Monday, February 08, 2016


Untitled Document
సింహపురి జట్టు జయకేతనం
* పెనాల్టీ స్ట్రోక్‌తో కలసివచ్చిన అదృష్టం
* ముగిసిన దక్షిణభారత ఓపెన్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌
ధర్మవరం క్రీడలు, న్యూస్‌టుడే : ధర్మవరం పట్టణంలో ధర్మాంబ అథ్లెటిక్‌ హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా జరుగుతున్న వీరాస్వామి స్మారక దక్షిణ భారత ఓపెన్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో నెల్లూరు జట్టు జయకేతనం ఎగురవేసింది. ఆదివారం సాయంత్రం జరిగిన తుది పోరులో నెల్లూరు, బెల్గాం జట్లు తలపడ్డాయి. నిర్ణీత సమయానికి ఏ జట్టు గోల్‌ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. తుదిపోరు కావడంతో పెనాల్టీ స్ట్రోక్‌కు అవకాశం ఇచ్చారు. ఒక్కో జట్టుకు 5 బంతుల ప్రకారం రెండు టీమ్‌లకు అవకాశం కల్పించారు. ఇరు జట్ల గోల్‌ కీపర్లు ప్రతి బంతిని నిలువరించారు. ఇది కూడా డ్రా అయింది. గోల్డెన్‌ గోల్డ్‌ సడన్‌ డెత్‌ అవకాశంగా పెనాల్టీ స్ట్రోక్‌ను తిరిగి కల్పించారు. రెండో అవకాశంలో భాగంగా బెల్గాం జట్టు మొదటి బంతిని ఉపయోగించుకోలేక పోయింది. నెల్లూరు క్రీడాకారుడు మణికంఠ మాత్రం మొదటి బంతితో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును విజేతగా నిలిపాడు.


ఒప్పంద అధ్యాపకులపై ప్రభుత్వం మొండి వైఖరి
అనంతపురం విద్య,న్యూస్‌టుడే: ఒప్పంద అధ్యాపకులపై ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్‌ పేర్కొన్నారు. అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం ప్రభుత్వ ఒప్పంద అధ్యాపకులసంఘం సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఒప్పంద అధ్యాపకులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రత్యేకంగా మంత్రివర్గ కమిటీ ఏర్పాటుచేసినా ఇంకా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. ఒప్పంద అధ్యాపకుల న్యాయమైన డిమాండ్‌ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈనెల 25న విజయవాడలో జరిగే ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల చలో కార్యక్రమంలో తమవాణిని విన్పించాల్సి ఉందన్నారు. ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్నా అరకొర వేతనంతో పాటు ఉద్యోగం ఉంటుందో, Üడుతుందో అన్న భయంతో విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడిందన్నారు.


