Tuesday, February 09, 2016
Untitled Document


Untitled Document
అద్భుత ప్రయోగం.. ఆరంభ శూరత్వం
వాహన బీమా పునరుద్ధరణ ప్రక్రియకు గ్రహణం
ఈనాడు, హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదాలెప్పుడైనా సరే చెప్పి రావు. రహదారిపై మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదురుగా వచ్చే వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపి మనపైకి దూసుకు రావొచ్చు. అదృష్టం మన వైపు లేకుంటే నిండుప్రాణాలే గాల్లో కలవొచ్చు. విధి రాతను తప్పించడం అసాధ్యం కాబట్టి.. కనీసం ముందు జాగ్రత్తతోనైనా మనల్నే నమ్ముకున్న కుటుంబసభ్యులకు ఆర్థిక చేయూతనందించే అవకాశముందనేది నగ్నసత్యం. కొత్త వాహనం కొన్న తర్వాత బీమా లేకుంటే రిజిస్ట్రేషన్‌ జరగదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బీమా చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించే విషయాన్ని చాలా మంది వాహనదారులు గాలికొదిలేస్తున్నారు. తత్ఫలితంగా ఏటా జరుగుతున్న రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు ఎలాంటి బీమా సొమ్ము అందక వీధిన పడే దుస్థితి నెలకొంటోంది. ఈ దురవస్థను తప్పించేందుకు చేపట్టిన అద్భుత ప్రయోగం ఆరంభశూరత్వంగా మిగలడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రయోగాత్మకం.. ఫలవంతం
ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా(ఐఐబీ) సంస్థ ప్రతినిధులు ఏడాదిన్నర క్రితం సైబరాబాద్‌ పోలీసులను కలిశారు. బీమా సౌకర్యం లేకపోవడం వల్ల వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరించారు. రహదారి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా బీమా సొమ్ము అందక కుటుంబాలు నష్టపోతున్నాయని వివరించారు. ఈ అంశంపై సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ట్రాఫిక్‌ డీసీపీ అవినాశ్‌ మహంతి సానుకూలంగా స్పందించడంతో బృహత్తర ప్రణాళిక పట్టాలెక్కింది. ఐఐబీ.. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఐఆర్‌డీఏ) కనుసన్నల్లో నడిచే సంస్థే కావడంతో పోలీసులు సైతం మొగ్గు చూపారు. ఈక్రమంలో తొలుత ఆర్టీఏ అధికారులను సంప్రదించి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని చిరునామాలతో నమోదై ఉన్న వాహనాల వివరాలను సేకరించారు. దీనికితోడు వాహనాల పుట్టుపూర్వోత్తరాలతో ఐఐబీ రూపొందించిన వి-సేవ(వాహన్‌ సేవ) ప్రాజెక్టు వల్ల వివరాల సేకరణ సులభమైంది. ఇలా కమిషనరేట్‌లో దాదాపు 7లక్షల అన్ని రకాల వాహనాల్లో సుమారు 1.89 లక్షల వాహనాలకు బీమా లేనట్లు తేల్చారు. అనంతరం ఆయా చిరునామాలకు ఈ-చలానాలు పంపించడం ప్రారంభించారు. అలాగే రహదారులపై తనిఖీల సమయంలో బీమా లేని వాహనాలను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అలా ఆపిన సందర్భాల్లో వాహనదారులకు బీమాపై అవగాహన కల్పించేందుకు ఐఐబీ సహకారంతో 24 సంస్థల ప్రతినిధుల్ని నెల రోజులపాటు మోహరింపజేశారు. ఆ సమయంలో జంటనగరాల్లో వంద కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నంలో సైబరాబాద్‌ పోలీసులు అప్పట్లోనే దాదాపు 20వేల వాహనాల బీమాను పునరుద్ధరించగలిగారు. ఆ అసాధారణ విజయంతో అబ్బురపడ్డ ఐఐబీ ప్రతినిధులు ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. తొలుత హైదరాబాద్‌ కమిషనరేట్‌తోపాటు దిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు.

అదే స్ఫూర్తి కరవు
దేశవ్యాప్తంగా అమలు చేయాలనే యోచనకు సైబరాబాద్‌లో బీజం పడినప్పటికీ.. తర్వాత కాలంలో ఆ స్ఫూర్తి కొరవడింది. అవగాహన అనంతరం భారీగా జరిమానాలు విధించడం ద్వారా వాహనదారుల్లో బీమా పునరుద్ధరణపై చైతన్యం తీసుకురావాలని అప్పట్లో భావించారు. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం ప్రతి వాహనానికి కనీసం థర్డ్‌పార్టీ బీమా పాలసీ అయినా లేకుంటే రూ.వెయ్యి చొప్పున జరిమానాతోపాటు కారాగార శిక్ష విధించేందుకు అవకాశముంది. దీనికితోడు సవరించిన మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం బీమా లేని ద్విచక్రవాహనానికి రూ.10వేలు, ఆటోలకు రూ.25వేలు, ట్రక్కుల్లాంటి భారీ వాహనాలకు రూ.75వేల వరకు జరిమానాతోపాటు అవసరమైతే వాహనాన్ని జప్తు చేయడమే కాకుండా జైలుశిక్ష విధించే నిబంధన అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. తర్వాతి కాలంలో సైబరాబాద్‌ పోలీసులు ఇతర విధుల్లో నిమగ్నం కావడంతోపాటు ఐఐబీ సంస్థ ప్రతినిధులు తొలుత చూపిన చొరవను ప్రదర్శించకపోవడంతో ప్రస్తుతం పునరుద్ధరణ ప్రక్రియకు గ్రహణం పట్టినట్లయింది.రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
భువనగిరి, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని వివేరా హోటల్‌ వద్ద ఆగి ఉన్న పోలీస్‌ వాహనాన్ని ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ సీఐ శంకర్‌ తెలిపిన కథనం ప్రకారం..నగరంలోని ఉప్పల్‌లో నివాసం ఉంటున్న చింగిచర్ల బిక్షపతి (35), తన అల్లుడు రాము(15)తో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్‌ జిల్లా లింగాల ఘనపూర్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమీప బంధువులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చి మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరివద్ద బెల్లం ముద్దలు లభ్యం కావడంతో సమ్మక్క సారళక్క జాతరకు వెళ్లి వస్తున్నట్టుగా భావిస్తున్నారు.

