శుక్రవారం, జనవరి 20, 2017

పర్యాటక ప్రదేశాలు

ctrtourisam


జిల్లా పర్యాటకరంగాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా టూరిజం అధికారులు అమరావతి, సూర్యలంక ప్రాంతాల వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు.
విజ్ఞానం.. వినోదం కలబోత హాయ్‌ల్యాండ్‌

హాయ్‌ల్యాండ్‌ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న స్వాగత బొమ్మలు
విజ్ఞానంతోపాటు వినోదం కూడా అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన బుద్ధిజం థీమ్‌ పార్కు హాయ్‌ల్యాండ్‌. విజయవాడ, గుంటూరు నగరాల నడుమ మంగళగిరి మండలం చినకాకాని గ్రామపరిధిలో సువిశాల 40 ఎకరాల విస్తీర్ణంలో హాయ్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేశారు. 2010 మే 9న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య హాయ్‌ల్యాండ్‌ను ప్రారంభించారు. సన్‌ప్లాజా, చైనా, కాంబోడియా, థాయ్‌ల్యాండ్‌, టిబెట్‌, బర్మా, ఇండోనేసియా, జపాన్‌ జోన్లుగా నామకరణం చేశారు. ఆయా దేశాల సంస్కృతి ప్రతిబింబించేలా కట్టడాలను తీర్చిదిద్దారు. స్త్రీ, పురుషులు, పిల్లలకు ప్రత్యేకంగా జలక్రీడలు (వాటర్‌గేమ్స్‌) ఉన్నాయి. వేవ్‌పూల్‌, లేజీరివర్‌, రెయిన్‌ డ్యాన్స్‌ వంటివి సరదా కలిగిస్తాయి. రైల్‌ఛేజ్‌, గోస్ట్‌ హంటర్‌, మ్యాజిక్‌ డ్యాన్సర్‌, బఫింగ్‌కార్స్‌, ఫ్లైయింగ్‌ ఎలిఫెంట్‌, ప్రైవేట్‌షిప్‌, క్రేజీజంప్‌ స్వింగ్‌ ఏరియంట్‌, ఫ్యామిలీ ట్రైన్‌, గోకార్టింగ్‌, వీడియోగేమ్స్‌ వినోదాన్ని పంచుతాయి. అన్ని విభాగాలకు మధ్యలో ఫుడ్‌కోర్టు ఉంది. వివిధ రకాల భారతీయ వంటకాలు ఘుమఘుమలాడతాయి. చైనాబజార్‌ తరహాలో షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. రిసార్ట్స్‌ విభాగంలో మొత్తం 61 అధునాతన కాటేజీలు పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. హాయ్‌ల్యాండ్‌లో ఆయుర్‌సుఖ్‌ ఆరోగ్యగ్రామాన్ని 2011 ఏప్రిల్‌ 9న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సుభోద్‌ కాంత్‌ సహాయ్‌ ప్రారంభించారు. పంచకోశ, పంచకర్మ, త్రికాయ చికిత్సలతో పాటు, యోగా, ఫిజియోథెరపీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 20 లగ్జరీ కాటేజీలు చికిత్సలు పొందే వారికోసం సిద్ధం చేశారు.

షాపింగ్‌ మాల్స్‌, ఫుడ్‌ కోర్టు

సందర్శన వేళలు
హాయ్‌ల్యాండ్‌ బుధవారం నుంచి సోమవారం వరకూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తారు. మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. పార్కులో వాటర్‌ గేమ్స్‌ సాయంత్రం 6 గంటలకు, మెకానికల్‌ రైడ్స్‌ 7 గంటలకు నిలిపేస్తారు.