సంఘటితంగా సమస్యలు సాధించుకుందాం
* పారా వెటర్నరియన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ సాంబశివరావు
అనంత వ్యవసాయం, న్యూస్‌టుడే : సంఘాలు సంఘటితంగా ఉంటేనే సమస్యలు సాధించుకోవచ్చని పశుసంవర్ధకశాఖ పారా వెటర్నరియన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం సాయినగర్‌ పశువైద్యశాల ఆవరణలో పారా మెటర్నరియన్‌ ఫెడరేషన్‌ 4వ జోనల్‌ విస్తృతస్థాయి సమావేశం జిల్లా ఛైర్మన్‌ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర ఛైర్మన్‌ సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు మంచి పీఆర్‌సీ ఇచ్చిందని చెప్పారు. అయితే టీఏ, డీఏలు ఇవ్వలేదు. రాష్ట్రంలో 13 జిల్లాలకు టీఏ రూ.300 కోట్లు, డీఏ రూ.2100 రావాల్సి ఉందని, పోరాటాలతో సాధించుకోవాల్సి ఉందన్నారు. పశుసంవర్ధకశాఖ పరంగా ఒక్కొక్కటి పరిష్కరించుకున్నామని చెప్పుకుంటూ 2014లో 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పశుసంవర్ధక ముఖ్య కార్యదర్శికి ఇచ్చామన్నారు. అయినా డైరెక్టరేట్‌లో ఫైళ్లు కదలడంలేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సర్వీసు రిజిస్టార్‌ న్యాయబద్దంగా ఏడీ కంట్రోల్‌లో ఉండాలి. అయితే వెటర్నరీ అసిస్టెంట్ల దగ్గర ఉంది. దానికి భద్రత లేక పలు కారణాలకు దారితీసిందన్నారు. ఏడీ కంట్రోల్‌ ఉంచాలని గత 15 ఏళ్లుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారా కౌన్సిల్‌ ఏర్పాటుకు కోసం ఏళ్లుగా పోరాడుతున్నా పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏపీఎన్జీఓ సంఘం ఆధ్వరంలో కలిశామని, సీఎం అనుమతించారన్నారు. ఆర్థికశాఖలో ఫైల్‌ ఉందని, అక్కడినుంచి క్యాబినెట్‌ ఆమోదం పొందాలన్నారు. డైరెక్టరేట్‌లో సమైక్య ఉద్యమంతో ఆగిన ఫైళ్లు ఇప్పటికీ కదలలేదన్నారు. ధర్నాలు, ఆందోళన చేస్తేనే సమస్యలు పరిష్కారం కావు. ఇప్పటికే పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించాం. కొంత ఓపికపట్టండి. తర్వాత కార్యాచరణ ప్రణాళికతో పెద్దఎత్తున ఉద్యమం చేపడుదామని ఆయన జిల్లా కార్యవర్గ సభ్యులకు సూచించారు.

సేవాగుణం అలవర్చుకోండి : జేడీహెచ్‌ఏ
తోటివారికి చేతనైనంత సాయం చేసే గుణాన్ని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ జయకుమార్‌ కోరారు. పారా వెటర్నరియన్ల జిల్లా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సాయినగర్‌ పశువుల ఆసుపత్రి ఆవరణలోని ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని, పేదలు, వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన హుండీని జేడీహెచ్‌ఏ ప్రారంభించారు. మొత్తం 40 మంది ఉద్యోగులు రక్తాన్ని దానంచేశారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి సేతురాం మాట్లాడుతూ 18-60 ఏళ్ల మధ్య వయసు వారంతా రక్తాన్ని దానం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్ణయ్య, కో-ఛైర్మన్‌ గోవిందరాజులు, ఉపాధ్యక్షుడు వెంకటరాముడు, కోకన్వీనర్‌ వెంకటసుబ్బయ్య, నాలుగు జిల్లాల కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.వెటర్నరీ అసిస్టెంట్ల సంఘం ఎన్నిక ఏకగ్రీవం
* జిల్లా అధ్యక్షుడిగా ఈశ్వర్‌నాయక్‌
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : పశుసంవర్ధకశాఖలోని జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సాయినగర్‌లోని పశువైద్యశాల ఆవరణలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవిందరాజులు ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అయితే నామినేషన్లు వేయడానికి ఎవరూ ముందుకురాలేదు. అంతా కలిసికట్టుగా ఉన్నామని, సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అందరం సహకరిస్తామని సభ్యులు తెలిపారు. దీంతో కొత్తసంఘం సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని నూతన కార్యవర్గ సభ్యుల పేర్లును రాష్ట్ర అధ్యక్షుడు గోవిందరాజులు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌.ఈశ్వర్‌నాయక్‌ (పుట్టపర్తి), సహాధ్యక్షురాలుగా ఎం.నందిని(శింగనమల), ఉపాధ్యక్షులుగా ఎస్‌.సురేష్‌నాయక్‌(కళ్యాణదుర్గం), హెచ్‌.ఆనందమూర్తి(నూతిమడుగు), ఇ.జ్యోతి (పెద్దవడుగూరు), కార్యదర్శిగా బి.హరినాథ్‌(ధర్మవరం), సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌.అఖిల్‌అహమ్మద్‌(కణేకల్లు), కె.బాలాజీ(తాడిపత్రి), కోశాధికారిగా వి.గౌతమ్‌జోత్స్న (అగళి), మరో తొమ్మిది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందరాజలు ఎన్నికైనట్లు ధ్రువీకరణపత్రాలను అందజేశారు.