మరో ఘటనలో లెక్చరర్‌...
చాదర్‌ఘాట్‌(క్రైం): మూసారాంబాగ్‌ ప్రశాంత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఎం.కిషన్‌రావు(54) విద్యానగర్‌లోని కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజిలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం కోఠి నుంచి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన నీటి ట్యాంకర్‌ బలంగా ఢీ కొట్టింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్‌పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.8 మంది బల్దియా ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు
శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: గ్రేటర్‌ పశ్చిమ మండలం పరిధిలోని 8 మంది ఉద్యోగులను గ్రేటర్‌ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ మండలం శేరిలింగంపల్లి సర్కిల్‌-11, 12, కూకట్‌పల్లి సర్కిల్‌- 14బీ కి చెందిన ఉద్యోగులు శనివారం ఖానామేట్‌లోని ఫాతిమా అతిథి గృహంలో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మోతాదుకి మించి మద్యం తాగి ముంబయి నుంచి వచ్చిన యువతులతో భారీ డీజే సౌండ్‌తో అశ్లీల నృత్యాలు చేయడం ఆరంభించారు. ఈ విషయం శనివారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులకి సమాచారం అందింది. మాదాపూర్‌ పోలీసులతో కలిసి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పశ్చిమ మండలానికి చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలుసుకున్న గ్రేటర్‌ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి వెంటనే పశ్చిమ మండలం జోన్‌ కమిషనర్‌ గంగాధర్‌రెడ్డికి శనివారం రాత్రి ఫోన్‌ చేశారు. ఘటనకి సంబంధించిన అంశంపై వివరణ కోరారు. ఈ వ్యవహరంపై నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం జోనల్‌కమిషనర్‌ గంగాధర్‌రెడ్డి కూకట్‌పల్లి సర్కిల్‌- 14బీ ఉప కమిషనర్‌ రవీందర్‌ కుమార్‌, సర్కిల్‌-11 ఉప కమిషనర్‌ మనోహర్‌, సర్కిల్‌-12 ఉప కమిషనర్‌ మమతల నుంచి వివరాలు తీసుకున్నారు. మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారికి వివరాల ప్రకారం ఆయా సర్కిళ్ల నుంచి నివేదిక తీసుకున్న జోన్‌ కమిషనర్‌ గ్రేటర్‌ కమిషనర్‌కి నివేదిక అందించారు. గంగాధర్‌రెడ్డి, ఆయా సర్కిళ్లకి చెందిన ఉప కమిషనర్లతో చర్చించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నానికి ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు చేశారు. ఈ మేరకు కూకట్‌పల్లి సర్కిల్‌-14బీ కి ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రుడు, శేరిలింగంపల్లి సర్కిల్‌- 11 ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కుమార్‌, శేరిలింగంపల్లి సర్కిల్‌-12కి చెందిన ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పద్మభూషన్‌రావు, బిల్‌కలెక్టర్‌ బాబూరావు, సర్కిల్‌-11కి చెందిన బిల్‌కలెక్టర్లు కృష్ణ, నరహరి, జ్ఞానేశ్వర్‌, రణవీర్‌ భూపాల్‌ ఉన్నారు.


పోలీసు ఠాణాల్లో జిమ్‌.. ఈ ఏడాదే శ్రీకారం
నారాయణగూడ, న్యూస్‌టుడే: ఉద్యోగమే కాదూ.. ఆరోగ్యమూ ప్రధానమే. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలీసు ఠాణాలో జిమ్‌ పరికరాలను అందజేస్తామని నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది నుంచే ఈ బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. నగర పోలీసు (మధ్యమండలం) ఆధ్వర్యంలో కేర్‌ ఆసుపత్రి సహకారంతో ఆదివారం నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కోసం ‘మెగా హెల్త్‌’ క్యాంప్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిథి మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ.. మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశమే కాదూ.. జీవితం ఫలప్రదమవుతుందన్నారు. కేర్‌ డీజీఎం డాక్టర్‌ మహేశ్‌, మధ్యమండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్‌రావు, కేర్‌ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ నిర్మల్‌కుమార్‌, డాక్టర్‌ రాధామనోహర్‌, డా.గోవర్థన్‌, డా.సునంద, రణబీర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా అబిడ్స్‌ పోలీసు ఠాణా పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ బిల్డింగ్‌ వ్యాపారుల పక్షాన రూ.2 లక్షలపైచిలుకు చెక్కును కమిషనర్‌కు వ్యాపారులు అందజేశారు. మధ్యమండలంలోని తొమ్మిది పోలీసు ఠాణాల పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.


ఫర్నీచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం
రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఫర్నీచర్‌ దుకాణంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగి సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ మంజు థియేటర్‌ ఎదురుగా ఉండే క్యాచి ఫర్నిచర్‌ షోరూమ్‌ను మహేంద్రహిల్స్‌కు చెందిన రణ్‌బీర్‌సింగ్‌ గాంధీ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి షోరూమ్‌ను మూసివేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి రాత్రి 12.30, ఒంటి గంట ప్రాంతంలో షోరూమ్‌కు చెందిన 3వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7 అగ్నిమాపక శకటాలను, వాటర్‌ ట్యాంకర్లను రప్పించారు. మంటలు అదుపులోకి వచ్చే సమయానికి భవనంలోని రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లోని షోరూమ్‌ మొత్తం తగలబడి ఫర్నిచర్‌ అంతా బూడిదైంది.


రసాయనాలతో అరటికాయల మగ్గింపు
నిందితుల అరెస్ట్‌.. సరకు స్వాధీనం
మూసాపేట: రసాయనాలతోఅరటి కాయలను మగ్గబెడుతున్న ఇద్దరిని కూకట్‌పల్లి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఎడ్ల రాజు(35) కొన్నాళ్లుగా అరటి పండ్ల గోదాము నిర్వహిస్తున్నాడు. నిషేధిత రసాయనాల్ని వినియోగించి అరటి గెలలను అతడు మగ్గబెడుతున్నట్లు సమాచారం అందింది. ఎస్సై ఎస్‌.వెంకన్న, ఎస్‌ఓటీ ఎస్సై శివ తమ సిబ్బందితో గోదాముపై దాడులు నిర్వహించారు. కాయలపై ‘ట్యాగ్‌ఫాన్‌ 39’ అనే రసాయనం పిచికారీ చేస్తున్నట్లు గుర్తించారు. 12 రసాయన డబ్బాలు, 4 పిచికారీ యంత్రాలు, 125 గెలలను స్వాధీనం చేసుకున్నారు. రాజు, అతడి సహాయకుడు రమణను అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఆహార ఇన్‌స్పెక్టర్‌ మూర్తిరాజు పండ్లను ప్రయోగశాలకు పంపారు.


అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న 525 గ్రాముల బంగారాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రమంలో కస్టమ్స్‌ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి వచ్చాడు. బంగారాన్ని కాగితపు రూపంలో తయారుచేసి బ్రీఫ్‌ కేస్‌ హండిల్‌గా అమర్చాడు. అనుమానం కలిగిన కస్టమ్స్‌ అధికారులు బ్రీఫ్‌ కేస్‌ను స్కానింగ్‌ చేయగా అక్రమ బంగారం బయటపడింది. 525 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


రహదారి భద్రతపై చైతన్యం అవసరం: ఏకే ఖాన్‌
అమీర్‌పేట, న్యూస్‌టుడే: రహదారి భద్రత పట్ల ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఏకే ఖాన్‌ అన్నారు. ‘ఐ ప్లెడ్జ్‌ ఫర్‌ సేఫర్‌ రోడ్స్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమీర్‌పేటలోని ప్రైమ్‌ అసుపత్రులు, ఆస్టర్‌ హెల్త్‌కేర్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏకే ఖాన్‌ మాట్లాడుతూ అవగాహన లేకపోవడం వల్ల దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీటు బెల్టును ధరించకపోవడం, హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనాలపై ప్రయాణం, సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రుల సిబ్బంది, యువకులు, విద్యార్థులతో రహదారి భద్రత పాటిస్తానంటూ ప్రతిజ్ఞ చేయించారు. ప్రైమ్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌రెడ్డి, సి.రఘు తదితరులు పాల్గొన్నారు.


సమాజ హితానికి కృషి చేయాలి
కేంద్రమంత్రి దత్తాత్రేయ
ఫిలింనగర్‌: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పరిశుభ్ర భారత్‌ (స్వచ్ఛభారత్‌) ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రచార పాత్రను పోషించాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆదివారం ‘స్ట్రీట్‌ కాజ్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్‌ యూత్‌ అసెంబ్లీలో దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు. యువత స్వచ్ఛభారత్‌లో భాగస్వాములవడంతో పాటు స్ఫూర్తిని పొందితే సమాజం మార్పు దిశగా పార్లమెంట్‌ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సినీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ... తమ లక్ష్య సిద్ధి కోసం యువత శ్రమించాలని కోరారు. స్ట్రీట్‌ కాజ్‌ సంస్థ అధ్యక్షులు శశాంక్‌ సింగిరిరాజు, ఉపాధ్యక్షులు ప్రబంద, కోశాధికారి హర్షిత, ప్రధాన కార్యదర్శి కీర్తన, ధరణి పాల్గొన్నారు.


కాపు ఉద్యమం ఉద్ధృతం అవుతుంది
హైదరాబాద్‌లో ఐకాస రిలే నిరాహార దీక్షలు
కవాడిగూడ, న్యూస్‌టుడే: కాపు ఉద్యమం మరింత తీవ్రతరం కాక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమస్యను పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆదివారం ధర్నాచౌక్‌లో కాపు సంఘాల ఐకాస రిలే నిరాహారదీక్షలను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అడుగుతున్నారు తప్పా కొత్తగా కోరుతున్నదేమీ లేదన్నారు. కాపు రిజర్వేషన్లను అడ్డుకోవడం బీసీ సంఘాలకు మంచిది కాదన్నారు. బీసీలను ఎవరు రెచ్చగొడుతున్నారో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అందివచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వూరూరా ఉద్యమాన్ని విస్తరించాలని కాపులకు సూచించారు. కాపు నాయకులు శేషాద్రి, బండారు సత్యనారాయణ, డీవీరావు, బ్రహ్మనాయుడు, రాంచందర్‌రావు, రమణప్రసాద్‌, రమేశ్‌, కోనేటి సత్యనారాయణ, పేరయ్య, వేణుబాబు తదితరులు దీక్ష చేసిన వారిలో ఉన్నారు. కాపు నాయకులు అద్దెపల్లి శ్రీధర్‌, కటారి అప్పారావు తదితరులు సంఘీభావం తెలిపారు.


బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణ వసూలు డ్రైవ్‌ ప్రారంభం
గోల్నాక: రాష్ట్రవ్యాప్తంగా రుణ వసూలు స్పెషల్‌ డ్రైవ్‌ ఆదివారం ప్రారంభమైంది. దీనిన ఈ నెల 21 వరకు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కాంతారావు ఓ ప్రకటనలో తెలిపారు. రుణాలు చెల్లించాల్సి ఉన్న మొదటి పది మంది ఎగవేతదారుల కార్యాలయాలు, నివాసాల ముందు బ్యాంక్‌ ఉద్యోగులు నిరసనను చేపడుతారని పేర్కొన్నారు. 2013 లో రూ.2450 కోట్లు ఉన్న రుణాల ఎగవేతలు, 2015 సెప్టెంబరు నాటికి రూ.7986 కోట్లకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా బ్యాంకింగ్‌ రంగంపై పరోక్షంగా సామాన్య ప్రజలపై పన్నుల రూపంలో భారం పడుతుందని తెలిపారు.


పాత్రికేయుల చట్టాలను అమలు చేయాలి
ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటులో ఆమోదం పొందిన జర్నలిస్టు చట్టాల అమలు గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, దాంతో సంపాదకుడి స్థాయి నుంచి కిందిస్థాయి విలేకరి వరకు అందరికీ ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ప్రోగ్రెసివ్‌ జర్నలిస్ట్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.చెన్నయ్య పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల అమలుపై దృషిపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని త్రివేణి కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కారు నిర్లక్ష్యం వల్ల విలేకరులకు పిఎఫ్‌, ఈఎస్‌ఐ లేకుండా పోతున్నాయన్నారు. కనీస హక్కులూ పొందలేని పరిస్థితి ఉందన్నారు. అసోసియేషన్‌ నాయకుడు భద్ర మట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తానని కేసీఆర్‌ చెప్పడం శుభపరిణామమని, అన్ని స్థాయిల్లోని విలేకర్లకు ఇళ్ల పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు వీరాంజనేయులు, ది జర్నలిస్ట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సీహెచ్‌వీవీ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.


