Wednesday, February 10, 2016


Untitled Document
ఎర్రచందనం సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి
కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : ఎర్రచందనం రక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ రేంజర్‌ కె.వి.సుబ్బయ్య అన్నారు. ఎర్రచందనం వన చైతన్య రథం మంగళవారం కడపకు విచ్చేసింది. కళాజాత సభ్యులు, అటవీ, పోలీసు సిబ్బంది ఎర్రచందనం రక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ నగరంలో కళాజాతా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ రేంజర్‌ కె.వి.సుబ్బయ్య మాట్లాడుతూ.. ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే ఉందన్నారు. ఈ సంపదకు విదేశాల్లో లక్షలాది రూపాయలు వస్తుండడంతో కొంతమంది బడా స్మగ్లర్లు కూలీల ద్వారా ఎర్రచందనాన్ని నరికిస్తున్నారన్నారు. అందుకే ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కళాజాతా నిర్వహిస్తున్నామన్నారు. కడప, వేంపల్లె, రాయచోటి, సిద్దవటం, వనిపెంట, అట్లూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎర్రచందనం అక్రమ రవాణా కాకుండా ప్రజలు భాగస్వాములు కావాలని కోరతామన్నారు.


ఉత్సాహంగా పాఠశాల క్రికెట్‌ పోటీలు
గెలుపొందిన నందలూరు, టంగుటూరు పాఠశాలలు
కడప క్రీడలు, న్యూస్‌టుడే : వైఎస్‌ రాజారెడ్డి-ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న అంతర్‌ పాఠశాలల జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన పోటీలలో కడపకు చెందిన హోలిట్రినిటీ పాఠశాలపై నందలూరు జడ్పీహెచ్‌ఎస్‌ గెలుపొందింది. వసంతపేట పాఠశాలపై టంగుటూరు జడ్పీహెచ్‌ఎస్‌ జట్టు విజయం సాధించింది. హోలిట్రినిటీ(కడప)- సెయింట్‌ జోసఫ్‌(నందలూరు) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హోలిట్రినిటీ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి 14.5 ఓవర్లలో 81 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నందలూరు పాఠశాల జట్టు 15.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నందలూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

* టంగుటూరు జడ్పీహెచ్‌ఎస్‌(నందలూరు)- వసంతపేట పాఠశాల(ప్రొద్దుటూరు) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టంగుటూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన వసంతపేట జట్టు 13.2 ఓవర్లలో 71 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టంగుటూరు జడ్పీహెచ్‌ఎస్‌ జట్టు 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.శైవక్షేత్రాల్లో పక్కా ఏర్పాట్లు చేయాలి
కడప జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 7న అన్ని శైవక్షేత్రాల వద్ద ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్‌ వెంకటరమణ ఆదేశించారు. శివాలయాలు ఉన్న ప్రాంతాల అధికారులతో మంగళవారం సభాభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. వైద్యశిబిరాలు, తాగునీరు, విద్యుత్తు వసతి, బస్సు సౌకర్యాలు, తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. పండగకు ముందు, తరువాత రోజులు కూడా వసతులు ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ విజయ్‌కుమార్‌, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.


మూడు క్వారీలకు అనుమతి
కడప జిల్లా సచివాలయం : జిల్లాలో మూడు క్వారీలకు అనుమతి ఇస్తూ కలెక్టర్‌ వెంకటరమణ ఆదేశాలిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలం పెద్దపల్లె గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామానికి చెందిన మెసర్స్‌ కృష్ణవేణి మెటల్స్‌, టి.సుండుపల్లె మండలం బాగంపల్లె గ్రామానికి చెందిన మెసర్స్‌ స్వర్ణ ఎంటర్‌ ప్రైజెస్‌ల దరఖాస్తులను పరిశీలించామని.. రెవెన్యూ, అటవీశాఖ పరంగా ఎలాంటి ఆక్షేపణలు లేనందున అనుమతించామన్నారు. సమావేశంలో జేసీ శ్వేత, ఆర్డీవోలు చిన్నరాముడు, ప్రభాకర్‌పిళ్లై, మైన్స్‌ అండ్‌ జియాలజి ఏడీ వెంకటేశ్వర్లు, సిద్దవటం, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె తహసీల్దార్లు పాల్గొన్నారు.


