లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది.

ఆక్వాకల్చర్‌ విషయానికొస్తే.. దీనిని బీఎస్‌సీలో భాగంగా ఒక సబ్జెక్టుగా గానీ, బీఎస్‌సీ- ఫిషరీస్‌, మైక్రోబయాలజీ, ఆక్వాకల్చర్‌ కలయికగాకానీ చదివే అవకాశముంది. ఇవేకాకుండా బీఎఫ్‌ఎస్‌సీ ఫిష్‌ బయాలజీ, ఫిష్‌ ఎకనామిక్స్‌, ఫిష్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌, ఫిష్‌ టెక్నాలజీ- ఇంజినీరింగ్‌, బీఎస్‌సీ ఫిషరీస్‌; ఇవే కోర్సుల్లో మాస్టర్స్‌, పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. ఈ కోర్సు చేస్తే ఆహార పరిశ్రమలో చేపలు/ రొయ్యల ఎగుమతులు, బయోటెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

* దూరవిద్య ద్వారా బీకాం (చివరి సంవత్సరం) చదువుతున్నాను. ఎంకాం (అకౌంట్స్‌)/ ఎంబీఏ నేరుగా చదవాలనుకుంటున్నాను. అలా చదవడం కుదురుతుందా? అయితే ఏయే ప్రవేశపరీక్షలు రాయాలి? తెలుగు రాష్ట్రాల్లో ఏయే విశ్వవిద్యాలయాలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి? - శశిధర్‌

** దూరవిద్య ద్వారా బీకాం చదివినప్పటికీ రెగ్యులర్‌గా బీకాం చదివినవారు ఏయే కోర్సులకు అర్హులో వాటన్నింటికీ మీరూ అర్హులవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలైన మౌలానా నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (ఉర్దూ మీడియం), అన్ని డీమ్డ్‌ యూనివర్సిటీలు, కొన్ని అటానమస్‌ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంకాంలు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జవహర్‌లాల్‌నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (హైదరాబాద్‌, అనంతపురం, కాకినాడ), దాదాపుగా అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఎంబీఏ మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు ఎంబీఏకి సమానమైన రెండు సంవత్సరాల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ను అందిస్తున్నాయి. ఉదాహరణకు శివశివాని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, విశ్వవిశ్వాని బిజినెస్‌ స్కూల్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, ఐఎంటీ హైదరాబాద్‌, సింబయాసిస్‌ మొదలైనవి. ఎంకాంకు సంబంధించినంతవరకూ ప్రతి సంవత్సరం మే, జూన్‌లలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

ఎంబీఏకు సంబంధించి ఐసెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా రెండు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో, వాటి అనుబంధ కళాశాలల్లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలుంటాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ క్యాట్‌లో వచ్చిన మార్కులు, బృందచర్చలు, మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుపుతారు. ఏఐసీటీఈ- సీమ్యాట్‌ (కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌), ఏటీఎంఏ (ఎయిమ్స్‌ టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌)ల్లో పొందిన మార్కులు, బృందచర్చలు, మౌఖిక పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.


కంప్యూటర్‌ & ఎలక్ట్రానిక్స్‌లో..పరిశోధన ఎలా?

* బీటెక్‌ పూర్తిచేశాను. ఎంబీఏ (హెచ్‌ఆర్‌) దూరవిద్య చేయాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయం, ప్రవేశపరీక్షల వివరాలు తెలపండి. - వెంకీ

** దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయాలనుకునేవారికి ముఖ్యంగా ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ), బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలలో అవకాశాలున్నాయి. ఇగ్నోలో ఎంబీఏ చేయాలనుకునేవారు ఓపెన్‌ మ్యాట్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షను జులై, డిసెంబర్‌ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఐసెట్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. ఇగ్నో, అంబేడ్కర్‌ యూనివర్సిటీల్లో ఎంబీఏ కోర్సు కాలవ్యవధి 3 సంవత్సరాలు.

హెచ్‌ఆర్‌ అనేది ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్‌ మాత్రమే. ప్రత్యేకంగా ఎంబీఏ (హెచ్‌ఆర్‌) అనే కోర్సు ఉండదు. హెచ్‌ఆర్‌తోపాటుగా మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ సిస్టమ్స్‌ స్పెషలైజేషన్లలో కూడా ఎంబీఏ చేయవచ్చు. వీటితోపాటు పైన చెప్పిన రెండు విశ్వవిద్యాలయాల్లో కూడా ఎంబీఏ దూరవిద్య ద్వారా చేయవచ్చు. అందుబాటులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు- ఉస్మానియా, కాకతీయ, ఆంధ్ర, నాగార్జున, శ్రీవెంకటేశ్వర మొదలైనవాటిలో రెండు సంవత్సరాల్లో దూరవిద్య ద్వారా ఎంబీఏ పూర్తిచేయవచ్చు.

వీటిల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఐసెట్‌ ద్వారా, ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుపుతున్నాయి. ప్రవేశపరీక్షలో ఇంగ్లిష్‌, మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వ్యాపార సంబంధిత పదాలు మొదలైనవాటిలో బహుళైచ్ఛిక ప్రశ్నల ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.

* బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చదివి, ఎంబీఏ చేస్తున్నాను. రెండో సంవత్సరంలో ఏ ఆప్షన్‌ తీసుకుంటే మేలు? గతంలో సేల్స్‌ ప్రమోటర్‌గా చేసిన అనుభవముంది. - బైల్‌రెడ్డి సంతోష్‌

** బీఎస్‌సీ- కంప్యూటర్స్‌ చదివిన మీరు ఎంబీఏలో సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌ తీసుకుంటే సబ్జెక్టును బాగా అర్థం చేసుకుని రాణించే అవకాశముంది. సేల్స్‌ ప్రమోటర్‌గా చేసిన అనుభవముంది కాబట్టి మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌ తీసుకుంటే మీకున్న సేల్స్‌ అనుభవం బాగా ఉపయోగపడుతుంది.

ఒకవేళ మీ కళాశాలలో డ్యూయల్‌ స్పెషలైజేషన్‌ అవకాశం ఉంటే మార్కెటింగ్‌, సిస్టమ్స్‌ను ఆప్షనల్‌గా తీసుకుంటే మీకున్న కంప్యూటర్‌ పరిజ్ఞానం, సేల్స్‌ అనుభవం బాగా ఉపయోగపడతాయి. సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌ లేకపోతే ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ అయినా తీసుకోవచ్చు. మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ కలయిక మీకు మంచి ఉద్యోగాలను తెచ్చిపెడుతుంది. ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ కూడా లేకపోతే మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ స్పెషలైజేషన్లను తీసుకుంటే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి.

కొన్ని విశ్వవిద్యాలయాల్లో మేజర్‌, మైనర్‌ స్పెషలైజేషన్లుంటాయి. మీ కళాశాలల్లో అలా ఉన్నట్లయితే మార్కెటింగ్‌ను మేజర్‌గా; సిస్టమ్‌/ ఆపరేషన్స్‌/ ఫైనాన్స్‌ల్లో ఒకదానిని మైనర్‌ స్పెషలైజేషన్‌గా తీసుకుని కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విషయాల్లో ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తే మీకు మార్కెటింగ్‌లో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌పై పట్టు వస్తుంది. ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.

* ఎంఫార్మసీ చివరి సెమిస్టర్‌ చదువుతున్నాను. తరువాత పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. కేయూ, ఓయూ విశ్వవిద్యాలయాల్లో నాకున్న అవకాశాలు తెలపండి. - అంబిక

** 2009 యూజీసీ రెగ్యులేషన్స్‌ ప్రకారం- పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దేశం మొత్తానికి అనువర్తించేలా కొన్ని నిబంధనలను నిర్దేశించారు. ముఖ్యంగా పీహెచ్‌డీలో ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు జరపాలి. ఎంఫిల్‌ చేసినవారికి, నెట్‌/ సెట్‌ అర్హత సాధించినవారికి ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు ఉంది. కానీ వీరు కూడా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సివుంటుంది.

ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు కూడా ఫార్మసీలో పీహెచ్‌డీ కోసం ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. నెట్‌, సెట్‌లతోపాటు సీఎస్‌ఐఆర్‌- యూజీసీ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, ఐసీఎంఆర్‌, డీబీటీల రీసెర్చ్‌ ఫెలోలు కూడా ప్రవేశపరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు.

* ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేశాను. ప్రస్తుతం శాప్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ నేర్చుకుంటున్నాను. దీని ద్వారా కొత్తవారికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయో తెలియజేయగలరు.- టి.హరీష్‌, హైదరాబాద్‌

** ప్రస్తుతం మౌలిక వసతుల రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. నగరాల సుందరీకరణ, కొత్త రాజధానుల నిర్మాణం నేపథ్యంలో ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంబీఏ చేసినవారికి నిర్మాణ, ఐటీ సంస్థల్లో, అర్బన్‌- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో మేనేజర్లుగా, కన్సల్టెంట్లుగా ఉద్యోగావకాశాలున్నాయి. ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తోపాటుగా శాప్‌ మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో నిపుణుడిగా ఉద్యోగావకాశాలుంటాయి.

మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, స్టోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, పర్చేజింగ్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విభాగాల్లో మేనేజర్‌గా, కోఆర్డినేటర్‌గా, స్పెషలిస్ట్‌గా, శాప్‌ కన్సల్టెంట్‌గా, అనలిస్ట్‌గా, ఎగ్జిక్యూటివ్‌గా వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం, కంప్యూటరైజేషన్‌, ప్రపంచీకరణ విస్తరిస్తున్న ఈ తరుణంలో ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌- శాప్‌ మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ల కలయిక వల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మొదటి ఉద్యోగం అతి పెద్దసంస్థలో చేయాలనుకోకుండా అనుభవం కోసం చిన్న సంస్థలో పనిచేసి ఈ రంగంలో మెలకువలు తెలుసుకోండి. ఆపై అంతర్జాతీయ, బహుళజాతి సంస్థల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించవచ్చు.

* ఎంసీఏ 2012లో పూర్తిచేశాను. పైచదువులు చదవాలనుంది. నానోటెక్నాలజీ/ మల్టీమీడియా/ డేటాబేస్‌/ నెట్‌వర్క్‌లపై ఆసక్తి ఉంది. కంప్యూటర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ కూడా చేయాలనుంది. దీనికి సంబంధించిన వివరాలు, సబ్జెక్టులు తెలియజేయండి. - జి. రాధిక

** నానోటెక్నాలజీ, మల్టీమీడియా, డేటాబేస్‌, నెట్‌వర్క్‌లపై ఆసక్తి ఉంటే, ఆయా కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిన అవసరముంది. మీరు చదివిన ఎంసీఏలో కంప్యూటర్‌ గురించి నేర్చుకున్న విషయ పరిజ్ఞానానికీ, మీకు ఆసక్తి ఉన్న కోర్సులకూ మధ్య కొంత తేడా ఉంది. ఆ తేడాను అధిగమించాలంటే ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించండి.

కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి మీకు పూర్తి అర్హతలున్నాయి. ఒక్కో విశ్వవిద్యాలయ ప్రవేశపద్ధతి ఒక్కోలా ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రవేశపరీక్ష ద్వారా, మరికొన్ని ఎంఫిల్‌ ద్వారా, మరికొన్ని గేట్‌ స్కోరు ద్వారా, ఇంకొన్ని నెట్‌/ సెట్‌ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తాయి. ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలంటే ఎలక్ట్రానిక్స్‌లో/ ఫిజిక్స్‌లో పీజీ ఉండాలి. విదేశాల్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌ విభాగాలు కలిపి ఒక విభాగంగా ఉంటాయి. మీకు ఎలక్ట్రానిక్స్‌లోనే పీహెచ్‌డీ చేయాలనే కోరిక ఉంటే, విదేశాల్లో వెసులుబాటు ఉంటుంది.

గేట్‌ ద్వారా ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌ల కలయికలో ఉన్న సబ్జెక్టులు (ఉదాహరణకు- రోబోటిక్స్‌)లో ఎంటెక్‌ చేసి ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ చేయవచ్చు.


దూరవిద్యలో వ్యవసాయ కోర్సులు
* అగ్రికల్చర్‌ డిప్లొమా చేశాను. బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చేయాలనుకుంటున్నాను. దూరవిద్య ద్వారా చేయడం మంచి ఆలోచనేనా? ఇతర రాష్ట్రాల్లో ఈ కోర్సును దూరవిద్య ద్వారా అందించే విశ్వవిద్యాలయాలేవి?- కృష్ణపాల్‌, ఆదిలాబాద్‌

** బీఎస్‌సీ అగ్రికల్చర్‌ కోర్సుకు దేశంలో ఐసీఏఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) అనుమతి తప్పనిసరి. ఐసీఏఆర్‌ అనుమతి లేని బీఎస్‌సీ అగ్రికల్చర్‌ కోర్సుకు ఉద్యోగావకాశాలు, ఉన్నతవిద్య అవకాశాలు ఉండవు. మీరు దూరవిద్య ద్వారా కానీ, నేరుగా కానీ బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చేయాలనుకుంటే ఆ విద్యాసంస్థకు ఐసీఏఆర్‌ అనుమతి ఉందో, లేదో తెలుసుకోవాలి. యశ్వంతరావు చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ, నాసిక్‌ http://www.ycmou.ac.in దూరవిద్య ద్వారా బీఎస్‌సీ అగ్రికల్చర్‌ను అందిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో బీఎస్‌సీ అగ్రికల్చర్‌ను దూరవిద్య ద్వారా ఏ విశ్వవిద్యాలయమూ అందించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో చాలా విశ్వవిద్యాలయాలు అగ్రికల్చర్‌లో పీజీ డిప్లొమా కోర్సులు, డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ లాంటి కోర్సులను అందిస్తున్నాయి.

బీఎస్‌సీ అగ్రికల్చర్‌ లాంటి ఏ ప్రొఫెషనల్‌ కోర్సునయినా నేరుగా పేరున్న కళాశాలల్లో చేయడం మంచిది. మీరు డిప్లొమా తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరి ఉంటే దూరవిద్య ద్వారా చేసిన డిగ్రీ పదోన్నతులకు ఉపయోగపడుతుంది. మరేదైనా కొత్త ఉద్యోగానికి వెళ్లినపుడు దూరవిద్య ద్వారా డిగ్రీ చేసినవారికంటే నేరుగా డిగ్రీ చదివినవారికి ప్రాముఖ్యం ఉంటుంది.

ఏదైనా ప్రొఫెషనల్‌ కోర్సులో మూడు/ నాలుగు సంవత్సరాలు ప్రముఖ విద్యాసంస్థల్లో పేరున్న అధ్యాపకుల పర్యవేక్షణలో విషయ పరిజ్ఞానాన్నీ, మెలకువలనూ ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేరుగా బీఎస్‌సీ అగ్రికల్చర్‌ను చేయడానికి వీలులేనపుడు మాత్రమే దూరవిద్య ద్వారా డిగ్రీ కోసం ప్రయత్నించాలి. దూరవిద్య ద్వారా చేస్తున్నప్పటికీ విశ్వవిద్యాలయం వారు అందించే పాఠ్యాంశాలను, ఉపయుక్త గ్రంథాలను కూడా చదవాలి. అసైన్‌మెంట్‌లను సొంతంగా రాస్తూ, కాంటాక్ట్‌ తరగతులకు విధిగా హాజరై విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇలా చేస్తే ఉద్యోగార్హత పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచే అవకాశం ఉంటుంది.