గడువు పొడిగించినా స్పందన అంతంతే
ఉపకార వేతనాలకు దరఖాస్తులే లేవు
వేలి ముద్రలతోనే సమస్య
26 వరకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: ఉపకారవేతనాలు పొందేందుకు ఎన్ని సార్లు గడువు పొడిగిస్తున్నా ఇంకా వేలల్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం లేదు. కొత్తగా కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులతోపాటు ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న దాదాపు 15 వేల మంది విద్యార్థులు కూడా ఈ ఏడాది దరఖాస్తులు చేసుకోలేదు. ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమని తెలుస్తోంది.

ధ్రువపత్రాలతో ఇక్కట్లు..
ఉపకారవేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలంటే కుల, ఆదాయ ధ్రువపత్రాలు అవసరం. అయితే ఈ సంవత్సరం నగర పరిధిలో ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యమే జరిగింది. ఒక దశలో దరఖాస్తులు 15శాతానికిపైగా పెండింగ్‌ ఉన్నాయి. నిబంధనల మేరకు నెల రోజుల వ్యవధిలో ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉండగా ప్రతి మండల కార్యాలయంలోనూ రెండు మూడు నెలల పాటు జారీ చేయని సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని దళారులు కూడా రంగప్రవేశం చేశారు. ఒక్కో ధ్రువపత్రానికి రూ.1000 వరకూ వసూలు చేశారు. ఈ పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా దరఖాస్తుల జారీలో జాప్యాన్ని నివారించి పరిస్థితిని చక్కదిద్దే సరికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడింది. దీంతో రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైంది.

సాంకేతిక సమస్యలతో..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు అధికారులు చెపుతున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది.. అలాగే విద్యార్థుల హాజరును కూడా బయోమెట్రిక్‌ పద్ధతిలో నమోదు చేసి ఆ వివరాలు సమర్పించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే విద్యార్థుల వేలిముద్రలు సరిపోలకపోవడంతో దరఖాస్తులను స్వీకరించడం సాధ్యం కావడం లేదని చెపుతున్నారు. దీంతోపాటు బ్యాంకు ఖాతాల విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థులు సమర్పిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాల్లో తప్పులు ఉంటున్నాయి. కొందరు సమర్పిస్తున్న ఖాతా వివరాలు కూడా సరిపోలడం లేదు. ఈ కారణాల రీత్యా వేలమంది సకాలంలో దరఖాస్తు చేసుకోలేదు. గత ఏడాది బీసీ సంక్షేమ శాఖకు సంబందించి నగర పరిధిలో దాదాపు 58వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది కేవలం 48వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో కూడా గత ఏడాదితో పోలిస్తే సుమారు 4వేల మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదని చెపుతున్నారు.

మరోసారి..
ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువు పెంచినట్లు బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు దేవీదాస్‌ తెలిపారు. వాస్తవానికి గత నెల 5వ తేదీతోనే గడువు ముగిసినా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావడం. వేల మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసకోకపోవడం లాంటి కారణాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గడువును ఈ నెల 26వరకూ పొడిగించినట్లు ఆయన వివరించారు.ఈనాడు - ఈతరం క్లబ్‌ ఆధ్వర్యంలో
సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ కోర్సులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్‌: చేతిలో సెల్‌ఫోన్‌ లేకుండా అడుగు బయటపెట్టని రోజులివి...సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికే కాదు ఏదైనా బిల్లు కట్టాలన్నా.. బ్యాంకు పని జరగాలన్నా.. సరదాగా సినిమా టిక్కెట్టు కొనాలన్నా.. ఎన్నో అవసరాలు తీర్చే మార్గం మొబైల్‌ఫోన్‌. అయితే పరికరం ఏదైనా, గ్యాడ్జెట్‌ ఎంత ఖరీదైనా అతిగా వాడితే మొరాయించడం మామూలే. పాడవడం సహజమే. సర్వీస్‌ సెంటర్‌కి వెళ్తే చాంతాడంత క్యూ. బోలెడంత సమయం వృథా. అందుకే ఇంటిపక్కనో, వీధి చివరనో ఉండే రిపేర్‌సెంటర్‌కి పరుగెత్తుతాం. నిమిషాల్లో పని పూర్తవుతుంది. మరి ఆ సెల్‌ఫోన్‌ రిపేర్‌ మనకే తెలిసి ఉంటే? స్వయంఉపాధికి బాట దొరికినట్టే. సంపాదనకి మార్గం తెలిసినట్టే. వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలకు కొదవ ఉండదు.

మరింకెందుకు ఆలస్యం.. ఈనాడు - ఈతరం క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌కోర్సులో చేరండి. నిపుణులుగా బయటికి రండి. కోర్సు కాలవ్యవధి రెండు నెలలు. ఎలక్ట్రానిక్‌ బ్యాగ్రౌండ్‌ ఉండాలనే నియమమేం లేదు. తొమ్మిదవ బ్యాచ్‌ ప్రారంభం.

శిక్షణ అంశాలు: బేసిక్‌ కోర్సు, కంప్లీట్‌ సెల్‌ ఫోన్‌టెక్నాజీ - సెల్‌ఫోన్‌ బేసిక్స్‌, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌, సెల్‌ఫోన్‌ హార్డ్‌వేర్‌ (చిప్‌ లెవెల్‌), సాఫ్ట్‌వేర్‌, కెరీర్‌ స్కిల్స్‌, ప్లేస్‌మెంట్‌ ట్రాక్‌, సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రాక్‌.

ఫీజు : రూ. 4000/- (బ్యాచ్‌కు 40 మంది) స్టడీ మెటీరియల్‌, టూల్‌కిట్‌కు రూ. 1000/- అదనం.

9వ బ్యాచ్‌ శిక్షణకాలం: 2 నెలలు (ఫిబ్రవరి 10 నుండి ఏప్రిల్‌ 10 వరకు)

సమయం: సాయంత్రం 4 గం॥ల నుండి 6 గం॥ల వరకు

శిక్షణ స్థలం మరియు రిజిస్ట్రేషన్లు : కలోరమ ప్రింటర్స్‌, 7-1-19, బేగంపేట రైల్వేస్టేషన్‌ గేట్‌ దగ్గర, హైదరాబాద్‌. (అమీర్‌పేట నుంచి బేగంపేట వెళ్ళే ఫ్లై ఓవర్‌ కింద)

కోర్సు పూర్తయిన తరువాత సర్టిఫికెట్స్‌ అందజేయబడును. పూర్తి వివరాలకు 9100024091, 8008551049 నంబర్లలో ఉదయం 9 గం॥ల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు.