రుణ లక్ష్యాలను అధిగమించాలి
కడప జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : అన్ని కార్పొరేషన్లు ప్రభుత్వం అందించే రుణ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని కలెక్టర్‌ వెంకటరమణ ఆదేశించారు. మంగళవారం సభాభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు సకాంలో అందించాలన్నారు. ప్రతి మండలం నుంచి ఆయా వర్గాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చేలా చూడాలన్నారు. బ్యాంకర్లతో సంప్రదించి కమిటీ ఆమోదంతో దరఖాస్తులు పంపాలన్నారు. సమస్యలుంటే లిఖితపూర్వకంగా అందచేయాలన్నారు. బ్యాంకర్లు నిరాకరిస్తే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య 75 వేలకు పెంచాలని పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లాకు మంజూరైన ఫారంపాండ్లు ఇప్పటి వరకు 30 వేలే గుర్తించారని మిగిలిన వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయాలని, జన్మభూమిలో అందిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ప్రతిభాభారతి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ మమత, జడ్పీ సీఈవో రజియాబేగం, తదితరులు పాల్గొన్నారు.


శిక్షణలు నిరుద్యోగ యువతకు వరం
కడప జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : ప్రభుత్వం నిరుద్యోగులకు వరం ప్రకటించిందని కలెక్టర్‌ వెంకటరమణ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించాలన్నారు. జిల్లా స్థాయి వృత్తి నైపుణ్యాల నూతన కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం ఆయన సమీక్షించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో అలాంటి వాటిలోనే శిక్షణ ఇప్పించాలన్నారు. డీఆర్‌డీఏ, సెర్ప్‌, ఏపీఎస్‌బీసీ, జిల్లా ఉపాధికల్పన, కేవీకే, అపిట్‌కో, నాబార్డు, న్యాక్‌, మెప్మా, సిండికెట్‌ తదితర విభాగల్లో యువతకు శిక్షణలు ఇచ్చేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.


కమిటీలో ఎవరెవరు ఉంటారు
జిల్లా స్థాయి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కమిటీకి ఛైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌గా డీఆర్‌డీఏ పీడీ, సభ్యులుగా జిల్లా అధికారులు, స్థానిక పరిశ్రమలు, యూనిర్సిటీ ఉపకులపతి, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉంటారు. సమావేశంలో జేసీ శ్వేత, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ బాలసుబ్రహ్మణ్యం, మెప్మా పీడీ వెంకటసుబ్బయ్య, ఎంప్లాయిమెంట్‌ అధికారి రామ్మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


బీసీ భవన్‌కు స్థలం మంజూరు
పరిశీలించిన జేసీ శ్వేత
కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే : బీసీ భవన్‌కు 10 సెంట్ల స్థలం కేటాయిస్తూ కలెక్టర్‌ వెకంటరమణ ఆదేశాలు జారిచేశారు. కలెక్టరేట్‌ ఎదుట పాత రిజిస్టర్‌ కార్యాలయ స్థలంలో పది సెంట్లు కేటాయించారు. మంగళవారం జేసీ శ్వేత, ఆర్డీవో చిన్నరాముడు, తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, బీసీ నాయకులు అవ్వారు మల్లికార్జున్‌, నారాయణయాదవ్‌ ఆ స్థలాన్ని పరిశీలించారు. బీసీ శాఖ ద్వారా వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.


శేషవాహనంపై శ్రీవారు
కడప సాంస్కృతికం, న్యూస్‌టుడే : దేవుని కడప బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వేదపండితులు శ్రీనివాసాచార్యులు ధ్వజారోహణం గావించారు. అనంతరం స్వామికి స్నపన తిరుమంజనం, సాయంత్రం వూంజల్‌సేవ నిర్వహించారు. వికసిత వదనుడైన స్వామి వూంజల్‌ సేవను తిలకించి భక్తులు తరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు స్వరరాగాలాపన సాగుతుండగా ఇరు దేవేరులతో దేవదేవుడు పురవీధుల్లో వూరేగారు.


గనులను సందర్శించిన ఈడీ
ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే : మంగంపేట గని పనులను మంగళవారం ఏపీఎండీసీ ఈడీ నాగరాజు సందర్శించారు. మైనింగ్‌ ప్రాంతం, ముగ్గురాయినిల్వ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టెండర్లను త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ సంస్థ దక్కించుకుందన్నారు. తర్వలో ఆసంస్థ మంగంపేట గనిలో ముగ్గురాయి తవ్వకాలను ప్రారంభిస్తుందని చెప్పారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో సిబ్బందికి వారం రోజులపాటు వాలీబాల్‌ క్రీడలు నిర్వహించారు. మంగళవారం గెలుపొందిన వారికి ఈడీ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం హైదరాబాద్‌ నుంచి ఏపీఎండీసీ ఎండీ చౌదరి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయన వస్తున్నారని ఏపీఎండీసీ సిబ్బంది ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీవో కేదార్‌నాథ్‌రెడ్డి, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు.


