గురువారం, జనవరి 19, 2017

జనరల్

విభిన్న అంశాలతో మహిళా పార్లమెంటరీ సదస్సు
శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌
ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : విభిన్న అంశాలతో జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు ఉంటుందని శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఫిబ్రవరిలో నిర్వహించే మహిళా పార్లమెంటరీ సదస్సు ఏర్పాట్లను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. సంగమ ప్రాంతం పవిత్ర యాత్రా స్థలిగా మారిందన్నారు. భక్తి పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే ప్రాంతంగా ఖ్యాతి గడించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిక సదస్సును ఏర్పాటు చేస్తోందన్నారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. జపాన్‌ పరిజ్ఞానంతో సదస్సు వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 25 ఎకరాల్లో వివిధ అంశాలపై వేదికలు ఉంటాయని చెప్పారు. మన సంప్రదాయాలకు అనుగుణంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశం మొత్తం సంగమ ప్రాంతం గురించి చర్చించుకునేలా నిర్వహిస్తామన్నారు. దాదాపు పది వేల మంది మహిళలు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అందరూ ప్రసంగించే అవకాశం కల్పిస్తామన్నారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ.. సంగమం అంతర్జాతీయ వేదక కాబోతోందన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి మహిళలు రానున్నారని తెలియజేశారు. అన్ని శాఖల యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు సభాపతి, మంత్రి కలిసి సంగమ ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతిష్ఠాత్మకంగా మహిళా సదస్సు ఏర్పాట్లు: కలెక్టర్‌
పవిత్ర సంగమం(ఇబ్రహీంపట్నం), న్యూస్‌టుడే : అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు ఏర్పాట్ల పనులను నాణ్యంగా చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు.ఎ ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సంగమ ప్రాంతాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంగమ ప్రాంతంలో పనులు నిర్వహించే గుత్తేదారులు, అధికారులతో మాట్లాడారు. మూడు రోజులు నిర్వహించే కార్యక్రమాలకు మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులు, దేశ ప్రధాని వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదన్నారు. స్పష్టమైన అవగాహనతో ప్రతి ఒక్కరికీ వేదికలు అర్థమయ్యేలా ఉండాలని చెప్పారు. ఏర్పాట్లను తాను నిత్యం పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. తహసీల్దారు పాషా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.