గమనిక: ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు HYD2 అని స్పేస్‌ ఇచ్చి MOBILE REPAIRING అని స్పేస్‌ ఇచ్చి మీ పూర్తి పేరు టైప్‌చేసి 56263579 కు SMS చేయండి. ఉదా: HYD2 MOBILE REPAIRING B.SRINIVASభవనం పైనుంచి పడి కార్మికుడి మృతి
పంజాగుట్ట: నిమ్స్‌ ఆసుపత్రిలో అద్దాలు పరిశుభ్రం చేసేందుకు కిటికీ లోనుంచి నుంచి సజ్జా ఎక్కుతూ జారిపడి ఓ కార్మికుడు మృతి చెందాడు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ కథనం ప్రకారం... జగద్గిరిగుట్టకు చెందిన కె.సదానందం (36) నిమ్స్‌లో 15 ఏళ్లుగా ఫెస్సీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం విధులకు వచ్చాడు. ఏఎంసీ భవనం కిటికీపైన ఉన్న సజ్జా, అద్దాలు అపరిశుభ్రంగా ఉండడంతో వాటిని శుభ్రం చేయాలని సిబ్బంది సూచించారు. ఏఎంసీ వద్ద ఉన్న కిటికిలోంచి శుభ్రం చేసేందుకు సజ్జా ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి సదానందం కిందపడ్డాడు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. అతడిని చికిత్స కోసం హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సదానందం చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.


చాంద్రాయణగుట్ట చౌరస్తాలో యువకుడి హత్య
ఏడాదిన్నర క్రితమే ప్రేమ వివాహం
కేశవగిరి, న్యూస్‌టుడే: ఈవెంట్‌ కోసం తన భార్యను ఎందుకు తీసుకెళ్లారని నిలదీసిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రామారావు, ఎస్సై ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. హఫీజ్‌బాబానగర్‌ సమీప ఒమర్‌కాలనీలో నివసించే సమి అహ్మద్‌ సిద్దిఖీ(22)కు పాతబస్తీకి చెందిన ఆస్మాఖాన్‌(22)తో ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం జరిగింది. సమి ఆటో నడుపుతుంటాడు. డబ్బులు చాలకపోవడంతో ఘాజిమిల్లత్‌కాలనీకి చెందిన స్నేహితురాలు అస్మా సుల్తానా అలియాస్‌ సల్మాను తనకు ఏదైనా ఉద్యోగం చూడాలని అస్మాఖాన్‌ కోరింది. శనివారం రాత్రి 9కి అస్మాసుల్తానా ఫోన్‌ చేసి ఓ విందులో ఈవెంట్‌ సభ్యురాలిగా ఉద్యోగం ఉందని చెప్పింది. భర్త అనుమతితో సుల్తానాతోపాటు కారులో అస్మాఖాన్‌ వెళ్లింది. వీరితోపాటు ముఖ్తార్‌ అనే వ్యక్తి ఉన్నాడు. కాటేదాన్‌కు వెళ్లిన తరువాత మరో ఇద్దరు యువకులు కారులోకి ఎక్కారని, మద్యం తాగుతూ పెద్ద శబ్ధంతో పాటలు వింటూ అటూ ఇటూ తిప్పారన్నది అస్మాఖాన్‌ కథనం. రాత్రి ఒంటిగంట దాటినా భార్య రాకపోవడంతో సమి ఫోన్‌ చేశాడు. ఆమె వచ్చిన తర్వాత అప్పటికే కారులో ఉన్న వ్యక్తులను చూసి భార్యను నిలదీశాడు. అనంతరం అస్మాసుల్తానాకు ఫోన్‌ చేసి నీతో మాట్లాడాలని కోరాడు. చాంద్రాయణగుట్ట చౌరస్తా పైవంతెన సమీపంలోని ఫంక్షన్‌హాలు వద్దకు రావాలని ఆమె సూచించగా భార్యతో చేరుకున్నాడు. అస్మాఖాన్‌ను ఎక్కడికి తీసుకెళ్లారని వారితో గొడవ పడి కర్రతో దాడికి యత్నించాడు. సుల్తానా వెంట ఉన్న వ్యక్తుల్లో ఒకరు కత్తితో సమి మెడపై పొడిచి పరారయ్యాడు. సమిని ఒవైసీ ఆసుపత్రికి భార్య తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. హత్యపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అస్మాసుల్తానా, ముఖ్తార్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి: కోదండరాం
బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ప్రాథమిక విద్యను బలోపేతం చేసి, పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం డిమాండు చేశారు. సుందరయ్య కళానిలయంలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం (ఎస్‌జీటీయూ) ఆధ్వర్యంలో ‘ప్రాథమిక విద్య పరిరక్షణ- మేధావుల సమాలోచనలు’ అనే అంశంపై రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్‌రావు అధ్యక్షత వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యను పునరుద్ధరించిన తర్వాతే ఎస్‌జీటీ ఉపాధ్యాయులు తమ సమస్యలపై పోరాటం చేస్తే తప్పక న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మాతృభాషతోపాటు ఆంగ్లంలోనూ విద్యాబోధన చేపట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురిజాల రవీందర్‌, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రావు, పద్మారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.


హార్వర్డ్‌ ఇండియా మీట్‌లో సాత్విక్‌కు అవకాశం
నాగోలు, న్యూస్‌టుడే: అమెరికా కేంబ్రిడ్జిలోని విఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగిన ‘హార్వర్డ్‌ ఇండియా మీట్‌’ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం చైతన్యపురికి చెందిన కస్తూరి శ్రీరాం సాత్విక్‌కు దక్కింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా బోస్టన్‌లోని యూమాస్‌ లోయెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులకు అవకాశం లభించగా... అందులో కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఎమ్మెస్‌ చదువుతున్న సాత్విక్‌ ఒకరు. కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమంలో రాజకీయ వ్యవస్థలు, సాంఘిక న్యాయం, మహిళా సాధికారికత, భారతదేశంలోని అవకాశాలు.. సవాళ్లు అనే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సాత్విక్‌ తెలిపారు. పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించి మనదేశ సాంకేతిక ప్రగతికి కృషి చేయాలని..కేంద్రం ఆర్థిక వనరులు సైతం అందజేస్తుందని మంత్రి ఇచ్చిన సందేశం అందరిని ఆలోచింపజేసిందని సాత్విక్‌ అన్నారు. లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌నారాయణ్‌, సినీ హీరో కమల్‌హాసన్‌, ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారన్నారు.