వామ్మో.. విజయవాడ
* ప్రయాణమంటేనే భయం
* ఒంటి కాలిపైనే ప్రయాణం
* బడ్జెట్‌ పైనే ప్రయాణికుల ఆశ
అనంతపురం(రైల్వే), న్యూస్‌టుడే: జిల్లా నుంచి విజయవాడకు ప్రయాణమంటేనే వణుకు పుట్టుకొస్తుంది. రోడ్డు మార్గం సరిగా లేదు. ఉన్న ఒక్క రైలులో వెళ్ధామంటే కాలుమోపలేం. ఇక బ్యాగు ఎక్కడ ఉంచాలి. రాత్రి నిద్రవస్తే తల ఎక్కడ వాల్చాలి. ఇదీ విజయవాడ, విశాఖపట్నం ప్రయాణికుల ఇక్కట్లు. రాజధాని ఏర్పాట్లపై రాష్ట్రప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంది. రాజధాని అమరావతి వెళ్లే వారిసంఖ్య రోజురోజుకూ ఘణనీయంగా పెరుగుతోంది. రాజధానికి ప్రయాణ సౌకర్యాన్ని పెంచడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. విశాఖపట్నం-ధర్మవరం(07274/73) రైలు వారానికి ఒకసారి నడుపుతున్నా రద్దీ రోజుల్లో, పండుగ రోజుల్లో ఈ రైలును రద్దు చేస్తున్నారు. అనంతపురం జిల్లాపై రైల్వేశాఖ వివక్ష చూపుతుందా? జిల్లా ప్రజాప్రతినిధుల పట్టనితనమా? అంటూ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. నాలుగు నెలలు ముందుగా రిజర్వు చేయించుకుంటేనే సీటు లభిస్తోంది. లేకుండా ఒంటికాలిపై ప్రయాణం చేయాల్సిందే. రాజధాని కావడంతో ప్రయాణపు అవసరాలు పెరిగాయి. దీనికితోడు గుంటూరు, విజయవాడల్లోని విద్యాసంస్థల్లో సుమారు 10వేల మంది జిల్లా విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. వెరసి విజయవాడ ప్రయాణం నరకయాతనగా మారింది. 450 కి.మీ. ప్రయాణాన్ని ఒంటికాలుపై నిల్చొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక లగేజీ ఎక్కడ ఉంచాలన్నది ప్రశ్నార్థకం. ఇదిలాఉండగా ప్రయాణికులు రైల్వే బడ్జెట్‌పై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కూడా ఆశించినన్ని కొత్త రైళ్లు రావట్లేదని ఇప్పటికే పరోక్షంగా సాంకేతాలు వచ్చాయి. విశాఖపట్నం-ధర్మవరం(07273/74) రైలును రోజు నడిచేలా మార్పు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పగటి వేళలో ఒకటి, రాత్రి వేళలో కనీసం రెండు రైళ్లు కొత్తగా కేటాయిస్తేనే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడం సాధ్యమవుతోంది. ప్రజాప్రతినిధులు ఈ దిశలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసి ఉంది.

ఫ్రీక్వెన్సీ పెంచాల్సిన రైళ్లు ఇవి..
* ప్రస్తుతం వారానికి మూడుసార్లు నడుస్తున్న యశ్వంతపూర్‌-మచిలీపట్నం(17211/12) కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడపాలి.

* ధర్మవరం-విశాఖపట్నం(7273/74) నడిచే రైలును రోజు నడపాలి.

* మధ్యాహ్నం వేళలో బెంగళూరు కంటోన్మెంట్‌-విజయవాడకు నడుపుతున్న (56503/04) రైలుకు స్లీపర్‌ బోగీలను రెండు నుంచి ఐదుకు పెంచాలి.

* వారానికి ఒకరోజు(శుక్రవారం)నడుస్తున్న ప్రశాంతి నిలయం(పుట్టపర్తి)- హౌరా(కలకత్తా) రైలును (22832/31) రైలును రోజు నడిపితే పగటి పూట విజయవాడకు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది.