* మా బాబు ఇంటర్‌ (ఎంపీసీ) తరువాత సీఏ తీసుకున్నాడు. సీపీటీ పూర్తి చేశాడు. ఐపీసీసీ చదివేటపుడే బీకాం పూర్తి చేశాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సును దూరవిద్య ద్వారా చేస్తున్నాడు. దీనికి విలువ ఉంటుందా? దీనికి తోడు ఏదైనా కోర్సు చేస్తే మేలా? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? - ఓ పాఠకురాలు

** సీపీటీ, ఐపీసీసీతోపాటుగా బీకాం పూర్తిచేసి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సును దూరవిద్య చేయడం వల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూరవిద్య ద్వారా చేస్తున్న కోర్సు డిప్లొమా, డిగ్రీ, పీజీల విషయంలో స్పష్టత లేనందువల్ల దూరవిద్య ద్వారా ఎంబీఏ చదువుతున్నారన్న భావనతో మీ ప్రశ్నకు సమాధానాన్ని పరిశీలిద్దాం. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం సీఏ, ఐసీడబ్ల్యూఏ లాంటి కోర్సులను పీజీతో సమానంగా అధ్యాపక ఉద్యోగాలకు అర్హత కల్పిస్తున్నారు. మీ బాబు సీఏ పూర్తిచేసి ఎంబీఏ కూడా కలిగి ఉన్నట్లయితే అధ్యాపక రంగంలో, ఆడిట్‌, సాఫ్ట్‌వేర్‌, వస్తుతయారీ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సు చదవడం వల్ల ప్రపంచస్థాయి వ్యాపారానికి కావాల్సిన విషయ పరిజ్ఞానం మెలకువలు గ్రహించవచ్చు. వీటితోపాటుగా ఎకౌంటింగ్‌కు సంబంధించి కొన్ని సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీల్లో శిక్షణ తీసుకున్నట్లయితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

దూరవిద్య ద్వారా చేస్తున్న కోర్సు విలువ గురించి పై ప్రశ్నకు చెప్పిన సమాధానాన్ని చూడండి.

* మా అమ్మాయి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ పూర్తయ్యాక ఏదైనా కోర్సులో చేరాలనుకుంటోంది. ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సుల గురించి వివిధ సంస్థలు అందించే డిగ్రీ, డిప్లొమా, పీజీ, మేనేజ్‌మెంట్‌ కోర్సుల వివరాలు తెలియజేయగలరు. అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలు తెలపండి. - పి. కుమారి

** ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లు ప్రత్యేకమైన కోర్సులు. ఆ కోర్సును చదవాలనుకునే విద్యార్థులకు ఆ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటే భవిష్యత్తులో రాణించే అవకాశం ఉంటుంది. ఈ కోర్సులు అందించే సంస్థలు, వాటి వివరాలు: జాతీయ సంస్థలైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అండ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (www.niiftbbsr.ac.in ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (www.nift.ac.in ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (www.iiftbangalore.com) మొదలైన సంస్థలు డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, బీఎస్‌సీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, పీజీ డిప్లొమా కోర్సులు, మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ మొదలైనవి అందిస్తున్నాయి. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని బీఐపీడీ బిజినెస్‌ స్కూల్‌ (www.bipdindia.com ), హామ్స్‌టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ (www.hamstech.com ), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ (www.svuniversity.ac.in ), ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ (www.andhrauniversity.edu.in ), కాలేజ్‌ ఆఫ్‌ హోమ్‌సైన్స్‌ (www.chshyd.ac.in ), జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌ మొదలైన సంస్థలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి.


పెట్రో ఇంజినీరింగ్‌లో.. ఏ బ్రాంచి మేలు?
* మా అబ్బాయి బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) పూర్తిచేశాడు. పెట్రోలియం ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాడు. దానిలో ఏ బ్రాంచి మేలు? పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఎలా ఉంటుంది? దేశవిదేశాల్లో ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? - ఎస్‌ఏ కలాం, కంభం

** బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) తర్వాత పెట్రోలియం ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేయడం వల్ల కెమికల్‌, పెట్రోలియం రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. పెట్రోలియం ఇంజినీరింగ్‌లో చాలా బ్రాంచీలు ఉన్నప్పటికీ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ బ్రాంచి బాగా ప్రాచుర్యం పొందింది.

పెట్రోలియం అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిన తరుణంలో ఉద్యోగావకాశాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. భారతదేశంలో అతి కొద్ది విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు మాత్రమే ఈ కోర్సును అందించడం వల్ల ఈ రంగంలో నిపుణుల కొరత ఎక్కువ. ఈ కోర్సు చదివిన తరువాత పెట్రోలియం సంస్థలతోపాటు గ్యాస్‌, ఆయిల్‌ సంస్థలు, ఎనర్జీ రంగాలు, సహజవాయు సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. విదేశీ ఉద్యోగావకాశాల విషయానికొస్తే గల్ఫ్‌, సౌదీ దేశాల్లో ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, కన్సల్టెంట్లుగా ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

ఇవే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా, కన్సల్టెంట్లుగా, విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా కూడా పనిచేసే అవకాశాలున్నాయి.

* లాసెట్‌లో మంచి ర్యాంకు సాధించాను. అయితే స్నేహితులు న్యాయవిద్య కంటే గ్రూప్స్‌కు సిద్ధమవడం మేలు అంటున్నారు. నిజమేనా? లా ఉపాధి, ఉద్యోగావకాశాలను తెలపండి. తరువాత ఏ పై చదువులు చదవవచ్చు?- పల్లికొండ నరేష్‌

** లాసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన మీరు ఆ రంగంలో ఆసక్తి ఉన్నట్లయితే లా కోర్సు చదవడమే మేలు. ప్రభుత్వ ఉద్యోగంతోపాటుగా ప్రజాసేవ చేయడం మీ అభిమతమైతే గ్రూప్స్‌ చేయడం మంచిది. లా చదివిన తర్వాతగానీ, గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నపుడుగానీ భారీగా పోటీపడాల్సి ఉంటుంది. కొన్ని వేలమంది లాయర్లతో, లక్షల మంది గ్రూప్స్‌ అభ్యర్థుతో పోటీ పడడం తప్పనిసరి అయిననపుడు మీకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రయత్నించడం మంచిది.

లా అనేది ఒక కోర్సు అయితే గ్రూప్స్‌... ఉద్యోగానికి సంబంధించిన అంశం. లాసెట్‌లో మంచి ర్యాంకు రావడమనేది మీకు ఉన్న జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ల్లో మీకున్న పట్టును తెలియజేస్తుంది.

పోటీ పరీక్షల్లో కూడా ఈ విషయాల్లో పరిజ్ఞానం ఉన్నవారు రాణించే అవకాశాలు ఎక్కువ. న్యాయవిద్య- ప్రొఫెషనల్‌ కోర్సు కాబట్టి గ్రూప్స్‌లో ఒకవేళ ఉత్తీర్ణత సాధించకపోతే లాయరుగా స్థిరపడే అవకాశాలుంటాయి. వీలుంటే లా చదువుతూ కూడా సన్నద్ధమయ్యే అవకాశాలను పరిశీలించండి. న్యాయవిద్య చదివినట్లయితే లీగల్‌ అడ్వైజర్‌గా, క్రిమినల్‌ లాయర్‌, లీగల్‌ జర్నలిస్ట్‌, లీగల్‌ అనలిస్ట్‌, సివిల్‌ లిటిగేషన్‌, సబ్‌ జడ్జి, జడ్జిలుగా ఉద్యోగావకాశాలుంటాయి.ఉన్నతవిద్య అభ్యసించాలంటే ఎల్‌ఎల్‌ఎం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులను చేయవచ్చు. మీరు లా చదవాలనుకుంటే క్రిమినల్‌ లా, అడ్మినిస్ట్రేటివ్‌ లా, హ్యూమన్‌రైట్స్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, సైబర్‌ లా, కార్పొరేట్‌ లా, బిజినెస్‌ లా, లేబర్‌ లా మొదలైన వాటిలో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంచుకుని చదవవచ్చు. కొన్ని తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు (ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ), కొన్ని జాతీయ విశ్వవిద్యాలయాలు (నల్సార్‌, నేషనల్‌ లా స్కూల్‌ మొదలైనవి), కొన్ని డీమ్డ్‌ (భారతీ విద్యాపీఠ్‌, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం) లా కోర్సును అందిస్తున్నాయి.

* బీఎస్‌సీ పూర్తిచేశాను. ఎంఎస్‌సీ (మేథమేటిక్స్‌) దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను కుదురుతుందా? అందించే సంస్థలేవి? తుది గడువులు, ఫీజు వివరాలు తెలియజేయండి. - వి. కిషోర్‌బాబు
** ఎంఎస్‌సీ (మేథమేటిక్స్‌)ను దూరవిద్య ద్వారా చేయవచ్చు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, (బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీతోపాటుగా ఉస్మానియా), కాకతీయ, ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, రాయలసీమ విశ్వవిద్యాలయాలు, తమిళనాడులోని అన్నామలై, మధురై కామరాజు, అలగప్ప విశ్వవిద్యాలయాలు, పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా ఎంఎస్‌సీ (మేథమేటిక్స్‌)ను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.