బఫింగ్‌ కార్స్‌లో ఆటలాడుతున్న చిన్నారులు
చేరుకునేదిలా..
విజయవాడ నగరం నుంచి 47 హెచ్‌ సిటీ సర్వీసు చినకాకాని హాయ్‌ల్యాండ్‌ వరకూ నడుపుతున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే బస్సు చినకాకాని హాయ్‌ల్యాండ్‌ వద్ద ఆగుతుంది. అక్కడి నుంచి కిలోమీటరున్నర దూరంలో హాయ్‌ల్యాండ్‌ పార్కు ఉంటుంది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు
ఏనాడు ఏ శిల్పీ కన్నాడో ఈ కలనూ.. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఆ కళనూ.. అంటూ ఓ సినీ గేయరచయిత రాసిన మాటలు ఉండవల్లి గుహాలయాలను చూస్తే నిజమేననిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఓ కొండలో ఏకశిలపై చెక్కి ఉన్నాయి. అజంతా, ఎల్లోరా శిల్పాలను తలదన్నే కళా నైపుణ్యం ఉండవల్లి గుహల్లో నిక్షిప్తమై ఉంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత చారిత్రాత్మకమైన ఈ గుహలు క్రీ.శ. 2, 3 శతాబ్దంలో బౌద్ధమత ప్రచారం జరుగుతున్న రోజుల్లో వీటిని నిర్మించారు. ఆనంద గోత్రికులు పరిపాలన కాలంలో, విష్ణుకుండిన రాజు గోవిందరాజవర్మ బౌద్ధ బిక్షువుల కోసం ఈ గుహలను నిర్మించారని ప్రతీతి. నాలుగు అంతస్తులుగా చెక్కిన గుహల్లో 64 స్తంభాలతో ఖానాలుగా మలిచారు. మొదటి అంతస్తులో 14 గుహలున్నాయి. త్రిమూర్తుల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. రెండో అంతస్తులో అనంతశయన శ్రీమహా విష్ణువు ఆలయముంది. ఇందులో ఐదడుగుల వెడల్పు, 19 అడుగుల పొడవుగల అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం శయనించినట్లు ఉంటుంది. మూడో అంతస్తులో త్రికూటాలయం ఉంది. వీటిపై శిల్పకళలు చాళుక్యుల కాలం నాటివిగా చెబుతారు. ఉండవల్లి నుంచి మంగళగిరిలోని పానకాల లక్ష్మీనృసింహస్వామి కొండవరకు తొమ్మిది కిలోమీటర్లు సొరంగ మార్గం ఉందని చరిత్ర ద్వారా తెలుస్తోంది.. మునీశ్వరులు, బౌద్ధ భిక్షువులు కృష్ణానదిలో స్నానాలు చేసి ఉండవల్లి గుహల్లో నుంచి ఉన్న సొరంగమార్గం ద్వారా మంగళగిరిలోని కొండపైన పానకాలస్వామిని దర్శించుకునేవారని చరిత్ర స్పష్టం చేస్తోంది. 6, 7 శతాబ్దాల కాలం వరకు ఈ గుహలు రాజపోషణలో ఉన్నాయి. 1529లో (16వ శతాబ్దం) శ్రీకృష్ణ దేవరాయల పాలనలోకి వచ్చాయి. ఈ గుహాలయాలు వివిధ రాజుల కాలంలో అనేక మార్పులకు లోనైనట్లు పురావస్తుశాఖ దస్త్రాల్లో ఉంది. ఈ గుహలకు ఉన్న స్తంభాలపై పూర్ణకుంభం చిత్రించి ఉంటుంది. దీనినే అనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా గుర్తించినట్లు చెబుతారు. 1959లో గుహాలయాలు పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చాయి.

అనంతపద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం

ఉండవల్లి గుహాలయాలకు గుంటూరు, విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరి.. అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవల్లి కూడలికి చేరుకుని.. ఎడమ పక్కకు తిరిగి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు దర్శనమిస్తాయి. విజయవాడ నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రకాశం బ్యారేజీ దాటిన తరువాత ఉండవల్లి కూడలి చేరుకుని కుడి వైపునకు మూడు కిలో మీటర్లులోనికి వెళితే ఉండవల్లి గుహలు ప్రత్యక్షమవుతాయి.