* ప్రస్తుతం వారానికి ఒక రోజు యశ్వంతపూర్‌ నుంచి పూరికి నడుస్తున్న గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌(22884/22883) రైలును రోజు నడిపితే అమరావతికి వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రైలు తెల్లవారుజామున 3.20 గంటలకు అనంతపురంలో బయలుదేరుతుంది. విజయవాడకు కార్యాలయాల పనులపై వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది.వివరాలు వెబ్‌సైట్‌లో నమోదుచేయాలి
- డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి
అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: లోక్‌అదాలత్‌లో పరిష్కరించిన కేసుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కమలాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యాలయంలో ఆదివారం న్యాయసేవాధికార సంస్థ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో పరిష్కరించిన కేసుల వివరాలను హైకోర్టు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ మేరకు వెబ్‌సైట్‌లో నమోదుచేయాలన్నారు. దీంతో హైకోర్టు అధికారులు జిల్లాల వారీగా లోక్‌అదాలత్‌ల సరళిని పరిశీలిస్తారన్నారు. జిల్లా, మండల న్యాయసేవాధికార సంస్థల పరిధిలో పనిచేసే ఉద్యోగులు కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈనెల 13న నిర్వహించే లోక్‌అదాలత్‌లో ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో పని చేసే ఉద్యోగులు పాల్గొన్నారు.


జీఓ నంబరు 279ను రద్దుచేయాలి
* శ్రామిక మహిళా సమన్వయకమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ధనలక్ష్మి
కోవూరునగర్‌(అనంతపురం),న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబరు 279ను రద్దు చేయాలని శ్రామిక మహిళా సమన్వయకమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో శ్రామిక మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్మికుల హక్కులను పరిరక్షించుకునేందుకు ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక, కార్పొరేట్‌ రంగాలకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏళ్లతరబడి ఒప్పంద పద్ధతిన ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించటం లేదని గుర్తుచేశారు. మధ్యాహ్నభోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచటంతో పాటు బకాయిలను చెల్లించాలన్నారు. అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని భవిష్యత్తులో పెద్దఎత్తున పోరాటాలు చేపడతామన్నారు. మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా కమిటీ జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి, అంగన్‌వాడీల సంఘం జిల్లా కార్యదర్శి వనజ, నాయకులు గోపాల్‌, నాగమని, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.


గిరిజన వసతిగృహాలకు ఆట వస్తువులు..!
కోవూరునగర్‌(అనంతపురం),న్యూస్‌టుడే: జిల్లాలో ఉన్న 18 గిరిజన సంక్షేమ వసతిగృహాలకు ఆట వస్తువులను ప్రభుత్వం విడుదల చేసింది. వసతిగృహాలలో వసతి పొందుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సాయంత్రం సమయంలో ఆట వస్తువులతో ఆటలు ఆడుతూ కొన్ని గంటలు సేదతీరాలన్నది ప్రభుత్వ ఉద్ధేశం. ఇందులోభాగంగా 18 వసతిగృహాలకు సంబంధించి 36 చెస్‌ బోర్డులు, క్యారం బోర్డులు 36, ఆర్చరీ పరికరాలు 250, స్కిప్పింగ్‌ రోప్స్‌ 108 వంటి ఆటవస్తువులు వచ్చాయి. అలాగే వసతిగృహ విద్యార్థులు వ్యాయమం చేసుకునేందుకు వీలుగా కొన్ని పరికరాలు అందజేశారు. జిల్లా కార్యాలయానికి ఆట వస్తువులు వచ్చాయని వాటిని వసతిగృహాల వార్డెన్లకు పంపిణీ చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ అధికారి నాగముని తెలిపారు. ఆట వస్తువులను విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు.


