గురువారం, జనవరి 19, 2017

జనరల్

120.. గండాలు
ఉమ్మడి జిల్లాలో రహదారులపై ప్రమాదకర స్థలాలు
గుర్తింపు తప్ప.. నివారణ చర్యలేవీ?
నిత్యం గాల్లో కలుస్తున్న ప్రాణాలు
మొక్కుబడిగానే.. భద్రత వారోత్సవాలు
సూచికలు లేకపోవడంతోనే.. ప్రమాదాలు
సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి గ్రామం వద్ద ఇండికేటర్లు లేకపోవడంతో ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి.. ఇటీవల పెద్దపల్లి మండలం కాసులపల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థి సంక్రాంతి పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అక్కడే నిత్యావసర వస్తువుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లి రోడ్డు దాటుతుండగా డివైడర్‌ వద్ద సూచికలు లేకపోవడంతో కరీంనగర్‌ నుంచి సుల్తానాబాద్‌కు వస్తున్న కారు ఢీకొని తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.

బంజేరుపల్లి వద్ద ప్రమాదకరమైన మూలమలుపు ఉండడంతో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొనడంతో ఏడాది కిందట మంచిర్యాల జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అక్కడ ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికీ పలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద ఉన్న డివైడర్‌ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాది కిందట ప్రయాణికులతో కరీంనగర్‌ బయలుదేరిన ఆటో దేవక్కపల్లి వద్ద డివైడర్‌ దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టడంతో ఆటో బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. ఇక్కడ ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం
జిల్లాలోని రహదారులు నిత్యం ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. స్వయంగా అధికారులే జిల్లాలో 120 ప్రమాద స్థలాలను గుర్తించి గాలికొదిలేశారు. కానీ.. గాలికి దీపం పెట్టి దేవుడా.. నివే దిక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏటా రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్న అధికారులు ఈ ప్రమాద స్థలాల్లో చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. కొందరు వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా వస్తూ ప్రమాదాల బారినపడుతుంటే.. పలు ప్రదేశాల్లో రహదారులు సరిగా లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు రోడ్డు వేసే సమయంలో సరైన ప్రణాళిక ఇవ్వకపోవడంతో గుత్తేదార్లు ఇష్టారీతిన రహదారులు వేస్తున్నారే విమర్శలు లేకపోలేదు.. అధికారిక అంచనాల ప్రకారం రోజుకో ప్రమాదం జరిగితే అందులో ఒకరు మృతిచెందితే.. ఇద్దరు తీవ్రంగా గాయపడుతున్నారు.

రవాణా శాఖ తీరు ఇలా...
జిల్లా రవాణా శాఖ తీరు నవ్విపోదురు గాక నాకేమి అన్నట్లుంది.. రెండేళ్ల కిందట ఆ శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానీయా జిల్లాలో ప్రమాదాలు జరిగే తీరు, తీసుకోవాల్సిన చర్యలపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు స్థానిక పోలీసుల సాయంతో బృందాలుగా ఏర్పడి 120 ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగడానికి కారణాలపై ఓ నివేదికను రూపొందించారు. ప్రమాదాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ.. రెండేళ్లు గడుస్తున్నా చర్యలు శూన్యం.

జిల్లా పాలనాధికారి స్పందిస్తేనే...
జిల్లా ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని గుర్తించిన రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానీయ స్పందించి చర్యలు తీసుకొవాలని అధికారులకు సూచించారు. అయితే నివెధిక జిల్లా పాలనాధికారికి సమర్పించడంతో గతంలో రహదారి, భవనాల శాఖ, పోలీస్‌, రవాణా శాఖ అధికారులతో జిల్లా పాలనాధికారి సమావేశపరిచి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఇప్పటికి ఎ ఒక్క శాఖ అధికారులు చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పటికైన జిల్లా పాలనాధికారి స్పందించి తగిన చర్యలు తీసుకుంటే కొంతమేరకు ప్రమాదాలను తగ్గించవచ్చు.

కరీంనగర్‌ నుంచి ధర్మపురి వరకు
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి. నిత్యం అక్కడికి కరీంనగర్‌ నుంచి 500 మంది రాకపోకలు సాగిస్తుంటారు. కరీంనగర్‌ నుంచి ధర్మపురికి వెళ్లే దారిలో 15 ప్రమాదకర స్థలాలు ఉన్నాయి. ఇందులో రుక్మాపూర్‌, అర్నకొండ, ఎర్రగుంటపల్లి, బంజేరుపల్లి, కటికనపల్లి, మల్లాపూర్‌, జక్కనపల్లి, ఎండపెల్లి, రాజరాంపల్లి, కొత్తపేట, అంబారిపేట, కిషాన్‌రావుపేట, శాఖపూర్‌, వెల్గటూర్‌ వద్ద ప్రమాద స్థలాలు ఉన్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. కరీంనగర్‌-వరంగల్‌ దారిలో ఈదులగట్టెపల్లి వద్ద వంతెన ఇది.. ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. స్పందించిన రవాణా అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వంతెనకు ఇరువైపులా పసుపు, నలుపు రంగులు వేయమని, ఇక్కడ వాహనాలు ఓవర్‌టేక్‌ చేయవద్దని పలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించినా ఆర్‌అండ్‌బీ ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. మంత్రి ఈటల రాజేందర్‌ కారు ఈ వంతెన సమీపంలో బోల్తాపడినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..

వేగనిరోధకాలు లేకపోవడంతో...
అంబారిపేట ప్రధాన రహదారి దగ్గర వేగనిరోధకాలు లేకపోవడంతో వాహనాలు వేగంగా వచ్చి గ్రామంలో నుంచి బయటికి వస్తున్న వాహనాలను ఢీకొంటున్నాయి. పలుమార్లు స్వల్ప ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికీ ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.

ఇలా చేస్తే మేలు..
జిల్లా పాలనాధికారి స్పందించి రవాణా, పోలీసు, రోడ్డు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి.
శాఖల వారీగా ఉన్న నాలుగు రహదారులను దత్తత తీసుకోవాలి..
ముందుగా రవాణా శాఖ గుర్తించిన 120 ప్రమాద స్థలాల్లో కనీస చర్యలు చేపట్టాలి.
అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి..
ప్రమాద సూచికలు.. వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలి
అవసరమైన చోట డివైడర్లు ఏర్పాటు చేయాలి.. అవసరం లేని చోట మూసివేయాలి.
ఇరువైపులా ఉన్న బండరాళ్లను తొలగించాలి.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..
-వినోద్‌కుమార్‌, రవాణా శాఖ పర్యవేక్షకులు
జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై మరోమారు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.