మీ ఆరోగ్య సమస్యలను పోస్టుకార్డు మీదే, క్లుప్తంగా,
స్పష్టంగా రాయండి.

సమస్య-సలహా
సుఖీభవ,
ఈనాడు కాంపౌండ్‌,
సోమాజిగూడ,
హైదరాబాద్‌- 500082.

క్యాన్సర్‌పై నాదే మనదే విజయం
స్వీయ పోరాటం! సమష్టి సహకారం!!
క్యాన్సర్‌పై జైత్రయాత్రకు ఇదే కీలక సూత్రం.
ఎవరి పోరాటం వారిదే కావచ్చు. మన యుద్ధానికి మనమే సిద్ధం కావాల్సి రావచ్చు. కానీ ఆ యుద్ధానికి అందరి సమర్థనా ఉన్నప్పుడే ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అస్త్రాలన్నీ సమర్థంగా సంధించినప్పుడే పూర్తి విజయం సిద్ధిస్తుంది. అందుకే క్యాన్సర్‌పై పోరాటానికి ‘నేను’గా ఎవరికి వాళ్లం ఏం చెయ్యాలి...? ‘మనం’గా అందరం కలిసికట్టుగా ఎలా సన్నద్ధమవ్వాలి...? అన్నది బలంగా నొక్కి చెబుతోంది ఈ ఏటి ‘ప్రపంచ క్యాన్సర్‌ దినం’.
కేవలం చక్కటి అలవాట్లను పాటించటం ద్వారానే మనలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌ దరిజేరకుండా చూసుకోవచ్చు.
క్యాన్సర్‌ నివారణ కోసం పెద్దపెద్ద పనులేం చెయ్యక్కర్లేదు. నిత్యం వ్యాయామం చెయ్యాలి. ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. బరువు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. పొగ మానెయ్యాలి, మద్యం తగ్గించెయ్యాలి.

* కేవలం బరువు ఎక్కువగా ఉండటం వల్లనే 10 రకాల క్యాన్సర్ల ముప్పు (పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ, అండాశయ, క్లోమ, కాలేయ, అన్నవాహిక, మూత్రపిండ, ప్రోస్టేట్‌, పిత్తాశయ క్యాన్సర్లు) పెరుగుతోందని గుర్తించారు. కాబట్టి రోజూ వ్యాయామం చేస్తూ బరువు ఎక్కువగా లేకుండా చూసుకోవటం ద్వారా చాలా క్యాన్సర్లను నివారించుకోవచ్చు.

* క్యాన్సర్‌ రాకుండా చూడటానికి మన చేతిలో ఉన్న అతి ముఖ్యమైన మార్గం పొగ మానెయ్యటం. దీనివల్ల కుటుంబం, చుట్టుపక్కల వారూ లబ్ధిపొందుతారు. పొగ ఎన్నేళ్ల తర్వాత మానేసినా అక్కడి నుంచీ ఆయుష్షు పెరుగుతుంది, జీవితం హాయిగా గడుస్తుంది.

* మద్యం తగ్గించుకుంటే నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, కాలేయ, రొమ్ము క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు.

మొత్తమ్మీద.. మొత్తం క్యాన్సర్లలో మూడోవంతు క్యాన్సర్లను కేవలం మంచి అలవాట్లతోనే నివారించుకోవచ్చని గుర్తించాలి.


తొలిదశలోనే క్యాన్సర్‌ లక్షణాలను పట్టుకోవటం ముఖ్యమన్న అవగాహన పెంచుకోవాలి. ఒంట్లో మార్పులపై కన్నేసి ఉంచాలి.
*చాలా క్యాన్సర్లు ముదిరే వరకూ కూడా ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. అంత మాత్రాన దాన్ని మనం తొలిదశలో గుర్తించలేమని కాదు. మన ఒంట్లో ఎలాంటి మార్పులు వస్తున్నా వాటిని ఓ కంట కనిపెడుతూ, అవేమాత్రం అసహజంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం ద్వారా చాలా క్యాన్సర్లను ముందే పట్టుకోవచ్చు. ఉదాహరణకు రొమ్ముల్లో ఏ కొంచెం తేడాగా అనిపించినా వైద్యులు/శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలకు చూపిస్తే రొమ్ములను పద్ధతి ప్రకారం పరీక్షించటం (క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌) ద్వారా అది క్యాన్సరయ్యే అవకాశం ఉందేమో వెంటనే పసిగడతారు. నోటిలో వచ్చే క్యాన్సర్‌ మార్పులనూ వైద్యులు ముందుగానే గుర్తుపట్టగలరు.