కథ చెప్పడమూ కళే : టిమ్‌ రాప్స్‌
నారాయణగూడ: కథ ఎవరైనా చెబుతారు.. భావ వ్యక్తీకరణ లేకుండా అది రక్తికట్టదని యూకేకు చెందిన ప్రముఖ స్టోరీ టెల్లర్‌ టిమ్‌ రాప్స్‌ అన్నారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ లైబ్రరీలో ‘స్టోరీ టెల్లింగ్‌’పై కార్యశాల నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం లైబ్రరీ హాల్‌లో టిమ్‌ రాప్స్‌ మాట్లాడుతూ.. కథ చెప్పే ముందు అందులోని భావాన్ని ఆకళింపు చేసుకోవాలని, అప్పుడే ఎదుటివారిని కట్టిపడేసే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పుడైతే పాఠకుడిని కథలో విలీనం చేస్తామో... అప్పుడే మనం విజయాన్ని సాధించినట్లుగా పేర్కొన్నారు. కథ చెప్పడమూ కళే అన్నారు. హైదరాబాద్‌ రావడం ఇదే తొలిసారన్నారు. సోమవారమూ కార్యశాల కొనసాగుతుందని తెలిపారు.


ట్రెజరీ ద్వారా వేతనాలివ్వకుంటే సమ్మె బాట
బర్కత్‌పుర, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలోని అర్చకులు, ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుని తమకు ట్రెజరీ ద్వారా వేతనాలివ్వాలి’ అని తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐకాస డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో సమ్మె బాట తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం బర్కత్‌పురలోని అర్చక సంక్షేమ భవన్‌లో ఐకాస సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాస కన్వీనర్‌ గంగు భానుమూర్తి విలేకరులతో మాట్లాడుతూ గత జూన్‌, సెప్టెంబరు మాసంలో అర్చకులు, ఉద్యోగులు ఉద్యమానికి పూనుకోగా సెప్టెంబరు 15వ తేది నాటికి ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేందుకు జీఓ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ జీఓ మాత్రం విడుదల చేయలేదన్నారు. దీంతో అర్చకులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస విజయదుందుభి మోగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో ఐకాస ఛైర్మన్‌ నర్సింగ్‌రావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు కృష్ణమాచారి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి.కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


బీసీ మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి
కాచిగూడ: బీసీ మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని అఖిల భారత ఓబీసీ మహిళా సమాఖ్య డిమాండ్‌ చేసింది. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరింది. ఆదివారం కాచిగూడ సుప్రభాత్‌ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి అఖిల భారత ఓబీసీ మహిళా ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షురాలిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కవిలతకు నియామక పత్రం అందజేసిన సందర్భంగా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వినీతగౌడ్‌, మంగ, సువర్ణ తదితరులతో కలిసి మాట్లాడారు. మహిళా బిల్లు విషయంలో భాజపా, కాంగ్రెస్‌ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలు ఉద్యమించి వాటికి తగిన గుణపాఠం చెప్పాల్సిన తరుణం వచ్చిందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో బీసీ మహిళలు వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు.


తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం దైనందిని ఆవిష్కరణ
చార్మినార్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం డైరీని శనివారం పాత నగరం ఆజంపురాలోని తెరాస కార్యాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు డి.వి.ఎన్‌.రెడ్డి, అధ్యక్షుడు జె.సత్యనారాయరెడ్డితో పాటు పలువురు వీఆర్‌వోలు పాల్గొన్నారు.


‘వెలివాడ’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: సెంట్రల్‌ వర్శిటీ దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటన సమాజాన్ని కళ్లు తెరిపించాలని హైకోర్టు విశ్రాంత జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. దళిత శక్తి సామాజిక మాసపత్రిక ఆధ్వర్యంలో వెలివాడ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం సుందరయ్య కళానిలయంలో ఆదివారం జరిగింది. సభకు ప్రొ.గాలి వినోద్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. వెలివాడ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన విశ్రాంత జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. కుల సమస్య దేశంలోనే పెద్ద సమస్యగా మారిందన్నారు. అయితే ఒక వ్యక్తిని చంపమని చెప్పే మతం.. మతమే కాదన్నారు. మనుధర్మాన్ని ఎవరి ప్రయోజనాల కోసం మళ్లీ తెరపైకి తెస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మతతత్వానికి వ్యతిరేకంగా సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఉగ్రవాదం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దుర్మార్గమన్నారు. అవినీతి నిర్మూలన, ఆకలి లేని సమాజం రావాల్సిన అవసరం తప్పక ఉందన్నారు. సమావేశంలో పత్రికాసంపాదకులు గంగాధర్‌, దళిత సంఘం నేత జేబిరాజు, వెంకటేష్‌ చౌహాన్‌, జయవింద్యాల, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


యువత సన్మార్గంలో నడవాలి: మంత్రి ఈటల
రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: యువత సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సంఘాలు దోహదపడాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఆదివారం సికింద్రాబాద్‌ విశ్వకర్మ యువజన సంఘం మొదటి వార్షికోత్సవాన్ని సోమసుందరం వీధిలోని విశ్వకర్మ సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయంగా బడుగు వర్గాలు ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం మంత్రిని సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.


దోపిడీ వ్యవస్థ అంతానికి వామపక్షాలు ఏకం
- సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌ ఫ్లాగ్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ఎమ్మెస్‌ జయకుమార్‌ పిలుపు
సోమాజిగూడ: దేశ ఐక్యత అభివృద్ధి, దోపిడీ వ్యవస్థ అంతం, బడుగు బలహీన, దళితుల శ్రేయస్సుకోసం వామపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌ ఫ్లాగ్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ఎమ్మెస్‌ జయకుమార్‌ అన్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి దీనావస్థలో ఉందని, సామ్రాజ్యవాదం పూర్తిగా దేశాన్ని ఆవరించి పీల్చి పిప్పి చేసిందన్నారు. ఆయన నగరానికి వచ్చిన సందర్భంగా ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. వీహెచ్‌పీ, సంఘ్‌పరివార్‌ హిందూ సంస్థలు ప్రజా ఉద్యమాలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందులో భాగమే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ వేముల హత్య అన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, తెలుగు రాష్ట్రాల పార్టీ సమన్వయ కర్త మల్లేపల్లి ప్రభాకర్‌, కేంద్ర కమిటీ సభ్యులు, కర్ణాటక రాష్ట్ర బస్వలింగప్ప, హైదరాబాద్‌ నగర కార్యదర్శి సురుగు ప్రభాకర్‌, మట్టు అర్జున్‌, వేణుమాధవ్‌, తదితరులు పాల్గొన్నారు.