సందర్శన వేళలు
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం. వివరాలకు పురావస్తు శాఖాధికారి ఫోన్‌ నంబరు 0866-2422763ను సంప్రదించవచ్చు.
భవానీ ద్వీప సందర్శన ఓ మధురానుభూతి

భవానీ ఐలాండ్‌
గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన కృష్ణానది పరవళ్ళ మధ్యలో భవానీ ద్వీపం విస్తరించి ఉంది. ఈ ద్వీపాన్ని సందర్శించాలంటే మూడు కిలోమీటర్లు కృష్ణానది నీటిలో మెకనైజ్డ్‌ బోట్ల ద్వారా ప్రయాణించాలి. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో పర్యాటక సంస్థ బోటులను ఏర్పాటు చేసింది. ఐలాండ్‌లో ఏసీ కాటేజీలు నిర్మించారు. 26 కాటేజీల్లో 24 ఏసీ, మిగిలినవి ట్రీకాటేజీ (ఒంటి స్తంభం గది)లు నిర్మించారు. యాత్రికులు బస చేసేందుకు అనువుగా వీటిని నిర్మించారు. ఏసీ కాటేజీ అద్దె రూ.2100, ట్రీ కాటేజీ రూ.1560, చిన్నారుల ఆటపాటల కోసం అడ్వంచర్‌ గేమ్స్‌ సదుపాయముంది. పర్యటకులను ఆకర్షించే విధంగా ఐలాండ్‌లో 40 అడుగుల ఆకర్షణీయమైన ద్వీపస్తంభాన్ని (టవర్‌) నిర్మించారు. దీనిపై జీవకళ ఉట్టిపడే పలురకాల బొమ్మలున్నాయి.

బోటు షికారు
ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన కృష్ణానదిలో పర్యాటక శాఖ బోటు షికారుని ఏర్పాటు చేసింది. ఆహ్లాదకరమైన వాతావరణం గలగలా పారే కృష్ణమ్మ అలలపై బోటు షికారు ఎంతో ఆనందాన్నిస్తుంది. స్పీడుబోటు, బోధిసిరి, ఆమ్రపాలి, కృష్ణవేణి వంటి మెకనైజ్డ్‌ బోట్లు నదిలో విహారానికి ఉపయోగిస్తారు.


ఐలాండ్‌లో 40అడుగుల టవర్‌

వివరాలకు 08645-272382, 9848629342 సంప్రదించవచ్చు.
భవానీ ఐలాండ్‌లో వివరాలకోసం 9848779685
బెరంపార్క్‌ హరిత హోటల్‌ (పున్నమి) వివరాలకోసం 9848779686కు సంప్రదించవచ్చు.
కోటప్పకొండ

నరసరావుపేట నియోజకవర్గంలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ. నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడుని దక్షిణామూర్తిగా భావిస్తారు.
నాగార్జునసాగర్‌

మాచర్ల నుంచి 25 కి.మీ. దూరంలోని నాగార్జునసాగర్‌కు ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. హైదరాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, భద్రాచలం బస్సులు మాచర్ల నుంచి సాగర్‌ మీదుగా వెళ్తుంటాయి.  హైదరాబాద్‌ నుంచి 150 కి.మీ దూరంలో నాగార్జునసాగర్‌ ఉంది. ఎత్తిపోతల, అనుపు, నాగార్జునకొండ మ్యూజియానికి మాచర్ల నుంచి వెళ్లేందుకు ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
చెరుకుపల్లిలో..