* తొలిదశలో గుర్తించటం ద్వారా- రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ ముఖద్వారం, వృషణాల వంటి చాలా ఎక్కువగా కనబడే 8 రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చెయ్యొచ్చని ఇటీవలి అనుభవాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించటం ముఖ్యమనే సంగతిని అందరూ అర్థం చేసుకోవాలి. వీలైనంత త్వరగా చికిత్సను తీసుకోవటం కీలకమని గుర్తించాలి.


క్యాన్సర్‌తో ఒంటరి పోరాటం కంటే నలుగురితో మనసు పంచుకుని, వారి అండ తీసుకుంటే దాన్ని జయించటం తేలిక అవుతుంది.
క్యాన్సర్‌ శరీరం మీదే కాదు, మనసు మీదా విపరీత ప్రభావం చూపిస్తుంది. అనూహ్యమైన ఆర్థిక భారం, నెలల తరబడి సాగే చికిత్స, ఈ క్రమంలో తలెత్తే రకరకాల దుష్ప్రభావాల వంటివన్నీ తీవ్రంగా కుంగదీస్తాయి. ఇలాంటి సమయాల్లో తమ భావాలను ఇతరులతో పంచుకోవటం గొప్ప సాంత్వన ఇస్తుంది.

* జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబం, తోటి ఉద్యోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది.. వీరంతా ‘మేమున్నాం’ అనే ధైర్యాన్ని ఇవ్వొచ్చు. క్యాన్సర్‌ బాధితులంతా కలిసి ఏర్పాటు చేసుకునే మద్దతు బృందాల్లో (సపోర్ట్‌ గ్రూప్స్‌) చేరటం వల్ల వారి అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకోవటానికి వీలవుతుంది. క్యాన్సర్‌ బాధితులకే కాదు, వారిని చూసుకునే వారికీ ఈ మద్దతు బృందాలు ఎంతో భరోసా కల్పిస్తాయి. క్యాన్సర్‌ చికిత్సా సమయంలో తలెత్తే ఎన్నో ఆందోళనలు, భయాలను తగ్గించుకోవటానికి, త్వరగా కోలుకోవటానికి బాగా తోడ్పడతాయి.

* క్యాన్సర్‌ బాధితులను కనిపెట్టుకొని ఉండటం మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. మద్దతు బృందాల సహకారం తీసుకుంటే వీరికీ సాంత్వన దొరుకుతుంది.


క్యాన్సర్‌ వ్యాధి, చికిత్స- రెండూ మన జీవితాన్నీ, రూపురేఖలనూ కొంత మారుస్తాయి. వీటిని అవగాహనతో ఆమోదించి, నిబ్బరంగా ఉండటం ముఖ్యం.
క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నప్పుడూ, ఆ తర్వాత శరీరంలో కొన్ని మార్పులు తలెత్తుతుంటాయి. వీటిలో కొన్ని తాత్కాలికం, మరికొన్ని దీర్ఘకాలం ఉండొచ్చు. కీమోథెరపీ వల్ల తాత్కాలికంగా జుట్టు మొత్తం రాలిపోతుంది. అలాగే కొన్ని క్యాన్సర్లలో సర్జరీ ద్వారా ఏదో ఒక అవయవాన్ని కోల్పోవాల్సి రావచ్చు. దీంతో నలుగురిలోకీ వెళ్లటం ఇబ్బందిగా అనిపించొచ్చు. కొన్ని మార్పులు ఇతరులకు కనబడవుగానీ చాలా ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వల్ల మూత్రంపై పట్టు కోల్పోవచ్చు. ఇవన్నీ మానసికంగా ఆందోళన, కుంగుబాటుకు దారి తియ్యచ్చు. అయితే అవగాహనతో వీటిని అధిగమించటం తేలికే. జుట్టు రాలిపోతే కొంతకాలం విగ్గు పెట్టుకోవచ్చు. కృత్రిమ అవయవం అమర్చుకోవచ్చు. వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండటం వల్ల మనో నిబ్బరం అబ్బుతుంది.

