Friday, February 12, 2016


Untitled Document
సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు
కడెం, న్యూస్‌టుడే: మండలంలో పంచాయతీ అభివృద్ధికి వచ్చే నిధులను సర్పంచులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ మేరకు అధికారులు పంచాయతీల్లో విచారణ జరిపించి సర్పంచులకు షోకాజు నోటీసులు అందజేస్తున్నారు. ఇప్పటికి మండలంలోని మూడు పంచాయతీల సర్పంచులకు జిల్లా పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయగా.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై వేటు వేశారు. ఇటీవల మండలంలోని రేవోజిపేట, లింగాపూర్‌ సర్పంచులు నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టి ఆ గ్రామాల సర్పంచులు రాజ్‌కుమార్‌, గంగాధర్‌నాయక్‌లకు నోటీసులు అందజేసి నిధుల దుర్వినియోగానికి ఆ పంచాయతీల కార్యదర్శులను బాధ్యులను చేస్తూ వారిపై వేటు వేశారు. లింగాపూర్‌లో రూ.18లక్షల నిధులకు, రేవోజిపేటలో రూ.14లక్షల నిధులకు లెక్కలు కలవకపోవడంతో ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని డీపీఓ నుంచి సర్పంచులకు నోటీసులు అందాయి. తాజాగా మండలంలోని బుట్టాపూర్‌ సర్పంచి హన్మాగౌడ్‌కు గురువారం షోకాజ్‌ నోటీసులు అందజేశారు. రూ.16.30లక్షల నిధులకు లెక్కలు తెలపాలని డీపీఓ నుంచి వచ్చిన నోటీసు అందజేశారు. గురువారం బుట్టాపూర్‌ సర్పంచికి నోటీసు పంపినట్లు ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీలత తెలిపారు.


తురాటిలో వ్యక్తి ఆత్మహత్య
కుంటాల, న్యూస్‌టుడే: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుంటాల మండలంలోని తురాటిలో జరిగింది. కుంటాల ఎస్సై జె.మోహన్‌బాబు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెర్ల నడిపి పీరాజి (50) బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బంధువులు, గ్రామస్థుల ద్వారా తెలుసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలో వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండటాన్ని రాత్రి సమయంలో గమనించిన స్థానికులు కుటుంబీకులకు తెలియజేశారు. కూలీపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధడుతుండటంతోపాటు సంతానం కలగడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


ఆర్థిక ఇబ్బందులతో గృహిణి...
నార్నూర్‌: ఖాండోవ్‌ గ్రామానికి చెందిన జాధవ్‌ రేణుకాబాయి(56) అనే గృహిణి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి మృతిచెందింది. హెడ్‌ కానిస్టేబుల్‌ వసంత్‌ కథనం ప్రకారం.. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలు సరిగా పండక నిరుపేద కుటుంబాన్ని పోషించే స్తోమత లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. గురువారం ఉదయం ఆమె శవాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


హమాలీల సమ్మెతో రైసు మిల్లులకు నష్టం
బెల్లంపల్లి, న్యూస్‌టుడే: బెల్లంపల్లి పట్టణంలోని రైసుమిల్లుల్లో హమాలీలకు కూలీ ధరలు పెంచాలని చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఈవిషయంలో బెల్లంపల్లి డివిజన్‌ రైస్‌మిల్లుల సంఘం, హమాలీ సంఘం మధ్య చర్చలు జరిగినా సమస్యలు ఒక కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం బెల్లంపల్లి డివిజన్‌లోని రైసుమిల్లుల్లోహమాలీలు పనులు చేయకపోవడంతో బియ్యం ఉత్పత్తి లేకుండాపోయిందని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.రత్నాకర్‌, ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ లాహోటి గురువారం తెలిపారు. గతంలో చేసుకున్న ఒప్పంద ప్రకారం మళ్ళీ ధరలను పెంచే విషయంలో హమాలీ సంఘం ప్రతినిధులు ప్రస్తుత కూలీ కంటే 50శాతం అధికంగా పెంచాలని డిమాండ్‌ చేయడంతో సమస్య తలెత్తిందన్నారు. ఒకేసారి కూలీ ధరలను 50శాతానికి పెంచితే అన్నీ మిల్లులకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు.


ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు
విద్యావైద్య స్థాయిసంఘంలో చోటు
ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: నూతనంగా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పురాణంసతీష్‌కు జిల్లాపరిషత్‌లో విద్యావైద్యం స్థాయి సంఘంలో చోటు కల్పించారు. జడ్పీలో మొత్తం ఏడు స్థాయి సంఘాలుండగా ప్రతి కమిటిలో ఆరేడుగురు జడ్పీటీసీలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభ్యులుగా నియమిస్తారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రావ్‌ విద్యా, వైద్యంలో సభ్యుడిగా ఉండడంతో ఆయన స్థానం ఖాళీగా ఏర్పడడంతో పురాణంకు అందులోనే చోటు కల్పించారు. ఈమేరకు గురువారం జరిగిన జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో దీనికి ఆమోదం లభించింది.


పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలి
ఆదిలాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పడుతున్న తపన చూసి అధికారులు, ఉద్యోగులు పథకాలు ప్రజల దరికి చేరేలా పనిచేయాలని తెలంగాణ గజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సంఘం ఆధ్వర్యంలో రూపొంచిన దైనందిని విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు శోభారాణి, పాలనాధికారి జగన్మోహన్‌, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రాఠోడ్‌ బాపురావ్‌, రేఖానాయక్‌, కోవలక్ష్మి, సంఘం జిల్లా అధ్యక్షుడు ఆజ్మీరా శ్యాంనాయక్‌లతో కలిసి దైనందిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం అధికారులు, ఉద్యోగులు అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఆవిర్భావమే ఏకైక లక్ష్యంగా టీజీఓ సంఘం పోరాడిందని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్యకార్డుల అంశం నెలరోజుల్లో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌దేశ్‌పాండే, టీఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌, వనజారెడ్డి, జడ్పీటీసీ సంఘం అధ్యక్షుడు హేమాజీ, పెటా సంఘం అధ్యక్షుడు పార్థసారథి, జడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ మనీష, మున్సిపల్‌కమిషనర్‌ వెంకటేషం, సంఘం నేతలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