స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా జిల్లాలోని వినయాశ్రమానికి ఒక ప్రత్యేక స్ధానం ఉంది. స్వాతంత్ర సమపార్జనే ధ్యేయంగా ఆనాడు గాంధీజీ చేస్తున్న ఉద్యమానికి ప్రేరేపితులైన కావూరు గ్రామానికి చెందిన తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు స్వామి సీతారామ్‌ ఆదేశాల మేరకు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాక తమకున్న యావదాస్తులను స్వాతంత్ర సమపార్జనకే వెచ్చించాలనే లక్ష్యంతో కావూరులో ఆశ్రమాన్ని స్ధాపించారు. వీరి దేశభక్తికి మెచ్చి గాంధీజీ గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు 23.12.1933లో ఆశ్రమానికి శంకుస్ధాపన చేశారు. అప్పట్నించి దేశభక్తిని ప్రబోధిస్తూ ఆశ్రమంలో పలు కార్యక్రమాలు చేపట్టి దానిని స్వాతంత్ర సమరయోధుల కార్ఖానాగా తీర్చిదిద్దారు. అంతేకాక కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఆశ్రమవాసులు నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. స్వాతంత్రం సిద్ధించిన తరువాత ఆశ్రమాన్ని మరింత ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించేందుకు ఆశ్రమానికి ఉన్న ఆస్తులను కొంత బాలికల గురుకుల పాఠశాలకు, కొంత కృషివిజ్ఞాన్‌ కేంద్రానికి దానం చేశారు. ఎంతో పవిత్రమైన వినయాశ్రమాన్ని అప్పట్నించి ఇప్పటివరకు ఎందరో మహనీయులు సందర్శించారు. భారతదేశ రాష్ట్రపతులు బాబూ రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి వంటి వారే కాక మన రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ వినయాశ్రమాన్ని సందర్శించినవారే. ఆశ్రమ శంకుస్ధాపన సమయంలో ఆనాడు గాంధీ నాటిన చిన్నరావి మొక్క నేడు పెద్ద వృక్షంగా మారి సందర్శకులకు ఆనాటి జ్ఞాపకాలను స్ఫురణకు తెస్తుంది.


గుత్తికొండ బిలం.. దైద అమరలింగేశ్వరుడు..

పిడుగురాళ్లకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికొండ బిలం నియోజకవర్గంలో ప్రధాన పర్యాటక ప్రాంతం. చుట్టూ పర్వతశ్రేణి.. మధ్యలో బిల సముదాయం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ బిల ప్రాంతంలోకి అడుగుపెట్టడంతోనే ఆధ్యాత్మికత పలకరిస్తుంది. ప్రధాన బిలం నుంచి లోపలకు వెళ్తే 101 బిలాలు ఉన్నాయని చెపుతారు. ఇంకా ముందుకెళ్తే గరళం సేవించే శివుడి విగ్రహం ఉందని అంటారు. పల్నాడు యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు ఈ బిలంలోకి వెళ్లినట్లు కథనం ఉంది. గురజాలకు 13 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది తీరాన అమరలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. సొరంగ మార్గంలో స్వయంభువుగా వెలసిల్లిన అమరలింగేశ్వరుడు భక్తుల పూజలందుకుంటూ భాసిల్లుతున్నాడు. సొరంగ మార్గంలో 400 మీటర్ల వరకు ప్రయాణం చేసి శివలింగాన్ని సందర్శించుకోవల్సి ఉంటుంది.
దైదబిలం..

గురజాలకు 13 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది తీరాన అమరలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. సొరంగ మార్గంలో స్వయంభువుగా వెలసిల్లిన అమరలింగేశ్వరుడు భక్తుల పూజలందుకుంటూ భాసిల్లుతున్నాడు. ప్రతి సోమవారం భక్తులు ఇక్కడకు వచ్చి శివలింగాన్ని దర్శించి పూజలు చేస్తారు. శివరాత్రికి భారీ ఎత్తున భక్తజనం చేరుకుంటారు. సొరంగ మార్గంలో స్వయంభువుగా వెలియడంతో భక్తులు గతంలో ప్రమిదల వెలుగులో సందర్శించుకునే వారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. సొరంగ మార్గంలో 400 మీటర్ల వరకు ప్రయాణం చేసి శివలింగాన్ని సందర్శించుకోవల్సి ఉంటుంది. ఆలయం సందర్శించడం, శివలింగాన్ని పూజించడం గొప్ప అనుభూతిని నింపుతుంది.