వేగమంతంగా బ్రాంచి పోస్టాఫీసుల ఆధునీకరణ
అనంతపురం (అరవిందనగర్‌) న్యూస్‌టుడే: పల్లె పోస్టాఫీసుల ఆధునీకరణకు తపాలశాఖ శ్రీకారం చుట్టింది. పట్టణాల్లోని పోస్టాఫీసుల్లో ఇప్పటికే కంప్యూటరీకరణ, ఆన్‌లైన్‌ సౌకర్యాలు, ఏటీఎం కార్డుల పంపిణీ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో గ్రామీణప్రాంతాల్లోని పోస్టాఫీసులను ఆధునీకరించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కొన్ని గ్రామాల్లో అసలు పోస్టాఫీసు ఎక్కడుందో తెలియని పరిస్థితి. పోస్టాఫీసుల్లో సిబ్బందికి ఫర్నిచర్‌, కంప్యూటర్ల సరఫరా దశలవారీగా జరుగుతోంది. ఈనేపథ్యంలో అనంతపురం డివిజన్‌ పరిధిలో 403 బ్రాంచి పోస్టాఫీసులుండగా ఇప్పటికే 260 పోస్టాఫీసులకు నామఫలకాలు జిల్లా కేంద్రానికి అందాయి. వీటిమీద పోస్టాఫీసు పేరు, పనివేళలు, పిన్‌కోడ్‌ నంబరు వంటి వివరాలు ముద్రించారు. ఎంపిక చేసిన పోస్టాఫీసులకు కార్యాలయం ముందు ఈ నామఫలకాలను అమర్చుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసులు ఒకేలా ఉండాలనే ఆలోచనతో తపాలశాఖ దశలవారీగా ఆధునీకరణ చేపట్టింది.

ఏటీఎం కార్డులకు దరఖాస్తు చేసుకోండి : ఏఎస్పీ
వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోస్టాఫీసుల్లో ఖాతాదారులు నగదు లావాదేవీలకు కౌంటరు ముందు నిల్చోవాల్సిన అవసరం లేకుండా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు అనంతపురం డివిజన్‌ తపాలశాఖ ఏఎస్పీ సంజీవ్‌కుమార్‌ గుప్త తెలిపారు. అనంతపురం నగరం ప్రధాన కార్యాలయం ఆవరణలో ఏటీఎం అందుబాటులో ఉందన్నారు. దీంతో ఏటీఎం సేవల వినియోగం రోజురోజుకు ఎక్కువవుతోందన్నారు. తొలివిడతగా 250 ఏటీఎం కార్డులు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం మరో వెయ్యి కార్డులు జిల్లా కేంద్రానికి అందాయన్నారు. ఖాతాదారులు ఏటీఎం కార్డులకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఉద్యమం ఉద్ధృతం చేస్తాం
అనంతపురం(రాంనగర్‌), న్యూస్‌టుడే: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం మద్దతుగా జలిజ సోదరులు, సోదరీమణులు రెండోరోజు నిరసన దీక్ష చేపట్టారు. మునిరత్నం శ్రీనివాసులు నివాసంలో అతని భార్య పద్మావతి ఆధ్వర్యంలో ఆదివారం పల్లాలతో నిరసనలు తెలిపారు. చిన్నారులు తోటి మహిళలు సంఘీబావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజులాదేవి, అంబటి లక్ష్మీరెడ్డి, మోనికా జైన్‌, తదితరులు పాల్గొన్నారు.

బలిజ సోదరుల నిరసన
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం శ్రీనివాస కళ్యాణమండపంలో బలిజ సోదరులు దీక్ష కొనసాగించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించేంతవరకు వినూత్న పద్ధతులలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్‌ వెంటేశులు కోకన్వీనర్‌ బాబూరావు, బలిజ మహాసంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు, కేటీబీ నాయకులు జంగటి అమర్‌నాథ్‌, క్రిష్ణమూర్తి, లక్ష్మన్న, భవానీకుమార్‌, నాగలింగం, నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.ఫైనల్స్‌కు చేరిన అనంత స్పోర్ట్స్‌ అకాడమీ, గాండ్లపెంట జట్లు
* సెంచరీతో కదంతొక్కిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌లు
అనంతపురం(రాంనగర్‌), న్యూస్‌టుడే: అనంత ప్రీమియర్‌ లీగ్‌ అండర్‌-16 క్రికెట్‌ టోర్నీలో అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ, గాండ్లపెంట జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన సెమీ ఫైనల్‌ పోటీల్లో అకాడమీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌లు సెంచరీలు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చారు. అదేరోజు బి.మైదానంలో జరిగిన పోటీలో ఆత్మకూరు, అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన అకాడమీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 250 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయారు. జట్టులో క్యాప్టెన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 127 బంతుల్లో 127 పరుగులు, 19 బౌండరీలు నమోదు చేశారు. ఇతనికితోడుగా వినయ్‌కుమార్‌ 69 పరుగులు చేసి జట్టును భారీ స్కోరుకు చేర్చారు. ఆత్మకూరు జట్టు 148 పరుగులు చేసి 39.3 ఓవర్లలో ఆలౌట్‌ అయ్యారు. జట్టులో బాష 27 పరుగులు, వినయ్‌ 27 పరుగులు చేశారు. అకాడమీ బౌలర్‌ భార్గవ్‌ తన లెఫ్ట్‌ హ్యాండ్‌ స్ప్రింగ్‌ బౌలింగ్‌తో 4 వికెట్లు, గురురాఘవేంద్ర 3 వికెట్లు తీసి జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చారు.