* క్యాన్సర్‌, దాని చికిత్సల వల్ల భాగస్వాములతో సంబంధాలు, ముఖ్యంగా దాంపత్య జీవితం ఒడుదొడుకులకు లోనవ్వచ్చు. అయినా ఆందోళన, ఆగ్రహాల్లోకి జారిపోకుండా మనసువిప్పి మాట్లాడుకుంటే వీటిని అధిగమించొచ్చు.


క్యాన్సర్‌ విషయంలో- చికిత్స నుంచి విధానాల వరకూ ప్రతి దశలోనూ బాధితుల అభిప్రాయాలు వినటం, వారి ఇష్టాయిష్టాలకు అవకాశమివ్వటం కీలకం.
క్యాన్సర్‌ విషయంలో చాలాసార్లు ఎటువంటి చికిత్స చెయ్యాలో వైద్యులే నిర్ధారించేస్తుంటారు. దీనివల్ల బాధితులు తమకేం జరుగుతోందో అర్థంకాక తీవ్ర మానసిక వ్యధలో కూరుకుపోతుంటారు. కానీ చికిత్సా సమయంలో- బాధితుల ముందున్న అవకాశాలు, వాటితో ఉన్న కష్టనష్టాలేమిటో వివరించి, ఏది కావాలో ఎంచుకునే అవకాశం వారికే ఇవ్వటం, వారి నిర్ణయాన్ని గౌరవించి, చికిత్సలో వారినీ భాగస్వాములను చెయ్యటం కీలకం. ఈ సమయంలో ఎదురయ్యే రకరకాల దుష్ప్రభావాల గురించి సవివరంగా చర్చించటం వల్ల చికిత్స సజావుగా సాగుతుంది, ఫలితాలు బాగుంటాయి.

* వ్యాధి బాగా ముదిరిన దశలో క్యాన్సర్‌ బాధితుల అవసరాలు వేరుగా ఉంటాయి. నొప్పి, బాధ, ఆందోళనల నుంచి ఉపశమనం కోసం సాంత్వన చికిత్స అవసరమవుతుంది. అంతా అయిపోయిందని వదిలెయ్యకుండా ఈ సమయంలో వారి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక అవసరాలను తీర్చటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

* క్యాన్సర్‌ విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో కూడా భాధితులు, వారి కుటుంబాల అభిప్రాయాలకు అవకాశమిస్తూ, ముఖ్యంగా ఇందులో యువతకు భాగం కల్పిస్తేనే క్యాన్సర్‌పై విజయం సాధ్యమవుతుంది.


ఇప్పటికీ మన సమాజంలో క్యాన్సర్‌ విషయంలో ఎన్నో దురభిప్రాయాలు, అనవసర భయాలు, వివక్షలు బలంగా ఉన్నాయి. వీటిని పోగొట్టటం చాలా అవసరం.
క్యాన్సర్‌ విషయంలో మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతుండటంతో ఇప్పటికీ చాలామంది తమకు క్యాన్సర్‌ వచ్చిందన్న వాస్తవాన్ని అంగీకరించటానికే ఇష్టపడటం లేదు. క్యాన్సర్‌ నిర్ధారణ అయిన తర్వాత కూడా నలుగురిలో చెప్పుకోవటానికి సంశయిస్తున్నారు. కొందరు చికిత్సకు కూడా ముందుకు రాకుండా తమలో తామే మౌనంగా వ్యథ చెందుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావటం చాలా అవసరం. క్యాన్సర్‌పై శాస్త్రీయ దృక్పథం పెరిగేలా చూడటం, బహిరంగంగా చర్చించటం, అవగాహనా కార్యక్రమాలను చేపట్టటం వంటివి ముమ్మరం చెయ్యాలి.

* క్యాన్సర్‌ బాధితులు చికిత్సా సమయంలో ఉద్యోగాలకు హాజరు కాలేకపోవచ్చు. ఆఫీసుల్లో వివక్షకు గురవుతామేమోనన్న ఆందోళన ఉండొచ్చు. ఆ కష్టకాలంలో యాజమాన్యాలు అండగా ఉండి, వాళ్లు కోలుకోగానే తిరిగి విధులకు హాజరయ్యేందుకు అవసరమైన వాతావరణం, వసతులు కూడా కల్పించాలి. దీంతో వారి జీవితం తిరిగి గాడిలో పడుతుంది, మళ్లీ నలుగురిలో కలిసి తిరుగుతూ, మానసిక వేదనల నుంచి వేగంగా బయటపడతారు.