జడ్పీ సమావేశం కొనసాగుతుండగా..
జిల్లా పరిషత్‌లో సర్వసభ్య సమావేశం కొనసాగుతున్న సమయంలో టీజీఓ సంఘం నేతలు అక్కడికి వచ్చారు. సుమారు అరగంట వరకు వేచిచూశారు. చివరకు లోనికి వచ్చి జిల్లా పాలనాధికారిని కలిసి దైనందిని విడుదల చేస్తామని అనుమతి తీసుకున్నారు. అనుమతి లభించడమే ఆలస్యం సభావేదికపై ప్లెక్సీని ఏర్పాటుచేశారు. సభ అంతరాయానికి చింతిస్తున్నట్లు సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ముగియగానే జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వెళ్లిపోవడంతో జడ్పీ సమావేశం ముగించాల్సి వచ్చింది.అమ్మవారి చెంత.. అసౌకర్యాల చింత
బాసర, న్యూస్‌టుడే: వసతి పంచమి వేడుకలను పురస్కరించుకొని గురువారం రాత్రి భక్తులు భారీగా బాసర సరస్వతి క్షేత్రానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం, చిన్నారుల అక్షరభ్యాసాల కోసం రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచే ఆలయ గదులతో పాటు ప్రైవేట్‌ లాడ్జీలకు గిరాకీ పెరిగింది. గురువారం సాయంత్రానికి ఆలయ గదులు పూర్తిగా నిండాయి. దీంతో భక్తులు ప్రైవేట్‌ లాడ్జిలను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన వారు గదుల ధరలను పెంచారు. అధిక డబ్బులు ఉన్నవారు ప్రైవేట్‌ లాడ్జిలను ఆశ్రయించారు. సామాన్యులు డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటా భక్తులకు గదులు సరిపోవని తెలిసినప్పటికీ ఆలయాధికారులు ఏర్పాట్లు చేయాలి. వారు ఉన్న గదులను చూపించి చేతులు దులుపుకొంటున్నారు. రెండు నెలల క్రితం రూ. లక్షలు వెచ్చించి డార్మెంటరీ భవనం నిర్మించారు. ఇంతవరకు వినియోగంలోకి రాలేదు. దీంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. శుక్రవారం, శనివారం, ఆదివారం మంచి ముహుర్తాలు ఉండటంతో మరింతమంది భక్తులు వచ్చే అవకాశముంది. శనివారం, ఆదివారం వచ్చిన భక్తులకైనా డార్మెటరి అందుబాటులోకి తీసుకొస్తే కొంతవరకైన ఇబ్బందులను తొలగించే అవకాశముంది.


ఉత్తముడిగా బెజ్జూరు బీపీఎం
బెజ్జూరు, న్యూస్‌టుడే
తపాలాశాఖలో 3గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో సమయం మేరకే విధులు నిర్వర్తిస్తారు. కానీ అంతకన్న ఎక్కువగా పనిచేసి గుర్తింపుపొందే వారి సంఖ్య తక్కువే. మూడుగంటలు పనిచేయాల్సి ఉండగా ఉపాధిహామీ కూలీల కోసం నిత్యం 8నుంచి 10గంటలపాటు విధులు నిర్వర్తిస్తారు. కూలీలను అప్యాయంగా పలకరిస్తూ సకాలంలో కూలీల డబ్బులను చెల్లించి జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారం అందుకొని జిల్లాలో ఆదర్శంగా నిలిచారు బెజ్జూరు బీపీఎం సాంబయ్య. తెలంగాణలోనే ఉపాధిహామీ పథకంలో అత్యధికంగా కూలీల డబ్బులు చెల్లించి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి భీరేందర్‌సింగ్‌ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అందుకున్న బెజ్జూరు పోస్టుమాస్టర్‌ కూశన సాంబయ్యపై ‘న్యూస్‌టుడే’ కథనం..

ఇదీ సాంబయ్య నేపథ్యం...
భీమిని మండలం జజ్జరెల్లి గ్రామానికి చెందిన కూశన సాంబయ్య బెజ్జూరు బీపీఎంగా పనిచేస్తున్నారు. సొంత గ్రామంలోనే ఒకటి నుంచి ఐదోతరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆరు నుంచి 10వ తరగతి వరకు నెన్నెల జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో చదివారు. పదిలో 467 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. 1996లో మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఐటీపీ ఫిట్టర్‌ కోర్సు పూర్తి చేశారు. 2000లో హైదరాబాద్‌లోని శిక్షణ పొందారు. 2008లో తపాలాశాఖలో ఉద్యోగాల ప్రకటన రావడంతో దరఖాస్తు చేసుకున్నారు. పదిలో మంచి మార్కులు రావడంతో బీపీఎంగా ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2008 నుంచి బెజ్జూరులో బీపీఎంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నారు.