ప్రసాద్‌ సెంచరీతో గాండ్లపెంట గెలుపు
విన్సెంట్‌ మైదానంలో గాండ్లపెంట- గుంతకల్లు జట్లు పోటీ పడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన గాండ్లపెంట జట్టు 50 ఓవర్లలో 268 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఈ జట్టులో ప్రసాద్‌ 89 బంతుల్లో 104 పరుగులు, 1 సిక్స్‌, 6 బౌండరీలతో సెంచరీ నమోదు చేశాడు. జిలాన్‌ 82 పరుగులు చేశాడు. అనంతరం గుంతకల్లు జట్టు 50 ఓవర్లలో 238 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఈ జట్టులో సురేష్‌ 89 పరుగులు, సాహుల్‌ 46 పరుగులు చేశారు. గాండ్లపెంట బౌలర్‌ ఆనంద్‌ 3 వికెట్లు తీశాడు. గాండ్లపెంట జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. ఈనెల 14న బాలుర పోటీలో అకాడమీ జట్టు, బాలికల ఫైనల్స్‌లో ఆత్మకూరు- అనంతపురం జట్లు తలపడతాయని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి బీఆర్‌ ప్రసన్న తెలిపారు.క్రీడలతో మానసికోల్లాసం
* ఆర్టీటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి
* ఆర్డీటీ ఉద్యోగుల క్రికెట్‌ టోర్రీ ప్రారంభం
రాంనగర్‌(అనంతపురం) : ఉద్యోగులు క్రీడల్లో పాల్గొంటే వారికి మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఆర్డీటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆదివారం అనంత క్రీడాగ్రామంలో ఆర్డీటీ ఉద్యోగుల క్రికెట్‌ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పేస్వామి, అమెరికన్‌ ఏంజెలీనాలు హాజరయ్యారు. ఈసందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ ఉద్యోగుల క్రీడా పోటీల ద్వారా ఒత్తిడిని జయించగలుగుతారన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ట్రాన్స్‌పోర్ట్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌, కార్యనిర్వాహక సభ్యులు నాగప్ప, రవికాంత్‌, మధుసూదనాచారి పాల్గొన్నారు.