ఫీజు రూ. 8000 నుంచి రూ. 22,000వరకు (కోర్సు మొత్తానికి) ఉంటుంది. చాలా విశ్వవిద్యాలయాలు కనిష్ఠంగా రూ. 8000, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) లాంటి విశ్వవిద్యాలయాలు గరిష్ఠంగా రూ. 22000 ఫీజు నిర్ధారించాయి.

సాధారణంగా దూరవిద్య ద్వారా నిర్వహించే కోర్సుల ప్రకటనలు జులై నుంచి డిసెంబర్‌లోపు రకరకాల తేదీల్లో విడుదల చేస్తారు. ఆ తేదీల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.


న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ ఎక్కడ?
* బీటెక్‌ (ఈఈఈ) 2012లో పూర్తిచేశాను. ఎంటెక్‌ (పవర్‌ ఎలక్ట్రానిక్స్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. కోర్‌ ఇండస్ట్రీలో పనిచేయాలని ఉంది. వివరాలు, కెరియర్‌ అవకాశాలు తెలియజేయండి. - మణికంఠ

** పవర్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్‌ చేసినవారికి విద్యుత్‌ పరికరాల తయారీ పరిశ్రమలు, వైర్‌లెస్‌ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. పరిశోధన, విద్యుత్‌ ఆధారిత వస్తువుల ఉత్పత్తి సంస్థలు, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల్లో కూడా ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఇంజినీర్లు, జూనియర్‌ ఇంజినీర్లుగా, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా, అసోసియేట్‌ ఇంజినీర్లుగా ఉద్యోగావకాశం ఉంటుంది. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, భారత రైల్వేలు, బీహెచ్‌ఈఎల్‌, విమాన- ఆటోమొబైల్‌ పరిశ్రమ, స్టీల్‌ పరిశ్రమ, టెలికమ్యూనికేషన్‌ పరిశ్రమ, విద్యుత్‌ పవర్‌స్టేషన్‌లు, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌, అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించే అవకాశముంది. ప్రైవేటు రంగంలో విద్యుత్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రాలు, విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా, గృహావసర వస్తువుల ఉత్పత్తి, వైద్య సంబంధ వస్తువుల ఉత్పత్తి పరిశ్రమల్లో, విద్యుత్‌ నియంత్రణ వస్తువుల ఉత్పత్తి, ఐటీ పరిశ్రమ, రొబోటిక్స్‌, మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ మొదలైన వాటిలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది.

ఎంటెక్‌ (పవర్‌ ఎలక్ట్రానిక్స్‌) చేసినవారు అసిస్టెంట్‌ మేనేజర్‌- సిస్టమ్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌), ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌ మేనేజర్‌- ఎలక్ట్రికల్‌ పానల్‌, జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ అప్లికేషన్‌ ఇంజినీర్లుగా, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీలుగా ఉద్యోగం చేసే అవకాశముంటుంది. అంతేకాకుండా ఎంటెక్‌ (పవర్‌ ఎక్ట్రానిక్స్‌) చేసినవారికి విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు విరివిగా ఉంటాయి. సెక్యూరిటీ సిస్టమ్స్‌, స్విచ్‌గేర్‌, యూపీఎస్‌, సోలార్‌ ఎనర్జీ, థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ మొదలైన వాటిలో ఎక్కువగా అవగాహన ఉంటే మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

*. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. తరువాత ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ చేయాలనుంది. ఈ రెండింటిలో ఏది మేలు? ఉద్యోగావకాశాలు తెలియజేయండి. - టీఎస్‌ఐ నాగసాయి, రాజమండ్రి

** ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమేంటేషన్‌ ఇంజినీరింగ్‌ రెండు కోర్సుల్లో కూడా ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. కోర్సుని బట్టి కాకుండా మనకున్న అభిరుచి, ఆసక్తిని బట్టి ఉద్యోగావకాశాలుంటాయి. ఉద్యోగావకాశాల దృష్ట్యా కాకుండా పది సంవత్సరాల తర్వాత మీరు ఏ రంగంలో ఏవిధంగా ఉండాలని అనుకుంటున్నారో దాన్నిబట్టి కోర్సుని ఎంచుకోవాలి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో విమానాల తయారీ, పరిశోధన, ఉపగ్రహాల తయారీ, పరిశోధన, విమాన ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఇవేకాకుండా రక్షణ రంగంలో, ఇస్రోలాంటి సంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, నేషనల్‌ ఏరోనాటిక్స్‌ ల్యాబ్‌, డీఆర్‌డీవో, బీడీఎల్‌ లాంటి భారతదేశ సంస్థలతోపాటుగా విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాసెసింగ్‌ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతున్నతరుణంలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్ల అవసరం ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో విరివిగా ఉపయోగిస్తున్న రియల్‌టైం అప్లికేషన్స్‌, హైస్పీడ్‌ కంప్యూటింగ్‌, డేటా అక్విసిషన్‌, అడ్వాన్స్‌డ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ రంగాల్లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హెల్త్‌కేర్‌ రంగంలో కూడా స్కానింగ్‌, వెంటిలేటర్స్‌ లాంటి బయోమెడికల్‌ పరికరాల తయారీలో వీరి పాత్ర కీలకం. ఇవేకాకుండా స్టీలు, సిమెంట్‌, ఆటోమొబైల్స్‌, రబ్బరు, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ రంగాల్లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్ల అవసరం చాలా ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల బహుళజాతి సంస్థల్లో, విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి.

* బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌) పూర్తిచేశాను. నూక్లియర్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? - చిన్నా

** బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌) పూర్తిచేసిన మీరు నూక్లియర్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ చేయవచ్చు. భారత్‌లో ఉన్న ఐఐటీలు- ఐఐటీ బాంబే (www.iitb.ac.in), ఐఐటీ కాన్పూర్‌ (www.iitk.ac.in), ఐఐటీ మద్రాస్‌ (www.iitm.ac.in), కొన్ని ప్రభుత్వ సంస్థలు- బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) (www.barc.gov.in), కొన్ని విశ్వవిద్యాలయాలు/ ప్రైవేటు సంస్థలయిన హోమి బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (www.hbni.ac.in), అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నూక్లియర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (www.amity.edu/amst), దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (www.dtu.ac.in), జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (www.jntuk.edu.in), మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (www.manipal.edu), జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ (www.jaduniv.edu.in), మహాత్మ జ్యోతిరావు ఫూలే యూనివర్సిటీ (www.mjrpuniversity.ac.in) మొదలైనవి ఈ కోర్సును అందిస్తున్నాయి.

విదేశాల్లో చదవాలని అనుకుంటే.. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (www.mit.edu), కొలంబియా యూనివర్సిటీ (www. columbia.edu), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (www.california.edu), యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ (www.umich.edu), యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా (www. ufl.edu), ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ (www.osu.edu) మొదలైనవి ఈ కోర్సును అందిస్తున్నాయి.

నూక్లియర్‌ ఇంజినీరింగ్‌, నూక్లియర్‌ డివైన్‌ ఇంజినీరింగ్‌, ఫిజికల్‌ సైంటిస్ట్‌, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ మొదలైన ఉద్యోగాలుంటాయి. ఈ కోర్సు పూర్తిచేసినవారికి వివిధ రకాల తయారీ రంగ సంస్థలు, కంప్యూటర్‌ ఆధారిత ఉత్పత్తి సంస్థలు, రేడియోధార్మిక పదార్థాలు, ప్లాస్మా ఫిజిక్స్‌లకు సంబంధించిన రంగాల్లో ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలుంటాయి. మనదేశంలో రక్షణ, పరిశోధన, నావికా రంగాల్లో, జలాంతర్గాముల తయారీలో, అంతరిక్షనౌక తయారీలో ఉద్యోగావకాశాలుంటాయి. భారత్‌- అమెరికా నూక్లియర్‌ ప్రతిపాదిత ఒప్పందం అమల్లోకి వస్తే పలు ప్రైవేటు రంగసంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.


