ఆహ్వానం ఏదో సరదాకి... ఫన్‌ ఎస్సెమ్మెస్‌... సాంగ్‌ కౌంటర్‌... హైకూలను కార్డుపై రాసి పంపండి. ‘మనసులో మాట’ శీర్షికకు రాసేవారు, అడ్రస్‌ తప్పకుండా రాయాలి. మీరు కోరితే వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ రచనలు
పంపాల్సిన చిరునామా:

ఈతరం
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు,
రామోజీ ఫిల్మ్‌ సిటీ,
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
you@eenadu.net

సేవల బాటకు కుంచె బాసట!
ప్ర¾తిష్ఠాత్మక పోటీలో: తైపీ ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ కాంపిటీషన్‌. ప్రపంచవ్యాప్తంగా చిత్రకారుల కలల పోటీ. ఎంచుకున్న ఉద్దేశం, చిత్రాల్లో వైవిధ్యం, చిత్ర వ్యాఖ్యానం ఆధారంగా ఈ పోటీకి ఎంపిక చేస్తారు. ఏప్రిల్లో జరగబోయే తుది ప్రదర్శనకు డెబ్భై దేశాల నుంచి 4,600 దరఖాస్తులొచ్చాయి. ఎంపికైనవి 110 మాత్రమే. అందులో మన భాస్కరరావు వేసిన ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ చిత్రాలు అర్హత సాధించాయి.

బంధువుల బాటలో: ఆర్ట్‌ టీచర్లైన అన్నయ్య, మామయ్యల స్ఫూర్తితో కుంచె పట్టాడు ఈ విజయనగరం జిల్లా సాలూరు కుర్రాడు. ఆరోతరగతిలోనే మనసులోని భావాలకు రూపమిచ్చి ఓ చిత్రం గీస్తే మెచ్చుకోళ్లు దక్కాయి. ఆపై గురువు మచ్చ వెంకట్రావు శిష్యరికంలో రాటుదేలిపోయాడు. అదే వూపుతో బీఎఫ్‌ఏ ప్రవేశ పరీక్ష రాస్తే ఏడో ర్యాంకు వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీలో చేరాడు. 1996 తుఫానుతో కోస్తా తీరం అల్లకల్లోలమైంది. ఛిద్రమైన ప్రకృతి, మోడువారిన జీవితాలను ప్రతిబింబిస్తూ బొమ్మలు వేసి తొలి ఎగ్జిబిషన్‌ పెట్టాడు. వేసిన చిత్రాలన్నీ అమ్ముడయ్యాయి. ఉత్సాహం రెట్టింపైంది.

ప్రొఫెషనల్‌గా: 1999లో పీజీ చేయడానికి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ఇతర చిత్రకారులకు భిన్నంగా తన చిత్రాలకు ప్రకృతిని నేపథ్యంగా ఎంచుకున్నాడు. పల్లెటూరులో పుట్టిపెరిగిన వాతావరణం అందుకు ఉపయోగపడింది. పట్టా అందుకున్నాక ఓ పాఠశాలలో ఆర్ట్‌ టీచర్‌గా చేరాడు. మిత్రుడితో కలిసి ఓ ఇరుకు గదిలో అద్దెకు ఉంటున్నా ఆలోచనలు మాత్రం ప్రపంచం నన్ను గుర్తించాలి అనే రీతిలో ఉండేవి. ఇప్పటికి 4,000 స్కెచ్‌లు, 1,200 పెయింటింగ్స్‌ వేశాడు. దాదాపు ఎనభై బృంద, రెండు వ్యక్తిగత ప్రదర్శనల్లో తన చిత్రాలు ప్రదర్శించాడు. జర్మనీ, దుబాయ్‌ ఎగ్జిబిషన్‌లలో తానేంటో నిరూపించుకున్నాడు. మార్చిలో న్యూయార్క్‌లో మరో ప్రదర్శన ఉంది.

కళా సేవ: యునెస్కో సహకారంతో ‘ఆర్ట్‌ ఫర్‌ కాజ్‌’ పేరుతో మార్చిలో ఓ చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాడు. ఇందులో లక్ష్మాగౌడ్‌, తోట వైకుంఠం, రాజేశ్వరరావు, లక్ష్మణ్‌ ఏలెలాంటి నలభై మంది ప్రముఖ చిత్రకారులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వాళ్లందరితో చిత్రాలు గీయిస్తున్నాడు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని పేద బాలికల విద్య కోసం ఇవ్వనున్నాడు. అంతకుముందు క్యాన్సర్‌ బాధితుల కోసం కుంచె కదిలించాడు. తన కళ ద్వారా ప్రకృతిని కాపాడాలనే సందేశం చెబుతున్న భాస్కర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని లయోలా కాలేజీ యానిమేషన్‌ విభాగం అధిపతిగా ఉన్నాడు.

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • Pratibha_SSC
  • sthirasthi_300-50.gif