ఏడాదిలో రూ. 1.20 కోట్లకు పైగా డబ్బుల పంపిణీ
బెజ్జూరు పోస్టుమాస్టర్‌ కూశన సాంబయ్య బెజ్జూరుతోపాటు మొర్లిగూడ, కమ్మర్‌గాం గ్రామపంచాయతీల అదనపు బాధ్యతులు నిర్వర్తిస్తున్నారు. బెజ్జూరు గ్రామపంచాయతీ పరిధిలో 3,357 మంది కూలీలు ఉన్నారు. వారికి 2014-15 సంవత్సరానికి సంబంధించిన ఉపాధిహామీ కూలీల రూ.1,20,38,585లు చెల్లించారు. ఉపాధిహామీ కూలీ డబ్బుల చెల్లింపులో ముందంజలో ఉండటంతో జాతీయ పురస్కారానికి బెజ్జూరు బీపీఎం సాంబయ్య ఎంపిక చేశారు. ఈనెల 2న దిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి భీరేందర్‌సింగ్‌ చేతుల మీదుగా బీపీఎం సాంబయ్య ప్రశంసాపత్రంతోపాటు గోడగడియారాన్ని అందుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు బీపీఎం సాంబయ్య జాతీయ ఉత్తమ పురస్కారం అందుకోవడంతో తపాలాశాఖ అధికారులు, ప్రజలు అభినందలు తెలుపుతున్నారు. బెజ్జూరు గ్రామపంచాయతీ పరిధిలోని కూలీలకు కాకుండా కమ్మర్‌గాంలో 650 కూలీలకు రూ.49 లక్షలు, మొర్లిగూడలో 450 కూలీలకు రూ.30లక్షలు కూలీ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉత్తమ పురస్కారం అందుకొని పలువురి మన్ననలు పొందుతున్నారు.సామాజిక న్యాయం కోసం పోరాడతాం
ఏసీసీ, న్యూస్‌టుడే: అన్ని కులాలను ఏకం చేస్తూ సామాజిక న్యాయం కోసం పోరాడుతామని ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, బీఎస్‌ఎఫ్‌ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి తెలిపారు. అంబేడ్కర్‌ వారసులుగా హక్కుల కోసం ఉద్యమాలు చేయల్సిన అవసరం ఉందన్నారు. బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌(బీఎస్‌ఎఫ్‌) జిల్లా ప్రథమ మహాసభ గురువారం మంచిర్యాల పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. సంఘం జిల్లా అధ్యక్షుడు అనపర్తి యువరాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభకు రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కులాల కోసం కాకుండా సమాజం కోసం మాట్లాడిన వారు లేరని, ప్రతి వ్యవహారం కులంతోనే ముడిపడి ఉంటుందన్నారు. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందన్నారు. అంతకుముందు వక్తలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సభలో పలువురు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్‌, నేతకాని జిల్లా అధ్యక్షుడు దుర్గ రాజేష్‌, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు భూమలింగం, వివిధ సంఘాల నాయకులు డా.యశ్వంత్‌రావు, కాదాసి రవీందర్‌, రామటెంకి సుధాకర్‌, కల్లూరి రవికుమార్‌, దుర్గ సురేష్‌, ఎం.డి.ముస్తఫా, కార్తీక్‌, కానగంటి సంతోష్‌, చందు, రాజ్‌కుమార్‌, రియాజ్‌, మహేష్‌, అజయ్‌ పాల్గొన్నారు.


వైభవోపేతంగా సాయినాథుని జాతర
ఖానాపూర్‌, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని జంగల్‌హన్మాన్‌ వీరాంజనేయ శివసాయి సమాజ్‌ ఆలయంలో గురువారం సాయినాథుని 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతర మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈనెల 4 నుంచి కొనసాగుతున్న వేడుకలు కనుల పండువగా సాగాయి. జాతర సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఖానాపూర్‌ ఎటు చూసినా జనసంద్రాన్ని తలపించింది. సాయినాథునికి నాందేడ్‌ సత్యేంద్రనాథ్‌ బాబా, ఆదిలాబాద్‌ గోపాలకృష్ణమఠానికి చెందిన యోగానంద భారతి మహారాజ్‌, బాసర వేద విద్యానంద మహారాజ్‌ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామకృష్ణశర్మ మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఎంతో మహోన్నతమైన హైందవ సంప్రదాయ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. కళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకొంది. మహాఅన్నదానానికి సుమారు లక్షకుపైగా భక్తులు వచ్చారని ఆలయ కమిటీ అంచనా. మాజీ ఎంపీ రాఠోడ్‌ రమేష్‌, మాజీ డీసీసీ అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ సభ్యుడు పి.రవీందర్‌రావ్‌, డా.కృష్ణ్ణంరాజు దర్శించుకొన్నారు. ఎంపీపీ ఆకుల శోభారాణి, సర్పంచి నేరెల్ల సత్యనారాయణ, జడ్పీటీసీ సునీత, వైస్‌ ఎంపీపీ అంకం అనూష, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


డబ్ల్యూటీవో ఒప్పందాలకు వ్యతిరేకంగా పోరాడదాం
రెబ్బెన, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే డబ్ల్యూటీవోతో ఒప్పందాలు చేసుకోవడానికి పూనుకుంటోందని, దానికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ పిలుపునిచ్చారు. గోలేటిలోని కేఎల్‌ మహేంద్ర భవనంలో గురువారం ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నిర్మాణ మహాసభ నిర్వహించారు. ముందుగా అమరులైన విద్యార్థులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్రంలో 19నెలల మోదీ ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థలో మార్పులు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మోదీ విదేశీ పర్యటనలపై ఉన్న మోజు, విద్యావ్యవస్థపై చూపడం లేదన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఇన్ఛార్జి ఎస్‌.తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మానసిక దాడితోనే రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు మెస్రం భాస్కర్‌, కార్యదర్శి మహేందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవీందర్‌, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్‌, సహాయ కార్యదర్శి రాజు, మండల అధ్యక్షుడు రాయిల్ల నర్సయ్య, రవికుమార్‌, కార్యదర్శి సాయికిరణ్‌లు పాల్గొన్నారు.


పర్యటకపరంగా జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
కడెం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా పర్యటకులను ఆకట్టుకునే అద్భుతమైన అందాలను కలిగి ఉందని, జిల్లాను పర్యటకపరంగా సుందరంగా తీర్చిదిద్దుతామని పర్యటకశాఖ రాష్ట్ర కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. గురువారం ఉదయం కడెంలో విలేకరులతో మాట్లాడారు. బుధవారం రాత్రి కడెంలో హరిత హోటల్‌ విడిది గదుల్లో బస చేసిన ఆయన గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కడెం జలాశయంలో పడవలో విహరించారు. జలాశయం ఆనుకుని ఉన్న గుట్ట ప్రదేశాలను పరిశీలించారు. పర్యటకపరంగా గుట్టల వద్ద ఏమేం అభివృద్ధి పనులు చేపట్టవచ్చో శాఖ అధికారులతో చర్చించారు. జలాశయంలో పడవల్లో విహరించేందుకు వచ్చే సందర్శకులు సేఫ్టీ జాకెట్లు వేసుకున్నాకే పడవను నడిపించాలని, లేదంటే లోపలికి తీసుకెళ్లొద్దని పడవ నడిపేవారికి సూచించారు. అనంతరం విడిది గదులను, హోటల్‌ పరిసరాలను పరిశీలించారు. జిల్లాను మూడు సంవత్సరాల్లో పర్యటకపరంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కడెం, జన్నారంలను పర్యటకపరంగా మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. డీటీఓ రవికుమార్‌, స్టెప్‌ సీఈఓ వెంకటేశ్వరరావు, జిల్లా టూరిజం మేనేజరు సాంబశివరావు, తహసీల్దార్‌ నర్సయ్య తదితరులున్నారు.