కొప్పర్తి నీటి సమస్య పరిష్కారం
కడప నగర శివారులోని కొప్పర్తి భారీ పారిశ్రామికవాడకు పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. అక్కడ ఉన్న నీటి సమస్య. అందుకే ఏపీఐఐసీ అధికారులు నీటి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి సోమశిల వెనుక జలాలను ఇక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని గోరంట్ల వద్ద నాలెడ్జ్‌ సిటీ వరకూ తీసుకెళ్లేందుకు వైఎస్‌ హయాంలో ఓ పథకాన్ని చేపట్టారు. ఈ పైప్‌లైన్‌ కొప్పర్తి, ప్రొద్దుటూరు, ఇడుపులపాయ తదితర ప్రాంతాలకు నీరందిస్తూ అనంతపురం జిల్లాకు వెళ్లేలా పథకం రూపొందించారు. 2008లో రూ.1970 కోట్ల వ్యయంతో దీనికి అంచనా వేయగా తొలి దశగా కొప్పర్తి వరకు పైప్‌లైన్లు వేసి నీటిని తీసుకొచ్చే యత్నం చేశారు. ఇందుకు రూ.450 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వైఎస్‌ మరణానంతరం ఈ పథకం ఆగిపోయింది. ఇపుడు కొప్పర్తికి సోమశిల జలాలను తీసుకురావడమే మార్గంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే గతంలో రూపొందించిన పథకంలో భారీ పైప్‌లైన్లు కాకుండా, చిన్న పైప్‌లైన్లతో తక్కువ ఖర్చుతో పనులు చేయడంపై దృష్టి సారించారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో సోమశిల జలాలను కొప్పర్తి పారిశ్రామికవాడకు తీసుకొచ్చేలా ప్రయత్నాలు ఆరంభించారు. ఇప్పటికే ఈ దస్త్రం నీటిపారుదలశాఖకు వెళ్లగా, అక్కడ ఆమోదం పొందినట్టు తెలిసింది.


వసతులు కల్పించి ఇస్తాం
- రమణారెడ్డి, జోనల్‌ మేనేజర్‌, ఏపీఐఐసీ, కడప
పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే చాలు మా భూముల్లో వారికి వసతులు కల్పిస్తాం. మా పారిశ్రామికవాడల్లో ఇప్పటికే అభివృద్ధిచేసిన భూములకు ఒక ధర, అభివృద్ధిచేయని భూములకు తక్కువ ధర ఉంటుంది. వేటినైనా తీసుకోవచ్చు. కొప్తర్తికి సోమశిల నీటిని తీసుకురావడానికి రంగం సిద్ధమవుతోంది. అలాగే కొప్పర్తిలో రసాయన, ఖనిజ పరిశ్రమలు ఏర్పాటుకు కూడా అనుమతులిస్తాం. కాకపోతే వారు వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు చేసుకుంటే చాలు.. పలు కొత్త పరిశ్రమలు వస్తాయని ఆశాభావంతో ఉన్నాం.


రవాణా ఖర్చులకు రూ.10వేలు
చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి గిర్‌, సాహివాల్‌ తదితర రకాలకు చెందిన ఆవులను దిగుమతి చేసుకునే రైతులకు ప్రభుత్వం రూ.10వేలు రవాణా ఖర్చులు ఇస్తుందని జేడీ ఠాగూర్‌నాయక్‌ తెలిపారు. మంగళవారం ఆయన వూటుకూరులోని వ్యవసాయాధికారి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయంలో భాగంగా ఆవులను తెచ్చుకునే రైతులకు ప్రభుత్వం ఈ సదుపాయం కల్పింస్తుందన్నారు. జిల్లాలోని ఎల్‌ఆర్‌పల్లెకు 13, వేంపల్లెకు 14, పెండ్లిమర్రి 14, మైదుకూరు 13, కాశినాయన 14, కలసపాడు 14, కోడూరు 13 ఆవులకు మంజూరైనట్లు తెలిపారు. ఆవులను కొనుగోలు చేసి అక్కడి వీఆర్వోలతో ధ్రువీకరణ పత్రం, 3 సంవత్సరాలు బీమా చేసిన పత్రం తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి ఆయా మండలాల్లోని ఏవోలు, ఏఈవోలు, ఎంపీఈవోలు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయించడానికి సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ నరసింహారెడ్డి, ఏవో సుస్మిత పాల్గొన్నారు.