డెయిరీలో పీజీ కోర్సులు..
* బీఏ- హెచ్‌ఆర్‌ఎం మూడో సంవత్సరం చదువుతున్నాను. తరువాత నాకున్న కెరియర్‌ అవకాశాలను తెలియజేయండి. వాటితో ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? - ఎస్‌. నీలిమ, విజయనగరం

** బీఏ-హెచ్‌ఆర్‌ఎం (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) చదివిన తరువాత ఎంబీఏ హెచ్‌ఆర్‌ఎం కూడా చదివితే ఉద్యోగావకాశాల పరిధి బాగా పెరుగుతుంది. ఎంబీఏ- హెచ్‌ఆర్‌ఎం వీలుకాని పక్షంలో ఎంహెచ్‌ఆర్‌ఎం (మాస్టర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) కానీ, ఎంఏ (హెచ్‌ఆర్‌ఎం) కానీ, మాస్టర్స్‌ ఆఫ్‌ లేబర్‌ వెల్ఫేర్‌ కూడా చేసే అవకాశముంది. ఇంకా అవకాశముంటే హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు.

మీరు బీఏ- హెచ్‌ఆర్‌ఎంతోనే ఉద్యోగం చేయాలని అనుకుంటే ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంబీఏ కళాశాల నుంచి వేలమంది విద్యార్థులు హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో బయటికి వస్తున్నారు; వారితో పోటీపడి ఉద్యోగం సాధించాలంటే మీకు బీఏలో ఉన్న సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి. దీనితోపాటు భావప్రకటన నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, చొరవ ఉన్నట్లయితే ఎంబీఏ వారితో పోటీపడి ఉద్యోగాలు సాధించవచ్చు హెచ్‌ఆర్‌ఎం చదివినవారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలు: హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌, ఎంప్లాయీ ట్రెయినింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, ఎంప్లాయీ బెనిఫిట్‌ మేనేజర్‌, లేబర్‌ రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ కన్సల్టెంట్‌, రిక్రూట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎంప్లాయిమెంట్‌ ఇంటర్వ్యూయర్‌, ఎంప్లాయీ వెల్ఫేర్‌ మేనేజర్‌ మొదలైనవి.

* మా అబ్బాయి డెయిరీ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. పీజీ కోర్సులు, అందించే విశ్వవిద్యాలయాలను తెలపండి. కోర్సు పూర్తయిన తరువాత తనకుండే ఉద్యోగావకాశాలను తెలియజేయండి.- కె. నాగేశ్వరరావు, గుంటూరు

** నిత్యావసర వస్తువు అయిన పాలకు సంబంధించిన కోర్సులకు ఆదరణ, అవకాశాలు ఎప్పుడూ ఎక్కువే. డెయిరీ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ చదివినవారు ఈ కింది కోర్సుల్లో పీజీ చేయవచ్చు. అవి- ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ టెక్నాలజీ, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ కెమిస్ట్రీ, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ ఇంజినీరింగ్‌, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ బాక్టీరియాలజీ, మాస్టర్స్‌ ఆఫ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఏబీఎం) మొదలైనవి.

ఈ కోర్సులను అందించే విశ్వవిద్యాలయాలు కాలేజ్‌ ఆఫ్‌ డెయిరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కాలేజ్‌ ఆఫ్‌ డెయిరీ టెక్నాలజీ, బెంగళూరు డెయిరీ సైన్స్‌ కాలేజ్‌, ఆనంద్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వెస్ట్‌బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ యానిమల్‌ అండ్‌ ఫిషరీ సైన్స్‌, నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మొదలైన ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు, తెలుగు రాష్ట్రాల్లోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు డెయిరీ టెక్నాలజీలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి డెయిరీ కన్సల్టెంట్లుగా, సూపర్‌వైజర్లుగా, ఉపాధ్యాయులుగా, పరిశోధనల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారు మిల్క్‌ప్లాంట్‌, ఐస్‌క్రీం యూనిట్లు స్థాపించి సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. డెయిరీ టెక్నాలజీ చదివినవారికి డెయిరీ ఫార్మ్‌ల్లో పాలకు సంబంధించిన పదార్థాలను తయారుచేసే సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

* 2014లో బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. ఐటీ రంగంలో ఆసక్తి ఉంది. ఏ కోర్సులు చదివితే మేలు? - కె. వంశీ

** బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేసిన మీరు ఐటీ రంగంలోకి వెళ్లాలంటే ఎంటెక్‌ కంప్యూటర్‌సైన్స్‌/ ఎంటెక్‌- ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంఎస్‌సీ లాంటి రెగ్యులర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చేయవచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు/ సంస్థలు, డీమ్డ్‌/ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలల్లో మీరు ఈ కోర్సును చదవవచ్చు.

పీజీ కాకుండా కంప్యూటర్‌కు సంబంధించిన కోర్సులు చేయాలంటే వెబ్‌ డిజైనింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌, హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ కోర్సులు, సాఫ్ట్‌వేర్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కోర్సులు, సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సులు, జావా, డాట్‌ నెట్‌, టెస్టింగ్‌ టూల్స్‌, ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్సింగ్‌ ప్లానింగ్‌)కి సంబంధించిన కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఐటీలో కూడా మీకు ఆసక్తి ఉన్న విభాగంలో, ప్రస్తుతం ఉన్న ఉద్యోగావకాశాలను బట్టి తగిన కోర్సును ఎంచుకుంటే మంచిది.


ఐఈఎస్‌ రాసే వీలు ఉందా?
* మా అమ్మాయి పాలిటెక్నిక్‌ చేసింది. ఆ తర్వాత ఒక సంవత్సరం బీహెచ్‌ఈఎల్‌లో అప్రంటిస్‌గా చేసింది. ప్రస్తుతం బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. తనకున్న ప్రభుత్వ ఉద్యోగావకాశాల వివరాలు తెలపండి. - కె. నగేష్‌, తెనాలి

** మీ అమ్మాయి పాలిటెక్నిక్‌లో చదివిన బ్రాంచి విషయం తెలియజేయలేదు. బీహెచ్‌ఈఎల్‌లో అప్రంటిస్‌గా చేసింది కాబట్టి ఎలక్ట్రికల్‌గానీ, ఎలక్ట్రానిక్స్‌గానీ చదివి ఉంటుందని భావించి ఉద్యోగావకాశాల వివరాలను తెలియజేస్తున్నాం. పాలిటెక్నిక్‌, బీకాం ద్వారా ఉద్యోగావకాశాలు, బీకాం తర్వాత ఎంకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌), సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఏసీఎస్‌లాంటి కోర్సుల వల్ల కూడా ఉద్యోగావకాశాలుంటాయి. పాలిటెక్నిక్‌తోనే ఉద్యోగం చేయాలనుకుంటే భారత రైల్వే, ఏర్‌వేస్‌, రోడ్‌వేస్‌, ఇంకా చాలా ప్రభుత్వ సంస్థలు బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ఇండియా, హెచ్‌పీసీఎల్‌, ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఐఐటీ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఈసీఐఎల్‌, బీపీసీఎల్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. పాలిటెక్నిక్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్లుగా, అసిస్టెంట్‌ ఇంజినీర్లుగా ఉద్యోగం చేయడానికి అవకాశముంటుంది.

బీకాం తర్వాత ఉద్యోగం చేయదలచుకుంటే అకౌంట్స్‌ కర్క్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్‌, టాక్స్‌ అసిస్టెంట్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్‌, బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలుంటాయి. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, రక్షణ (ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌) మొదలైన రంగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ చదివినవారు అర్హులు. బీకాం తర్వాత ఉన్నత విద్య ద్వారా ఉద్యోగావకాశాలు పొందాలనుకుంటే ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ చదివిన వారికి బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్‌ సంస్థల్లో, ఫైనాన్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల్లో ఆడిటింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌, క్రెడిట్‌ ఆఫీసర్లు, లోను ఆఫీసర్లు మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.

* ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఈడీ చేశాను. ఎడ్యుకేషన్‌ సబ్జెక్టులో యూజీసీ నెట్‌, ఏపీసెట్‌లో అర్హత సాధించాను. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాను. దూరవిద్య ద్వారా సోషియాలజీ చేస్తే, నేను సోషియాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేయడానికి అర్హుడినేనా? - జాన్‌

** మీరు ఎడ్యుకేషన్‌లో నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌), సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ల్లో అర్హత సాధించారు. కాబట్టి మీరు ఎడ్యుకేషన్‌ విభాగంలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హులు. దూరవిద్య ద్వారా సోషియాలజీ చేసినట్లయితే సోషియాలజీలో కూడా నెట్‌లో కానీ/ సెట్‌లోకానీ అర్హత సాధిస్తేనే ఆ విభాగంలో మీరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హులు. సెట్‌ కానీ, నెట్‌ కానీ అర్హత సాధించకపోతే యూజీసీ- 2009 రెగ్యులేషన్‌ ప్రకారం పీహెచ్‌డీ చేసినట్లయితే సోషియాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హులవుతారు.

* ముంబై యూనివర్సిటీ నుంచి ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఐఈఎస్‌కు అర్హుడినేనా? - శ్రీధర్‌

** ఐఈఎస్‌ (ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌) పరీక్షను యూపీఎస్‌సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష రాయడానికి కనీస అర్హతగా బీటెక్‌/ బీఈ ఇన్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీని ఉండాలి. మీరు ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ చదివారు కాబట్టి, ఐఈఎస్‌ పరీక్ష రాయడానికి అర్హులు. కానీ ఐఈఎస్‌ పరీక్ష సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మీకు ఐఈఎస్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రాయడానికి అర్హత ఉంది.

జనరల్‌ కేటగిరీ వారికి 21- 30 సంవత్సరాలు, ఓబీసీ అయితే 21- 33 సంవత్సరాలు, ఎస్‌సీ/ ఎస్‌టీకి 21- 35 సంవత్సరాల వయః పరిమితి ఉంటుంది.
* మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్నాను. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో నాకున్న ఉద్యోగావకాశాలేమిటి? - రాజ్‌

** మీరు మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్నారని చెప్పారు. కానీ ఏ విభాగంలో చదువుతున్నారో రాయలేదు. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో ఫొటోగ్రఫి, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, డాన్స్‌, మ్యూజిక్‌, ఫిల్మ్‌ మేకింగ్‌ మొదలైన విభాగాలుంటాయి. ఈ కోర్సు సృజనాత్మకత రంగానికి సంబంధించినది. కాబట్టి ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ముఖ్యంగా టెక్స్‌టైల్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, టీచింగ్‌, గ్రాఫిక్‌ ఆర్ట్స్‌, పబ్లిషింగ్‌, అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే బోధనారంగంలో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు అవకాశాలున్నాయి. దూరదర్శన్‌, రేడియో, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వరంగంలో కంటే ప్రైవేటు రంగంలోనే వేతనాలు కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.

* మా అబ్బాయి అగ్రి బీఎస్‌సీ చేస్తున్నాడు. తను చదువుతున్న విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు ఉంది. కానీ ఐసీఏఆర్‌ గుర్తింపు లేదు. మా అబ్బాయికి ఉన్నత విద్య, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయాల్లో తేడాలేమిటి? - ఎస్‌.ఎండీ రఫిక్‌

** యూజీసీ గుర్తింపు అనేది విశ్వవిద్యాలయానికిగానీ, కళాశాలకు గానీ ఉంటుంది. ఆ విశ్వవిద్యాలయం, కళాశాలలు ప్రొఫెషనల్‌ కోర్సు అందిస్తుంటే వాటికి సంబంధించిన జాతీయ నియంత్రణ సంస్థల గుర్తింపు తప్పనిసరి. ఉదాహరణకు వైద్య కోర్సులకు ఎంసీఐ అనుమతి, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి, న్యాయకోర్సులకు బార్‌ కౌన్సిల్‌ అనుమతి, నర్సింగ్‌ కోర్సులకు ఐసీఏఆర్‌ అనుమతి తప్పనిసరి. ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విశ్వవిద్యాలయాలు అందించే ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇతర జాతీయ నియంత్రణ సంస్థల గురించి అటువంటి తీర్పులుగానీ, ఆదేశాలుగానీ వెలువడలేదు. కాబట్టి ఐసీఏఆర్‌ అనుమతిలేని బీఎస్‌సీ (అగ్రికల్చర్‌) కోర్సుకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలుగానీ ఉన్నతవిద్య అవకాశాలుగానీ ఉండవు. ప్రైవేటురంగంలోని సంస్థల్లో తగిన ప్రతిభ ఉంటే వారికి ఉద్యోగావకాశాలుంటాయి.

యూజీసీ అనుమతి ఉండడం వల్ల దాన్ని సాధారణ బీఎస్‌సీ డిగ్రీలాగా ఉపయోగించుకునే అవకాశముంది. కాబట్టి ఏదైనా ప్రొఫెషనల్‌ కోర్సులో చేరేముందు ఆ కళాశాలలో ఆ కోర్సుకు జాతీయ నియంత్రణ సంస్థల అనుమతి ఉందో లేదో నిర్ధారించుకుని తర్వాతే ప్రవేశాన్ని పొందాలి. కొన్ని విద్యాసంస్థలు ఎలాంటి అనుమతి లేకుండా కోర్సుని ప్రారంభించి ప్రవేశాలు జరిపి మీరు ఫైనల్‌ ఇయర్‌ అయ్యేలోపు అనుమతి లభిస్తుందని విద్యార్థులను తప్పుదోవ పట్టించే అవకాశముంది. కాబట్టి నిపుణుల సలహాలు, అదే కళాశాలలో చదువుతున్న సీనియర్ల సూచనల ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లయితే మీ డిగ్రీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయాల్లో ఏవైనా ఐసీఏఆర్‌ అనుమతితో మాత్రమే అగ్రికల్చర్‌ కోర్సులను అందించాలి. ఏదైనా విశ్వవిద్యాలయంలో స్కూళ్లు, కళాశాలలు, డిపార్ట్‌మెంట్లు, సెంటర్లు భాగంగా ఉంటాయి. ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రకమైన పేరుతో విభాగాలను ఏర్పాటు చేస్తుంది. స్కూల్‌ అనే పదం సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఎక్కువగా వాడుతారు. అదే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అయితే కాలేజ్‌ అని ఉంటుంది. మీరు అగ్రికల్చర్‌ కోర్సు చదవదలచుకుంటే ఐసీఏఆర్‌ అనుమతి అతిముఖ్యమైనది. కానీ స్కూల్‌, డిపార్ట్‌మెంట్‌, కాలేజ్‌ అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

వన్‌ సిటింగ్‌ డిగ్రీ ఉందా?
* ఇంటర్మీడియట్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. బీటెక్‌- బయోటెక్నాలజీ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? ఈ కోర్సులో ఏ సబ్జెక్టు ఎంచుకుంటే లాభదాయకం? ప్రవేశపరీక్షల వివరాలు తెలియజేయండి. - భావన

** బీటెక్‌- బయోటెక్నాలజీని తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐటీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)- వరంగల్‌, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల- పులివెందుల, ఆంధ్రయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల, గీతం యూనివర్సిటీ, విజ్ఞాన్‌ యూనివర్సిటీ మొదలైన వాటిల్లో అందిస్తున్నారు. అదేవిధంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ మొదలైన ఐఐటీల్లో బీటెక్‌- బయోటెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అన్నా యూనివర్సిటీ, గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, డీవై పాటిల్‌ విద్యాపీఠ్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంది.

ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) ద్వారా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎంసెట్‌ ద్వారా, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో వారు నిర్వహించే ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. బీటెక్‌- బయోటెక్నాలజీలో స్పెషలైజేషన్లు ఏమీ ఉండవు. ఎంటెక్‌లో మాత్రమే ఉంటాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌లాంటి సంప్రదాయ కోర్సుతో పోలిస్తే బీటెక్‌-బయోటెక్నాలజీకి సాధారణంగా తక్కువ సీట్లుంటాయి. కాబట్టి బీటెక్‌ స్థాయిలో ఆప్షనల్‌ సబ్జెక్టును కూడా కచ్చితంగా చదవాల్సి ఉంటుంది.