డీసెట్‌ అభ్యర్థులకు తీపి కబురు!
ఆదిలాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: డీ సెట్‌ పరీక్ష రాసి కౌన్సిలింగ్‌ కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు అందింది. సుదీర్ఘ విరామానికి ప్రభుత్వం తెరదించింది. ఈ నెల 18 నుంచి డైట్‌సెట్‌ కౌన్సిలింగ్‌ చేపడుతున్నట్లు డీసెట్‌ కన్వీనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అటు డిగ్రీలో చేరలేక.. ఇటు డైట్‌లో ప్రవేశం పొందలేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల అవస్థలు తీరిపోనున్నాయి. ఆలస్యంగానైనా డీసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రకటన జారీ కావడంతో అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు అంతర్జాలంలో కళాశాలల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇదే నెల 26న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. మార్చి 1 నుంచి కళాశాలలో తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాలో 7,195 మంది అభ్యర్థులు
ఇంటర్మీడియట్‌ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణ కోసం నిర్వహించిన డీసెట్‌ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం కిందటేడాది జులై 5న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే నెల 21 వరకు అంతర్జాలంలో దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో 7,539మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 7,195మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అదే ఏడాది ఆగస్టు 9న పరీక్ష నిర్వహించగా సెప్టెంబర్‌ 22న ఫలితాలు వెల్లడించారు. కౌన్సిలింగ్‌ సన్నాహాల్లో భాగంగా విద్యార్థుల ధ్రువీకరణపత్రాలను సైతం పరిశీలించారు. జిల్లాలో ఒక ప్రభుత్వ డైట్‌ కళాశాల ఉండగా.. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, ఉట్నూరు, మంచిర్యాల, ప్రాంతాల్లో ప్రైవేటు డీఎడ్‌ కళాశాలలున్నాయి. ఇవి కాకుండా ఈ ఏడాది భైంసాలో కొత్త కళాశాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ప్రతి ఏడాది ప్రభుత్వ కళాశాలలో 100మందికి ప్రవేశం కల్పిస్తుండగా.. ప్రైవేటు కళాశాలలో 80 శాతం సీట్లు కౌన్సిలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. 20 శాతం మేనేజ్‌మెంట్‌లో కోటాలో భర్తీ చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద కళాశాలలో వందసీట్లు, మిగతా కళాశాలల్లో 50 సీట్లు కేటాయించారు.సంఘాలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ మాతుర్‌
ఇచ్చోడ, న్యూస్‌టుడే: స్వయం సహాయక మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఆ దిశగా గ్రామీణస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందికి లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వినోద్‌కుమార్‌ మాతుర్‌ సూచించారు. గురువారం ఆయన ఇచ్చోడలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన బోథ్‌ డివిజన్‌ స్థాయి బ్యాంకర్లు, అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రుణాలు తీసుకున్న వారు క్రమంగా చెల్లించకుంటే వడ్డీభారం వారిపై పడుతుందని, క్రమంగా చెల్లిస్తే రుణాలు అదనపు తిరిగి అధిక మొత్తంలో పొందవచ్చన్నారు. సెర్ప్‌ సిబ్బంది మహిళ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసి వారి జీవన స్థితిగతులపై చర్చించి, రుణాలు చెల్లించేలా అవగాహన కల్పించాలని అన్నారు. బ్యాంకర్లు సైతం వినియోగదారులకు సహకరించాలన్నారు. అనంతరం బోథ్‌ డివిజన్‌లోని ఆయా మండలాల్లో బ్యాంకుల పనితీరు, స్వయం సహాయక సంఘాలకు చెల్లించిన రుణాలు, వసూళ్ల తీరుపై సమీక్ష జరిపారు. కార్యక్రమంలో ఎస్‌బీహెచ్‌ ప్రధాన కార్యాలయం ఫైనాన్షియల్‌ మేనేజర్‌ సాయిప్రసాద్‌, ఆర్‌బీఐ ప్రతినిధిµ మురళీధర్‌, ఎంపీడీఓ బి.రమాకాంత్‌, ఇచ్చోడ ఎస్‌బీహెచ్‌ మేనేజర్‌ వి.గిరినాథ్‌, సెర్ప్‌ ప్రాంతీయ సమన్వయకర్త రాజేశ్వర్‌, ఎంపీడీఓలు, బ్యాంకుల మేనేజర్లు, ఐకేపీ ఏపీఎంలు హాజరయ్యారు.