మే లోగా సర్వీస్‌ రూల్స్‌ సాధిస్తాం
ఎమ్మెల్సీ పుల్లయ్య
రాయచోటి, న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ మే నెలలోపు సాధిస్తామని ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని డైట్‌ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే డైట్‌ అధ్యాపకులకు పదోన్నతలు కల్పిస్తామని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ కూడా సాధిస్తామన్నారు. పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. పీఈటీల భాషాపండితుల అప్‌గ్రేడేష్‌ను సాధిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, పీఆర్‌టీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
మైదుకూరు, న్యూస్‌టుడే : వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించనున్న వేడుకలకు స్థానిక అమ్మవారిశాలలో ఆర్యవైశ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆర్యవైశ్య సభ, మహిళా మండలి, యువజన సంఘం, వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కన్యకలు, మహిళలు పూజల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబుచేశారు. బుధవారం చండీహోమం, అగ్నిగుండ ప్రవేశం ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈసందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు తల్లం వెంకటసుబ్బయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు వంకదార హైమావతి, వాసవీక్లబ్‌ ఛైర్మన్‌ తల్లం సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


యాజమాన్య పద్ధతులతో అధిక లాభాలు
పశుసంవర్ధక శాఖ జేడీ వెంకట్రావ్‌
జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: గొర్రెల పెంపకందారులు కొత్త యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చని జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.వెంకట్రావ్‌ సూచించారు.మంగళవారం జమ్మలమడుగులోని నూతన పశు సంవర్ధక శాఖ డివిజనల్‌ సహాయ సంచాలకుల కార్యాలయంలో గొర్రెల పెంపకందారుల సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ గొర్రెలు,మేకల అభివృద్ధి సహకార సమాఖ్య, హైదరాబాద్‌ వారి ఆర్థిక సౌజన్యంతో, కడప పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో మొత్తం 19 లక్షల గొర్రెలు ఉన్నాయని.. గొర్రెల పెంపకం దారులు మరిన్ని సంఘాలు ఏర్పడి లాభాలు పొందాలని కోరారు. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపైపశు సంవర్ధక శాఖ డివిజనల్‌ సహాయ సంచాలకులు విజయలక్ష్మి వివరించారు. ఆరోగ్యమైన మంచి గొర్రెలను ఎంపిక చేసుకోవాలన్నారు.చూడుతో ఉన్న గొర్రెలను లేదా ఒక ఈత ఈనిన గొర్రెలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. గొర్రెల మందలలో ఉన్న పొట్టేలు పిల్లలు కాకుండా వేరు గొర్రెల పెంపకందారుల విత్తన పొట్టేళ్లను ఎంపిక చేసుకోవాలన్నారు. అలా చేస్తే ఆరోగ్యకరమైన గొర్రె పిల్లలు పుడతాయని, త్వరగా ఎదిగి రోగనిరోధక శక్తి ఉంటుందన్నారు. అనంతరంవిత్తన పొట్టేళ్లను డా.వెంకట్రావ్‌, కడప గొర్రెల విభాగం సహాయ సంచాలకులు డా.మాలకొండయ్య, విజయలక్ష్మి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గొర్రెల సంఘం డైరెక్టర్‌ బయన్న, వెంకటేశ్‌ యాదవ్‌, శ్రీధర్‌లింగారెడ్డి, నియోజకవర్గ పరిధిలోని పశువైద్యాధికారులు పాల్గొన్నారు.


నాటుసారా అమ్మితే చర్యలు
ముద్దనూరు, న్యూస్‌టుడే : జిల్లాలో నాటుసారా తయారీనే కాదు. అమ్మకాలు చేపట్టినా శిక్ష కఠినంగా ఉంటుందని ఆబ్కారీ శాఖ కడప జిల్లా ఏసీ విజయకుమారి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని ఏసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాటు సారా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం కార్యక్రమ అమలుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీ విలేకర్లతో మాట్లాడుతూ ముద్దనూరు డివిజన్‌ పరిధిలోని కొండాపురం మండలంలోని సిరిగేపల్లె, టీ.కోడూరు గ్రామాల్లో సారా అమ్మకాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నవోదయ కార్యక్రమంలో భాగంగా పర్యవేక్షణకుగాను సిరిగేపల్లెను ఎస్సై శ్రీనివాసులరెడ్డి, టీ.కోడూరు గ్రామాన్ని ఎస్సై లక్షణరావుకు అప్పగించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆయా గ్రామాల పరిధిలో గ్రామసభల నిర్వహణ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. కడప జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఆబ్కారీ శాఖకు అన్ని శాఖల అధికారులు తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
Untitled Document
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net