ఆహ్వానం ఏదో సరదాకి... ఫన్‌ ఎస్సెమ్మెస్‌... సాంగ్‌ కౌంటర్‌... హైకూలను కార్డుపై రాసి పంపండి. ‘మనసులో మాట’ శీర్షికకు రాసేవారు, అడ్రస్‌ తప్పకుండా రాయాలి. మీరు కోరితే వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ రచనలు
పంపాల్సిన చిరునామా:

ఈతరం
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు,
రామోజీ ఫిల్మ్‌ సిటీ,
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
you@eenadu.net

ఆడొద్దని అమ్మానాన్నలు కొట్టారు!
ఆడొద్దని అమ్మానాన్నలు కొట్టారు... అడ్డుకోవాలని ఆటలో ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు... అప్పుడూ, ఇప్పుడూ ఎవరికీ లొంగని ఉడుంపట్టు రాహుల్‌ చౌధురీది... ఆ పట్టుదలే అతడ్ని ప్రొ-కబడ్డీ లీగ్‌ స్టార్‌గా మార్చింది... ఇరవై రెండేళ్లకే తెలుగు టైటాన్స్‌ నాయకుడ్ని చేసింది... అతడితో మాట కలిపింది ఈతరం... కబడ్డీ సంగతులు.. చిన్ననాటి కహానీలు.. ఎదిగినవైనం అన్ని ముచ్చట్లూ పంచుకున్నాడిలా.
దేశాన్ని కబడ్డీ జ్వరం పట్టుకుంది. మేటి క్రీడాకారులంతా పాల్గొంటున్న ప్రొ కబడ్డీ లీగ్‌ సమరాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నారు. గత సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌, తెలుగు టైటాన్స్‌ తలపడుతున్నాయి. ఓటమి అంచున ఉంది తెలుగు జట్టు. జట్టు నాయకుడు మాత్రం ఆశలు వదులుకోలేదు. కబడ్డీ కబడ్డీ అంటూ రైడింగ్‌కు వెళ్లాడు. రాహుల్‌... రాహుల్‌ అంటూ అభిమానులు చప్పట్లతో ప్రోత్సహించారు. ప్రత్యర్థుల కళ్లు తిరిగేలా మెరుపు వేగంతో పాదాల్ని కదిలిస్తూ, వారి పట్టునుంచి ఒడుపుగా తప్పించుకొని మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. చేజారిందనుకున్న మ్యాచ్‌ టైటాన్స్‌ వశమైంది. ఇలా అతడు ఆటను మలుపు తిప్పిన సందర్భాలెన్నో.

పదమూడేళ్లకే మొదలు
రాహుల్‌ది ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌ అనే చిన్న పట్టణం. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేది కోరిక. చదువు అస్సలు తలకెక్కేది కాదు. పదేళ్లనుంచే పరుగు, వ్యాయామం మొదలుపెట్టాడు. 400, 800 మీటర్ల పరుగుపందెంలో విజేతగా నిలిచాడు. పదమూడేళ్లపుడు కబడ్డీ ఆటగాడు సంజీవ్‌వాలన్‌ గురించి తెలిసింది. ఆయన స్ఫూర్తితో కూత మొదలుపెట్టాడు. అమ్మానాన్నలకేమో కొడుకు బాగా చదివి ఉద్యోగం చేయాలని ఆశ. ‘ఆట తిండి పెడుతుందా? చదువు మీద ధ్యాస పెట్టు. బాగు పడతావ్‌’ అని మందలించేవాళ్లు. పట్టించుకుంటేగా! కనిపిస్తే తిడతారని భోజనం మానేసి మరీ రాత్రివరకూ ఆటలో మునిగిపోయేవాడు. కోపంతో అతడి నాన్న రోడ్డుమీదే చితకబాదేవారు.

సానబెట్టిన సాయ్‌
తిట్టీ, కొట్టీ కన్నవాళ్లే అలిసిపోయారు. తను మాత్రం ఆట మానలేదు. తర్వాత సన్నిహితుల సలహాతో స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)కి ప్రయత్నించి ఎంపికయ్యాడు. నాలుగేళ్ల శిక్షణ రాహుల్‌ జాతకాన్నే మార్చేసింది. ఏడాదికే జాతీయ జట్టులో చోటు దక్కింది. ఆపై అతడి నేతృత్వంలో భారతజట్టు ఆసియన్‌ బీచ్‌గేమ్స్‌లో కంచు పతకం గెల్చుకుంది. ఆ ప్రతిభే అతడికి ఎయిర్‌ఇండియాలో రెండేళ్ల ఒప్పంద ఉద్యోగం ఇప్పించింది. అప్పుడుగానీ అమ్మానాన్నలకు నమ్మకం కలగలేదు.