ఉద్యోగమే లక్ష్యంగా వారసులు
మందమర్రి, న్యూస్‌టుడే: సింగరేణిలో వారసత్వంగా వచ్చే ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికుల వారసుల పోరాటం ఉద్ధృతంగా మారుతోంది. కొద్దినెలలుగా నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వారసత్వ ఉద్యోగాలు లక్ష్యంగా సింగరేణి సన్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఆందోళనలు చేపడుతోంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో కార్మిక సంఘాలు, సార్వత్రిక ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి ఏరియాలో వివిధ పద్ధతుల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. కార్మిక నేతలు, ప్రజాప్రతినిధులు, గుర్తింపు సంఘం నేతలు, సింగరేణి అధికారులను కలిసి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు చొరవ చూపాలని కోరుతున్నారు. సింగరేణిలో 1998 వరకు కొనసాగిన వారసత్వ ఉద్యోగాలను కార్మిక సంఘాలు ఒప్పందంతో యాజమాన్యం పక్కన పెట్టింది. దీన్ని తిరిగి పునర్ధురించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సింగరేణిలో ఏళ్లుగా సేవలందించిన తమ తండ్రుల స్థానంలో అవకాశం కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌. ఇప్పటికే వయస్సు మీద పడటంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కార్మికులకు వైద్యపరంగా విధులు నిర్వహించడం లేదని పక్కన పెట్టి వారిస్థానంలో వారసులకు ఉద్యోగం కల్పించే విధానాన్ని అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాలకు చెందిన నిరుద్యోగ యువకులు గుర్తింపు సంఘం బాధ్యతను తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సింగరేణిలో కొత్తగనులు రానున్న నేపథ్యంలో ఉద్యోగావకాశాలు పెరుగనున్నాయి. వాటికి సరిపడా నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉండటంతో వారసులకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంస్థ అవసరాల కోసం
హేమచందర్‌, సింగరేణి వారసుల సంఘం నాయకుడు
సింగరేణి ఉద్యోగుల వారసులుగా తమకు అవకాశం కల్పిస్తే సంస్థలో అవసరం మేరకు విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. సింగరేణి కార్మికుల వారసులందరూ ఉన్నత చదువులు చదివారు. సింగరేణిలో వారికి అవకాశం కల్పించడం ద్వారా సంస్థ ఏవిధంగానైనా వారిని వినియోగించుకునే అవకాశం ఉంది. సాంకేతికంగా ఉపయోగపడేలా ఇంజినీరింగ్‌, డిప్లామా, ఐటీఐ చేసినవారున్నారు. ఎంబీఏ, పీజీ, డిగ్రీలు పూర్తిచేసినవారున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు చొరవచూపాలి.

కొత్తగనుల రాకతో ఉద్యోగులు అవసరమే
ప్రవీణ్‌, మందమర్రి
సింగరేణిలో కొత్త గనులు రానున్నాయి. తప్పకుండా ఉద్యోగులు అవసరం. సింగరేణికి ఇంతకాలం సేవలందించిన కార్మికుల వారసులకు అందులో అవకాశం కల్పించడం ద్వారా అంకితభావంతో పనిచేస్తారు. సింగరేణిలో గతంలో మాదిరిగా వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలి. ఏటా బొగ్గుఉత్పత్తి పెరుగుతోంది. దానికి అనుగుణంగా కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కార్మికులు సంఖ్య తగ్గింది. కొత్తవారిని తీసుకొంటే సంస్థతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న కార్మికుల పిల్లలకు వారసత్వంగా ఉద్యోగ అవకాశం కల్పిస్తే సింగరేణి ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య తీరుతుంది.పదోవేతన కమిటీని నియమించాలి
బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పదో వేతన కమిటీని కేంద్ర ప్రభుత్వం వెంటనే నియమించాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సంపత్‌కుమార్‌ అన్నారు. గురువారం ఇఫ్టూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో నాలుగు నెలల్లో తొమ్మిదో వేతన కాలపరిమితి ముగిసిపోతుందని, గుర్తింపు సంఘాల కాలపరిమితి పూర్తవుతుందన్నారు. ఏడాది ముందే పదో వేతన కమిటీని కేంద్రం నియమించాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బొగ్గుగనుల కార్మికుల జీతభత్యాలు, రక్షణ, కార్మికుల సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. సింగరేణిలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాతీయ సంఘాలు మొసలికన్నీరు కారుస్తున్నాయని ఆరోపించారు. కోడ్‌ఆఫ్‌ డిసిప్లేన్‌ను మార్చకుండా సింగరేణిలో ఎన్నికలు నిర్వహించవద్దని డిమాండ్‌ చేశారు. సమావేశంలో గోదావరి లోయబొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ చాంద్‌పాషా, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎండీ.జాఫర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.మైసూసింగ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.బ్రహ్మానందం, రీజియన్‌ కార్యదర్శి వెంకటేశ్‌, నాయకులు భూమయ్య, రాములు, శ్రీనివాస్‌, పాపారావులు పాల్గొన్నారు.


ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదు
గని ప్రమాదాలపై కార్మిక సంఘాల నాయకుల ధ్వజం
శ్రీరాంపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: గురువారం శ్రీరాంపూర్‌ ఏరియాలో ఆర్కే-8, ఎస్సార్పీ-3 గనుల్లో జరిగిన ప్రమాదాలపై వివిధ కార్మిక సంఘాల నాయకులు యాజమాన్య వైఖరిని విమర్శించారు. రెండు గనుల్లో అధికారుల ఒత్తిడి కారణంగానే ప్రమాదాలు జరిగి కార్మికులకు గాయాలయ్యాయని తెబొగకాసం రాష్ట్ర నాయకుడు పెద్దపల్లి కోటిలింగం, ఏరియా కార్యదర్శి లెక్కవ విజయ్‌ ఆరోపించారు. యాజమాన్యానికి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదన్నారు. ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు డి.అన్నయ్య మాట్లాడుతూ రెండు గనుల్లో జరిగిన ప్రమాదాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి కిషన్‌రావు మాట్లాడుతూ గనుల్లో కార్మికుల రక్షణపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.


అటవీశాఖ సరిహద్దు పనుల పరిశీలన
తాండూరు, న్యూస్‌టుడే: తాండూరు మండలంలో గురువారం అటవీశాఖ జిల్లా కన్జర్వేటర్‌ తిమ్మారెడ్డి పర్యటించారు. మండలంలో చేపడుతున్న అటవీశాఖ సరిహద్దు ట్రెంచ్‌ పనులపై ఆయన అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం గోపాల్‌నగర్‌ నుంచి గోపాల్‌రావుపేట దారిలో చేపట్టిన పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ట్రెంచ్‌ కొలతలను తనిఖీ చేశారు. ఇంకా అన్నిప్రాంతాల్లోనూ అటవీ సరిహద్దులను గుర్తించి ప్రహరీ ట్రెంచ్‌లు పూర్తి చేయాలని సూచించారు. అటవీశాఖ మొక్కల పెంపకంపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట బెల్లంపల్లి రేంజ్‌ అధికారి వినయ్‌కుమార్‌ సాహు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారి మారయ్య, డిప్యూటీరేంజ్‌ అధికారి లతీఫ్‌, బీట్‌ అధికారులు రజనీ, బదర్‌ తదితరులు పాల్గొన్నారు.