నేడు క్యాన్సర్‌ విస్తరించిపోతుండటానికి మూలాలు మన జీవనశైలిలోనే ఉన్నాయి. దీన్ని చక్కదిద్దుకోవటానికి మనం నడుంకట్టాలి.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతుండటానికి జీవనశైలిలో వస్తున్న మార్పులే ముఖ్య కారణం. రోజంతా ఒంటికి వ్యాయామం లేకుండా గడిపెయ్యటం, అనారోగ్యకరమైన తిండి పట్ల మోజు పెంచుకుంటుండటం, పొగ-మద్యం అలవాట్లకు బానిసలవుతుండటం.. ఇవన్నీ క్యాన్సర్‌ ముప్పును పెంచుతున్నాయి. మన జీవనశైలికీ, క్యాన్సర్‌ వ్యాధికీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని అందరం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని స్కూళ్లలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, ప్రసార సాధనాల్లో విస్తృతంగా ప్రచారం చెయ్యాలి.

* ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యాన్సర్‌ కారకం పొగ! మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో 22% పొగాకు వల్ల సంప్రాప్తిస్తున్నవే. అలాగే వూబకాయమూ చాలా కాన్సర్లకు దోహదం చేస్తోంది. కాబట్టి ఆఫీసుల్లో పొగ తాగకుండా నిషేధించటం, స్కూళ్లలో ఆటలను ప్రోత్సహించటం ద్వారా పిల్లలకు శారీరక వ్యాయామం అలవడేలా చూడటం, చక్కటి పోషకాహారం గురించి అవగాహన పెంచటం, క్యాంటీన్లలో పోషకాహారం అందుబాటులో ఉండేలా చూడటం, కాలనీల్లో నడకకు వీలుగా పార్కుల్లాంటివి ఏర్పాటు చెయ్యటం, క్యాన్సర్‌ ఆనవాళ్లను తొలిదశలోనే పట్టుకునేలా తరచూ ‘స్క్రీనింగ్‌’ కార్యక్రమాల వంటివి నిర్వహించటం నేటి అవసరం.


అన్ని వైపుల నుంచీ అస్త్రాలు సంధిస్తేనే క్యాన్సర్‌పై విజయం సాధ్యం. ఇందుకు సమగ్ర వ్యూహం అవసరం.
కప్పుడు రాచపుండులా సంపన్న వర్గాల్లోనే ఉన్న క్యాన్సర్‌.. ఇప్పుడు మారుతున్న జీవనశైలితో సామాన్యుల వరకూ వచ్చేసింది. కానీ క్యాన్సర్‌ చికిత్సలు మాత్రం ఇప్పటికీ పెనుభారంగానే ఉండటంతో క్యాన్సర్‌ చికిత్స అంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. నాణ్యమైన, సమర్థమైన క్యాన్సర్‌ చికిత్సలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడటం సామాజిక బాధ్యత. దాదాపు సగానికి సగం క్యాన్సర్‌ బాధితులకు ‘రేడియేషన్‌’ చికిత్స అనివార్యంగా అవసరమవుతోందని గుర్తించారు. ఇందుకోసం వాడే యంత్రాలు చాలా ఖరీదైనవి కావటంతో చికిత్సా సమాన్యులకు భారంగానే తయారవుతోంది. అలాగే కీమోథెరపీ కోసం ఇచ్చే మందులు కూడా బాధితులను కుంగదీస్తున్నాయి. ఈ అగాధాలను పూడ్చేందుకు విధానాల్లో మార్పులు తప్పనిసరి.

* తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్‌ చికిత్స తేలిక, చాలాసార్లు దాన్ని పూర్తిగా నయం చెయ్యచ్చు కూడా. కాబట్టి దీన్ని గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చెయ్యటంతో పాటు వైద్య సిబ్బందికి తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేలా ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి, వీరి సంఖ్యను గణనీయంగా పెంచి... వూరూరా క్యాన్సర్‌ ‘స్క్రీనింగ్‌’ కార్యక్రమాలను ముమ్మరం చెయ్యాలి. క్యాన్సర్‌పై విజయానికి ఇది కీలకమైన అడుగు.

cinema-300-50.gif
sthirasthi_300-50.gif