* బీఎస్‌సీ- ఎంపీసీ చేసి, కేంద్రప్రభుత్వ స్థాయిలో క్లర్క్‌గా నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎంబీఏ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయాలు, వాటి దరఖాస్తు విధానాలను తెలియజేయండి. హెచ్‌ఆర్‌/ ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌ చదవాలనుంది. ఇది చేస్తే ప్రభుత్వ/ పీఎస్‌యూ విభాగంలో ఉద్యోగావకాశాలుంటాయా? - కిషోర్‌. బి

** అవును, ఉంటాయి. ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, రైల్వే, యూపీఎస్‌సీ, బ్యాంక్‌ పీవో, ఐఏఎస్‌, ఇండియన్‌ ఆర్మీ మొదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఎస్‌ఏఐఎల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఐఓసీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, పీజీసీఐఎల్‌లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎంబీఏను దూరవిద్య ద్వారా డా. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఇగ్నో, ఉస్మానియా, జేఎన్‌టీయూ, కాకతీయ, గీతం, ఆచార్య నాగార్జున, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, కేఎల్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఐసెట్‌ ద్వారా, మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఆయా విశ్వవిద్యాలయాల ప్రత్యేక ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో సమయంలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. మీరు ప్రకటన వచ్చిన తరువాత ఏ విశ్వవిద్యాలయంలో ఆసక్తి ఉందో చూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

* డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలోనే ఆపేశాను. ఇపుడు పూర్తి చేయాలనుకుంటున్నాను. వన్‌ సిట్టింగ్‌ డిగ్రీ అంటే ఏమిటి? దీనికి అర్హులెవరు? వివరాలు తెలియజేయండి. - వినయ్‌

** ఆపేసిన డిగ్రీని పూర్తిచేయాలని కోరుకోవడం అభినందనీయం. ఇరవై సంవత్సరాల క్రితం వరకు వన్‌ సిట్టింగ్‌ డిగ్రీని వివిధ విశ్వవిద్యాలయాలు దూరవిద్య/ ఎక్స్‌టర్నల్‌ ద్వారా అందించేవి. కానీ వన్‌సిట్టింగ్‌ ద్వారా డిగ్రీ చేసే విద్యార్థులు తొమ్మిది గ్రూప్‌ సబ్జెక్టులు, నాలుగు లాంగ్వేజ్‌ సబ్జెక్టుల్లో పరీక్ష రాసి ఒకేసారి డిగ్రీని పొందేవారు. ఈ క్రమంలో నాణ్యత లోపించడం వల్ల పరీక్ష నిర్వహణలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యూజీసీ వన్‌ సిట్టింగ్‌ డిగ్రీని పూర్తిగా రద్దుచేసింది.

ఎవరైనా వన్‌ సిట్టింగ్‌ డిగ్రీ ద్వారా డిగ్రీ పూర్తి చేయవచ్చని చెబితే నమ్మి మోసపోకండి. కొన్ని నకిలీ విశ్వవిద్యాలయాలు స్టడీ సెంటర్ల ద్వారా వన్‌ సిట్టింగ్‌ డిగ్రీని ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్నాయి. డిగ్రీ అనేది ఆభరణం లాంటిది కాదు. ఆసక్తి ఉంటే 3 సంవత్సరాలపాటు ఏదైనా ప్రభుత్వ/ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ప్రత్యక్ష/ దూరవిద్య ద్వారా చదువుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకుని డిగ్రీ పట్టా పొందాలి. అప్పుడే ఆ పట్టాకూ, మీకూ కూడా విలువ పెరిగి మెరుగైన ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసుకునే అవకాశముంటుంది.

* మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇండియన్‌ నేవీలో ఉద్యోగం వచ్చింది. నేనెలా చదువు పూర్తిచేయగలనో వివరించండి. దూరవిద్య ద్వారా చేసే అవకాశముంటే కళాశాలల వివరాలు తెలియజేయండి. - నాగేంద్ర, వైజాగ్‌

** మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న మీకు ఇండియన్‌ నేవీలో ఉద్యోగం వచ్చినందుకు అభినందనలు. అవకాశముంటే ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరువాత ఉదోగంలో చేరే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో చదువుతున్న కళాశాల ఆఫీసులో ఎన్ని సంవత్సరాల్లోపు ఇంజినీరింగ్‌ డిగ్రీని పూర్తిచేసే అవకాశం ఉంటుందో కనుక్కోండి. దాన్ని బట్టి ఉద్యోగంలో చేరి స్టడీలీవ్‌లో అర్హత లభించాక మళ్లీ వెనక్కి వచ్చి ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని వెళ్లండి.

ఇంజినీరింగ్‌ను దూరవిద్య ద్వారా అందించే కళాశాలలు లేవు. ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను కళాశాలల్లో చదవడమే మేలు. తప్పనిసరిగా మీరు దూరవిద్య ద్వారానే చేయాలి అనుకుంటే ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంజినీర్స్‌)ను చేయవచ్చు.

* ఫిజియోథెరపి విభాగంలో డిగ్రీ 2012లో పూర్తిచేశాను. తరువాత నుంచి ప్రాక్టీసు చేస్తున్నాను. యూఎస్‌ఏలో ఉన్నత చదువులు చదవాలనుంది. ఏ కోర్సులు చేస్తే మేలు? - రంజిత్‌ కుమార్‌

** ఫిజియోథెరపి చికిత్సకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. మీరు ఉన్నత చదువులు యూఎస్‌ఏలో చదవాలని అనుకుంటున్నారు కాబట్టి జీఆర్‌ఈ, టోఫెల్‌ రాయాల్సివుంటుంది.ఫిజియోథెరపీలో పీడియాట్రిక్స్‌, జీరియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, న్యూరాలజీ, మస్కులోస్కెలిటల్‌ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్‌ ఫిజియోథెరపి, ఆంకాలజీ మొదలైన కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంఎస్‌సీ- ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ స్టడీస్‌, మెడికల్‌ ఫిజిక్స్‌, థెరపాటిక్‌ రిక్రియేషన్‌, ఫిజియాలజీ, మాస్టర్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ, ఎంఎస్‌సీ- కైనేసియాలజీ, ఎంఏ- క్లరికల్‌ ఆర్ట్‌ థెరపీ, మాస్టర్‌ ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ స్టడీస్‌ మొదలైన కోర్సులు కూడా చేయవచ్చు. ఈ కోర్సు అయినా దానికది ప్రత్యేకతను కలిగివుంటుంది. అభిరుచి, ఆసక్తులను బట్టి కోర్సు ఎంచుకున్నట్లయితే ఆ రంగంలో రాణించే అవకాశముంటుంది.


ఎర్త్‌సైన్సెస్‌ ఎంత మెరుగు?
బీటెక్‌ (మెకానికల్‌) 2012లో పూర్తిచేశాను. దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా? కళాశాలల వివరాలు తెలియజేయండి.
- దివ్య
బీటెక్‌ (మెకానికల్‌) పూర్తిచేసిన మీరు దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేసే అవకాశం లేదు. ఎంటెక్‌ను దూరవిద్య ద్వారా చేయడానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) లాంటి కోర్సులకు మాత్రమే అతి తక్కువ అవకాశాలున్నాయి. గతంలో చెప్పినట్లుగా ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రత్యక్ష విద్య ద్వారా కళాశాలలో చదివితేనే విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉండి మెరుగైన ఉద్యోగావకాశాలుంటాయి.

ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ పోస్టు వివరాలను తెలియజేయండి. దానికి ఎలా సన్నద్ధమవాల్సి ఉంటుంది?

- ప్రశాంతి
ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ పోస్టు కోసం కనీసం 60% మార్కులతో రెగ్యులర్‌ పూర్తికాలపు బ్యాచిలర్స్‌ డిగ్రీని (మూడు సంవత్సరాలు) ఫిజిక్స్‌, మాథమేటిక్స్‌ సబ్జెక్టులతో చదివి ఉండాలి. లేదా కనీసం 60% మార్కులతో బీఈ/ బీటెక్‌ డిగ్రీని ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో చదివి ఉండాలి. ఇది కూడా రెగ్యులర్‌ ఫుల్‌టైం చదివి ఉండాలి. అంతేకాకుండా ఇంటర్మీడియట్‌ స్థాయి ఇంగ్లిష్‌ను రాయగల, మాట్లాడగల కనీస సామర్థ్యం ఉండాలి. ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ పోస్టు కోసం ఎంపిక విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష, వాయిస్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఆన్‌లైన్‌ పరీక్షలో వారు చదివిన డిగ్రీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులుండవు. తరువాత ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ లెవల్‌- 4 (ఆపరేషనల్‌) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి ఉచ్చారణ, వ్యాకరణం, ఒకాబులరీ, ఫ్లూయెన్సీ, కాంప్రహెన్షన్‌, ఇంటరాక్షన్‌ మొదలైనవాటిని పరీక్షిస్తారు.