గని ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులకు గాయాలు
శ్రీరాంపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే-8, ఎస్సార్పీ-3 గనుల్లో గురువారం వేరువేరుగా జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్కే-8 గని కార్మికుల కథనం ప్రకారం.. గనిలో నార్త్‌ దిశలో 52 డిప్‌ 5వ సీమ్‌లో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోల్‌కట్టర్‌ దనిశెట్టి రాజయ్య విధుల్లో భాగంగా పుల్లీ(చక్రం)కి సపోర్టుగా గార్డర్‌ను ఏర్పాటుచేసే విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా పుల్లీలో రాజయ్య కుడికాలు ఇరుక్కపోయింది. ప్రమాదంలో రాజయ్య కుడికాలు పాదంపై భాగం వరకు విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే గని అధికారులు కార్మికుడిని రామకృష్ణాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు.

ఎస్సార్పీ-3 గనిలో జరిగిన మరో ప్రమాదంలో సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ ఎల్‌.పరుశురాం తీవ్రంగా గాయపడ్డాడు. గని కార్మికుల కథనం ప్రకారం.. గురువారం గనిలో పరుశురాం 5 1/2 లెవల్‌, మూడో సీమ్‌లో షాట్‌ఫైరర్‌ విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా పరుశురాం బ్లాస్టింగ్‌ కోసం చేసిన రంద్రంలో నిచ్చెన సహాయంతో మందుగుండు నింపే పనులు చేస్తున్నారు. అతడు పనిచేస్తుండగానే ఒక్కసారిగా నిచ్చెన పైనుంచి కింద పడిపోయాడు. అతన్ని వెంటనే అధికారులు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితులను గుర్తింపు సంఘం శ్రీరాంపూర్‌ ఏరియా కార్యదర్శి లెక్కల విజయ్‌, ఆర్కే-8, ఎస్సార్పీ-3 గనుల పిట్‌ కార్యదర్శులు బన్న వెంకటి, గోపె రాజయ్య, నర్సింగం, రాములు, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శులు కొట్టె కిషన్‌రావు, ల్యాగల శ్రీనివాస్‌ పరామర్శించారు.కృషి సించాయి ప్రణాళికకు ఆమోదం
ఆదిలాబాద్‌ అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం అమలుకు అధికారులు రూపొందించిన రూ.8685 కోట్ల ప్రణాళికను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో ప్రతి ఎకరానికి నీటి వసతి కల్పించేందుకు కృషి చేయనున్నారు. ఈ పథకం కింద తయారుచేసిన ప్రణాళికను సభ ఆమోదించాలని జడ్పీ అధ్యక్షురాలు కోరగా.. సభ్యులు మద్దతు తెలిపారు. అనంతరం స్వచ్ఛపాఠశాలల కింద నిర్మించిన మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించేందుకగాను గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా వేసిన బోర్లు, బిగించిన మోటార్ల వ్యవహరంపై విచారణ జరిపించాలని బజార్‌హత్నూర్‌ జడ్పీటీసీ సభ్యుడు మునేశ్వర్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. మరోపక్క పాఠశాలలకు ఉపాధ్యాయులు సరిగ్గారావడం లేదని నార్నూర్‌ జడ్పీటీసీ సభ్యురాలు చెప్పగా ఇది వాస్తవమేనని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ సమర్థించారు. కేజీబీవీల్లోనూ తాగునీటి సమస్యలు ఉన్నాయని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు వివరించారు. వాటికి వాహనాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని డీఈఓ పేర్కొన్నారు.


జడ్పీకి తాకిన గిరి విశ్వవిద్యాలయం సెగ
ఆదిలాబాద్‌ పట్ణణం, న్యూస్‌టుడే: గిరిజన విశ్వవిద్యాలయం జిల్లాలోని ఉట్నూరులో ఏర్పాటు చేయాలని కొన్నిరోజులు ఆందోళన చేస్తున్న విద్యార్థి, ప్రజా, గిరిజన సంఘాల ఆందోళన రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. తాజాగా గురువారం జిల్లాకేంద్రంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఈ సెగ తాకింది. నెల రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు గురువారం జడ్పీ సమావేశం జరిగే భవనం వద్దకు వచ్చారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొమ్మెన సురేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సిర్రాదేవెందర్‌, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బి.రాహుల్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఎ.నవీన్‌, రాఠోడ్‌నరేందర్‌లు పోలీసుల అనుమతితో లోనికి వచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు శోభారాణి, జిల్లా పాలనాధికారి జగన్మోహన్‌ను ప్రత్యేక గదిలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సమావేశంలో జిల్లా పాలనాధికారి జగన్మోహన్‌ దీనిపై మాట్లాడారు. యువత అంతా వచ్చి తీర్మానం చేయాలని విన్నవించారని చెప్పారు. జడ్పీ అధ్యక్షురాలు శోభారాణి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆసిఫాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు ఏమాజి మాట్లాడుతూ సభ్యులంతా కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనడడంతో బల్లలు చరుస్తూ సభ్యులందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఏకగీవ్రంగా తీర్మానించారు.


వరంగల్‌లో ఫిబ్రవరి 21న రెడ్డి వధూవరుల వివాహ పరిచయ వేదిక
రెడ్డి కమ్యూనిటీలో సంబంధాలను అన్వేషించే వారి సౌకర్యార్థం ఈనాడుపెళ్లిపందిరి.నెట్‌ వరంగల్‌లో ఫిబ్రవరి 21న పరిచయవేదిక నిర్వహిస్తుంది.
వేదికః రెడ్డి సంక్షేమం సంఘం భవన్‌, వడ్డేపల్లి క్రాస్‌ రోడ్‌, సుబేదారి, హన్మకొండ, వరంగల్‌.

ప్రత్యేకతలివీ.. రెడ్డి కమ్యూనిటీలో సంబంధాలను అన్వేషించే వారిని ఒక వేదిక పై ప్రత్యక్షంగా కలిసే అవకాశం.
వధువు/వరుడు, వారి ఇష్టాఇష్టాల పరిచయం.

వధువు/వరుడు ప్రాథమ్యాలతో 1 నిమిషం నిడివి వీడియో 5 రోజుల ముందుగా ఇస్తే పరిచయ వేదికలో ప్రదర్శన.
వధువు/వరుడు వివరాలతో కూడిన సి.డి. ఇవ్వబడును.

ఈనాడుపెళ్లిపందిరి.నెట్‌ వెబ్‌సైట్‌లోని ద్వారా మీకు నచ్చిన 10 ‘కాంటాక్ట్‌ నంబర్స్‌’ 30 రోజుల కాల వ్యవధిలో పూర్తి ఉచితంగా చూసుకునే అవకాశం.
ఈనాడుపెళ్లిపందిరి.నెట్‌ ద్వారా వివాహం జరిగిన వారు 3 నెలల లోపు మాకు తెలియచేస్తే రూ॥ 2500/- విలువ గల గిప్ట్‌ కూపన్‌ అందచేయబడును.

పరిచయవేదికలో వధువు/వరుడు లతో కలిపి ముగ్గురు వ్యక్తులకు భోజన వసతి.
రిజిస్ట్రేషన్ల సంఖ్య పరిమితం. రుసుము రూ: 1500/- మాత్రమే.

వివరాలకు సంప్రదించాల్సిన చిరునామాః ఈనాడు ఆఫీస్‌, విజయ టాకీస్‌ రోడ్‌, ఎస్‌.ఆర్‌ బాలికల కాలేజ్‌ వెనుక, హన్మకొండ, వరంగల్‌ ఫోన్స్‌: 8008550132. కరీంనగర్‌ : 8008551132, ఖమ్మం : 8008550131.మహబూబ్‌నగర్‌ : 8008551130. సూర్యాపేట : 9177147543. నిజామాబాద్‌ : 8008551131. హైదరాబాద్‌ : 9100058123, 040-49051234.

రిజిస్ట్రేషన్స్‌ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు వెబ్‌సైట్‌:-www.eenadupellipandiri.netమరుగుదొడ్డి వినియోగించకుంటే రేషన్‌ రద్దు
ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాల మేరకు సంపూర్ణ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం(ఓడీఎస్‌) కింద ఎంపికై వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయినా ఉపయోగించకుండా బహిర్భూమికి వెళుతున్న కుటుంబాలకు రేషన్‌ కార్డును రద్దు చేయడంతోపాటు ఇంటికి విద్యుతు సరఫరాను నిలిపివేస్తామని జిల్లా పంచాయతీ అధికారి కె.పోచయ్య హెచ్చరించారు. గురువారం ఉదయం ముత్నూర్‌ గ్రామంలో బహిర్భూమికి వెళ్తున్నవారిని గమనించారు. గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న యువకుడు నీటితో బయటకు వెళ్తుండగా.. అతన్ని నిలిపి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిందా, ప్రభుత్వం నుంచి రావల్సిన రూ.12 వేలు తీసుకున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. మరుగుదొడ్డి పూర్తయినా దానిని వినియోగించకుండా బయటకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. ముత్నూర్‌ గ్రామంలో మరుగుదొడ్లు పూర్తయినవారు ఉపయోగించకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని, వారి జాబితాను తయారు చేయాలని సర్పంచి తుంరాం తారామతి, కారోబారి ప్రహ్లాద్‌ను ఆదేశించారు. విద్యాకమిటీ ఛైర్మన్‌ ముండే దేవిదాస్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు.


నాగోబా జాతరలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు
ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది నాగోబా జాతరలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో గిరిజన, తెలంగాణ సంస్కృతిపై కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర సంస్కృతికి సారధి కోర్డినేటర్‌ దయ నర్సింగ్‌ అన్నారు. గురువారం నాగోబా దేవతను దర్శించుకొన్నారు. అనంతరం నాగోబా దేవత పూజారులైన మెస్రం వంశీయులతో మాట్లాడుతూ రాష్ట్ర సాంస్కృతిక సారధి ఛైర్మన్‌ అయిన రసమయి బాలకిషన్‌ ఆదేశాల మేరకు జాతర సందర్శనకు వచ్చామన్నారు. వచ్చే ఏడాది నాగోబా జాతరలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా వారం రోజులపాటు పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. జిల్లా కోర్డినేటర్‌ మామిడ్ల లక్ష్మణ్‌, గాయకురాలు సౌమ్య, పవార్‌ మోహన్‌ నాయిక్‌, కుమ్ర నగేష్‌, రాఠోడ్‌ శంకర్‌, ఆత్రం గోవింద్‌రావు తదితరులు పాల్గొన్నారు.


ఉద్యోగులు సేవాదృక్పథంతో పనిచేయాలి
జడ్పీ అధ్యక్షురాలు శోభారాణి
ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు సేవాదృక్పథంతో పనిచేయాలని జడ్పీ అధ్యక్షురాలు శోభారాణి సూచించారు. పంచాయతీరాజ్‌లో కారుణ్య నియమాలకింద ఆరుగురికి ఉద్యోగాలు కల్పించి గురువారం జడ్పీ సమావేశమందిరంలో పోస్టింగ్‌ ఉత్తర్వులు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విధినిర్వహణలో నిక్కచ్చిగా పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని వివరించారు. ఉద్యోగాలు పొందిన సరాఇస్మత్‌జహాన్‌కు పీఆర్‌ ఆసిఫాబాద్‌ డివిజన్‌, ఎ.లక్ష్మినారాయణకు జైనూర్‌ మండలపరిషత్‌ కార్యాలయం, ఎం.శశికిరణ్‌కు మామడ మండలం, ఎం.సురేష్‌కు తానూర్‌ మండలం, స్వాతికి ఖానాపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయం, ఎం.శారదకు జిల్లాపరిషత్‌ కార్యాలయంలో పోస్టింగ్‌లు కల్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా పాలనాధికారి జగన్మోహన్‌, జడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