క్రిమిలేయరు రద్దు చేసేవరకు పోరాటం
నల్లకుంట, న్యూస్‌టుడే: బీసీలకు విధించిన క్రిమిలేయరు రద్దు చేసేవరకు పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి పార్లమెంటులో బీసీబిల్లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీభవన్‌లో జరిగిన బీసీ ఉపాధ్యాయుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. సమావేశానికి ముందుగా బీసీ ఉపాధ్యాయ సంఘం రూపొందించిన నూతన డైరీ, కాలమానిని కృష్ణయ్య ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఉపాధ్యాయుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌, గుజ్జకృష్ణ, కృష్ణుడు, వినోద్‌కుమార్‌, కోటేశ్వర్‌, లక్ష్మణ్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


‘అంబేడ్కర్‌ హిందూత్వాన్ని వ్యతిరేకించలేదు’
కాచిగూడ: భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ దేశంలోని కుల వ్యవస్థను వ్యతిరేకించారే కాని హిందూత్వంను కాదని హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎన్‌ రావు తెలిపారు. కులాల ప్రాతిపదికన సామాజిక, ఆర్థిక స్థాయిని బట్టి రిజర్వేషన్లు ఏర్పాటు చేయవచ్చు కాని మతాల ఆధారంగా ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు, రిజర్వేషన్లను కల్పించరాదని అంబేడ్కర్‌ అన్నారని పేర్కొన్నారు. ఆదివారం కాచిగూడలోని బద్రుకా కళాశాల ఆడిటోరియంలో ముంబయికి చెందిన ‘సామాజిక సమరసత వేదిక’ ఆధ్వర్యంలో ‘ఒకే ప్రజ, ఒకే సంస్కృతి, ఒకే జాతీయ లక్ష్యం డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆలోచన’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ భారత ప్రజలందరూ ఒక్కటేనన్నారు. సంచార జాతుల కమిషన్‌ జాతీయ ఛైర్మన్‌ బిక్కు రామ్‌జీ ఇదాతే మాట్లాడుతూ సంచార జాతుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగుపర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ శ్యాంకాంత్‌ హనుమాన్‌ ఆత్రే, ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు, గోపాలాచారి, డాక్టర్‌ వంశీ తిలక్‌, సమరసత వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్లు శ్యాంప్రసాద్‌, అప్పాల ప్రసాద్‌, మనోహర్‌రావు, మసన చెన్నప్ప, నర్సింగ్‌దాస్‌, వన్నాల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మేయర్‌ పీఠాన్ని వడ్డెరలకు కేటాయించాలి
గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం సాధించిన తార్నాక కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతికి మేయర్‌గాగానీ, డిప్యూటీ మేయర్‌గాగానీ నియమించాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆలకుంట హరి ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఇప్పటికీ మరో 70 కేసులు హరిపై ఉన్నాయని చెబుతూ ఈ కేసులను ఎత్తి వేయాలని కోరారు. ఆలకుంట హరి సతీమణి ఆలకుంట సరస్వతికి మేయర్‌గాగానీ, డిప్యూటీ మేయర్‌గాగానీ నియమించడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వడ్డెర కులస్థుల అభివృద్ధికి చేయూత అందించినట్లు అవుతుందన్నారు. ఈ నియామకం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వడ్డెర కులస్థులు రుణపడి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య, తెలంగాణ అధ్యక్షులు ఎత్తరి మారయ్య, వల్లపు శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


ఖజానా, పద్దుల గెజిటెడ్‌ అధికారుల సంఘం ఎన్నిక
రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఖజానా, పద్దుల(ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌) గెజిటెడ్‌ అధికారుల సంఘం ఎన్నికలు ఆదివారం రాజేంద్రనగర్‌లో నిర్వహించారు. అధ్యక్షులుగా జి.వెంకటేష్‌, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఎం.మాణిక్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డి.మోహన్‌రావు, యాదగిరి, ప్రదీప్‌కుమార్‌, హరిప్రసాద్‌, శిరీష; ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.అనంతరావు, కార్యదర్శులుగా పి.నర్సింహ్మరెడ్డి, టి.ప్రభాకర్‌రెడ్డి, ఎం.సతీష్‌కుమార్‌, ఎ.బాల్‌రాజ్‌, సీహెచ్‌ రాజయ్య, విజయలక్ష్మీ, కోశాధికారి పురుషొత్తం ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఖజానా, పద్దుల కార్యాలయాలను నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ను అసోసియేషన్‌ సభ్యులు సన్మానించారు.


నేతలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం: రఘువీరారెడ్డి
బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: కాపులను బీసీల్లో చేర్చాలంటూ వారి రిజర్వేషన్‌కోసం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వెళ్లే నేతలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేతలు ఎస్‌.శైలజానాథ్‌, కొప్పుల రాజు, శర్మలతో కూడిన బృందం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని ఏపీ స్టేట్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లే నేతలను అడ్డుకొంటున్న ఏపీ ప్రభుత్వ చర్యలను నిరోధించాలని కోరుతూ జస్టిస్‌ కక్రూకు వినతిపత్రం అందించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ, మూడు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు సి.రామచంద్రయ్య, వట్టి వసంత్‌కుమార్‌ కిర్లంపూడికి వెళ్లారని, వారిని ఏపీ ప్రభుత్వ పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. సోమవారం తాను, ఎంపీ చిరంజీవి రాజమండ్రి మీదుగా కిర్లంపూడి వెళ్లనున్నట్లు చెప్పారు. తమకు మానవ హక్కుల సంఘం మద్దతు ఇచ్చిందనీ, తాము కిర్లంపూడి వెళతామని చెప్పారు. కొప్పుల రాజు మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్ల విషయంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరి స్పష్టంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.


మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా మేడారంలో ఈనెల 14 నుంచి 21 వరకూ సమ్మక్క-సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ప్రత్యేకంగా ఒక రోజు యాత్రను సిద్ధం చేసింది. ఈనెల 6 నుంచి 13 వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రోలగ్జరీ ఏసీ బస్సులను నడపనుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కేపీహెచ్‌బీ, లింగంపల్లి, బోరబండ, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌ క్రాస్‌ రోడ్స్‌, రిసాల్‌బజార్‌, అల్వాల్‌, ఉప్పల్‌, మాదన్నపేట, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, చార్మినార్‌, ఆరాంఘర్‌ చౌరస్తాల్లో బస్సులను ఉంచుతారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో అయితే ఒక వైపు ఛార్జీ రూ.310, చిన్నారులకు రూ.160 చొప్పున వసూలు చేస్తారు. మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో అయితే పెద్దలకు రూ.600, చిన్నారులకు రూ.450 చెల్లించాలి. వివరాలకు 9959226148, 9959226142, 9959226129, 9959226136.

టీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు... రంగారెడ్డి రీజియన్‌ ఈనెల 13 నుంచి 21 వరకూ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌.బి.నగర్‌, జగద్గిరిగుట్ట, కె.పి.హెచ్‌.బి., కూకట్‌పల్లి నుంచి ఈ బస్సులు బయలుదేరి.. ఉప్పల్‌లోని వరంగల్‌ వెళ్లే బస్సు స్టాపు మీదుగా ప్రతి గంటకు బస్సులుండేలా చర్యలు చేపట్టారు. ఏసీ బస్సులో రూ.552, చిన్నారులకు రూ. 432గా నిర్ధారించారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో పెద్దలకు రూ.447, చిన్నారులకు రూ.247. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పెద్దలకు రూ.337, చిన్నారులకు రూ.187, వివరాలకు ఎంజీబీఎస్‌ 9959226257, 9959224910, 9959226245, 040-24624406, 23434268, జేబీఎస్‌ 040-27802203, 9959226246, ఉప్పల్‌ 7382801686, మేడారం క్యాంప్‌ 7382800134.ఆకట్టుకున్న వెల్‌ బేబీ షో
ఆబిడ్స్‌, న్యూస్‌టుడే: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆదివారం నిర్వహించిన వెల్‌ బేబీ షోకు విశేష స్పందన లభించింది. నిలోఫర్‌ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగనాథ్‌ పర్యవేక్షణలో జరిగిన వెల్‌ బేబీ షోలో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. మూడేళ్లలోపు చిన్నారులు ఈ షోలో పాల్గొనగా ముగ్గురు విజేతలను ప్రకటించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు అనిల్‌ స్వరూప్‌ మిశ్రా, కార్యదర్శి వనం సత్యేందర్‌, సంయుక్త కార్యదర్శి ఆదిత్య మార్గం, కోశాధికారి చార్యులు విజేతలకు బహుమతులను అందజేశారు.


రోహిత్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్‌పీఐ
బషీర్‌బాగ్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్‌ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాందాస్‌ అథవాలే డిమాండ్‌ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కులం కట్టుబాట్లు బద్దలు కొట్టు-సమ సమాజాన్ని నిర్మించు’ నినాదంతో జనవరి 26న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్‌ భీమ్‌ రథయాత్ర ఆదివారం నగరానికి చేరింది. బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో విలేకరుల సమావేశంలో రాందాస్‌ మాట్లాడారు. నగరానికి చెందిన ఆలిండియా దేవీ ధార్మి సంస్థాన్‌ (పార్ధి సమాజం) జాతీయ అధ్యక్షులు కె.గోపి ఆర్‌పీఐలో చేరగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు.


ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కాచిగూడ: ఒప్పంద (కాంట్రాక్టు) ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఓయూ జర్నలిజం ప్రొఫెసర్‌, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలు, నగరంలో 25 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారు ఐక్యమైతేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆదివారం కాచిగూడలో కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) 70 వ వార్షికోత్సవం సందర్భంగా ‘బ్యాంకింగ్‌ రంగంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ఉద్యోగ, కార్మిక సంఘాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఏఐబీఈఏ కార్యదర్శి, ఏపీబీఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటుందని కేంద్రం ఈ విషయంలో ముందుకు రావాలని కోరారు. బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న వేలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు, పీఎఫ్‌, గ్రాట్యుటీ సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు. కేజే రామకృష్ణారెడ్డి, వి.మధుసూదన్‌, జయరామిరెడ్డి, లక్ష్మీనర్సయ్య, కృష్ణమోహన్‌, రంగరాజన్‌, మురళీధర్‌ పాల్గొన్నారు.
Untitled Document
అద్భుత ప్రయోగం.. ఆరంభ శూరత్వం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
8 మంది బల్దియా ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు
పోలీసు ఠాణాల్లో జిమ్‌.. ఈ ఏడాదే శ్రీకారం
ఫర్నీచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
రసాయనాలతో అరటికాయల మగ్గింపు
అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
రహదారి భద్రతపై చైతన్యం అవసరం: ఏకే ఖాన్‌
సమాజ హితానికి కృషి చేయాలి
కాపు ఉద్యమం ఉద్ధృతం అవుతుంది
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణ వసూలు డ్రైవ్‌ ప్రారంభం
పాత్రికేయుల చట్టాలను అమలు చేయాలి
గడువు పొడిగించినా స్పందన అంతంతే
సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ కోర్సులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి
చాంద్రాయణగుట్ట చౌరస్తాలో యువకుడి హత్య
ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి: కోదండరాం
హార్వర్డ్‌ ఇండియా మీట్‌లో సాత్విక్‌కు అవకాశం
కథ చెప్పడమూ కళే : టిమ్‌ రాప్స్‌
ట్రెజరీ ద్వారా వేతనాలివ్వకుంటే సమ్మె బాట
బీసీ మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి
తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం దైనందిని ఆవిష్కరణ
‘వెలివాడ’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
యువత సన్మార్గంలో నడవాలి: మంత్రి ఈటల
దోపిడీ వ్యవస్థ అంతానికి వామపక్షాలు ఏకం
క్రిమిలేయరు రద్దు చేసేవరకు పోరాటం
‘అంబేడ్కర్‌ హిందూత్వాన్ని వ్యతిరేకించలేదు’
మేయర్‌ పీఠాన్ని వడ్డెరలకు కేటాయించాలి
ఖజానా, పద్దుల గెజిటెడ్‌ అధికారుల సంఘం ఎన్నిక
నేతలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం: రఘువీరారెడ్డి
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
ఆకట్టుకున్న వెల్‌ బేబీ షో
రోహిత్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్‌పీఐ
ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net