తొలిరోజు విజేతలు కణేకల్‌- బత్తలపల్లి ఆసుపత్రి జట్లు గెలుపు

ప్రధాన మైదానంలో జరిగిన తొలిరోజు కణేకల్‌, బత్తలపల్లి ఆసుపత్రి జట్లు గెలుపొందాయి. టోర్నీలో తొలిరోజే ప్రదీప్‌ సెంచరీ సాధించడం విశేషం.బీసీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
* మార్చి 14న చలో అసెంబ్లీ
అనంతపురం, (కమలానగర్‌)న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా 50శాతం ఉన్న బీసీలు ఇప్పటివరకు సామాజికంగా, విద్యపరంగా వెనుకబడి ఉన్నారని, ఇందుకు కారణం ప్రభుత్వం బీసీలకు తగిన నిధులను కేటాయించకపోవడమేనని, ప్రభుత్వం బీసీలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ గేయానంద్‌ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీË రాష్ట్ర కన్వీనర్‌ జంబులయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్సీ గేయానంద్‌ పాల్గొని మాట్లాడుతూ లక్షల మంది చదువుకున్న యువతకు ఉపాధి లేక వీధిన పడ్డారన్నారు. ప్రభుత్వ రంగాలు బలహీనపడి, ప్రైవేటు రంగాలు బలపడినందున వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రైవేటువిద్య కరవైందన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కన్వీనర్‌ జంబులయ్య మాట్లాడుతూ 50శాతం ఉన్న బీసీలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోవడం లేదని జనాభాను బట్టి బీసీలకు నిధులు కేటాయించాలన్నారు. బీసీల అభివృద్ధి సాధనకు మార్చి 14న అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నామని జిల్లాలోని బీసీలంతా ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. వివిధ సంఘాల నాయకులు శ్రీధర్‌బాబు, ఆంజినేయులు, శ్రీకాంత్‌, పురుషోత్తం, నల్లప్ప, బాలకృష్ణ, రాయుడు, వీరభద్రప్ప, లక్ష్మినారాయణ, సాకే నరేష్‌ పాల్గొన్నారు.


ఆర్టీసీ కార్మికుల ఉద్యోగభద్రతే ప్రధాన అజెండా
* కార్మిక పరిషత్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాలనాయుడు
అనంతపురం (ఆర్టీసీ), న్యూస్‌టుడే : ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది ఉద్యోగభద్రతే ప్రధాన అజెండాగా పోరాడనున్నట్లు ఆర్టీసీ కార్మిక పరిషత్తు రాష్ట్ర కార్యదర్శి వరహాలనాయుడు పేర్కొన్నారు. ఆర్టీసీలో యూనియన్‌ గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికపరిషత్తు ఆధ్వర్యంలో ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేయనున్నట్లు ఆయన తెలిపారు. గత 10 నెలల కాలంగా కార్మికపరిషత్తు కార్మికుల పక్షాన పోరాడుతోందన్నారు. వచ్చే ఏడాది ఉద్యోగులకు కొత్త వేతన సవరణ చట్టం కొత్త వేతన స్కేలు సాధిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత కార్మికపరిషత్తుదేనన్నారు. యూనియన్‌ ముఖ్యంగా ఉద్యోగభద్రత, పనిభారం, ఆర్టీసీ సిబ్బంది పదవీవిరమణ పొందేలోగా వారికి సొంత ఇళ్లు నిర్మించేలా పోరాడుతుందన్నారు. ప్రతీ జిల్లాలో కార్పొరేట్‌ ఆసుపత్రి, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేందుకు పోరాడనున్నట్లు తెలిపారు. ప్రారంభమైన అనతికాలంలోనే 18వేల మంది సభ్యత్వంతో కార్మికపరిషత్తు దూసుకుపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికపరిషత్తు రాష్ట్ర ఉపాద్యక్షుడు షరీఫ్‌, టీఎన్‌టీయూసీ జిల్లా అద్యక్షుడు దేవళ్లమురళి, కార్మికపరిషత్తు రీజినల్‌ కార్యదర్శి ఈడీ ఆంజనేయులు, చీప్‌వైస్‌ ప్రెసిడెంట్‌ విశ్వనాథరెడ్డి, ఆంజనేయులు, సత్యమయ్య నారాయణ పాల్గొన్నారు.


ఇంటి పట్టాలా.. డబ్బు చెల్లింపులా?
* కోదండరామస్వామి మాన్యం భూముల బాధితుల గగ్గోలు
* గృహ నిర్మాణ అనుమతులకు తీవ్ర ప్రయత్నాలు
పామిడి, న్యూస్‌టుడే: గుంతకల్లు తిమ్మనచెర్ల శ్రీకోదండరామస్వామి దేవాలయానికి సంబంధించి పామిడిలో ఉన్న మాన్యం భూమి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లుగా వ్యవహారం న్యాయస్థానంలో నలుగుతుండటంతో కొనుగోలు చేసినవారు సదరు వ్యాపారిపై ఒత్తిడి తెస్తున్నారు. గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని, లేకపోతే డబ్బు తిరిగి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