జాతరలో నీటికి కటకట
ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా జాతరలో బుధవారం సాయంకాలం నుంచి రాత్రి 12 గంటల వరకు తాగునీటితోపాటు ఇతర అవసరాలకు నీరు సరఫరా కాక మెస్రం వంశీయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం దినమంతా నీరు సరఫరా చేసిన బోరుబావుల్లో అడుగంటిపోవడంతో జాతరకు వచ్చిన పూజారులతోపాటు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రెండు గంటల నుంచి జాతరలో నీటి కొరత ఉందని కొంతమంది గిరిజనులు జిల్లా పాలనాధికారి డాక్టర్‌ ఎం.జగన్మోహన్‌కు చరవాణి ద్వారా వివరించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామీణ నీటి సరఫరా శాఖ డిప్యూటీ ఈఈ దేవేందర్‌రెడ్డి, ఏఈ భానుకుమార్‌లు స్వయంగా దగ్గరుండి కొత్త బోరును వేయించారు. బోరు వేయడంతోపాటు ఐదు ట్యాంకర్లతో గిరిజనులకు నీటి సరఫరా చేశారు. జాతరలో తాగునీరు, పరిశుభ్రతపై తనకు కొన్ని గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని పాలనాధికారి జిల్లా పంచాయతీ అధికారి కె.పోచయ్య, ఉట్నూర్‌ ఆర్‌డీఓ ఐలయ్యలను ఆదేశించడంతో గురువారం ఉదయం ఆరు గంటలకే జాతరకు చేరుకొని గిరిజనుల తాగునీటి సమస్యపై పూర్తిస్థాయిలో పరిశీలించారు. డీపీఓ, ఆర్‌డీఓలు ఆర్‌డబ్ల్యూఎస్‌ డిప్యూటీ ఈఈని ఉద్దేశించి మాట్లాడుతూ తాగునీటి సరఫరా చేస్తున్న మరుగుదొడ్లు, సాన్నపు గుదుల వద్ద కూలీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. జాతర ముగిసేవరకు ట్రాక్టర్‌లో గిరిజనులకు తాగునీటితోపాటు ఇతర అవసరాలకు అవసరమైన నీటిని సరఫరా చేయాలని సూచించారు.


నైపుణ్యాన్ని వెలికితీసేవే క్రీడలు
ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: మారుమూల గిరిజన గ్రామాల్లో యువతలో దాగి ఉన్న క్రీడ నైపుణ్యాన్ని వెలికితీసేందుకే క్రీడలు ఎంతో దోహదపడతాయని ఉట్నూర్‌ డీఎస్పీ మల్లారెడ్డి, ఏపీఓ జనరల్‌ కుర్ర నాగోరావు, ఆర్‌డీఓ ఐలయ్యలు అన్నారు. నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు గురువారం బహుమతులు అందజేశారు. వాలీబాల్‌ ప్రథమ బహుమతిని బెల్లంపల్లి మండలం చిత్తపూర్‌, ద్వితీయ దుర్వగూడ(ఇంద్రవెల్లి), కబడ్డీలో ప్రథమ గర్కంపెట్‌(గుడిహత్నూర్‌), ద్వితీయ బహుమతిని బురదపల్లి(మామడ) పొందాయి. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ఖోఖో పోటీలో మొదటి స్థానంలో లక్కంపూర్‌(నేరడిగొండ), రెండో స్థానంలో జైనూర్‌ నిలిచాయి. సర్పంచి మెస్రం నాగ్‌నాధ్‌, ఆలయ కమిటీ ఛైర్మన్‌ తుకారాం, బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌ మెస్రం మనోహర్‌, తహసీల్దార్లు అజ్మీర శంకర్‌, రాఠోడ్‌ రమేష్‌, సీఐ బీఎల్‌ఎన్‌ స్వామి, ఎస్సై ఎన్‌.శ్రీనివాస్‌, ఏటీడుబ్ల్యూఓ ఆత్రం భాస్కర్‌, ప్రధానోపాధ్యాయులు గొడం చందర్‌, మెస్రం హన్మంత్‌రావు, రాయిసెంటర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తొడసం దేవురావు, పీఈటీలు పాల్గొన్నారు.
Untitled Document
సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు
తురాటిలో వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో గృహిణి...
హమాలీల సమ్మెతో రైసు మిల్లులకు నష్టం
ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు
పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలి
అమ్మవారి చెంత.. అసౌకర్యాల చింత
ఉత్తముడిగా బెజ్జూరు బీపీఎం
సామాజిక న్యాయం కోసం పోరాడతాం
వైభవోపేతంగా సాయినాథుని జాతర
డబ్ల్యూటీవో ఒప్పందాలకు వ్యతిరేకంగా పోరాడదాం
పర్యటకపరంగా జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
డీసెట్‌ అభ్యర్థులకు తీపి కబురు!
సంఘాలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యోగమే లక్ష్యంగా వారసులు
పదోవేతన కమిటీని నియమించాలి
ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదు
అటవీశాఖ సరిహద్దు పనుల పరిశీలన
గని ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులకు గాయాలు
కృషి సించాయి ప్రణాళికకు ఆమోదం
జడ్పీకి తాకిన గిరి విశ్వవిద్యాలయం సెగ
వరంగల్‌లో ఫిబ్రవరి 21న రెడ్డి వధూవరుల వివాహ పరిచయ వేదిక
మరుగుదొడ్డి వినియోగించకుంటే రేషన్‌ రద్దు
నాగోబా జాతరలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు
ఉద్యోగులు సేవాదృక్పథంతో పనిచేయాలి
జాతరలో నీటికి కటకట
నైపుణ్యాన్ని వెలికితీసేవే క్రీడలు
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net