భట్టిప్రోలు బౌద్ధస్థూపం

వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో బౌద్ధస్థూపం ముఖ్యమైన పర్యాటక కేంద్రం. కీ.శ. 1870లో భాసిక్‌ అనే ఈస్టు ఇండియా కంపెనీ అధికారి భట్టిప్రోలులో బౌద్ధస్థూపం ఉన్నట్లు గుర్తించారు. 1892లో అలెగ్జాండరు అనే బ్రిటిష్‌ అధికారి తవ్వకాలు జరిపి సంపూర్ణ స్థూపాకృతిని వెలికితీశారు. జిల్లాలో అమరావతి క్షేత్రం తర్వాత భట్టిప్రోలు బౌద్ధస్థూపానికి పేరుంది. విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. 2009లో రూ.30 లక్షలతో స్థూపం చుట్టూ పూర్వ ఆకారాన్ని తీసుకొచ్చే పనులు చేశారు. గుంటూరు నగరానికి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సూర్యలంక తీరం
సూర్యలంక బీచ్‌: జిల్లా కేంద్రం గుంటూరు నుంచి 56 కిలోమీటర్లు, బాపట్లకు 8 కి.మీ. దూరంలో బంగాళాఖాతం ఒడ్డున సహజ సిద్ధమైన బీచ్‌ ఉంది. పర్యాటకుల వసతి కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అతిథిగృహాలను నడుపుతున్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కొండవీడుకోట, చెంఘీజ్‌ఖాన్‌పేట, వెన్నముద్దల వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నాయి.
గుంటూరు నగరం నుంచి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు బస్సు సౌకర్యం.. వివరాలు
అమరావతి
విశిష్టత : బౌద్ధుల శిల్పకళ, అమరలింగేశ్వరస్వామి దేవాలయం
* దూరం : 35కి.మీ
* గుంటూరు నుంచి అమరావతి వెళ్లేందుకు ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు కలదు.

మంగళగిరి
విశిష్టత : పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
* దూరం : 20 కి.మీ.
* గుంటూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఓ బస్సు

ఉండవల్లి
విశిష్టత : కొండలలో బౌద్దుల శిల్పకళ
* దూరం : 32 కి.మీ.
* గుంటూరు నుంచి విజయవాడ వెళ్లి, అక్కడ నుంచి వెళ్లాలి.

పొన్నూరు
విశిష్టత : భావన్నారాయణ స్వామి దేవాలయం
* దూరం : 30 కి.మీ
* గుంటూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు

కోటప్పకొండ
విశిష్టత : త్రికోటేశ్వరస్వామిదేవాలయం
* దూరం : 60 కి.మీ.
* గుంటూరు నుంచి నర్సరావుపేట, చిలకలూరిపేట మీదుగా

కారంపూడి
విశిష్టత : పల్నాటి వీరుల గుడి
* దూరం : 87 కి.మీ
* గుంటూరు నుంచి నర్సరావుపేట, మాచర్ల మీదుగా కారంపూడి చేరుకోవాలి.

మాచర్ల
విశిష్టత : చెన్నకేశవస్వామిదేవాలయం
* దూరం : 127 కి.మీ
* గుంటూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు

ఎత్తిపోతల
విశిష్టత : జలపాత విహారం
* ఎత్తిపోతలకు చేరుకునేందుకు మాచర్ల మీదుగా వెళ్లాలి.

కొండవీడు
విశిష్టత : రెడ్డిరాజుల చారిత్రక స్థలం
* దూరం : 25 కి.మీ
* గుంటూరు నుంచి ఫిరంగిపురం చేరుకొని అక్కడ నుంచి వెళ్ళవలసి ఉంటుంది.

నాగార్జునసాగర్‌
విశిష్టత : బౌద్ధుల విద్యాకేంద్రం
* దూరం : 162 కి.మీ
* గుంటూరు నుంచి మాచర్ల మీదుగా నాగార్జున సాగర్‌ చేరుకోవలసి ఉంటుంది

చేజర్ల
విశిష్టత : కపోతేశ్వరాలయం
* దూరం : 68 కి.మీ

గుత్తికొండ
విశిష్టత : గుత్తికొండ బిలం
* దూరం : 83 కి.మీ
* గుంటూరు నుంచి నర్సరావుపేటకు చేరుకొని అక్కడ నుంచి వెళ్లవలసి ఉంటుంది.

పెదకాకాని
విశిష్టత : భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం
* దూరం : 6 కి.మీ
* ప్రతి ఐదు నిమిషాలకు ఓ బస్సు

చేబ్రోలు
విశిష్టత : భీమేశ్వర స్వామి దేవాలయం
* దూరం : 16 కి.మీ
* గుంటూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు కలదు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.