వివాద నేపథ్యమిదీ..
పామిడి పట్టణ నడిబొడ్డున సర్వే నెంబర్లు 818-ఏ, 819-బీ, 820-బీ, 821, 823-ఏ, 823-సీలో కలిపి మొత్తం 3.79 ఎకరాల దేవాలయ మాన్యం ఉంది. ఇందులో 1.14 ఎకరాల్లో భవన సమూదాయాలు ఉన్నాయి. మిగతా 2.55 ఎకరాల స్థలాన్ని పట్టణానికి చెందిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా గుత్తికి చెందిన ఎనిమిది మందికి విక్రయించారు. ఈ వ్యవహారంపై 2007 అక్టోబర్‌ 7న ‘ఈనాడు’లో ‘దేవాలయ మాన్యం భూమిపై కన్ను’ కథనం వెలువడగా దేవాదాయశాఖ అధికారులు స్పందించి రాష్ట్ర ఎండోమెంట్‌ న్యాయ స్థానంలో వాజ్యం వేశారు. విచారణ అనంతరం భూమి ఆలయానికి చెందినదేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో మాన్యం భూమిని కొనుగోలు చేసిన ఎనిమిది మంది హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో వాజ్యం నడుస్తున్నట్లు సమాచారం.

టోకన్‌ అగ్రిమెంట్‌ కింద విక్రయం
ఇదిలా ఉండగా మాన్యం భూమిని కొనుగోలు చేసిన ఎనిమిది మంది ఎలాగైనా వదిలించుకోవాలని భావించి పామిడికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి టోకన్‌ అగ్రిమెంట్‌ కింద విక్రయించారు. అయితే అదే సమయంలో ఆ భూమికి సంబంధించి గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని నగర పంచాయతీ కార్యాలయానికి, క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేయరాదని పామిడి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఎండోమెంట్‌ న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఏడేళ్లుగా సదరు సర్వే నెంబర్లలో క్రయ విక్రయాలు, గృహ నిర్మాణాలను అనుమతులు లభించడం లేదు.

కొనుగోలుదారులను మభ్యపెట్టి..
భూమిని కొనుగోలు చేసిన పామిడి భూ వ్యాపారి దానిని విక్రయించి సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో మాన్యం భూమికి ఉత్తరాన ఉన్న పొలం సర్వే నెంబర్లను రాయించి ప్లాట్లుగా చూపి ఐదేళ్ల కిందట విక్రయించినట్లు సమాచారం. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులను మభ్యపెట్టి రూ. లక్షలు దండుకొని దొడ్డిదారిన చాలా మంది పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. కొనుగోలు చేసిన వారు గృహ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఐదేళ్లుగా అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో వారు వ్యాపారిపై ఒత్తిడి తేగా.. ఎలాగైనా అనుమతులు సంపాదిస్తానని మభ్యపెడుతూ వస్తున్నాడు.

వ్యాపారిపై ఒత్తిళ్లు..
వ్యాపారి గృహ నిర్మాణాలకు అనుమతులను ఇప్పించాలంటూ ప్రధాన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఏళ్లుగా అనుమతులు లభించకపోవడంతో కొనుగోలుదారులు సదరు భూ వ్యాపారిపై ఇటీవల తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలిసింది. గొడవ కూడా జరిగినట్లు సమాచారం. మోసం చేసి విక్రయించినందుకు ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న రేటు ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండు చేస్తున్నట్లు తెలిసింది. అయితే వడ్డీతో చెల్లిస్తానని ఆ వ్యాపారి చెబుతున్నట్లు సమాచారం. వారు ఒప్పుకోనట్లు తెలిసింది. సదరు వ్యాపారి ఇటీవలే ఓ దేవాలయ కమిటీలో సభ్యత్వం సంపాదించారు. ఇదే అదునుగా అనుమతుల కోసం స్థానిక నాయకులతో కలిసి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అనుమతులు ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వాలని పట్టణ ప్రజలు, భక్తులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను కోరుతున్నారు.


Untitled Document
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net