స్టార్‌ హోదా
సాయ్‌లో శిక్షణ పొందుతున్నపుడు ఉదయ్‌కుమార్‌ కోచ్‌. తర్వాత ఆయనే తెలుగు టైటాన్స్‌ జట్టుకు ప్రధాన శిక్షకుడవడంతో రాహుల్‌ని తెలుగు జట్టులోకి తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని రాహుల్‌ వమ్ము చేయలేదు. మొదటి సీజన్‌లో రెండో అత్యధిక పాయింట్లు సాధించి ‘రైడర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా ఎంపికయ్యాడు. కానీ జట్టుగా విఫలమవడంతో ఐదోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో సీజన్‌లో కసిగా ఆడి రెండోస్థానంలో నిలిచారు. 2016 సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గారు. ‘ఆటలో మొదట్నుంచే దూకుడు, ఆధిక్యం ప్రదర్శిస్తే సగం విజయం సొంతమైనట్టే. రైడింగ్‌లో మేం మెరుగ్గా ఉన్నా, డిఫెన్సివ్‌లో కొంచెం బలహీనంగా ఉన్నాం. కొత్త కుర్రాళ్ల చేరికతో బలోపేతమయ్యాం. టైటిల్‌ గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

జీవితం మారింది
ప్రొ కబడ్డీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంటాడు రాహుల్‌. ముఖ్యంగా తన ఆర్థిక కష్టాలన్నీ తీరాయి. తెలుగు జనాలకు ఇప్పుడు అతడో హీరో. ఆటలో కూతకెళ్తుంటే అభిమానులు రాహుల్‌... రాహుల్‌ అని కేకలేయడం సహజమైంది. ఆటోగ్రాఫులు, అభిమానించే అమ్మాయిలకు కొదవే లేదు. ‘కాఫీకొస్తావా?’ అని ఓ అమ్మాయి బహిరంగంగానే ఆఫర్‌ ఇచ్చింది. ఈ అభిమానం నిలుపుకోవడానికి ఆటను మరింతగా తీర్చిదిద్దుకుంటానంటున్నాడు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తీరికలేని ఆటతో రెండు, మూణ్నెళ్లకోసారి మాత్రమే ఇంటికెళ్తున్నాడు. అతడ్ని స్ఫూర్తిగా తీసుకొని బిజ్నోర్‌ చుట్టుపక్కల యువత కబడ్డీ ఆడుతున్నారు. ఇప్పుడక్కడ గ్రామానికో మూణ్నాలుగు జట్లు తయారయ్యాయి. రాహుల్‌ తమ్ముడు అరుణ్‌సైతం కబడ్డీ ఆటగాడే. ఓ దర్శకుడైతే ఏకంగా అతడికి హీరో ఛాన్స్‌ ఇస్తానన్నాడు. ‘నాకు మాత్రం నటించే ఉద్దేశం లేదు. నా మనసంతా ఆటపైనే’ అంటున్నాడీ ఆటగాడు. ఇంత పేరూ, డబ్బూ ప్రొ కబడ్డీ పుణ్యమే అన్నది అతడి ఏకైక మాట.


కబడ్డీ.. కబడ్డీ
కబడ్డీ కాకుండా: వాలీబాల్‌ ఇష్టం
నచ్చిన ఆటగాడు: అర్జున అవార్డీ సంజీవ్‌ వాలన్‌
బలం: ఆటగాళ్ల మధ్యలోంచి చేసే డైవ్‌, జంప్‌ చేయడం
నచ్చిన హీరోహీరోయిన్లు: సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌
ఖాళీగా ఉంటే: స్నేహితులతో గడుపుతా. వ్యవసాయం చేస్తా
పెళ్లెపుడు?: దక్షిణాసియా క్రీడలయ్యాక
ప్రొ కబడ్డీ ఇచ్చిందేంటి?: చెప్పలేనంత పేరు. అన్నదమ్ములకి ట్రాక్టర్‌, బైక్‌లు కొనిచ్చా. రెండు కార్లు కొన్నా
తెలుగువారిలో నచ్చింది?: వారు చూపుతున్న అభిమానం. హైదరాబాద్‌, వైజాగ్‌ నగరాలు
లక్ష్యం: జాతీయజట్టుకు ఆడటం, అర్జున అవార్డు సాధించడం
భవిష్యత్తులో: రాజకీయాల్లోకి వస్తా.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • Pratibha_SSC
  • sthirasthi_300-50.gif