ఈ ఉద్యోగానికి వయః పరిమితి జనరల్‌ కేటగిరీ వారికి 27 సంవత్సరాలు, ఓబీసీకి 30 సంవత్సరాలు, ఎస్‌సీ/ ఎస్‌టీ వారికి 32 సంవత్సరాలు మించకూడదు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కి వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.


ఎంఏ (జాగ్రఫీ) పూర్తిచేశాను. అందులో భాగంగా జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫి, క్లెమటాలజీ చదివాను. ఎర్త్‌సైన్సెస్‌లో నెట్‌/ ఏపీసెట్‌ రాయడానికి అర్హుడినేనా? ఒకవేళ అయితే ఈ విభాగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
- నాగబాబు
ఎంఏ (జాగ్రఫీ) చేసిన మీరు ఎర్త్‌ సైన్సెస్‌లో నెట్‌/ ఏపీసెట్‌ రాయడానికి అర్హులు. మీరు నెట్‌లో అర్హత సాధించినట్లయితే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగావకాశాలుంటాయి.

ఈ కోర్సు చదివినవారికి వాతావరణానికి సంబంధించిన కన్సల్టింగ్‌ సంస్థల్లో, మైనింగ్‌, ఎక్స్‌ప్లోరేషన్‌ సంస్థల్లో, ఆయిల్‌ సంస్థల్లో, పరిశోధనా సంస్థల్లో (ప్రభుత్వ, ప్రైవేటు) మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎన్విరాన్‌మెంటల్‌ (వాతావరణ) కన్సల్టెంట్లుగా, గ్రౌండ్‌ వాటర్‌ స్పెషలిస్టులుగా, మైనింగ్‌/ మెరైన్‌ ఇంజినీర్లుగా, ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్టులుగా, జియాలజిస్టులుగా, మెరైన్‌ జియాలజిస్టులుగా, పేలియొంటాలజిస్టులుగా, పెట్రోలియం జియాలజిస్టులుగా, జియోకెమిస్టులుగా, జియోఫిజికిస్ట్‌లుగా, ఓషినోగ్రాఫర్‌లుగా, ఎన్విరాన్‌మెంటల్‌ లాయర్లుగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మ్యాపింగ్‌, ఎక్స్‌ప్లోరేషన్‌, పాలసీ డెవలప్‌మెంట్‌ అండ్‌ అడ్వైజింగ్‌, కన్సల్టింగ్‌ అండ్‌ మేనేజింగ్‌ లాంటి వాటిల్లో జియాలజిస్టుల అవసరం ఎంతైనా ఉంది.


బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. తరువాత నాకున్న విద్యావకాశాలేమిటి? ఉద్యోగావకాశాలనూ వివరించండి.
- పి.వి. రామయ్య
బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తి అయిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు ఎంఎస్‌సీ (కంప్యూటర్‌సైన్స్‌), ఎంఎస్‌సీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), ఎంసీఏ, ఎంబీఏ, బీఎడ్‌, ఎంఎస్‌సీ (మాథ్స్‌) మొదలైన కోర్సులు చేయడానికి అవకాశముంటుంది. అంతే కాకుండా ఇతర కోర్సులైన వెబ్‌ డిజైన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ జావా స్పెషల్‌ కోర్సు, ఫ్యాషన్‌ డిజైన్‌ లాంటివి చేయడానికి కూడా వీలుంది.

బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివినవారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలో ఈ కోర్సు చదివినవారికి వెబ్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, వీడియోగేమ్స్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ విజన్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌, యానిమేషన్‌, ఎంటర్‌ప్రైజ్‌ కంప్యూటింగ్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ మొదలైన రంగాల్లో ఉపాధి దొరుకుతుంది. ఈ కోర్సు చదివిన తర్వాత ప్రభుత్వ రంగానికి సంబంధించిన రైల్వే, ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ), గ్రూప్స్‌ (సివిల్స్‌), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.


ఆటోమేషన్‌- రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా బెంగళూరులో చేస్తున్నాను. తరువాత ఇదే బ్రాంచిలో బీటెక్‌ చేయాలనుకుంటున్నాను. అందించే కళాశాలల వివరాలు తెలియజేయండి.
- ప్రవీణ్‌
ఆటోమేషన్‌- రోబోటిక్స్‌ అనేది ఇంజినీరింగ్‌లో ఒక ప్రత్యేక విభాగం. రోబోలు, ఆటోమేటిక్‌ మెషీన్‌ల ఉపయోగం పెరుగుతున్న ఈ తరుణంలో ఈ బ్రాంచిని ఎంచుకోవడం అభినందనీయం. ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని భారతదేశంలో దలాల్‌ గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (న్యూదిల్లీ), గుల్జార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (లూథియానా), పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కోయంబత్తూరు), చండీగఢ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (పంజాబ్‌), డీఏవీ యూనివర్సిటీ (పంజాబ్‌) లాంటి విద్యాసంస్థలు అందిస్తున్నాయి. కొన్ని ఐఐటీల్లో నేరుగా కాకుండా ఈ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ను ఎలక్టివ్స్‌గా అందిస్తున్నారు. ఉదాహరణకు ఐఐటీ దిల్లీలో పరవ్‌ అండ్‌ రోబోటిక్స్‌ అనే బ్రాంచి అందుబాటులో ఉంది.

పురావస్తు శాస్త్రవేత్త కావాలంటే...
ఇంటర్‌ (ఎంఈసీ) పూర్తిచేశాను. పురావస్తు శాస్త్రవేత్త ( ఆర్కియాలజిస్టు) కావాలనుకుంటున్నాను. ఎలా?
- ఆశ్రిత్‌ కృష్ణ
జ: పురావస్తుశాస్త్రవేత్త కావాలనుకునేవారు డిగ్రీ, పీజీల్లో హిస్టరీ, ఆర్కియాలజీ, ఆంత్రపాలజీ, సోషియాలజీ లేదా జియాలజీల్లో ఏదో ఒకదాన్ని చదివుండాలి. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర,
ఉస్మానియా, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, కాకతీయ; ఇంకా అన్నామలై మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బనారస్‌ హిందూ
విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌,
యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, పాండిచ్చేరి, విశ్వభారతి, నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతా, దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
మొదలైన విశ్వవిద్యాలయాలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి.
 

బీఎస్‌సీ రెండో సంవత్సరం చదువుతున్నాను. పైలట్‌ కావాలనుంది. కావాల్సిన అర్హతలేమిటి?

 - ఎం.కుమార్‌
జ: పైలట్‌ కావాలనుకునేవారు మొదటగా గుర్తింపున్న కళాశాల నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (మూడు సంవత్సరాల కోర్సు) 60% మార్కులతో ఉత్తీర్ణులవాలి. ఇంటర్మీడియట్‌లో
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పాసై ఉండాలి. లేదా బీఈ/ బీటెక్‌ డిగ్రీ (4 సంవత్సరాలు) ఏదైనా గుర్తింపు ఉన్న కళాశాల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించివుండాలి.

ఎత్తు కనీసం 162.5 సెంటీమీటర్లు ఉండి, బరువు ఎత్తుకి తగ్గట్లుగా ఉండాలి. శారీరక దృఢత్వం కలిగివుండి కంటిచూపుకు సంబంధించి ఎలాంటి సమస్యలూ లేకుండావుండాలి. వీరి వయః
పరిమితి 19- 23 సంవత్సరాలు ఉండాలి. డిగ్రీ పూర్తయినవారే కాకుండా, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి అర్హులే.

- ప్రొ . బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

 

  • Railway Recuritment Board
  • Kovida