పొదుపు, మదుపు, పన్నులు, బీమా, బ్యాంకులు, రుణాలు, ఆస్తులు-హక్కులు... ఇలా వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన మీ సందేహాలేమైనా సరే కార్డుపై క్లుప్తంగా రాయండి.

సిరి,
ఈనాడు బిల్డింగ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌,
రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
siri@eenadu.net

వేచి చూస్తే.. రాబడుల పంటే!
‘అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా.. దీర్ఘకాలంలో మన మార్కెట్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తక్కువ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తగ్గడం, సంస్కరణల ప్రభావంతో ఈ ఏడాది చివరకల్లా మార్కెట్లు వృద్ధి పథంలో సాగే అవకాశం ఉంది’ అని అంటున్నారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఎండీ నిమేశ్‌ షా. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశం అంటున్న ఆయనతో ‘సిరి’ కబుర్లు మీ కోసం...

మార్కెట్లో ఆటుపోట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇవి మరిన్ని రోజులు కొనసాగుతాయా? మొత్తంగా మార్కెట్‌ పరిస్థితిని ఎలా విశ్లేషిస్తారు?
ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటు కనిపిస్తోంది. ముడి చమురు ధరలు, చైనాతోపాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా దీనికి కారణం అయ్యాయి. ఇలా వచ్చిన దిద్దుబాటు మన దేశ ఈక్విటీ మార్కెట్లోకి మరిన్ని నిధులు వచ్చేందుకు అవకాశాన్ని కల్పిస్తుందని భావించొచ్చు. స్థూలంగా మార్కెట్‌ను గమనిస్తే.. ప్రస్తుతం మన మార్కెట్‌ దీర్ఘకాలిక సగటు ధరలకు దగ్గరగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు మన దేశపు మార్కెట్లో మదుపు చేసిన వారికి రానున్న మూడు నుంచి ఐదేళ్ల కాలంలో పెట్టుబడి వృద్ధికి అధిక అవకాశాలున్నాయని చెప్పొచ్చు.

ఇప్పుడు ఉన్న స్థాయుల వద్ద మార్కెట్లో మదుపు చేయడం మంచిదేనా?లేక మరింత దిద్దుబాటు వచ్చేదాకా ఆగాలా?
సాధారణంగా ఈక్విటీ మార్కెట్లో క్రమం తప్పకుండా మదుపు చేయడమే లక్ష్యంగా ఉండాలి. షేర్ల ధరలు తక్కువగా ఉన్నప్పుడు వాటిని మన ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసుకోవాలి. 2016 ఈ అవకాశాన్ని కల్పించనుంది. కాబట్టి, క్రమం తప్పకుండా మదుపు చేస్తూ మరిన్ని యూనిట్లను ఖాతాలోకి వచ్చేలా చూసుకోవాలి.

కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయా? వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?
కమోడిటీల ధరలు తక్కువగా ఉండటంతో ఆయా సంస్థలు ఆశాజనకంగా ఫలితాలు చూపించలేకపోయాయి. తక్కువ ధరల వల్ల వినియోగం కూడా పెరిగింది. దీనివల్ల కొన్ని కంపెనీలు ప్రయోజనం పొందాయి. భవిష్యత్తును ఆలోచిస్తే.. అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు వస్తుంటాయి. వీటిని వూహించలేం. ఈ నేపథ్యంలో 2016 ప్రథమార్థంలో కాస్త ఇబ్బందిగానే ఉండొచ్చు. యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ ఇంకా వూగిసలాటలోనే ఉంది. చైనాలో మందగమనం ఇబ్బంది పెడుతోంది. చమురు ధరలు తగ్గడం వల్ల దాన్ని ఉత్పత్తి చేసే దేశాల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. అయితే, వీటన్నింటిని బేరీజు వేసుకుంటే.. మన మార్కెట్‌కు అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ పనితీరు, నగదు నిల్వలు, తక్కువ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తగ్గడం, సంస్కరణల్లో కదలికలు తదితరాలన్నీ మన మార్కెట్‌ ఈ ఏడాది చివరికల్లా వృద్ధి పథంలో సాగేందుకు వీలు కల్పించే వీలుంది.

స్వల్పకాలిక, దీర్ఘకాలిక మదుపు కోసం ఎలాంటి కంపెనీలను ఎంచుకోవడం మేలు?
గత కొంతకాలంగా ఎఫ్‌ఐఐలు మన దేశ ఈక్విటీ మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలే చేస్తున్నారు. దీంతో లార్జ్‌క్యాప్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన ధరలకు వచ్చాయి. తిరిగి ఆ పెట్టుబడులు రావడం ప్రారంభం అయితే, ఈ కంపెనీల్లో వెంటనే వృద్ధి కనిపిస్తుంది. కాబట్టి, దీర్ఘకాలిక మదుపరులు లార్జ్‌ క్యాప్‌ కంపెనీలపై దృష్టి సారించడమే మేలు.

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇప్పటికే మదుపు చేస్తున్న, కొత్త మదుపరులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
స్వదేశీ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌ మరికొంత కాలంపాటు అటూఇటూగానే ఉండే అవకాశం ఉంది. 2016లో సాధ్యమైనంత వరకూ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, డైనమిక్‌ అసెట్‌ అలెకేషన్‌ ఫండ్లలో మదుపు చేయడం మేలు. ఈ ఫండ్లు తక్కువలో కొని, ఎక్కువలో అమ్మడం అనే సూత్రంతో పనిచేస్తాయి. ప్రస్తుత నేపథ్యంలో ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిది. మరో విషయం ఏమిటంటే.. తక్కువ ధరల వద్ద కొని, దీర్ఘకాలం కొనసాగాలి. అప్పుడే ఈక్విటీ ఫండ్లు మంచి ఫలితాలను అందిస్తాయి.

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif